
అమెరికా మితిమీరిన వ్యయానికి ప్రపంచం మూల్యం చెల్లిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రంప్ ఎంచుకుంటున్న వినాశకర విధానాలను భారతదేశం సమర్ధిస్తుందా?
అంతిమంగా అమెరికాలో పరపతి మార్కెట్ కుదేలవటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చతికిలబడ్డాడు. ఫలితంగా 75 దేశాల నుండి అమెరికాకు వస్తున్న దిగుమతులపై ఎడాపెడా దిగుమతి సుంకాలు విధించాలనే నిర్ణయాన్ని మూడునెలల పాటు వాయిదా ట్రంప్ వేసుకున్నాడు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు అమలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థలు అతలాకుతలమయ్యేవి. రానున్నకాలంలో ఈ నిర్ణయాలు ధరలు విపరీతంగా పెరగటానికి, ఆర్థికమాంద్యానికి, దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్తబ్దతకు దారితీసేది. కానీ పరపతి మార్కెట్ స్పందన అమెరికా విధానాలపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నమ్మకం కోల్పోయిందనే విషయాన్ని చాచిపెట్టి కొట్టి మీర చెప్పింది. జపాన్, ఇతర దేశాల్లో పరపతి మార్కెట్ నిల్వలు డాలర్లలో ఉంటాయి. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడైన జపాన్‌తో సహా వివిధ దేశాలు తమ దేశాల్లో డాలర్ రూపంలో ఉన్న పరపతి నిల్వలను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాయి. దాంతో అమెరికా డాలర్ విలువ పతనం అంచుకు చేరుకుంది.
ఏ స్టాక్మార్కెట్లోనైనా ఒక కంపెనీ షేరు విలువ పడిపోయిందంటే ఆ కంపెనీ పట్ల నమ్మకం సన్నగిల్దిందని అర్థం. కానీ ప్రభుత్వం జారీ చేసిన పరపతి పత్రాల అమ్మకాలు తగ్గాయంటే ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లిందని అర్థం. సార్వభౌమత్వం కలిగిన దేశాలు జారీ చేసే రుణపత్రాల విలువ ఆయా దేశాల సార్వభౌమత్వ విలువకు ప్రతీకలుగా అంతర్జాతీయ మార్కెట్ చూస్తుంది. ఈ విషయాన్ని ట్రంప్ చుట్టూ ఉన్న సలహాదారులలో కొందరైనా ట్రంప్‌కు వివరంగా చెప్పి ఉండొచ్చు.
అప్పు అందంగా ఉంటుంది
దిగుమతి సుంకాల విధింపు తాత్కాలికంగా వాయిదా వేసిన తర్వాత ‘పరపతి మార్కెట్ సంక్లిష్టమైనదే’అని ట్రంప్ తొలిసారి ఒప్పుకున్నారు. పరపతి మార్కెట్ భాగస్వాములు ఆందోళనకు గురయ్యారనికూడా ఆయన ఒప్పుకున్నారు. దిగుమతి సుంకాల విధింపు వాయిదా పడిన తర్వాత పరపతి మార్కెట్లో కదలికలు ఆకర్షణీయంగా మారాయని చెప్పుకున్నారు. ఆకర్షణీయంగా అన్న పదాన్ని వాడటం ఇక్కడ ఆసక్తికరమైన అంశం.
నిజంగానే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌కి పరపతి(అప్పు) ప్రాణవాయువు లాంటిది. అదేసమయంలో మార్కెట్ విశ్వాసం కోల్పోతే రాత్రికి రాత్రే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌కు గుండాగినంత పని అవుతుంది. డాలర్ల రూపంలో అమెరికా పరపతిని లక్షల కోట్ల డాలర్ల అమెరికా పరపతిని నిల్వ వేసుకున్న దేశాలు తన నిర్ణయాలతో గందరగోళానికి గురవుతున్నాయని, తన విధానాల పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నారని గుర్తించటానికి ట్రంప్‌కు ఎంతో కాలం పట్టలేదు. జపాన్, చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, భారతదేశం వంటి దేశాల్లో సుమారు ఆరు లక్షల కోట్ల విలువైన డాలరు నిల్వలున్నాయి. ఆయా దేశాల్లో నేటికీ 60 శాతం బాండ్లు డాలర్ నిల్వల రూపంలోనే ఉన్నాయి. ఈ నిల్వలు చారిత్రంగా డాలర్ ఆధారిత అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ చట్రంపై ఉన్న నమ్మకానికి ప్రతీకలుగా ఉన్నాయి.
