
ఒకప్పుడు ఫాసిజంతో తెగతెంపులు చేసుకున్న యూరోపియన్ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులు పేట్రేగుతున్నాయి. ఈ కాలంలో నూతన తరహా నిరంకుశ దౌర్జన్యపాలన రూపాలు ముందుకొచ్చాయి. ఈ రూపాలు సారం రీత్యా ఫాసిస్టు స్వభావాన్ని కలిగి ఉన్నా రూపం రీత్యా పాసిజం కంటే నాజూకుగా కనిపిస్తాయి.
ఫాసిస్టు శక్తులు ఇటలీలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సరిగ్గా వందేళ్ల తర్వాత వారి వారసులైన నయా ఫాసిస్టులు మూడు పార్టీల సంకీర్ణంతో ఆ దేశంలో అధికారానికి వచ్చారు. 1922లో బెన్నిటో ముస్సోలిని రోమ్పైకి దండయాత్ర అని ప్రకటించటంతో అప్పటి రాజు బెనిటో ప్రయివేటు సైన్యాల ముందు సాగిల పడ్డాడు. లొంగిపోయాడు. కానీ వందేళ్ల తర్వాత నయా ఫాసిస్టు శక్తులు పద్ధతి ప్రకారం, ఎన్నికల ద్వారా, రాజ్యాంగ యంత్రం అనుమతితో, శాంతియుతంగా అధికారాన్ని చేపట్టారు.
ఇటలీలో 1920 దశకంలో ఫాసిజానికి సామాజిక పునాదిగా ఉన్న మధ్యతరగతి, పట్టణకార్మికర్గంలో ముఖ్యమైన భాగం, ధనిక రైతాంగమే 2022లో కూడా నయా ఫాసిజానికి సామాజిక పునాది సమకూరుస్తున్నాయి. ఈ బలగాల్లో భారీ భూస్వాములే కొరతగా ఉంది. ఎందుకంటే యూరప్‌లో 1920 దశకంలో ఉన్నంత స్థాయిలో విశాలకమతాలపై యాజమాన్యం ఉన్న భూస్వాములు ప్రస్తుతం లేరు. (ఉంటే వారు కూడా ఈ నయా ఫాసిస్టు శక్తుల పక్షాన నిలిచేవారే).
యూరప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రాజకీయాలు మెజారిటేరియన్ రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఉదారవాద ప్రజాతంత్ర విలువలను తిరస్కరిస్తున్నాయి. ఫాసిస్టు లక్షణాలున్న ఆలోచనలు ప్రజారంజక రాజకీయాలుగా ముసుగువేసుకుని చలామణి అవుతున్నాయి. హంగరీ పోలండ్ వంటి దేశాల్లో ఈ శక్తులు రాజ్యాంగయంత్రంలో చొరబడ్డాయి. స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో అత్యంత మితవాద శక్తులు రాజకీయంగా పలుకుబడి పెంచుకుంటున్నాయి. ఎన్నికల రాజకీయాల్లో పైచేయి సాధిస్తున్నాయి.
ఇటలీలో ముస్సోలిని తర్వాత, ఫ్రాన్స్‌లో వికీ తర్వాత, జర్మనీలో కూడా ఫాసిస్టు పూర్వరూపాల్లో ఉన్న శక్తులు బతికి బట్టకట్టటమే కాక రాజకీయాలను శాసించే దశకు చేరతాయని ఎవరైనా ఊహించారా? సమాజం ఒకప్పుడు ఈ ధోరణులను ఈసడించుకున్నది. అయినా ఫాసిస్టు ఆలోచనా ధోరణులు విశాల జనసమ్మర్ధం బుర్రల్లోకి సున్నితంగా ఎక్కించబడుతూనే ఉన్నాయి.
