
దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఐ) ఈ కంపెనీపై ఏడాది పాటు కొత్త ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా, రూ 90 లక్షలు జరిమానా విధించనున్నట్లు పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేరళలో జాతీయ రహదారి 66 పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడటంతో ఎన్హెచ్ఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధానికి ప్రధాన కారణం కేరళలోని కసర్‌గోడ్‌లో జాతీయ రహదారి 66 పనుల్లో జరిగిన ప్రమాదం. 2025 జూన్ 16న చెంగల-నీలేశ్వరం సెక్షన్లో జరుగుతున్న నిర్మాణంలో మట్టి జారిపడి(స్లోప్ ప్రొటెక్షన్ వర్క్స్) కూలిపోయింది. ఈ ఘటనతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ఎన్హెచ్ఐ వెంటనే విచారణ జరపగా, మెఘా ఇంజనీరింగ్ సంస్థ పనుల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది.
సరైన డిజైన్ లేకపోవడం, మట్టి జారిపడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు(స్లోప్ స్టెబిలైజేషన్) సరిగా చేపట్టకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణాలని ఎన్హెచ్ఐ తన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ కిందకు వస్తుంది. అంటే, కాంట్రాక్టర్(మెయిల్) 15 సంవత్సరాల పాటు రోడ్డును నిర్వహించడంతో పాటు, దెబ్బతిన్న భాగాన్ని తన సొంత ఖర్చుతో పునర్నిర్మించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నాణ్యతా లోపాల కారణంగానే మెయిల్‌పై ఏడాది పాటు కొత్త బిడ్లలో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎన్హెచ్ఐ ప్రకటించింది. అలాగే, రూ 90 లక్షల జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై మెఘా ఇంజనీరింగ్ 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఘటనపై విచారణ కోసం, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ) నుంచి సీనియర్ శాస్త్రవేత్త, ఐఐటీ-పాలక్కాడ్ నుంచి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులతో కూడిన ఒక నిపుణుల కమిటీని కూడా ఎన్హెచ్ఐ ఏర్పాటు చేసింది.
మెఘా ఇంజనీరింగ్‌కు గతంలో ఎదురైన వివాదాలు..
మెయిల్ పనుల నాణ్యతను ప్రశ్నించే సంఘటనలు గతంలో చాలనే చోటుచేసుకున్నాయి. ఈ సంస్థ భారతదేశవ్యాప్తంగా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో కీలకంగా వ్యహరించింది. వాటిలో చాలావరకు సాంకేతిక వైఫల్యాలు, భద్రతా సమస్యలు వంటి విమర్శలు ఎదుర్కొన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ (తెలంగాణ)..
తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మెయిల్ నిర్మించిన అత్యంత కీలక ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ ప్రాజెక్టులో భాగంగా మెఘా కంపెనీ మేడిగడ్డ బ్యారేజ్, పంప్ హౌస్‌లు నిర్మించింది. అయితే మేడిగడ్డ బ్యారేజీలో భారీ నిర్మాణ లోపాలు వెలుగుచూశాయి. మూడు పిల్లర్లు భూమిలోకి మునిగిపోయాయి, బ్యారేజీలో పెద్ద పగుళ్లు కనిపించాయి. దీంతో ఈ బ్యారేజీని కొన్ని రోజులు ఉపయోగించకుండా పాక్షికంగా మూసివేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక విచారణకు ఆదేశించినా, ఇప్పటివరకు మెయిల్‌పై ఎటువంటి అధికారిక చర్యలు తీసుకోలేదు. డిజైన్ లోపాలు, నాణ్యత లోపాల గురించి నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణానికి ముందు లేదా తర్వాత స్వతంత్ర సంస్థల ద్వారా తనిఖీలు జరపకపోవడమే ఈ లోపాలకు ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు.
సుంకిశాల సొరంగం కూలిపోవడం..
2024 ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టులో ఒక సొరంగం కూలిపోయింది. ఈ పనులను మెయిల్ చేపట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. తొలి నివేదికల ప్రకారం, భూగర్భ పరిస్థితుల అంచనా తప్పిపోయిందని, సొరంగాన్ని బలంగా తయారుచేయడంలో లోపాలు ఉన్నాయని తేలింది. ఈ ఘటనపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అంతర్గత విచారణ ప్రారంభించినప్పటికీ, దాని నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. ఎవరు బాధ్యులు అన్నది ఇప్పటివరకు అధికారికంగా తెలియజేయలేదు.
ఎంఎంఆర్డీఏ టెండర్ రద్దు..
మహారాష్ట్రలో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఎంఆర్డీఏ) మెఘా కంపెనీకి సుమారు రూ 14,000 కోట్ల విలువైన రెండు పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అప్పగించింది. కానీ ఎల్అండ్టీ వంటి సంస్థలు తక్కువ ధరలకు బిడ్లు ఇచ్చినా అవి పట్టించుకోకపోవడం వల్ల ఈ టెండర్లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఎంఎంఆర్డీఏ ఈ టెండర్లను రద్దు చేయాల్సి వచ్చింది.
ఎన్నికల బాండ్లు: మెఘా సంస్థ చుట్టూ విరాళాల నుంచి ఒప్పందాల దాకా తలెత్తిన వివాదం..
ఎన్నికల బాండ్ల పథకాన్ని 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. దీని తరువాత మెయిల్(మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) చుట్టూ ఉన్న వివాదం కొత్త రాజకీయ మలుపు తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాండ్ల కొనుగోలు, ఏడీఆర్ వివరాలను బహిర్గతం చేసింది. ఈ డేటా ప్రకారం, మెయిల్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూ 966.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొన్నట్లు తెలిసింది. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద విరాళదాతగా మెయిల్‌ను నిలబెట్టింది. వీటిలో పెద్ద మొత్తం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చేరినట్టు, అది నగదుగా మార్చుకున్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి. అంతేకాక, మెయిల్‌కు భారీ ప్రాజెక్టులు ఉన్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాల్లో అధికార- ప్రతిపక్ష పార్టీలకు కూడా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చినట్టు తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై విమర్శలు తలెత్తాయి.
అమరావతి ప్రాజెక్టులపై ప్రభావం?..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీ పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి, పోలవరం విద్యుత్ ప్రాజెక్టు: పోలవరం ప్రాజెక్టు వద్ద 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌లో ప్రెజర్ టన్నెల్ పనులను మెయిల్ చేపడుతోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అత్యంత కీలకం. పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు: అన్నమయ్య జిల్లాలోని కొమ్మురులో రూ 10,300 కోట్ల పెట్టుబడితో ఒక పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టును మెయిల్ నిర్మిస్తోంది. దీంతో పాటు అమరావతి మౌలిక సదుపాయాలు: అమరావతిలో రోడ్లు, విద్యుత్ లైన్లు, ఇతర ప్రాథమిక సేవలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులలో మెయిల్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ)తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.