
పుస్తకాలపై దాడికి నిరసనగా భారీ ప్రదర్శన
తిరుపతి : తిరుపతిలో పుస్తక ప్రదర్శనపై మతోన్మాదులు చేసిన దాడికి నిరసనగా కవులు, రచయితలు, పుస్తక ప్రియుల చేతుల్లో వివిధ రకాల పుస్తకాలు మంగళవారం సాయంత్రం ఎత్తిన జెండాలై రెపరెపలాడాయి. పుస్తకాలపై దాడులను నిరసిస్తూ వారు చేసిన నినాదాలతో పట్టణం మారుమోగిపోయింది.
తిరుపతి పుస్తకప్రదర్శనపై గత శనివారం రాత్రి మతోన్మాదులు దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి నిరసగా ‘తిరుపతి పుస్తక ప్రియుల ఐక్య వేదిక’ ఆధ్వర్యంలో కవులు, రచయితలు, పుస్తక ప్రియులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి చేతిలో పుస్తకం ఎత్తిన జెండాలా రెపరెపలాడింది. సాయంత్రం 5 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూల మాలలు వేసి, నినాదాలు చేస్తూ ప్రదర్శన సాగింది. ప్రదర్శన ప్రారంభానికి ముందు ‘తిరుపతి పుస్తక ప్రియుల ఐక్య వేదిక’ కన్వీనర్ వాకా ప్రసాద్ మాట్లాడుతూ, పుస్తకాలపైన దాడి చేయడం హేయమైన చర్యని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు. ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదో నిర్ణయించడానికి ఈ ఉన్మాదులు ఎవరని ప్రశ్నించారు. ఒక బుక్ స్టాల్ నుంచి పుస్తకాన్ని లాక్కుని చించి పోగులు పెట్టి, దగ్ధం చేయడానికి యత్నించిన దుండగులు, విశాలాంధ్ర పుస్తక స్టాల్ పై కూడా దాడి చేసి, ఈ.వి. పెరియార్ పుస్తకాలను అమ్మరాదని తీసేయించారని గుర్తు చేశారు. ఈ సంఘటనపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరగగా, దాని కొనసాగింపుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
పుస్తకాల స్టాల్స్ పై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. నినాదాల్లో ప్రధానంగా ‘నూరుపువ్వులు వికసించని, వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్’ ‘పుస్తకాలు జ్ఞాన నేత్రాలు’ ‘పుస్తకాలను చించినంత మాత్రాన, వాటిలోని భావాల్ని చంపలేరు’ ‘భావ ప్రకట నా స్వేచ్ఛను ఎవ్వరూ అరికట్టలేరు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ ప్రదర్శన ఆఫీసర్స్ క్లబ్ సెంటర్, ఎస్పీ ఆఫీస్, ప్రకాశం రోడ్డు, చతుర్ముఖ ఆంజనేయ స్వామి ఆలయం సెంటర్ మీదుగా గాంధీ రోడ్డులోకి ప్రవేశించింది. రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రజలంతా ప్రదర్శకులు పట్టుకున్న పుస్తకాలను ఆసక్తిగా తిలకించారు. విశాలాంధ్ర వద్ద ఆగి నినాదాలు చేశారు. నాలుగ్గాళ్ళ మండపం వద్ద అంతా వలయాకారంలో గుమిగూడి దాడికి నిరసనగా వక్తలు ప్రసంగిస్తూ, బుక్ స్టాల్స్ పై దాడి చేయడం హేయమైన చర్యని, పెరియార్ పుస్తకాలను అమ్మరాదని విశాలాంధ్రపై దాడి చేయడం దారుణమని పేర్కొంటూ, అభ్యుదయ సాహిత్యాన్ని విక్రయించరాదని ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు. పుస్తక స్టాల్ పై నేడు జరిగిన దాడి అభ్యుదయ భావజాలంపై దాడిగా పరిగణించాలని కోరారు. చదివే పుస్తకాలపైన, ధరించే దుస్తులపైన, తినే తిండి పైన హిందూ మతోన్మాదుల నియంత్రణ ఏమిటని ప్రశ్నించారు. ఒక పుస్తక ప్రచురణ ఆపవచ్చు కానీ, దాని లోని భావజాలాన్ని ఆపలేరన్నారు. అనేక భాషలు, మతాలు, జాతులు ఉన్న లౌకిక భారత దేశంలో ఒకే భావజాలం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. కొందరు మతోన్మాదులు ఉన్మాదంతో విజ్ఞానాన్ని ప్రజలకు దూరం చేయాలనుకోవడం అవివేకమన్నారు. పౌరుల భావ స్వేచ్ఛకు పుస్తకం నిదర్శనమని గుర్తు చేశారు. ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా జ్ఞానాన్ని పంచేది పుస్తకమేనని పేర్కొన్నారు. ఇంత మంది పుస్తక ప్రియులు కలిసి చేస్తున్న ప్రదర్శన మతోన్మాదులకు హెచ్చరికలాంటిదని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రచయితలు మదురాంతకం నరేంద్ర, ఆర్.ఎం. ఉమా మహేశ్వరరావు, రచయిత, జర్నలిస్టు రాఘవ, మూరి శెట్టి గోవిందు, పేరూరు బాలసుబ్రమణ్యం, వెంకటరత్నం, యమలా సుదర్శన్, నాగులూరి దయాకర్, గొడుగు చింత గోవిందయ్య, నిర్మల, జర్నలిస్టు ప్రసాద్, శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత దేశ అధ్యక్షులు పి. అంజయ్య, జనవిజ్ఞాన వేదిక నుంచి రెడ్డెప్ప, సాహితీ స్రవంతి నుంచి ఓ. వెంకటరమణ, వేమన విజ్ఞాన కేంద్రం నుంచి నాగార్జున, తిరుపతి బాలోత్సవం నుంచి నడ్డి నారాయణ, అభ్యుదయ వేదిక నుంచి కడియాల వెంకటరమణ, పౌర చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఏ.ఎన్ పరమేశ్వర్ రావు, తిరుపతి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు సాకం నాగరాజ, అరసం జిల్లా అధ్యక్షులు యువశ్రీ మురళి, శంకరంబాడి సుందరాచారి పీఠం నుంచి మస్తానమ్మ, తెలుగు భాషోద్య సమితి నుంచి తమటం రామచంద్రా రెడ్డి, ఐద్వా తరపున సాయి లక్ష్మి, ఎస్.యూ.సీ.ఐ నుంచి లక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
-రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.