కాలం విసిరిన సవాళ్లను అధిగమించిన ఫాసిజం
ఫాసిస్టు భావజాలం స్థూలంగా ముడిగానూ, ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఉన్నట్లుగానూ, గుర్తించలేనంతగా రోజువారీ జీవితంలో మమేకమైనవిగానూ, ఆలోచనకు పదును పెట్టేవిగా కాక భావోద్వేగాలు రెచ్చగొట్టేవిగానూ ఉంటాయి. ఆరాధనా భావాన్ని పెంపొందించటం, చరిత్రను సమగ్రంగా పరిశీలించటానికి బదులు చరిత్రలో ఏమీ జరగలేదన్న గుడ్డినమ్మకాన్ని పెంపొందించేవిగానూ, కొన్నికొన్ని సార్లు అసలు అటువంటి ప్రశ్నార్ధకమైన చరిత్ర ఉన్నదని గుర్తించ నిరాకరించటం ఈ శక్తులు అనుసరించే సార్వత్రిక వైఖరి. మరో విషయం ఏమిటంటే ఫాసిజం సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటవెంటనే ఆలింగనం చేసుకుంటుంది. స్వీకరిస్తుంది. సర్వరోగ నివారిణిగా కీర్తిస్తుంది. అదే సమయంలో ఆధునికతనూ, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని తిరస్కరించటం ఫాసిస్టుల మౌలిక లక్ష్యం. లక్షణం. మార్మికమైన గతాన్ని కీర్తిస్తుంది. జాతీయ గర్వభావనను ప్రేరేపిస్తుంది. చరిత్ర గమనంలో జరిగిన తప్పులను పెడధోరణులను సరిదిద్దాలని పట్టుబడుతుంది. దేశంలో ఉన్న అధిక సంఖ్యాకుల అస్తిత్వాన్నే దేశ అస్తిత్వమని వాదిస్తారు. (భారత దేశంలో హిందువులు ఎక్కువ కాబట్టి హిందూ దేశంగా పిలవాలన్న డిమాండ్ ముందుకు వచ్చినట్లుగా) దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఓ అదృశ్య శత్రువును సృష్టించటం ఈ శక్తుల శాశ్వత వ్యూహం. ఎత్తుగడ. అటువంటి అదృశ్య శతృవుల వల్లనే ఈ మెజారిటేరియన్ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతున్నదన్నది ఫాసిస్టు శక్తుల ప్రచార వ్యూహం.
ఈ వ్యవహారాలన్నీ ప్రజల రోజువారీ సాధారణ జీవితానుభవంతో సంబంధం లేనివి. కానీ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కునే సమస్యలు, ఇబ్బందులనుండి దృష్టి మళ్లించటానికి ఉపయోగపడతాయి.
నిజానికి ఫాసిజం అన్నది సర్వకాల సర్వావస్థలయందూ పాలకవర్గానికి అక్కరకొచ్చే పదం కావటంతో ఎవరు ఈ పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నారో గుర్తించటం కూడా కష్టంగా ఉండేది. (ఫాసిజం ఓ విలక్షణ వ్యవహార శైలి అనీ, వివిధ సమాజాల్లో తలెత్తే ఫాసిస్టు లక్షణాల మధ్య సారూప్యతలు ఎంత ఎక్కువగా ఉంటాయో వైవిధ్యాలు, ప్రత్యేకతలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని ఇటలీకి చెందిన పౌర మేధావి ఉంబర్టో ఎకో అభిప్రాయపడ్డారు).
అంతర్గత ధోరణులు
ప్రతి సమాజంలోనూ కొన్ని అంతర్గత ధోరణులు ఆయా సమాజాల్లో ఫాసిజానికి పునాదులు వేస్తాయన్న వాస్తవాన్ని గుర్తించిన మొదటి సామాజిక శాస్త్రవేత్త విఫిల్మ్ రీక్. ఫాసిజం నిర్మించే సార్వత్రిక మానసికతే ఫాసిస్టు ఉద్యమాలకు బలమైన పునాదులు వేస్తుందన్నది ఆయన మౌలిక సూత్రీకరణ. ఈ భావజాలం సాధారణంగా జనాన్ని నిరంకుశ ధోరణులవైపు మొగ్గు చూపేలా చేసేది. దీనికి కారణం ఆయా సమాజాల్లో వేళ్లూనుకుని ఉన్న నియంతృత్వ ధోరణులు, పితృస్వామిక ధోరణులే అంటారు రీక్.
