
వర్తమాన భారతదేశంలో మేధో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఇది కీలక స్థానాన్ని ఆక్రమిస్తోంది. బోధన, పరిశోధనలపై పెరుగుతున్న ప్రభుత్వ జోక్యం, క్రమంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, సైద్ధాంతికపరమైన ఆంక్షలు విశ్వవిద్యాలయాలు, మేధో కేంద్రాలపై పెద్దఎత్తున ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా విద్యా వ్యవస్థకు కీలక పునాదయిన విమర్శనాత్మక విశ్లేషణ బీటలువారుతోంది.
మేధో స్వాతంత్య్రం అంటే ఏంటి? పరిశోధనా స్వేఛ్చ, బోధనా స్వేఛ్చ, బోధకుల స్వేఛ్చ, బోధనాంశాలను ఎంపిక చేసుకునే స్వయంప్రతిపత్తి, రాజ్యంతో సహా ఎటువంటి బోధనేతర శక్తుల పలుకుబడి, జోక్యం, ఒత్తిళ్లు లేకుండా పరిశోధనాంశాల ప్రచురణ, అన్నీ కలిపితేనే మేధో స్వాతంత్య్రం. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, జాతీయ, పౌర ప్రాధాన్యత కలిగిన అంశాలపై వ్యక్తులుగా కానీ, బృందంగా కానీ స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, ఆ స్వతంత్ర అభిప్రాయాలను వెల్లడించే హక్కు, ఉన్నత విద్యా కేంద్రాల్లోనూ, బయటా వీటిపై చర్చించే హక్కు కూడా మేధో స్వాతంత్య్రంలో భాగమే. విద్యాహక్కు గురించి ఐక్యరాజ్యసమితి రాపోర్టియర్ (స్వతంత్ర పరిశోధక ప్రతినిధి) మాటల్లో మేధో స్వాతంత్య్రం, ‘ప్రాథమిక హక్కు. కేవలం విశ్వవిద్యాలయాల్లో పని చేసే సిబ్బందికి మాత్రమే పరిమితమైనది కాదు.’
జ్ఞానోత్పత్తిలో ఈ స్వేఛ్చ అత్యంత కీలకమైనది. ఈ మేధో స్వాతంత్య్రం ఉంటేనే విమర్శనాత్మక ఆలోచన, హేతుబద్ద దృక్ఫథం, శాస్త్రీయ అవగాహన, వివేచన, వైవిధ్యమైన మేధో బృందాల మధ్య జ్ఞానోత్పత్తి సంబంధిత విషయాలను ఇచ్చిపుచ్చుకోవటం సాధ్యమవుతుంది. బోధనలో వైవిధ్యమైన దృక్పథాలకు తావు లేకుండా, బహుముఖ మేధో పరిశోదనల ద్వారా ప్రయోజనం పొందకుండా పరిణతి సాధించలేము. పరిశోధకుడి సాంకేతిక సామర్ధ్యం పరిధికి మించిన అంశాలున్నప్పుడు సంబంధిత రంగాల్లో నిపుణులైన వారి సలహాలు సూచనలు స్వీకరించి పరిశోధనా ఫలితాలను పరిపుష్టం చేయటం, పరిశోధన ఫలితాలను వ్యక్తపర్చే భాషా సామర్ధ్యం లేనప్పుడు సంబంధిత భాషానిపుణుల సేవలు వినియోగించటం పరిశోధనా ఫలితాలు మెరుగ్గా పాఠకులకు చేరేందుకు మార్గం సుగమమం చేస్తాయి.
భౌగోళిక హద్దులతో నిమిత్తం లేకుండా మితవాద రాజకీయాలు మేధో స్వాతంత్య్రం విషయంలో అనుసరించే ధోరణి ఒకటిగానే ఉంటుంది. మేధో పరిణతిని తిరస్కరించేలా పామర జ్ఞానాన్ని పండిత జ్ఞానోత్పత్తిగా చూపించటం ఒకటైతే గతకాలపు వైభవాలను భుజాన మోయటం, మేధో వ్యతిరేకతను నెత్తినెత్తుకోవటం మరోటి. భారతదేశంలో నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాల కోసం మేధో వ్యతిరేకతను పెంచిపోషించటంతో పాటు మేధో స్వాతంత్య్రానికి అడ్డుకట్టలు వేయటం మనం చూస్తున్నాము.
