
జీవుల మనుగడకు అడవే హామీ పత్రంలాంటిది. పచ్చని ప్రకృతి బయోడైవర్సిటీని పరిరక్షిస్తుంది. అది ఇచ్చే ఆక్సీజన్ మనిషి జీవనానికి మూలాధారం. అలాంటి ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రం నగరంలో ఉంటే కళ్లకు అద్దుకొని కాపాడుకోవాలి. హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే అడవుల్లో సెంట్రల్ యూనివర్సిటీ అడవి కూడా ప్రధానమైంది. ఉస్మానియా యూనివర్సిటీ, కేబీఆర్ పార్క్, ఇతర రీసెర్చ్ సెంటర్స్, అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏరియా, మిలట్రీ ఏరియాలు మాత్రమే హైదారాబాద్‌లో పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లుగా ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే అవి అన్నీ దాదాపు విద్యాకేంద్రాలు కావడం గమనించవలసిన విషయం.
ఇవి విద్యా కేంద్రాలుగా లేకపోతే ఆ పచ్చని బయో డైవర్సిటీ మిగిలేది కాదు. ఎప్పుడో కాంక్రీట్ జంగల్లా మారి పోయేది. పొద్దున లేచి ప్రశాంతంగా వాకింగ్‌కు వెళ్ళాలంటే ఓయూ, కేబీఆర్, హెచ్‌సీయూ, మిలట్రీ ఏరియాలలో వెళ్తేనే ఒక సంతృప్తి ఉంటుంది. ఆ ఏరియాల నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ‘అబ్బా ఇక్కడ ఒక ఇళ్లు ఉంటే బాగుండు, ఇళ్లంటూ కట్టుకుంటే ఇలాంటి ఏరియాలోనే కడితే బాగుంటుంది’ అనిపిస్తుంటుంది. అలా అనిపించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పచ్చని వాతావరణం, చెట్లు, పిట్టలు, నెమలి రాగాలు, జింకల పరుగులు వివిధ జీవజాలంతో మమేకమైన ఫీలింగ్. పల్లెటూరిని ఒదిలిపెట్టి వచ్చిన వారికి ఆ ఊరి మట్టి జాడను వెత్తుక్కున్నట్లు అనిపిస్తుంటుంది. రెండోది స్వచ్ఛమైన ఆక్సీజన్ దొరికే ప్రాంతం కావడం. వాకింగ్ చేస్తున్నప్పుడే ఎక్కువ గాలిని పీల్చుతుంటాం. దాంతో పాటే స్వచ్ఛమైన ఆక్సీజన్ అవయవాలకు చేరుతుంది. అది ఆరోజు మొత్తం ఉత్సాహంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఇలాంటి ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రాలు లేకుంటే హైదారాబాద్ వాసులకు స్వచ్ఛ ఆక్సీజన్ ఎలా దొరుకుతుంది? ఇక్కడ తప్పితే మిగతా ఎక్కడికి వెళ్లినా కూడా కాలుష్యంతో నిండిన పొగలో తిరిగినట్టే అనిపిస్తుంటుంది. అందుకే ఉన్న అడవిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
కోటీశ్వరులు బాగానే ఉంటారు. పచ్చని ప్రదేశాల్లో భూములు కొనగలరు. లేదా ఉన్న ప్రాంతంలోనే ఎకరం స్థలంలో సొంతంగా చెట్లు నాటుకోగలరు. మిగతా వారి పరిస్థితి ఏంటి? పొట్టకెల్లని పేదల గతి ఏమికాను? ఓగాల రోగాలు వస్తే పెద్దోడు యాడికైనా పోయి ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టుకొని బతికి రాగల్గుతడు. బస్తీ బక్కోడు ఎక్కడికి వెళ్లగలడు? ఎంత ఖర్చు పెట్టుకోగలడు?
హెచ్సీయూలాంటి బయో డైవర్సిటీ ప్రాంతాలు లేకుంటే ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది. దాని వల్ల ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అయ్యేది మురికివాడ ప్రజలే. ఆ తర్వాత మధ్యతరగతి జనం ప్రభావితం అవుతారు. అయితే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తన సంపాదనలో ఎక్కువ భాగం ఆసుపత్రి ఖర్చులకే పెడుతున్నాడని సర్వేలు చెబుతున్నాయి. పర్యావరణ అసమతౌల్యం వల్ల కొన్ని జీవితాలు ఆగం అవుతున్నాయి. దీనికి పాలకులు, బడా పారిశ్రామిక వేత్తలు మాత్రమే కారణం. తమ బాగు కోసం పారిశ్రామికవేత్తలు స్థలాలు ఇవ్వమంటారు. పాలకులు సోయి లేకుండా సొంత లాభం కోసం వ్యాపారికి కట్టబెడతారు, కట్ట బెడుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ నగరం ఎలా అయ్యిందో మనం చూస్తున్నాం. పసి పిల్లలు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చలి కాలాలు శ్వాససంబంధిత వ్యాధిగ్రస్తులకు చాలా ఇబ్బందిగా మారాయి. బడి చదువులు ఆగిపోతున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కూడా ఆ స్థాయికి కొన్నేళ్లలో చేరుతుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అయినా పాలకులకు సోయి రావడం లేదు. ఒకవేళ వచ్చినా రానట్లే నటిస్తున్నారా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా సందర్భాల్లో పర్యావరణం రక్షించాలని నేతలు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగాలను ప్రజలందరూ వింటూనే ఉన్నారు కదా. కనీసం అధికారులు కూడా గట్టిగా చెప్పే వాళ్ళు లేరాయే. ఎందుకంటే వారెప్పుడో అవినీతి మకిలిలో మునిగి పోయారు.