ఉత్పాదక రంగాన్ని తిరిగి అమెరికాకి రప్పించాలన్న సాకుతో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం వారం రోజుల్లోనే ప్రపంచ ద్రవ్య మార్కెట్ చట్రాన్ని ఓ కుదుపు కుదిపింది.
ఇక్కడ ట్రంప్ చేసిన తప్పు ఏమిటంటే అమెరికా వినిమయ మార్కెట్‌ను పోషించటానికి డాలర్ రూపంలో అప్పులు తీసుకుని వడ్డీలు కడుతున్న దేశాలనే ట్రంప్ బెదింరించటం ప్రారంభించాడు. ఈ దేశాలు కట్టిన వడ్డీలే ఇరాక్, ఆఫ్గనిస్తాన్, ఉక్రెయిన్లలో అమెరికా యుద్ధ వీరంగానికి పెట్టుబడులు సమకూరుస్తున్నాయి.
అమెరికా పౌరులు దేశంలో జరుగుతున్న అదనపు వినిమయానికి కానీ, స్థూల జాతీయోత్పత్తిలో పోల్చినపుడు 130 శాతం పెరిగిన రుణభారానికి అమెరికా పౌరులు చెల్లించేది నామమాత్రమేనని వారెన్ బఫెట్ స్పష్టం చేశారు.
ఈ మధ్యకాలంలో అమెరికాలో విపరీతంగా పెరిగిన ఖర్చుకు ఆధారం, అమెరికా విదేశాల నుంచి సేకరించిన రుణాలే. ఈ రుణాలు సేకరించటానికి అమెరికా సావరిన్ బాండ్ల పేరిట పరపతిపత్రాలను అమ్మింది. ఆ పత్రాలు కొనుక్కున్న దేశాలపైనే ఇప్పుడు ట్రంప్ సుంకాల కొరడా ఝళిపిస్తున్నాడు. అంటే అమెరికా విలాసాలకు అంతర్జాతీయ సమాజం మూల్యం చెల్లిస్తోందన్నమాట.
హనుమంతుని తోకలా పెరుగుతున్న వాణిజ్య లోటు
ఏ దేశాలకైతే అమెరికా రుణపడి ఉందో ఆ దేశాలపైకే ట్రంప్ తుపాకీ గురిపెడుతున్నారు. ఈ దేశాలు అమెరికా పరపతి పత్రాలు కొనుగోలు చేయకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థలో లోటు పెరుగుతుంది.
నీ ఇంటి పొయ్యిలో పిల్లి లేవటానికి, నువ్వే తెచ్చి పెట్టే గిల్లి కజ్జాలకు పెట్టుబడులు పెడుతున్న దేశాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించటం దుస్సాహసమే కదా. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చేసిన చౌకబారు వ్యాఖ్యను గుర్తు చేసుకోవాలి. ‘చైనా రైతుల నుండి అప్పు తీసుకుని వాళ్లు తయారు చేసిన సరుకులనే కొంటున్నాము’ అని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో చైనా సోషల్ మీడియా చైనా ఇచ్చిన అప్పులకు అమెరికా రుణపడి ఉండాలని వ్యాఖ్యానించింది.