ఈ అధ్యయాన్ని ది మాస్ సైకాలజీ ఆఫ్ ఫాసిజం పేరుతో రీక్ తొలిసారి 1933లో ప్రచురించాడు. అప్పటికి జర్మనీలో నాజీయిజం అధికారానికి వచ్చింది. నాజీయిజం పనితీరును మరింత సన్నిహితంగా పరిశీలించిన తర్వాత రీక్ నిర్ధారణలు వాస్తవికమైనవనీ, శాస్త్రీయమైనవని రుజువు అయ్యింది. దాంతో ఆ పుస్తకాన్ని 1942లో పునర్ముద్రించారు.
‘‘ఫాసిస్టు మానసికత అంటే నిరంతరం భయాందోళనలతో కూడుకున్న వ్యక్తికి ఉండే మానసికతే. అధికారాన్ని ఆహ్వానించి ఆస్వాదిస్తూనే దాని పట్ల విముఖతను వ్యక్తం చేయటం ఆ మానసికతలో ఉన్న అంతర్గత వైరుధ్యం. ఫాసిజంలో అధికారాన్ని చేపట్టే నియంతలందరూ ఈ తరహా ప్రతీఘాత ధోరణులకు చెందిన వారే కావటం కాకతాళీయం కాదు.’’ అంటారు రీక్.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో నాజీయిజాన్ని నెత్తికెత్తుకున్నది మధ్యతరగతి వృత్తిదారులు, చిన్నవ్యాపారులు, పెటీబూర్జువా వర్గం. ఈ వర్గాలు లోతైన పితృస్వామిక ధోరణులను కలిగి ఉంటాయి. ఇటువంటివారే నియంతృత్వం అధికారాంలో ఉన్నప్పుడు రాజ్యాంగ యంత్రం చేతిలో పావులుగా మారతారు.
ఈ శక్తులు నైతికత, గౌరవ ప్రతిష్టలు, సమాజం పట్ల బాధ్యత అన్న భావనలకు పెద్దపీట వేస్తాయి. ఇవే ఫాసిస్టు భావజాల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించే భావనలు. సాధారణ ప్రజలు దీన్ని నిర్దిష్ట లక్ష్యంతో సాగుతున్న ప్రచారంగా గుర్తించి అర్థం చేసుకోవడానికి బదులు ఇవన్నీ మనం ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలే నని భావిస్తుంటారు.
నిజానికి ఈ శక్తులు నిజజీవితంలో నైతికతకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. తాము చేసే వృత్తులు, వ్యాపారాల్లో చిన్నా చితకా మోసాలు వీరి జీవితాల్లో అత్యంత సాధారణంగా జరిగిపోయే పరిణామాలు. వారు ప్రతిపాదించే నైతికవిలువలు వ్యక్తిగత జీవితంలో పాటించే నైతిక విలువలు కాదు. ఈ నైతికత సార్వత్రిక నైతికత. అంటే సమాజం నైతికంగా ఉండాలని ప్రతిపాదిస్తారు తప్ప ఆ సమాజంలో నిర్దిష్ట స్థానంలో ఉన్న నిర్దిష్ట వ్యక్తులు నైతికతతో వ్యవహరించాలన్న సూత్రాన్ని అంగీకరించరు. పాటించరు.
రీక్ అధ్యయనంలో ఈ పరస్పర వైరుధ్యంలో కూడిన విలువలే ఫాసిస్టు మానసికతలో ముఖ్యాంశంగా ఉన్నాయి.