కార్పొరేట్లకు వత్తాసు పలికే మేధావులు- విమర్శనాత్మక దృష్టిలో వైఫల్యాలు
ఉన్నత విద్యారంగంపై కార్పొరేట్ కబ్జా మేధో రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ప్రస్తుతం భారతీయ మేధో రంగానికి కావల్సింది సంపూర్ణమైన స్వయంప్రతిపత్తి, ఉన్నత విద్యారంగానికి తగినన్ని ప్రభుత్వ నిధులు, ఉన్నత విద్యకు దూరమైన వారికి కూడా సేవలు విస్తరించటం, జాతి వ్యతిరేకులనే ఆరోపణలు, దేశద్రోహం కేసుల భయం లేకుండా స్వేఛ్చగా ఆలోచించటం, చర్చించుకోవడం, లేవనెత్తదల్చుకున్న ప్రశ్నలు లేవనెత్తడం వంటివి ప్రస్తుతం ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి కావల్సిన తక్షణ కనీస అవసరాలు. ఈ మధ్యకాలంలో మేధో చర్చల్లో కూడా చొరబడుతున్న దేశద్రోహం, జాతివ్యతిరేకత, వారసత్వ వ్యతిరేకత వంటి విమర్శలు మొత్తం ఉన్నత విద్యారంగంలో రాజకీయ మనోభావాలకు పెద్దపీట వేస్తున్నాయి.
ప్రస్తుత విద్యారంగానికి అవసరం లేనిదేమిటి? ఉన్నత విద్యారంగాన్ని నిరుత్సాహపర్చే చర్చలు, ఆలోచనలకు అడ్టుకట్ట వేసే విధానాలు, ప్రభుత్వ విద్యాసంస్థల గొంతు నులిమే నిధుల కొరత, మేధో కేంద్రాలను కట్టడిచేసే ఇతర చర్యలు అవసరం లేదు. వివిధ మార్గాల్లో సాధనాల ద్వారా మేధో వ్యతిరేక చర్యలు పురికొల్పబడుతున్నాయి. పాలకపక్షాన్ని, పాలకపక్షం భావజాలాన్నీ ఆకాశానికెత్తుతూ దాంతో విబేధించే ఆలోచనలను, ఆలోచకులను వెంటాడి వేధించటం నూతన సాంప్రదాయంగా మన ముందున్నది. ఫలితంగా సత్యం ఎండమావి అవుతోంది. నిర్హేతుకత, రూఢీవాదం జ్ఞానంగా చలామణి అవుతున్నాయి.
కుదింపుకు గురవుతున్న మేధో స్వాతంత్య్రం
మేధో స్వాతంత్య్రం కుదింపు కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతున్న పరిణామం కాదు. ఇది ప్రపంచ వ్యాప్త పరిణామంగా మారుతున్న తరుణం ఇది. గాజాపై ఇజ్రాయెల్ ముష్కరదాడుల నేపథ్యంలో విద్వేషపు ప్రసంగాల నియంత్రణ పేరుతో కొత్తకొత్త మార్గదర్శకాలు జారీ కావటం, ధర్నాలు, విద్యార్ధుల డిమాండ్లను పరిష్కరించకుండానే నిరసన కేంద్రాలను తొలగించటం, గాజాపై దాడులను వ్యతిరేకించేవారిపై విశ్వవిద్యాలయాల పాలన మండళ్లు చర్యలు తీసుకోవటం వంటివి ఈ కాలంలో చూస్తున్నాము. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో నిరసనలు, ఆందోళనలకు సంబంధించిన నిబంధనలు మారిపోతున్నాయి. 2023- 24లో పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన శిబిరాలు ఏర్పాటు జరిగిన తర్వాత కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధుల కదలికల మీద నిఘా పెరిగింది. గేట్లకు తాళాలు పడుతున్నాయి.
చెదురుమదురు ఘటనలుగా ప్రారంభమైన మేధో నియంత్రణ ప్రస్తుతం ఓ ప్రధాన ధోరణిగా మారింది. గాజా మారణహోమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్ధులపట్ల ట్రంప్ ప్రభుత్వం స్పందన దీనికి ఓ ఉదాహరణ. ఇటువంటి చర్యలు విశ్వవిద్యాలయాల రోజువారీ వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తాయి. ఈ ధోరణులు ప్రభుత్వ విధానాలుగా మారితే విశ్వవిద్యాలయాల మేధో స్వాతంత్య్రంతో పాటు నియామకాలు, బోధన, పరిశోధనల్లో కూడా రాజ్యం తన జోక్యానికి పునాదులు వేస్తుంది.