అంటే నిరంతరం ట్రంప్ దాడి ఎక్కుపెట్టిన వాణిజ్యలోటు సమస్య ఏమిటి? శక్తికి మించి అమెరికా చేస్తున్న ఖర్చును పూడ్చుకోవడానికి వివిధ దేశాల నుండి వివిద రూపాల్లో చేసిన అప్పుల ఫలితమే ఈ వాణిజ్య రుణాలు. ఇక్కడ లెక్కలు తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ విధానాలు తప్పు అని భావిస్తే అమెరికా తన ప్రజలను పరిమిత వినియోగం దిశగానూ, పొదుపు దిశగానూ ప్రోత్సహించాలి. పొదుపు చేసే వారికి ప్రోత్సహకాలు ఇవ్వాలి. ఈ శతాబ్ది ఆరంభంలో అమెరికా రుణభారం స్థూల జాతీయోత్పత్తిలో 50 శాతం మాత్రమే ఉండేది. ప్రస్తుతం 130 శాతం ఉంది. గత పాతికేళ్లలో అమెరికా అడ్డగోలు వినియోగం ద్వారా ఆదాయానికి మించిన ఖర్చులు పెంచుకుంటూ పోయి ఆర్థిక వ్యవస్థను చేజేతులా లోటుపాలుచేసుకున్న తర్వాత ఏ చైనానో, మెక్సికోనో, యూరోపియన్ యూనియనో దీనికి కారణం అని ఆడిపోసుకోవడం తగునా?
ఇంకా చెప్పాలంటే అమెరికా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా ఆ దేశపు డాలరును అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ద్రవ్య చట్రం గౌరవిస్తున్నందుకు సంతోషించాలి. ఇప్పుడున్న అమెరికా రుణభారం ఇలానే కొనసాగితే ముందుముందు డాలరు విలువ పడిపోతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజం చెప్పాలంటే అమెరికా వాణిజ్య లోటు గురించి చేస్తున్న గగ్గోలంతా పెరుగుతున్న రుణభారాన్ని, వడ్డీచెల్లింపుల మేరకైనా ఆదాయాలు సంపాదించలేని దేశీయ ఆర్థిక వ్యవస్థ వైఫల్యాల నుండి ప్రజలను ఏమార్చటానికే. ఏ దేశానికైనా సంవత్సరానికి కట్టే వడ్డీ రేటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సాధించే వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశం శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అర్థం. అమెరికా పాలకవర్గం ఆందోళనకు కారణం ఇదే. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ట్రంప్ దేశీయంగా పేరుకుపోతున్న అప్పులకు, వాణిజ్యలోటుకు ప్రపంచ దేశాలను ఆడిపోసుకుంటున్నాడు.
అప్పిచ్చువాడు వైద్యుడు
ట్రంప్ నినాదం అమెరికాను మళ్లీ అగ్రరాజ్యం చేయాలని. ఎలా? మార్ ఎ లాగో ప్రాజెక్టు ద్వారా. అప్పిచ్చేవాడే షరతులు విధిస్తాడు అన్నదే ఇప్పటి వరకూ అమల్లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ సూత్రం. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సూత్రం ఊరికే రాలేదుగా. ప్రస్తుతం అమెరికాపై ఉన్న రుణభారాన్ని ఇతర దేశాలపైకి మోపటానికి ఇప్పుడున్న అంతర్జాతీయ ద్రవ్య చట్రాన్ని బలహీనపర్చటం ఈ ప్రాజెక్టు సారాంశం. దాని స్థానంలో బలవంతంగా అమలయ్యే నూతన తరహా ద్రవ్య చట్రాన్ని తెరమీదకు తీసుకురావాలన్నది ట్రంప్/అమెరికా ప్రయత్నం. ట్రంప్ దిగుమతి సుంకాల విధానం ఎంత పనికిమాలినదో ఈ విధానం కూడా అంతే పనికిమాలినది. ఈ సంవత్సరం చివరికి అమెరికా చెల్లించాల్సిన అప్పులు తొమ్మిది లక్షల కోట్ల డాలర్లు. ఈ అప్పు చెల్లించాలంటే ఎక్కడోచోట కన్నం వేయాలి. అసాధ్యమైనంత సంపాదించాలి. దానికోసం ఎవరో ఒకరి నెత్తిన చేయి పెట్టాలి.
