
ఫాసిజం ఓ ఆధునిక రాజకీయ ధోరణి. సామూహిక విధ్వంసక సాధనం. అది ఎక్కడ కాలు పెడితే అక్కడ విలయమే. తాను ఆశించిన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అప్పటి వరకు ఉన్న సమాజాన్ని సమూలంగా ధ్వంసం చేస్తుంది. ఫాసిజం నిర్ధిష్ట చారిత్రక సందర్భంలో నేపథ్యంలో ఎంతగా ఒదిగి పోయిందంటే వేరే చారిత్రక పరిస్థితులను ఈ అవగానతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే కష్టంగా మారింది. అయినా వర్తమాన దక్షిణాసియా దేశాల్లో పరిణామాలని నాజీయిజం వెలుగులో పరిశీలిస్తే రెండు ప్రయోజనాలు నెరవేరతాయి. వర్తమాన భారతదేశంలో అమల్లో ఉన్న మెజారిటేరియన్ రాజకీయాలను తన పూర్వీకులతో (చరిత్రలో ఇతర దేశాలలో అమలు జరిగిన ఇటువంటి రాజకీయ ధోరణులతో) పోల్చి అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. వర్తమాన ఫాసిస్టు ధోరణులను, వాటి సైద్ధాంతిక పునాదులను గుర్తించి దానికి ఓ పేరు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. తద్వారా వర్తమాన ఫాసిస్టు ధోరణులపై పోరాడే మార్గాన్ని చూపిస్తుంది.
భారత దేశంలో అధికారంలో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే మనువాద సాయుధ సంస్థకు చెందిన రాజకీయ విభాగం. ఆరెస్సెస్ 1925లో ఏర్పడింది. ఈ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధంలో అవమానకరంగా ఓటమి పాలై ఛిద్రమై చితికి పోయిన జర్మనీ అహాన్ని రెచ్చ గొట్టి ఆత్మన్యూనతను పెంచి పెద్దది చేసి, సమాజంలో సంఖ్యాపరంగా బలహీనమైన పక్షాన్ని శత్రువుగా సృష్టించి, సదరు బలహీన శత్రువు నుంచి దేశాన్ని కాపాడే మిషతో మాజీ హిట్లర్ అధికారానికి వచ్చిన కాలం కూడా అదే. ఆరెస్సెస్ ఒక జాతీయోన్మాద సాయుధ దళం. భారత దేశం కేవలం హిందువులకు మాత్రమే దేశం అన్నది వారి భావన. హిందువులు మాత్రమే పౌరులుగా ఉంటారు హిందువేతరులు పౌరులుకాబోరు అన్నది వారి స్పష్టమైన అవగాహన. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వివిధ దేశాల్లో పుట్టుకొచ్చిన అర్ధ సైనిక దళాలకు ఆర్ఎస్ఎస్ కు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. విలక్షణమైన వస్త్రధారణ, అభివాద శైలి, సంస్థాగత క్రమశిక్షణలో భాగమైన కవాతు, పురుషాధిక్య లక్షణం వంటి పోలికలు ఎన్నైనా చెప్పవచ్చు. వీటన్నిటికి తోడు మౌలికంగా మతపరమైన లేదా జాతి పరమైన అల్పసంఖ్యాక తరగతుల నుంచి ముప్పు వస్తుందన్న ఊహాజనిత భావన ఆధారంగా సదరు అల్ప సంఖ్యాకులపట్ల వ్యవహరించడం అన్న విషయంలో కూడా ఈ శక్తుల మధ్య సైద్ధాంతిక ఏకాత్మత ఉంటుంది.