మనమూ × వాళ్లూ
20 శతాబ్ది ఆరంభం నాటి యూరప్ సమాజం గిడసబారిన సమాజం. 21వ శతాబ్ది సమాజం అత్యంత గతిశీలమైనది. 20వ శతాబ్ది నాటి సమాజం కంటే 21వ శతాబ్ది సమాజం మరింత వైవిధ్యమైనది. చీలికలు, పేలికలుగా ఉన్న సమాజం. సామాజిక మానసికత, దృక్ఫధాల విషయంలో 20వ శతాబ్ది సమాజానికి, 21వ శతాబ్ది సమాజానికీ మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. ఈ సారూప్యతలను అర్థం చేసుకోవడానికి రీక్ అధ్యయనాలు ఎలా ఉపయోగపడాయి? రోజువారీ జీవితంలో తీసుకునే ప్రజాకర్షక వైఖరి ఫాసిస్టు అనుకూల ధోరణులతో నిండి ఉంటుంది.
రాజకీయంగా పార్టీలు అమలు జరిపే ప్రజాకర్షక విధానాలకూ, రోజువారీ జీవితంలో ప్రజలు సార్వత్రికంగా పాటించే విధానాలకూ మధ్య తేడా ఉంటుంది. ప్రజలందరికీ సార్వత్రికంగా ఉండే అభిప్రాయాల్లో ముఖ్యమైనది సమాజం రెండు శిబిరాలుగా చీలి ఉంటుందన్న అభిప్రాయం. ఈ చీలిక నీతిమంతులు, అవినీతిమంతుల మధ్య అయినా ఉండొచ్చు. స్వఛ్చమైన జీవితాన్ని కోరుకునేవారు, అవినీతి కూపంలో కూరుకుపోయి సామాజిక ఆర్థికంగా విలాసవంతమైన జీవితాలనుభవించేవారూ గాను చీలిపోయి ఉండొచ్చు. వీరందరి వాదనంతా ఒకటే. మెజారిటీ ప్రజల మనోభావాల ఆధారంగానే రాజకీయాలు నడవాలన్నది వీరి వాదన. (ముడ్డే, కల్తవాస్సర్ సంయుక్త రచన 2017).
‘నేను సగటు ఓటరుకు ప్రాతినిధ్యం వహిస్తాను తప్ప అనువజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా ఉండటానికి సిద్ధపడను’, ‘కీలకమైన విధాన నిర్ణయాలు జనాలే చేయాలి కానీ నాయకులు కాదు’, ‘రాజకీయాల్లో సంపన్నుల పాత్ర ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం వహించదు’, ‘రాజకీయాల్లో రాజీలంటే మనం నమ్ముకున్న సూత్రాలను వదులుకోవడమే’ వంటి ప్రకటనలు ఈ ధోరణిని ప్రతిబింబిస్తాయి. (భారతదేశంలో గత పదేళ్లకాలంలో మోడీ నోట ఇటువంటి ప్రకటనలు వందలు వేలు వెలువడ్డాయి).
దేశం ఎదుర్కొంటున్న లోతైన, దీర్ఘకాల సమస్యలను, సామాజిక చెడులను సైతం చిటికెలో పరిష్కారం చేస్తానని వాగ్దానం చేయటం నియంతల లక్షణాల్లో ఒకటి. ఇటువంటి నియంతలు తరచూ తాము ప్రజల మనోభావాలకు, భయూందోళనలకూ ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ట్రంప్, ఎర్గోడాన్, మోడి, బోల్సనారో వంటి స్వయంప్రకటిత శక్తిమాన్లు రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాలం ఇది. ఈ శక్తి సామర్ధ్యాలకూ నిజానికి వారికున్న వాస్తవిక శక్తి సామర్ధ్యాలకూ మధ్య ఎటువంటి పొంతనా ఉండదు. ఇటువంటి పాలకులు కీర్తివంతమైన, ప్రకాశవంతమైన ఊహాజనిత గతాన్ని మందుకు తెస్తుంటారు.
