
2019 -23 మధ్య రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 20 శాతం మంది కాలి నడకన వెళ్ళే వారే అనే వాస్తవం రహదారి భద్రత సమస్యల తీవ్రతను తెలియజేస్తుంది. ఈ కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది లక్షల మంది చనిపోయారు. అందులో లక్షన్నర మంది కాలినడకన వెళ్ళే వాళ్ళే కావడం గమనార్హం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ట్రాన్స్‌పోర్టేషన్ రిసెర్చ్ అండ్ ఇంజురి ప్రివెన్షన్ సెంటర్, ఢిల్లీ ఐఐటిలు సంయుక్తంగా తయారు చేసిన భారత దేశంలో రహదారి భద్రత గురించిన స్టేటస్ రిపోర్ట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.
రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఫుట్‌పాత్‌లు ఉపయోగించే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హక్కును రహదారి వెంట నడిచే పాదాచారులు అనుభవించటానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడంలో ఇస్తున్న తోడ్పాటు నామ మాత్రమే. సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ ఆడిట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఫుట్‌పాత్‌లు అవసరమైన మోతాదుల్లో 19 నుంచి 73% వరకు మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది.
వివిధ రాష్ట్రాలలో ఫుట్‌పాత్‌ల నిర్మాణం తీరు తెన్నులు పరిశీలించడానికి ప్రతీ రాష్ట్రానికి నాలుగు నగరాలను ఎంచుకొని సుప్రీంకోర్టు నియమించిన ఆడిటర్స్ బృందం అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరిలాంటి కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం తక్కువ శాతం మాత్రమే ఫుట్‌పాత్‌ల నిర్మాణం జరిగింది. బీహార్, హర్యానాలల్లో 19- 20% ఫుట్‌పాత్‌ల నిర్మాణం జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఫుట్‌పాత్‌ల నిర్మాణం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ రూపొందించిన ప్రమాణాలకు చాలా తక్కువ స్థాయిలోనే ఉంది.
ఈ వారం సుప్రీంకోర్టు విడుదల చేసిన నివేదికలో “పౌరులకు అవసరమైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం అనివార్యం. ఈ ఫుట్‌పాత్‌లు వికలాంగులు సహా పౌరులందరికీ అందుబాటులో ఉండాలి. అందుకని ఫుట్‌పాత్‌లపై ఏవైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని తొలిగించాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ఫుట్‌పాత్‌లను వినియోగించుకునే హక్కు దేశ పౌరులకు ప్రాథమిక హక్కుల్లో భాగమని ఈ న్యాయస్థానం గుర్తిస్తోంది” స్పష్టం చేసింది.
రహదారులపై జరిగిన ప్రమాదాలను నియంత్రించడంలో లేదా నివారించడంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు ఫుట్‌పాత్‌ల నిర్మాణం అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఇండియన్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వాహకులు అమర్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నటువంటి వాళ్లలో 21 శాతం ఫుట్ పాత్లపై నడిచే వాళ్లే, భారతదేశంలో సంభవిస్తున్న రహదారి దుర్ఘటనల్లో 25 శాతం ఫుట్‌పాత్‌లపై నడుస్తున్నవాళ్లే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.