
టర్కీలో చోటుచేసుకుంటన్న పరిణామాలు యావత్ ప్రపంచం ఆ దేశం వైపు చూసేలా, ఆ దేశం గురించి చర్చించేలా చేశాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగర మేయర్ ఇక్రెమ్ ఇమామోలును ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్ష పదివి రేసులో ముందు వరుసలో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ చాలా మంది ఇక్రెమ్ అభిమానులు, విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి టర్కీ మీద పడింది.
ఇస్తాంబుల్ మేయర్‌గా ఎవరైతే ఎన్నిక అవుతారో వారే దేశపాలకులుగా అధికారంలోకి వస్తుంటారు. కారణమేంటంటే ఇస్తాంబుల్‌లో జనాభా కోటి యాభై లక్షల పైచిలుకు ఉంటుంది. ప్రస్తుత టర్కీ దేశ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్దోవాన్ కూడా అలానే మేయర్ నుంచి దేశ పాలకుడయ్యారు. ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ(సీహెచ్‌పీ)లో ప్రముఖ నాయకుడు ఇక్రమ్ ఇమామోలు ఇస్తాంబుల్ మేయర్‌గా భారీ మెజార్టీతో ఎన్నిక అయ్యారు. దీంతో అతనికి ఉన్న ప్రజాధరణను చూసిన ఎర్దోవాన్ అతనిపై కేసులు బనాయించి నిర్భందించారు. ఈ చర్య ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు..
ఇస్తాంబుల్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, మార్చి 23న ఇక్రమ్‌ను అరెస్టు చేశారు. ఆయనపై అవినీతి, ఉగ్రవాద సంస్థకు సహాయం చేసినట్లు అధికారులు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేశ రాజధాని అంకారాలో, అతిపెద్ద టర్కీ నగరం ఇస్తాంబుల్‌లో నిరసనలు పెల్లుబికాయి. భారీ సంఖ్యలో ఇమామోలు అభిమానులు, విద్యార్థులు, ప్రజలు ఇక్రమ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. తనపై మోపిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, తనను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అయితే ఎర్దోవాన్ పాలనలో ఓ వైపు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మరోవైపు నిరుద్యోగిత కారణంగా యువత అసహనంతో ఉన్నారు. దీనికి తోడుగా టర్కీ లీరా విలువ రోజురోజుకు పడిపోతుంది. ప్రజల జీవనం దుర్భరంగా మారిపోసాగింది. ఈ నేపథ్యంలో తమకు విపక్షనేత ఇక్రమ్ ఆశా కిరణంలా కనబడేసరికి ప్రజలు భారీగా స్వాగతిస్తున్నారు. ఈ తీరు ఎర్దోవాన్ నిరంకుశ పాలనకు చరమగీతం అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ముస్తఫా కెమల్ అతాతుర్క్ తరహా పాలనను తాము కోరుకుంటున్నామని నిరసనకారులు తెలిపారు. తనకు పోటిగా భారీ ప్రజాధారణ ఉన్నటువంటి ఇక్రమ్ నిలబడడంతో ఎర్దోవాన్ అరెస్టు చేయించారు. ఇక్రమ్ అరెస్ట్, నిరసనల మధ్య టర్కీ ప్రస్తుతం వేడి నీటిలా సలాసలా మరుగుతోంది.
టర్కీ గురించి..
టర్కీ దేశాన్ని తుర్కియేగా కూడా పిలుస్తారు. పశ్చిమాసియాలో ఉన్న ఇస్లామిక్ దేశమే టర్కీ. సౌత్ ఈస్ట్ యూరప్‌తో ఈ దేశం భూభాగాన్ని పంచుకుంటుంది. ఈ దేశానికి ఉత్తరాన నల్ల సముద్రం ఉంది. జార్జియా, ఆర్మేనియా, అజర్ బైజాన్, ఇరాన్ దేశాలు తూర్పు సరిహద్దులుగా ఉన్నాయి. ఇరాక్, సిరియా, మధ్యధరా సముద్రాన్ని దక్షిణ సరిహద్దుగా కలిగి ఉంది. ఏజియన్ సముద్రం, గ్రీస్, బల్గేరియాతో పశ్చిమభాగం సరిహద్దులను కలిగి ఉంటుంది. టర్కీవాసులులో ప్రధానంగా ఎత్నిక్ తుర్క్లతో పాటు, కుర్దులు కూడా ఉంటారు. అయితే, టర్కీ అధికారికంగా సెక్యులర్ దేశం. అంకారా రాజధాని అయినప్పటికీ ఇస్తాంబుల్ టర్కీకు ప్రధాన నగరంగా ఉంది. వాణిజ్యంలో కూడా ఇస్తాంబుల్దే పెద్దపీట అని చెప్పుకోవచ్చు.
వివిధ దశలను చూసిన టర్కీ..