భారతదేశంలో ముస్లింల ప్రవేశానికి ముందున్న కాలం, పోలండ్‌లో 14వ శతాబ్దిలో కలిమిర్ ది గ్రేట్ పాలనా కాలం, స్వీడన్లో 1950, 1960 దశకాల కాలాలను ఇటువంటి ఘనకీర్తిగల కాలాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే అన్యమతస్తులు, అన్యదేశస్తులు ఆయా దేశాల్లోకి ప్రవేశించని కాలం అత్యంత గొప్పదిగా చెప్పబడుతూ ఉండేది. (ప్రస్తుతం ఆరెస్సెస్, సనాతన ధర్మరక్షకులుగా తమను తాము ఫోజు పెట్టుకుంటున్న వారు ముందుకు తెస్తున్న వాదనలను ఈ విశ్లేషణతో పోల్చి చూడవచ్చు).
వర్గ విభజనను అధిగమించి మరీ…
ప్రస్తుత శతాబ్ది ఆరంభానంతరం యూరోపియన్ దేశాల్లో పెచ్చరిల్లుతున్న మెజారిటీ అనుకూల ధోరణులు గురించిన చాలా పరిశోధనలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రజాకర్షక రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది మాత్రమే కాదు. పూర్తి ప్రతికూలమైనది కూడా. ఈ రాజకీయాలు నిజానికి ప్రజాస్వామ్య వ్యక్తీకరణలుగా ఉంటూనే మరోవైపు అదే ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోయిన తీరును కూడా చర్చకు తెస్తాయి.
ఆధునిక సమాజాలు ఎన్నో సమస్యలతో అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా జనానికి ఏదికావాలన్న విషయంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు. రాజ్యాంగబద్దమైన పాలనలో రాజీలు తప్పవు. సమన్యాయం అంటే అన్ని విషయాల్లోనూ అందరికీ సమాన అవకావశాలు కల్పించటం. అయితే దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలకు తేలికపాటి పరిష్కారాలు ప్రజాస్వామిక సమాజంలో ఎదురయ్యే సంక్లిష్టమైన చాయిస్‌లు, రాజీలు, వాటితో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధత గురించిస సమస్యలను ముందుకు తెస్తాయి. సత్వర న్యాయం లాగా సత్వర పరిష్కారం గురించిన ధోరణులు ముందుకు రావటంతో చట్టబద్ధపాలన సాంప్రదాయాన్ని భూస్థాపితం చేస్తుంది. రాజకీయ వర్గం విఫలం అయ్యిందన్న వాదన, అవినీతి కూడా ఈ ధోరణులకు పెద్దఎత్తున తోడ్పడుతుంది. (యుపిఎ హయాం గురించిన విమర్శల్లో పాలసీ పరాలసిస్, ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ వంటి నినాదాలును ఈ కోణంలో పున:పరిశీలించాలి.)
సాంప్రదాయంగా అల్పసంఖ్యాకవర్గాలకు ప్రాతినిధ్యం కలిగించటం అంటేనే మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందన్న వాదన కూడా తరచూ ముందుకొస్తుంది (2014 తర్వాత చట్టసభల్లో ముస్లింల ప్రాధాన్యతను రద్దు చేయటానికి సంఘపరివారం ఇటువంటి వాదనలే ముందుకు తేవడాన్ని ఈ నేపథ్యంలో చూడాలి).
ఆదాయం, సంపదల్లో అసమానతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ సమాజంలో మితవాద రాజకీయాలకు, ఫాసిస్టు శక్తులవైపు మొగ్గు పెరుగుతూ ఉండటం గమనించాల్సిన అంశం. పరస్పర విరుద్ధమైన వర్గ ప్రయోజనాల మధ్య ఉండే వ్యతిరేకత సార్వత్రిక విలువలు, వాటికి సంబంధించిన నినాదాల ముందు కనుమరుగవుతున్నది. సమాజం ఆర్థిక సామాజిక ప్రయోజనాల ఆధారితంగా చీలిపోవడానికి బదులు విలువల ఆధారిత వ్యవస్థగా చీలిపోతుంది. ఈ విలువలను తరచూ ఉదార విధానాలతోనో, సాంప్రదాయకతతోనో ముడిపెట్టం జరుగుతోంది.
