
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో కవి అరుణ్ కుమార్ “శూన్యం” కవితా సంపుటిని ముద్రించారు. నోబెల్ పురస్కార గ్రహీతలైన రవీంద్రనాధ్ ఠాగూర్, సీవీ రామన్‌లకు ఈ కవిత్వ సంపుటిని అంకితం చేశారు. ప్రఖ్యాత సినీగేయ రచయిత రాంబాబు వెనిగళ్లు, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తి మండ ప్రతాప్, డా ప్రవీణ, ఎన్ కిరణ్ రెడ్డి, శ్రీనివాసులు, సంతోష్, ఎల్లన్నలాంటి ప్రముఖ సాహితీవేత్తలు, సైంటిస్టులు చక్కటి ముందు మాటలు రాశారు. అట్టవెనుక డా అమ్మిన అభిప్రాయం ఈ పుస్తకానికి నిండుతనాన్ని ఇచ్చింది. పుస్తకంలో మొత్తం 58 కవితలున్నాయి.
పుట్టుక చావులని, ఫిజిక్స్‌ని, ఫిలాసఫీని తన పోయేట్రీతో కవి తెలియజేశారు. సాపేక్షతా సిద్ధాంతంతో ఎంతో తాత్త్విక ధోరణితో “ఆకలి ఆవేదనపు శూన్యాన్ని/ అక్షర ఆలోచనపు అనంతాన్ని/ కొన్ని దశాబ్దాలుగా/ఆవాహనం/ చేసుకున్నవాణ్ణి!” అని కవి అంటారు.
ప్రకృతిని- పర్యావరణాన్ని కాపాడాలని “గ్లోబల్ వార్నింగ్” కవితలో హెచ్చరించారు. అంతేకాకుండా అదే కవితలో “జలగళం మూగబోయి రెడ్ సిగ్నల్‌తో/ డేంజర్ సైగల్ చేస్తుంటే మన తాతల కాలంనాటి చల్లని ప్రశాంత/ గాలులు మనకు జ్ఞాపకాలయ్యాయి” అని కవితాత్మకంగా చెప్తారు.
“అవనిపై ఆరోగ్య సైనికులు మీరు! పరిశుభ్రత పంటను పండిస్తున్న! కర్షక దేవుళ్లు మీరు” అంటూ పారిశుద్ధ్య కార్మికులపై “మీకు శతకోటిదండాలు” అనే కవితను రాసి, వాళ్లను ప్రశంసించారు. ఏ దేశంలోనైనా సంపద సృష్టికర్తలు శ్రామికులు.
దేశానికి సేవ చేసిన “కలాం”లాంటి వారిని తన కవితలో కవి ఫిజిక్స్ అరుణ్‌కుమార్ కీర్తించారు, ఆయన సేవలను గుర్తుచేస్తూ అక్షర జల్లును కురింపించారు. ప్రపంచీకరణను, నూతన ఆర్థిక విధానాన్ని, ప్రైవేటీకరణను, కార్మికుల తొలగింపును, పర్మినెంట్ ఉద్యోగాల స్థితిని తొలగించే వ్యక్తులు- శక్తులు ప్రజావ్యతిరేకులే కదా!! శ్రీశ్రీ అన్నట్లు “వ్యక్తులు ప్రైవేట్ బ్రతుకు వారి వారి సొంతం, పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం”. అయితే కవి అరుణ్ కుమార్ ప్రేమ వనంలో నవభారతపు లౌకికవాదం వికసించాలని కోరుకుంటారు. నానమ్మ పెంచిన ప్రాణాలేలాంటి కవితలు కవి కలం బలాన్ని చెప్పాయి.
ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ “మీ తాత చెప్పిన నేతాజీ కథ ఎంత బాగుందో! మా నాన్న నేర్పిన ధైర్యపు ఆదర్శం ఎంత బాగుందో! మాకు అన్నం పెట్టి ఆకలితో నిద్రించిన మా అమ్మ ప్రేమ ఎంత బాగుందో” అని నానమ్మ పెంచిన ప్రాణాలే! కవితలో అంటారు. అంతుచిక్కని రహస్యాలకు శూన్యం ఓ భాండాగారం. అలానే కవి ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన “శూన్యం” కవితా సంపుటి సమకాలిన అంశాల భాండాగారంగా అభివర్ణించవచ్చు.
తంగిరాల చక్రవర్తి (సమీక్షకులు)
9393804472
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.