
మనువాద వ్యతిరేక పోరాటం హిందుత్వ వ్యతిరేక పోరాటం లో భాగమే
ప్రకాష్ కరత్
మధురై నుండి ద వైర్ తెలుగు స్టాఫ్
మూడోసారి అధికారానికిని వచ్చిన మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను, నియంతృత్వాన్ని దూకడుగా అమలు చేస్తోందని, ఈ క్రమంలో నయా ఫాసిస్టు లక్షణాలు వ్యక్తపరుస్తోందని ప్రకాష్ కరత్ అన్నారు. సిపిఎం పొలిట్‌బ్యురో సమన్వయకర్త ప్రకాష్ కరత్ 24వ జాతీయ మహాసభలు సందర్భంగా ప్రసంగించారు. ఆరెస్సెస్ ఫాసిస్టు లక్షణాలను పుణికి పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం నిరంతరం మైనారిటీలపై దాడులకు ఒడిగట్టడటంతో పాటు హిందూత్వ శక్తులు నిరంతరం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ దుండగుల చర్యలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని కూడా గుర్తు చేశారు. నిరంతరం హింసాత్మక చర్యలను ప్రేరేపించటం ద్వారా దేశంలో శాశ్వతంగా మతపర విభజన చేసేందుకు సిద్ధమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి ఉద్రిక్తతలకు తెర తీయటం ద్వారా దేశవ్యాప్తంగా హిందూత్వ శక్తులను సంఘటితం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కరత్ ఆరోపించారు.
ఇంకా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఆశ్రితపెట్టుబడిదారీ విధానానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ప్రకాష్ కరత్ అన్నారు. దేశంలో నానాటికీ కొత్త రంగాలను ప్రైవేటీకరించటం ద్వారా దేశంలోని గుత్తపెట్టుబడిదారులకు పెద్దఎత్తున లాభాలు సంపాదించి పెట్టెందుకు పాకులాడుతోందని ఆయన తెలిపారు. ఫలితంగా దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా కమ్యూనిస్టు పార్టీకి రాజకీయ విధానం రూపొందించుకోవటమే మహాసభల్లో ముఖ్యమైన కర్తవ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్‌కు మిత్రుడెవరు, గౌతం అదానీ, అంబానీలకు మిత్రుడెవరు, ఆరెస్సెస్ అడుగుజాడల్లో నడిచే భక్తుడెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానమే మన రాజకీయ విధాన రూపకల్పనను సుసాధ్యం చేస్తుందన్నారు. మోడీకి పార్లమెంట్లో స్వంత బలం లేకపోయినా తన నియంతృత్వ విధానాలను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడని గుర్తుచేవారు. ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం పార్లమెంట్లో ప్రతిపాదించిన బిల్లు సమాఖ్యతత్వం మీద ప్రత్యక్ష దాడిగా ప్రకాష్ అభివర్ణించారు. అధికారాల కేంద్రీకరణ, నియంతృత్వ ధోరణులు సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మోడీ, అతని నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అమెరికాతో అంటకాగుతున్న మతోన్మాద కార్పొరేట్ శక్తులకు ప్రతినిధిగా ఉందన్నారు. ఈ సంకీర్ణానికి కవచంగా ఆరెస్సెస్ ఉందన్నారు. ఈ శక్తులతో పోరాడి ఓడించటమే రాజకీయలక్ష్యంగా ఉండాలన్నారు. అయితే ఈ పోరాటాన్ని ఎలా నిర్మించాలి, ఎలా సాగించాలన్నవే క్లిష్టమైన ప్రశ్నలని అభిప్రాయపడ్డారు. వర్తమాన భారతదేశంలో హిందూత్వ శక్తులకున్న బలం, బలగం కేవలం చట్టసభల్లో ఆధిపత్య స్థానాలు, ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదని, సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక రంగాల్లో పని చేస్తున్న హిందూత్వ శక్తులు కూడా వీరికి తోడునీడగా ఉన్నాయనే విషయాన్ని మార్క్సిస్టులుగా మనం అర్థం చేసుకోగలమన్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాసభల్లో రూపొందించే రాజకీయ ఎత్తుగడల పంథా హిందూత్వ శక్తులపై బహుముఖ పోరాటాలకు తెరతీసేందుకు దోహదం చేసేదిగా ఉండాలని కాంక్షించారు. దేశవ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలను నయా ఉదారవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మేళవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తుల విశాల ఐక్యతకు పాటుపడుతూనే ఈ పోరాటంలో నికరంగా ఉండేది మాత్రం వామపక్షాలే అన్న వాస్తవాన్ని గుర్తెరగాలని ఆయన హెచ్చరించారు.
బిజెపి, ఆరెస్సెస్‌లు కుల వ్యవస్థను మరింత సంఘటితం చేసేలా ఉపకులాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారన్న పార్టీ విశ్లేషణను ఆయన ప్రస్తావించారు. సామాజిక సాంస్కృతిక జీవితంలో మనువాద విలువను ఒక పథకం ప్రకారం చొప్పిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనువాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటం హిందూత్వ వ్యతిరేక పోరాటంలో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మహాసభలు పార్టీ స్వతంత్ర బలాన్ని పెంపొందించుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని చర్చిస్తాయని తెలిపారు. సమాఖ్య స్పూర్తిని కాపాడేందుకు కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ ప్రయత్నాలకు దేశవ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.
ట్రంప్ నేతృత్వంలో అమెరికా సామ్రాజ్యవాదం మరింత బరితెగించి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం అమెరికా ముందు సాగిలపడి జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని, కనీసం ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేయటం లేదని విమర్శించారు. ఈ మహాసభ వేదికగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న వికృత దాడులను ఖండిస్తూ పాలస్తీన ప్రజల పోరాటాలకు పూర్తి సంఫీుభావాన్ని ప్రకటించారు. వామపక్ష ఐక్యతను బలోపేతం చేయటం ద్వారా దేశ రాజకీయాల్లో వామపక్షాల జోక్యాన్ని విస్తరించేందుకు కృషి చేయాలన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం కోసం దేశంలోని అన్ని వామపక్షాలతో సిపిఎం కలిసి పని చేస్తుందన్నారు. బిజెపికి వ్యతిరేకంగా వామపక్ష లౌకిక జ్రాతంత్ర శక్తులను విశాల ఐక్యతకు సిపిఎం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.