వర్తమాన పరిస్థితుల్లో ఈ ఉమ్మడి మానసికత అనూహ్యంగా విస్తరించటానికి కావల్సిన ఆంతరంగిక కారణాలు, పరిస్థితులు ఉన్నాయి. దీనికి గల కారణాలును మనం లోతుగా పరిశీలిస్తే అంతిమంగా వీటిని రెండే రెండు కారణాలుగా వర్గీకరించవచ్చు. అస్తిత్వ రాజకీయాలు. కక్షసాధింపు రాజకీయాలు.
నూతన తరహా నిరంకుశత్వం
సాంప్రదాయక ఫాసిజం మళ్లీ తలెత్తుతుందా లేక నూతన తరహా నిరంకుశత్వం రాజ్యమేలుతుందా?
ఈ విషయంలో గతం కొన్ని గుణపాఠాలు నేర్పుతున్నా వర్తమానాన్ని దాని నిర్దిష్ట పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సిందే.
ఇటలీ ఫాసిజం యూరప్ దేశాల్లో తలెత్తిన తొలి మితవాద నిరంకుశ ప్రభుత్వం. తర్వాతి రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల్లో ఈ ఫాసిస్టు శక్తులు వేర్వేరు మోతాదుల్లో విజయం సాధిస్తూ వచ్చాయి.
నిర్దిష్టతల్లో తేడాలున్నా ఈ ఉద్యమాల మధ్య కొన్ని ఉమ్మడి లక్షణాలను మనం గమనించవచ్చు : అధినాయకుడి పట్ల ఆరాధన, అర్థసైనిక స్వభావం కలిగిన సంఘ నిర్మాణాలు, అతివాద జాతీయవాదం, ఇతరులను వెలివేసే విధానాలు ఏ దేశంలోనైనా ఫాసిజంలో కనిపించే ఉమ్మడి లక్షణాలు. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని తుంగలో తొక్కటమే కాక ఉదార ప్రజాస్వామిక విలువల స్థానంలో అణచివేతతతో కూడిన విచక్షాధికారాలు పాలనా వ్యవస్థలుగా మారతాయి. ( సిబిఐ, ఈ డి వంటి సంస్థల దాడులు ఉదాహరణగా చూడవచ్చు) రాజ్యాధికారం తమ రాజకీయ శతృవులకు వ్యతిరేకంగా మరింత హింసను రెచ్చగొట్టేందుకు పనిముట్టుగా మారుతుంది. వర్తమాన నియంతృత్వ పాలనల్లో కూడా ఈ లక్షణాలను మనం గమనించవచ్చు. అయితే సాంప్రదాయక ఫాసిజానికి సంబంధించిన సారూప్యతలు ఇక్కడితో ఆగిపోతాయి. తమ సిద్ధాంతం వైపు యావత్ సమాజాన్ని లొంగదీసుకోవటానికి ఆధునిక ఫాసిస్టు శక్తులు రాజ్యాంగ వ్యవస్థలనూ, న్యాయస్థానాలనూ, ప్రజాతంత్ర వ్యవస్థలోని సాధనాలనూ, చట్టబద్ధమైన రూపాలను, మాస్ మీడియాను ఉపయోగించుకుంటాయి.