1969 ప్రత్యేక తెలంగాణ పోరు వల్ల ఆరు సూత్రాల పథకం తెరమీదికి వచ్చింది. అందులో రెండో సూత్రమే సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. అలా ఏర్పడ్డ యూనివర్సిటీకి 1970లో 2,300 ఎకరాల స్థలం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయలేదు. దాని మీద కన్నేసిన అప్పటి సీఎం చంద్రబాబు ఐఎంజీ భారత్ అనే సంస్థకు 400 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేసింది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం, వేరే సంస్థకు ఇవ్వడంతో వివాదం రాజుకుంది. ఆ కేసు కాస్తా కోర్టులో చాలా రోజులు నడిచింది, చివరికి 2024లో ఆ కేసు క్లియర్ అయ్యింది.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను కూడా దాని మీద పడింది. అప్పులు ఉన్నాయనే సాకుతో అభివృద్ది పేరు చెప్పి కార్పొరేట్లకు అమ్మచూస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానిది కాబట్టి ఏమైనా చేస్తామనే వాదన ఎంత వరకు సరైనది? యూనివర్సిటీకి వేరే దగ్గర 400 ఎకరాలు కేటాయించామనీ చెప్పి, ఇంత మంచి స్థలాన్ని ప్రైవేట్‌కు అప్పజెప్పడం ఏం న్యాయం?
ఈ కంచ గచ్చి బౌలి అడవి అరుదైన 72రకాల చెట్ల జాతులతో, నలభై వేల చెట్లతో అలరారుతుంది. అంతేకాక మంజీర పరీవాహక బేసిన్ కూడా. నల్ల చెరువులో అనేక జీవులు ఆశ్రయం పొందుతున్నాయి. 223 పక్షి జాతులు ఈ అడవి ప్రాంతంలో జీవిస్తున్నాయి. జాతీయ పక్షి నెమలి, రాష్ట్ర జంతువు జింకలతో పాటు ఇండియన్ రోలర్(తెలంగాణ రాష్ట్ర పక్షి), హూపోస్, స్కైలార్క్స్ వంటి పక్షులకు హెచ్‌సీయూ అడవి నీడగా ఉంది. అడవిలో సరస్సులు, గుహలు, చిత్తడి నేలలు, రాతి బండలు వంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని రాతి కొలనులు స్కిటరింగ్ ఫ్రాగ్లకు, గుహలు గబ్బిలాలకు, చిత్తడి నేలలు తీర పక్షులకు నివాసంగా ఉన్నాయి. చారిత్రక రాళ్ళు కూడా అడివిలో ఉన్నాయి. ఇటువంటి వాటిని కాపాడాల్సిన ప్రభుత్వమే పిల్లలను చంపుతున్న తల్లిలా వ్యవహరిస్తుంది.
యూనివర్సిటీ విద్యార్థులకు అడవితో ఎంతో అనుబంధం ఉంటుంది. అక్కడి వాతావరణానికి పరవశించి పోతారు. ఈ అడవిని కాపాడాలని గొంతు ఎత్తుతున్న విద్యార్థులను కర్కశంగా లాక్కొని పోవడం, కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రజాపాలననా? పరాయిపాలననా?
యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. వేరేవేరే రాష్ట్రాలకు చెందిన ఐదు వేల మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. యూనివర్సిటీ అంటే బిల్డింగ్ కాదు, అక్కడ ఉన్న చెట్టు చేమ, పుట్ట, మట్టి, చెరువు, పక్షి, ప్రాణులు అన్ని అని అర్థం. ఇవన్నీటితో మమేకమైన చదువు మాత్రమే సంపూర్ణమైనంది. అందుకేనేమో అక్కడి విద్యార్థులు ఉన్మాదానికి గురి కాకుండా ఉన్నతంగా ఆలోచిస్తుంటారు. అక్కడ మట్టితో కలిసిన జీవితం వల్లనేమో మానవత్వంతో మహోన్నతులుగా ఎదుగుతున్నారు. అడవిలో ఉన్న వివిధ జాతులలానే, విద్యార్థులు విభిన్న జాతులుగా, విభిన్న సంస్కృతుల సమ్మిళితమైన ఉమ్మడి సాంస్కృతిక జీవనాన్ని అభివృద్ది చేస్తున్నారు.
ఈ దేశపు ఎదుగుతున్న పట్టుకొమ్మగా ఈ యూనివర్సిటీని చెప్పుకోవాలి. నూతన కొమ్మలు ఎదగాలంటే మరింత నీరు పోయాలి. మరిన్ని కోర్సులు పెంచి దేశాభివృద్ధికి, విద్యాభివృద్ధికి తోడ్పడాలి. అలా కాకుండా అడవిని నరికి, విద్యార్థులను తరిమితే రాష్ట్ర గౌరవానికి మంచిది కాదు. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూములను యూనివర్సిటీకే ఉంచి అభివృద్ధికి ఆసరా కావాలి.
కంచ గచ్ఛిబౌలి అడవి హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల లాంటిది. దీని జీవవైవిధ్యం, జలవనరులు, పర్యావరణ నేపథ్యం నగరానికి అమూల్యమైంది. దీనిని రక్షించడం మన బాధ్యత. ఈ అడవి కేవలం రెవెన్యూ భూమి కాదు. ఇది జీవన శ్వాసగల అరణ్యం. దీనిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం ప్రకటించాలి. అంతేకాకుండా యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఏ విజయ్ కుమార్
రచయిత, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు,
9573715656
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.