అలెగ్జాండర్ దండయాత్రలు, రోమనీకరణలాంటి వివిధ దశల తర్వాత సెల్జుక్ తుర్క్‌లు అనతోలియాకు వలస వెళ్లారు. ఇక్కడ నుంచి టర్కీ ప్రస్థానం మొదలవుతుంది. మంగోలియన్ దాడుల తర్వాత ముక్కలైన ప్రాంతాలను ఒట్టోమాన్ పాలకులు పునరేకీకరణ చేశారు. రెండవ మహ్మద్ కాన్స్టంట్నోపుల్ను ఆక్రమించడం జరిగింది. దీనినే ఇప్పుడు ఇస్తాంబుల్‌గా పిలుస్తున్నారు. ఒట్టోమాన్ల పతనం తర్వాత సుల్తాన్ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో టర్కీ అవతరించింది. ముస్తఫా కెమాల్ అతాతుర్క్ దేశానికి ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికై, దేశంలో పలు సంస్కరణలను తెచ్చారు.
యూరప్, ఆసియా ఖండంతో సరిహద్దులు కలిగివున్న టర్కీ వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉంది. టర్కీ నాటోలో సభ్యదేశంగా కొనసాగుతుంది. పర్యాటకరంగంలో ఈ దేశం 5వ స్థానంలో ఉంది. టర్కీ రిపబ్లిక్ దేశంగా 1923 అక్టోబర్ 29న ఏర్పడింది. దేశ రాజధానిగా అంకారా ఉంది.
మొదటి టర్కీ అధ్యక్షుడి ముస్తాఫా కెమాల్ దేశానికి సేవలు అందించారు. ఆయన పారిపాలనలో పలు సంస్కరణలు ప్రవేపెట్టబడ్డాయి. ఆధునిక సెక్యులర్ పునాదిపై టర్కీను నిలబెట్టిన అధ్యక్షునిగా ఆయనకు పేరు ఉంది. మహిళలకు ఓటు హక్కును 1934 నాటికే ఇవ్వడం గుర్తించదగ్గ పరిణామం. అయితే ఆ తర్వాత టర్కీ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు కనిపిస్తాయి. అనేకసార్లు మిలటరీ తిరుగుబాట్లు దేశాన్ని కుదిపేశాయి.
2014లో ఎర్దోవాన్ తొలి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి టర్కీ మరో దారిలో ప్రయాణం చేసింది. ముస్తాఫా దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలనే కలను ఎర్దోవాన్ నీరుగార్చారు. ఇస్లామిక్ దేశాలలో అక్కడి పాలకులలో కొందరు అభ్యుదయ భావాలతో దేశాన్ని ఆధునిక దేశాల సరసన నిలబెట్టాలని, సెక్యులర్ పార్లమెంటరీ పంథాలో ముందుకు తీసుకువెళ్ళాలని పరితపించిన వాళ్ళు కనిపిస్తారు. వారి తదనంతరం పూర్తిగా మత ప్రాతిపదికన పాలన చేసే పాలకులు రావడంతో ఆయా దేశాలు నిరంకుశ సైనిక పాలన దిశగా వెళ్ళాయి. అధ్యక్ష తరహా మిలటరీ పాలన ఏర్పడి చాలా దేశాలు నిత్యం అంతర్యుద్ధాలతో మునిగి తేలుతున్నాయి.
1993లో టర్కీ మహిళా ప్రధానమంత్రిగా తాన్సుసిల్లర్ ఎన్నికైయ్యారు. తుర్కియే ప్రజలు ఇతర ఇస్లాం దేశాల ప్రజల కంటే ఆధునికంగా కనిపిస్తారు. వీరి ఆహార్యం యూరోపియన్ శైలికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఎర్దోవాన్ పాలనను నిరసిస్తూ లక్షలాది మంది ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కూడా వారి ప్రవర్తన ఎంతో హుందాగా కనిపిస్తుంది. వారు మాట్లాడే తీరులో స్పష్టత, నిజాయితీతో కూడుకున్న వైఖరిని చూడవచ్చు. ఇస్లాం వ్యక్తిగత అభీష్టం ఆధునికత గమ్యస్థానంగా టర్కీ ప్రజలు కోరుకుంటున్నారు. క్రీడలు, సంగీతం, సినిమాతో ఆ దేశంలో ఆధునికత ఉట్టిపడుతుంది. ఎర్దోవాన్ పాలనను నిరసిస్తూ దేశప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. 25 ఏళ్ళుగా నిరంకుశ పాలన చేస్తున్న ఎర్దోవాన్ పట్ల టర్కీ ప్రజలు విసిగివేశారని విశ్లేషకులు అంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలన చేయాలని చూస్తున్న ఎర్దోవాన్ వైఖరిని ప్రజాస్వామ్య ప్రియులైన టర్కీ ప్రజలు ఆక్షేపిస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను చూస్తే తెలుస్తోంది.
డా. సుంకర రమేశ్
ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు
9492180764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.