
తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే టీటీడీ మరో వివాదానికి వేదిక అయింది. తిరుపతి టీటీడీ గోశాలలో 3 నెలలలో 100 గోమాతలు చనిపోయాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం ఏపీలో పెను దుమారాన్ని లేపింది. గోవుల మృతి ఆరోపణలు రూటు మారి రాజకీయం పెనవేసుకొంటోంది. రాజకీయ కుట్రలో భాగంగా భూమన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. టీటీడీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలలో నిజం లేదని, గోశాలలో గోవులు మృతి చెందలేదని వివరణ ఇచ్చింది. మరి ఈ అంశలో నిజం నిగ్గుతేల్చే పని ఎవరు చేయాలి? ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా అసలు వాస్తవాన్ని భక్తుల ఎదుట ఎందుకు పెట్టడంలేదు?
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్వీ గోశాలలో గోవుల దుస్థితి దారుణంగా ఉంది. చనిపోయిన ఆవుల లెక్కలు, బయటకు రాకుండా చూశారు. కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ మహాపాపం టీటీడీది, ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు.
గోశాలపై పర్యవేక్షణ అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణం అన్నారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో గుజరాత్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల నుండి ఆవులను తీసుకోచ్చి స్వామి వారి సేవలు అందించామని, 580 ఆవులను తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు టీటీడీ జేఈవో, సీవీ ఎస్వీ సహా ఇతర అధికారులను నియమించలేదు. తొక్కిసలాట ఘటనలో ఏమాత్రం సంబంధం లేని ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కావాలనే సస్పెండ్ చేసి, ఇప్పుడు గోవుల మృతికి చంద్రబాబు కారణం అయ్యారని దుయ్యబట్టారు.
భూమన ఆరోపణలపై స్పందించిన టీటీడీ
గత మూడు నెలల్లో తమ గోశాలల్లో 100 ఆవులు చనిపోయాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పేసింది. కొందరు దురుద్దేశంతో చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో చనిపోయినట్లు చూపిస్తున్న ఆవులు టీటీడీ గోశాలల్లోవి కాదని తెలిపింది. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని భక్తుల్ని కోరింది.
రాజకీయంగా మంటలు
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ దురుద్దేశ్యంతో పవిత్రమైన టీటీడీ ప్రతిష్ట దిగజార్చాలని చూడటం దారుణమని బీజేపీ, తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు టీటీడీ క్లారిటీ ఇవ్వగా బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గోశాలలో గోవుల మరణాలు జరగలేదని, ఈ ప్రచారం భక్తుల మనోభావాలను గాయపరిచేందుకు వైసీపీ దురుద్దేశంతో చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ విషయంపై విచారణ జరుపుతోందని, ప్రస్తుతం గోశాలలో 1,768 గోవులు ఆరోగ్యంగా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రమైన తిరుమలను ధనార్జన క్షేత్రంగా మార్చేశారని విమర్శించారు. ఎస్వీ గోశాలలో వంద గోవులు బక్కచిక్కి, మృత్యువాత పడ్డాయని చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, శ్రీవారి భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, గోశాలలో గోవులన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తే చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ ఆరోపణలు నిజం కాకపోతే ,రాజకీయాల నుంచి తప్పుకుంటారాని సవాల్ కూడా విసిరారు. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. దీన్ని నీచమైన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. వైసీపీ నేతలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రమేయం ఉన్న ఓ అధికారిని కాపాడేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని, వారికి హిందూ మతంపై గౌరవం లేదని విమర్శించారు. పవిత్ర సంస్థలపై అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీపై వైసీపీ చేస్తున్న విమర్శలు దారుణమన్నారు. గతంలో బోర్డు ఛైర్మన్గా టీటీడీని అప్రతిష్ట పాలుచేసిన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు మరో కుట్రకు తెరలేపారన్నారు.
నిజం నిరూపించాల్సింది ఎవరు?
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. ఆ వివాదం ముదిరి సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ సాగుతోంది. ఇంతవరకూ సిట్ బృందం కల్తీ జరిగిందా లేదా అన్నది మాత్రం తేల్చలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. లడ్డూ వివాదంలో ప్రభుత్వమే ఆరోపణ చేసి దర్యాప్తునకు ఆదేశించింది. మరి ఇప్పుడు టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయని ప్రతిపక్షం చేసే ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తుందా? ఈ విషయాన్ని ఆధారాలతో సహా తప్పు జరగలేదని చెప్పాల్సింది టీటీడీ బోర్డు. ఇప్పుడు టీటీడీ గోవులు చనిపోలేదంటోంది. ఇదంతా రాజకీయ ప్రేరేపితంగా కొట్టిపారేస్తోంది. అయినా గోశాలలో వుండే గోవులకు పక్కాగా లెక్క వుంటుంది. ప్రతి గోవుకూ నెంబర్ కూడా వుంటుంది. అలాంటప్పుడు ఏదో ఆరోపణలు ఎవరో చేస్తే, ఊరుకోవాల్సిన పనిలేదు. తప్పుడు ఆరోపణలు అయితే చర్యలు చేపట్టవచ్చు. టీటీడీ ఎందుకు ఉపేక్షించాలన్నది అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇప్పటికైనా వాస్తవాలను వెల్లడించి, తగిన చర్యలు చేపట్టాలి. తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవోకు మధ్య విభేదాలు బైటపడ్డాయి. అది కాక అధికారుల మధ్య సమన్వయలోపం కనిపించింది. వాటన్నింటినీ దాటి టీటీడీ బోర్డు వ్యవహరించాలి. గోశాలలో ఆవుల రక్షణకోసం అధికారులు నిత్యం చర్యలు తీసుకుంటూ ఉంటారనే, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ప్రతి నెలా పదుల సంఖ్యలో గోవులు మరణిస్తుంటాయని వివరించారు. సాధారణ మరణాలయితే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అధికారుల నిర్లక్ష్యం వుంటే మాత్రం తప్పుపట్టాల్సిందే. ఒకవేళ గోవుల మరణాల వార్తలు అసత్యమైతే, అటువంటి ప్రచారం చేసిన వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం గోశాలకు ప్రత్యేకంగా ఇంచార్జ్ లేకపోవడం, అటవీశాఖ అధికారి గోశాల బాధ్యతలు కూడా చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
టీటీడీ గోశాల నేపధ్యం
దీని నేపథ్యం ఏంటంటే ఈ గోశాల దానంగా పొందిన పశువుల సంరక్షణ కేంద్రం. దీనిని 1956లో టిటిడి స్థాపించింది. 2004లో ఎస్వి గోసంరక్షణశాలగా పేరు మార్చారు. ఇది తిరుపతిలోని చంద్రగిరి రోడ్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాల ట్రస్ట్ కింద వచ్చిన నిధుల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం దీనిని నిర్వహిస్తోంది. పశువులకు మంచి వాతావరణం, నిర్వహణ, ఆహారం అందిస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలు, దాని ఉత్పత్తులను శ్రీవెంకటేశ్వర ఆలయం, ఇతర టిటిడి దేవాలయాలలో రోజువారీ ఆచారాల కోసం టిటిడి వినియోగిస్తుంది. ప్రస్తుతం 2600లకు పైగా గోవులు వున్నాయని లెక్కలు చెబుతున్నారు. ఇందులో అరుదైన మేలుజాతి ఒంగోలు, పుంగనూరు, కపిలగోవు, కాంగేయం వంటివి ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.