
“నేను ఒక సగటు గ్రామీణ రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి,ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ప్రవేశించి, అందులో అంచెలంచెలుగా ఎదిగి, ఆర్థికంగా బలపడ్డాను. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేస్తున్నాను” అంటూ చాలా వేదికలపై సీఎం రేవంత్ తన జీవన ప్రయాణం గురించి ప్రస్తావిస్తుంటారు.
పేదల జీవితాల్లో మార్పు, నిరుద్యోగుల నైపుణ్యాల్లో మెరుగుదల వంటివి తన లక్ష్యమని సీఎం రేవంత్ అంటారు. దానిలో భాగంగానే విద్యారంగంలో చాలా విప్లవాత్మక మార్పులు,పేదలకు కనీస అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలు అవసరమని తన విజన్‌ను ప్రకటిస్తుంటారు. ఈ వైపుగా వారి ఆధ్వర్యంలో తొలి అడుగులు పడ్డాయని కొన్ని పథకాలు, ప్రకటనల ద్వారా తెలుస్తోంది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆడవారికి ఉచిత బస్ సదుపాయం వంటివి కొన్ని చూచాయగా కనిపిస్తున్నాయి.
ఈ ఏప్రిల్ నెలలో రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం ఓ చారిత్రాత్మకమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా సామాన్యుడి ఇంట సీఎంతో సహా మంత్రులు సహపంక్తి భోజనం చేస్తూ ‘సన్నబియ్యం పంపిణీ’ కార్యక్రమానికి ప్రచారం కల్పించారు. ఈ పథకం వల్ల దాదాపు మూడు కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఆకలి తీరుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో మహాత్మా గాంధీ స్ఫూర్తితో “యంగ్ ఇండియా” పేరుతో 58 సమీకృత పాఠశాలలని ప్రారంభిస్తూ, మౌలిక వసతుల కల్పన కోసం రూ. 11,500 కోట్లు కేటాయించారు. మారుతున్న ప్రపంచ పోకడల ఆధారంగా మన పిల్లలందరూ అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభ్యసించాలనే తెలంగాణ సీఎం తాపత్రయం స్వాగతించాల్సిన విషయం.
ప్రభుత్వ పాఠశాలలో ప్రతిసంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గడాన్ని నిరోధించడానికి ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా 2025-26 విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభిస్తున్నారు. నిజానికి మారుమూల తండాలు, గ్రామాల్లోని ప్రజలు వేల రూపాయలు ఖర్చుపెట్టి తమ పిల్లలకు ప్రైవేటు విద్యను కొనలేకపోతున్నారు. ఉచిత రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తూ గాంధీజీ గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాభివృద్ధికి విద్యను ఆయుధంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, దాదాపు 15 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడులకే పంపడానికి ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారనే కోణంలోనే ముఖ్యమంత్రి విద్యా కమిషన్ నివేదికతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ వంటి మేధావుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అవసరమని భావిస్తున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లాకు 30 బడుల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నారు. విద్యావాలంటీర్లను నియమిస్తూ, చిన్నారులకు విద్యకు సంబంధించిన కిట్లు అందించే ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి.
దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ గట్టిగానే సంకల్పించినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా విశ్వ విద్యాలయాల స్థాయిలో పిహెచ్డి విద్యార్థుల గుణాత్మకమైన పరిశోధనలు పెంచడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రోత్సహాకాలు అందించాలి. విద్యా సంస్థల్లో వివిధ స్థాయిల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను వెంటనే టెంపరరీ బేస్‌లో కాకుండా పర్మినెంట్ మోడ్‌లో నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చెయ్యాలి.
“కేవలం పేద పిల్లల కోసమే ప్రభుత్వ విద్యాసంస్థలు” అనే లోకోక్తి ఎందుకొచ్చిందో ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగుల, రాజకీయ నాయకుల, ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల్లోని పిల్లలు అందరూ ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు సైతం అప్పులు చేసి మరీ ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చదివిస్తున్నారు. దీనికి గల కారణాలను క్షేత్రస్థాయిలో అన్వేషిస్తేనే విద్యారంగంలో సమూల మార్పు వస్తుంది.
ఆర్థికంగా బలంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధ్యాపకులు- ఉపాధ్యాయుల్లో కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులుగా వున్న విషయం అందరికీ తెలిసిందే. “వాళ్లైతే తమ పిల్లలను ప్రైవేటులో చదివిస్తారు. అంటే “మేం పేదోళ్లం కాబట్టి సర్కారు బడుల్లో చదవాలా? మా పిల్లల భవిష్యత్తు మాలాగే వుండాలా? కూలీ పని చేసైనా సరే మా పిల్లల్ని బాగా చదివిస్తాం. అంబేద్కర్ చిత్రపటాన్ని చూపిస్తూ, చదువుకంటేనే కదా సర్, మా పిల్లల బ్రతుకులు మారేది” వంటి మాటలు ప్రస్తుతం పల్లెల్లో బలంగానే వినిపిస్తున్నాయి.
మంచి కార్యాచరణతో అర్హత, అనుభవం, ఆసక్తి వున్న ఫ్యాకల్టీతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న ఐఐటీ/నీట్ ఫౌండేషన్ తరగతులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు వంటివి కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో హైస్కూల్ స్థాయిలో కార్పొరేట్‌కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలో అమలు చేయగలిగితే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచవచ్చు. ప్రైమరీ విద్యలో కూడా కృత్రిమ మేధతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ఆధునికతకు అనుగుణంగా పిల్లలకు అందించాలి. వార్షిక బడ్జెట్లో విద్య కోసం కనీసం 15% బడ్జెట్‌ను కేటాయించాలి.
మౌలిక వసతులతో పాటు, తల్లిదండ్రుల అంతరంగపు ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే తెలంగాణ విద్యాసంస్థలు దేశానికి ఆదర్శమవుతాయి. ముఖ్యంగా రాజకీయాలకతీతంగా విద్యా సంస్థల నిర్వహణ వుండాలి. విద్య బలమైనది కాబట్టి బలహీనుల కోసం
ఓ విద్య, బలవంతుల కోసం ఓ విద్య కాకుండా మన రాజ్యాంగం సాక్షిగా “అందరికీ సమాన విద్య” అందుబాటులోకి వచ్చే విధంగా సీఎం రేవంత్ ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందని గ్రహించాలి.
అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే, అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్యలో సమాన అవకాశాలు కల్పించే దిశలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. ప్రజలను నైతికంగా, సాంఘికంగా మార్చడం విద్య ఉద్దేశ్యం అనే అంబేద్కర్ స్ఫూర్తితో చదువుల తల్లి – తెలంగాణ నినాదం ఊపిరి పోసుకోవాలని ఆశిద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.