
ఒబెసిటీ అనగానే చాలా మంది కంగారు పడిపోతారు. ఆ మరుసటి రోజు నుంచే సీరియస్‌గా డైట్ ప్లాన్ చేయాలని అనుకుంటారు. గంటల తరబడి ఎక్సర్సైజ్ చేసేయాలి, శరీరంలోని కొవ్వును తగ్గించాలని ఆలోచిస్తుంటారు.అసలు ఈ మధ్య భారతీయులు ఎందుకు ఊబకాయులుగా మారుతున్నారు? ఎవరు ఎక్కువ ఊబకాయులుగా మారుతున్నారు? బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) లెక్కల్లో మార్పు ఎందుకు వచ్చింది? సడన్‌గా ప్రధాని మోదీ భారతీయులకు ఒబిసిటీ ఛాలెంజ్‌ను ఎందుకు విసిరారు? వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా భారతీయుల శరీరాల్లో కొవ్వుశాతం పెరుగుతోంది. దీంతో ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తాజాగా హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏఐజీ(ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
అందరూ ఉద్యోగాలు చేస్తూ బిజిబిజిగా కనబడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూలయినా ప్రతి ఒక్కరిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. పాతకాలం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ మొదలు పెడుతున్నారు. అయినా కానీ రోజురోజుకి భారతీయుల శరీరాల్లో కొవ్వు శాతం పెరిగిపోతుందనీ, అందుకే సడన్‌గా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయనీ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు చిన్నా, పెద్ద తేడా లేకుండా చాలామందిలో ఒబిసిటీ తీవ్రంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో ఎక్కువమంది ఊబకాయులుగా మారుతున్నారు.
ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, వ్యసనాలకు ఎక్కువగా ఆకర్షితులవటం, ఇష్టానుసారంగా జంక్ ఫుడ్ తినడం, ఆల్కహాల్, సిగరెట్ కారణంగా 70, 80 ఏళ్లలో రావాల్సిన వ్యాధులన్నీ యుక్త వయసులోనే వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఒబెస్ సంఖ్య పెరుగుతుంది. అందులోనూ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోని పని చేసే వారిలో ఒబెసిటీ ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. తాజాగా ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ నిర్వహించిన అధ్యయనంలో ఐటి ఉద్యోగులలో ఫ్యాటీ లివర్ సమస్య, ఒబెసిటీ విపరీతంగా పెరుగుతున్నట్టుగా నిర్ధారించారు.
అయితే వీరిలో నిద్రలేమి, పని ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతోందని వైద్యులు ఓ నిర్ధారణకు వచ్చారు. అందులోనూ కాలేయంలో ఎక్కువగా కొవ్వు శాతం ఉండటం వల్ల చిన్న వయస్సులోనే ఊబకాయులుగా మారుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 54 లక్షల మంది ఐటి రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 84% మందికి ఫ్యాటీ లివర్‌తో పాటు అనేక లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారనీ ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా 71% ఊబకాయిలుగా ఉన్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. అందుకే వీరికి ఎక్కువగా బీపీ, షుగర్, వంటి దీర్ఘకాలిక సమస్యలు చాలా చిన్న వయస్సులోనే వస్తున్నాయి. మరోవైపు బీపీ, షుగర్ అసమతుల్యంగా ఉండటంవల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతోంది.
సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్‌లో ఎక్కువగా సమయానికి భోజనం చేయకపోవడం, ఒకవేళ చేసినా ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులోనూ జంక్ ఫుడ్ విపరీతంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మీద ప్రభావం చూపించి, అది అస్థవ్యస్తంగా తయారవుతుందనీ వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలలో విధులు నిర్వహిస్తున్న ఐటి ఉద్యోగులకు వారి వారి కంపెనీలు ఈమధ్య తరచుగా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అందులో ఫ్యాటీ లివర్ సమస్య సర్వ సాధారణంగా కనిపిస్తుందనీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే, డబ్య్లూహెచ్ఓ(వర్ల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం భారతీయుల బీఎంఐ ఫార్మెట్ మారిందనీ డాక్టర్లు చెబుతున్నారు. ఒకప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ 25 దాటితేనే ఒబెసిటీగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు భారతీయుల శరీరతత్వం మేరకు బీఎంఐ కేవలం 22 దాటితేనే ఒబెసిటీ కింద లెక్కగట్టాలనీ అంటున్నారు. బీఎంఐని బట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా కొంతమందిలో బయోలాజికల్ ఏజ్‌కి, బాడీ ఏజ్‌కి చాలా తేడా ఉంటోంది. 30 ఏళ్ళున్న ఒక యువకుడిలో బాడీ ఏజ్ 50 ఏళ్ల వారిలా కనిపిస్తోంది. అంటే అతనిలోని అవయవాల పనితీరు 50 ఏళ్ల వయసు వారిలా ఉందన్నమాట. తాజా అధ్యయనంలో ఐటి ఉద్యోగుల్లో బాడీ ఏజ్‌లో చాలా హెచ్చుతగ్గులు ఉన్నట్టు గమనించారు. బయోలాజికల్ ఏజ్‌కీ బాడీ ఏజ్‌కీ గ్యాప్ ఎక్కువగా ఉండటం మంచి పరిణామం కాదనీ, అనేక ఆరోగ్య సమస్యలకు అదే ప్రధాన కారణం కావ్వొచ్చనీ హెచ్చరిస్తున్నారు.
ఐటి ఉద్యోగులైనా, ఏ రంగంలో పనిచేసే వారైనా సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోతే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెడెంట్రి లైఫ్ స్టైల్ వల్ల గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య దేశంలో విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి శరీరానికి కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరిగా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వంట నూనెల వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కనీసం ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు.
ఒబిసిటీ గురించి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఊబకాయం గురించి ప్రస్తావించారు. భారతదేశంలో ఊబకాయంపై తక్షణం దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారు. వైద్యుల సలహాతో జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.
– కె సమైక్య
(ప్రపంచ ఒబేసిటీ డే మార్చ్ 4 సందర్భంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.