ఈ నూతన తరహా నియంతలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా రద్దు చేయరు. దానికి భిన్నంగా తమతమ వికృత చర్యలన్నిటినీ సమర్ధించుకోవడానికి ఈ ప్రజాస్వామిక వ్యవస్థలను సాధనాలుగా మార్చుకుంటారు. జనం తమ విధానాలను సహిస్తే సరిపోదు. భక్తులుగా మారి ఈ నయా నియంతల నిర్ణయాలన్నిటినీ క్రియాశీలకంగా సమర్ధించేవారిగా మారాలని కోరుకుంటారు. అబద్ధాలూ, మోసాలకూ ఎంత బాహాటంగా బరితెగించి పాల్పడతారో ప్రజలు అంతే భారీ సంఖ్యలో వీరి కుతంత్రాలను సమర్ధిస్తూ ఉండటం, వాస్తవాన్ని పూర్తిగా విస్మరించటం నయా ఫాసిస్టు లక్షణాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే మరో వాస్తవం.
మరోమాటగా చెప్పాలంటే ఫాసిస్టు రాజకీయాలను ఓ పద్ధతి ప్రకారం వ్యవస్థలో ప్రవేశపెట్టి పెంచి పోషిస్తూ ఉంటారు. నయా ఫాసిజంలో ప్రజలు కేవలం ఈ విధానాలకు బలయ్యేవారిగా మిగిలిపోవటమే కాదు. ఈ విధానాలను ముందుకు తీసుకువెళ్లే పనిముట్లుగా మారతారు. దీని సమర్ధకులు కేవలం మాటమాత్రమైన సమర్ధకులుగానో, లేక ఓటర్లుగానో మిగిలిపోరు. అటువంటి నయా ఫాసిస్టు పాలకులకు, పాలనకు ఎదురొడ్డి నిలిచే వారిని, అదృశ్య శతృవులను రాక్షసులుగా చూపించటంలో క్రియాశీలక పాత్రధారులుగా ఉంటారు. (వర్తమానం లో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రొలింగ్ ను దీనికి ఉదాహరణగా చూడవచ్చు) సాధారణ ప్రజలను కూడా ఫాసిజం ఆవహిస్తే తలెత్తే పరిస్థితులు ఇవి.
ఈ శక్తులకు అంతముండదా?
ఈ విస్తృత ప్రజానీకాన్ని వెర్రెక్కించటంలో ప్రతి మనిషి తనదైన పాత్ర పోషిస్తాడు. అటువంటి వ్యక్తులు గుంటర్ గ్రాస్ నవల టిన్ డ్రమ్‌లో కథానాయకుడు ఆస్కార్ లాగా నిరంతర మరగుజ్జులుగానే మిగిలిపోతారు. బావిలోని కప్పల్లానే ఉండిపోతారు. భౌతికవాస్తవికతను చూడటానికి వీలుగా మానసిక పరిణతి సాధించేందుకు సిద్ధంకారు. ఇటువంటివారి నిశ్శబ్ద రోదన ప్రజాస్వామ్యమనే గాజు మేడను కూల్చేస్తుంది. ఈ ఆస్కార్లు ఎదిగినప్పుడు తమ స్వతంత్రతను పున:ప్రతిష్టించుకున్నపుపడు విధ్వంసక లక్షణాలను త్యజిస్తారు.
గుంటర్ గ్రాస్ నవలలో లాగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లినప్పుడు ఫాసిజం దానంతటదే మరణశయ్యపై చేరుతుందన్న నమ్మకంతో నిజజీవితంలో జీవించటం అంత తేలికైన పనేమీ కాదు. నిజానికి జీవితాంతం ఫాసిస్టు వ్యతిరేకిగా ఉన్న గుంటర్ గ్రాస్ కూడా తర్వాతి దశలో ఫాసిజాన్ని పటిష్టపర్చటంలో భాగస్వామి అవుతాడు.
కౌషిక్ జయరాం
అనువాదం: కొండూరి వీరయ్య
రచయిత బ్యాంక్ ఫర్ ఇంటన్నేషనల్ సెటిల్మెంట్స్లో పని చేశారు. ఆర్థిక, సాంకేతిక, బ్యాంకింగ్ రంగాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం గడించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.