దీనికోసం ట్రంప్ వాడుతున్న పాచిక ఏమిటి? ప్రస్తుతం జపాన్, చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, బ్రెజిల్, భారతదేశం వంటి దేశాల వద్ద ఉన్న అమెరికా బాండ్ల కాలపరిమితి పదేళ్లు. వీటిని వందేళ్ల కాలపరిమితికి వాయిదా వేసి వాటిని వడ్డీ లేని రుణంగా మార్చాలన్నది ట్రంప్ యోచన. అంటే రానున్న వందేళ్లల్లో ఏ పార్టీ అమెరికాలో అధికారానికి వచ్చినా వడ్డీ చెల్లించే పని ఉండదు. అసలు వందేళ్ల వరకూ చెల్లించాల్సిన అవసరం రాదు.
పాల్ క్రుగ్మాన్ అన్నట్లు ఇటువంటి విధానాలు, సుంకాల యుద్ధం వెరసి ఇప్పటి వరకూ అమెరికా తోపు అన్న అభిప్రాయాన్ని, నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో మౌలిక స్థిరత్వం కోసం అమెరికా చొరవతో రూపొందించిన వ్యవస్థలోనే మనం జీవిస్తున్నాము. ఈ వ్యవస్థ నడిసముద్రం అనుకుంటే ఒడ్డుకు చేరటానికి వివిధ దేశాలు అనుసరించే విధానాలు పడవల్లాంటివి. అమెరికా అలాంటి పడవకు కన్నం వేసుకుంటూ కూర్చుంటే గత ఎనిమిది దశాబ్దాల పాటు అమల్లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ చితికి శిథిలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా ఇదే విధంగా వాణిజ్య సుంకాలనో మరోటనో దూకుడుగా వ్యవహరిస్తే అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ మనుగడ సాగించేందుకు బహుళ కరెన్సీ ఆధారిత వ్యవస్థగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ ఆధారిత వ్యవస్థగా మారక తప్పదని పోయిన వారం రష్యా టీవీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్యా విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. డాలర్ ఆధిపత్య ప్రపంచ ఆర్ధిక చట్రం ఇప్పుడు బహుళ కరెన్సీ ఆధారిత ఆర్థిక చట్రంగా మారే క్రమాన్ని ట్రంప్ విధానాలు వేగవంతం చేస్తున్నాయని సెర్గీ లావ్రోవ్ అన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న బ్యాంకింగ్ లావాదేవీల వ్యవస్థ స్విఫ్ట్. దీని స్థానంలో చైనా తనదైన స్విఫ్ట్ చట్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నం చేస్తుందన్న వార్తలు వచ్చాయి. రష్యాలో ఉన్న డాలర్ వనులను వినియోగంలో రాకుండా అడ్డుకున్న అమెరికా రష్యాను స్విఫ్ట్ వ్యవస్థ నుండి బయటికి నెట్టింది. దాంతో రష్యా డాలర్ ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో ఎటువంటి లావాదేవీలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల, విధాన నిబధ్దత పట్ల విశ్వాసం కోల్పోతున్న ప్రపంచానికి చైనా రూపొందించే ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఆశారేఖలుగా ఉన్నాయి. దీంతో అమెరికా నిర్మించబూనుకున్న నూతన ద్రవ్య చట్రంలో భారతదేశం భాగస్వామి అవుతుందనే హామీ ఇచ్చే ముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. అత్యంత వినాశకర ఫలితాలకు దారితీసే మార్ ఎ లాగో ప్రాజెక్టును భారతదేశం బహరింగంగా వెనకేసుకొస్తుందా? రానున్న మూడునెలల్లో 75 దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే నిర్ణయాలను తీసుకోబోతున్న తరుణంలో భారత విదేశాంగ మంత్రి ఈ విషయాలపై ఎలా స్పందిస్తారో దేశం తెలుసుకోవాలనుకొంటోంది.
ఎంకె వేణు
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.