ఈ మధ్యనే హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీ బుడాపెస్ట్‌లో పని చేయటానికి వీల్లేదంటూ ఆ దేశ ప్రధాని ఓర్బాన్ 2019లో ఏకండా చట్టం చేయటంతో మరో మార్గం లేక మొత్తం యూనివర్శిటీ వియన్నాకు మారిపోయింది. తురీల్రో కూడా 2016లో తిరుగుబాటు ప్రయత్నం జరిగిన తర్వాత మేధో కేంద్రాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. పలువురు బోధనా సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. గులియెన్ ఉద్యమానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన విశ్వవిద్యాలయాలు శాశ్వతంగా మూతపడ్డాయి.
భారతదేశంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిరాఘాటంగా పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా, పార్లమెంట్లో కావల్సినంతమంది సభ్యుల మద్దతు ఉన్నా విమర్శను మాత్రం తట్టుకోలేకపోతోంది. అసమ్మతిని సహించలేకపోతోంది. వరుసగా మూడుసార్లు భారీ ఆధిక్యతతో గెలిచినా ఈ దేశంలో ఆలోచనాపరులపై బిజెపి పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయిందన్న వాస్తవానికి ఇది ప్రతీకగా చెప్పుకోవచ్చు. అందువల్లనే మేధో కేంద్రాలతో పాటు న్యాయవ్యవస్థ, మీడియా వంటి కీలకమైన రంగాలపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకునేందుకు పలు చర్యలు తీసుకొంటోంది. భావ ప్రకటన స్వేఛ్చ, మేధో స్వాతంత్య్రం, ఇంటర్నెట్ సంబంధిత హక్కులు, ఆన్లైన్లో వెంటాడం, వేధింపులు పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో మేధోస్వాతంత్య్రం గతంలో ఎన్నడూ లేనంత ముప్పు ఎదుర్కొంటోంది. ప్రజాస్వామి వైరుధ్యాలు(వెరైటీస్ ఆఫ్ డెమొక్రసీ- విడెమ్) సంస్థ మేధో స్వాతంత్య్ర సూచి అధ్యయనంలో భారతదేశం అధమంగా ఉంది. స్వీడెన్లోని గొటెన్బర్డ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా పని చేసే ఈ సంస్థ భారతదేశంతో సహా 179 దేశాల్లో సామాజిక అధ్యయనాల సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది.
2022 సంవత్సరానికి గాను ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒకటికి 0.36 శాతం మార్కులు మాత్రమే భారతదేశానికి దక్కాయి. 2024వ సంత్సరానికి సంబంధించిన విశ్లేషణలను 2025 మార్చి నాలుగున ఈ సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం భారతం మేధో స్వాతంత్య్రంపై సంపూర్ణ నియంత్రణలు విధించే దేశాల జాబితాలోకి చేరింది. 2024 వార్షిక అధ్యయనానికి గాను ‘బహుళ ధృవ రాజకీయాలకు వ్యతిరేకమైన పార్టీల ఏలుబడిలో ఉన్న దేశాల్లో మేధో స్వాతంత్య్రం’ అనే అంశాన్ని కేంద్రకాంశంగా తీసుకున్నారు. బహుళధృవ రాజకీయాలను వ్యతిరేకంచే పార్టీలు అధికారంలో ఉన్న దేశాల్లో మేధోస్వాతంత్య్రం తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఈ అధ్యయనం నిర్ధారించింది.
(రెండో భాగంలో మేధో స్వాతంత్య్రంపై సైద్ధాంతిక నియంత్రణ, మార్కెట్ నియంత్రణ పర్యవసానాల గురించి చర్చిద్దాం).
(చెన్నై లోని లయోలా కళాశాల లో 20 ఫిబ్రవరి 2025 న భారత దేశంలో మేధో స్వాతంత్ర్యం అన్న అంశంపై ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞులు జోయా హాసన్ చేసిన ప్రసంగానికి ఇది వ్యాసరూపం: ది వైర్ తెలుగు సంపాదకులు)
జోయా హసన్
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.