భారతదేశంలో మత పరమైన అల్ప సంఖ్యాకులపై జరుగుతున్న దాడులు, పాటిస్తున్న వివక్ష మనం నిత్యం చూస్తున్నవే. ప్రత్యేకించి గత దశాబ్ది కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాలనలో ఈ ధోరణులు మరింతగా పెట్రేగి పోతున్నాయి. పశు సంరక్షణ పేరుతో మనుషుల హత్యలు, ముస్లిం నివాసాలపై స్వైరవిహారం చేస్తున్న బుల్డోజర్లు, నేరంగా మారుతున్న హిందూ ముస్లిం యువతీ యువకుల మధ్య ప్రేమలు, లవ్ జీహాద్ వంటి అపోహలు పెంచే నినాదాలు ప్రధాని మోడీ హయాంలో ప్రత్యేక లక్షణాలుగా మారాయి. దేశంలో మతపరమైన అల్ప సంఖ్యాకుల విషయంలో ఆర్ఎస్ఎస్ జర్మనీ నాజీల నుండి ప్రేరణ పొందటం ఇప్పటిది కాదు. 1930 దశకం నుండే ఆర్ఎస్ఎస్ కు నాజీయిజం ఆదర్శం.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎం ఎస్ గోల్వాల్కర్. భారత దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికగా చెప్పుకోదగ్గ పుస్తకం ‘మనం మన జాతీయత నిర్వచనం’. ఈ పుస్తకాన్ని గోల్వాల్కర్ 1939లో రాశారు. ఆర్ఎస్ఎస్ నిరంతరం జర్మన్ నాజీల నుంచి ప్రేరణ పొందింది అని చెప్పటానికి గోల్వాల్కర్ రచనలోని ఈ వాక్యాలను గుర్తు చేసుకోవాలి. ‘జర్మన్ జాతి ఆత్మాభిమానం గురించి ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. జర్మన్ జాతి, జర్మన్ సంస్కృతికి పట్టిన కాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు జర్మనీయేతర జాతులను ఊచకోత కోయటం ద్వారా ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. దీంతో జాతీయాభిమానాన్ని జాతి గర్వాన్ని పతాక స్థాయిలో నిలబెట్టిన సందర్భం అది. మూలాల్లోనే వైవిధ్యం ఉన్న భిన్న సంస్కృతులు ఎంత ప్రయత్నించినా ఉమ్మడి జాతిగా మనగల లేవన్నది తిరస్కరించలేని వాస్తవం. మన దేశం లో ఉన్న పరిస్థితుల్లో జర్మన్ అనుభవాలు నుంచి ఎంతో నేర్చుకుని లబ్ధి పొందవచ్చు.’
జర్మన్ నాజీయుజాన్నీ అది చెప్పిన పాఠాలను బీజేపీ బాగా వంట బట్టించుకుంది. ముస్లింల ప్రస్తావన తీయకుండానే వారి గురించి అనరాని మాటలన్నీ అంటున్నారు. జాతీయ నేతల మొదలు క్షేత్ర స్థాయి కార్యకర్తల వరకు ముస్లింలను చీడ పురుగుల్లా చూస్తున్నారు. ఎపుడో మధ్య యుగాల్లో కట్టిన మసీదులు ఇపుడు తాజా వివాదాలకు కేంద్రమవుతున్నాయి. మైనారిటీలను ఉద్దేశ్య పూర్వకంగానే జన జీవన స్రవంతి నుంచి వెలివేస్తోంది. వందల సంఖ్యలో ఉన్న బిజెపి ప్రజాప్రతినిధుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లింలు లేరు.
పశువుల రవాణాపై నిషేధం విధించడం లాంటి చర్యల ద్వారా ముస్లింల జీవనోపాధిని దెబ్బతీయడం ప్రభుత్వ విధానంగా మారింది. ముస్లిం మహిళల హిజాబ్ వస్త్రధారణ నేరమైంది. పౌర సత్వ చట్ట సవరణ పేరుతో దొడ్డిదారి ముస్లింల పట్ల వివక్షను చట్టబద్దం చేశారు. తద్వారా ఒకే దేశంలో వివక్ష పూరిత పౌరసత్యానికి తెర తీసింది బీజేపీ ప్రభుత్వం.
మెజారిటీరియనిజం నాజీయిజం మౌలిక వ్యక్తీకరణ. ఈ దిశగా జన జీవన స్రవంతిలో అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దక్షిణాసియాలో ఫాసిజం నిదానంగా వేళ్ళునుకొంటోంది. నిరంతరం మైనారిటీలపై విషం చిమ్మటంలో బిజెపి హిందూత్వ రాజకీయాలు బరితెగించవచ్చన్నది నాజీయిజం నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ లు నేర్చుకున్న మరో పాఠం. అప్పటి వరకు యూరప్ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మేధో జీవనంలో భాగస్వాములు అయిన యూదులను కేవలం 20 ఏళ్లలో అంటారని తరగతిగా సామాజిక శత్రువులుగా మార్చింది హిట్లర్ ప్రభుత్వ విధానాలు. ఈ స్పూర్తితోనే గోల్వాల్కర్ రెండో ప్రపంచ యుద్దానికి ముందు ఈ దేశంలో హిందూయేతరులు అందరూ తమ చరిత్ర సంస్కృతి అస్తిత్వం వదులుకుని ఎటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులు చివరకు పౌరసత్వం కూడా వదులుకుని ఈ దేశంలో రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోవాలని హెచ్చరించారు.
ఇది దేశవాళీ నాజీయిజం అని నిర్ధారించుకోవడండానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది జర్మనీ ఎంత త్వరగా దివాళా తీసిందో అంతే వేగంగా నరహంతక రాజ్యంగా ఎదిగింది. రెండో అంశం నరమేధాన్ని తేలికైన క్రతువుగా మార్చిన పారిశ్రామిక అభివృద్ధి. యూదుల నరమేధాన్ని వేగిరపర్చిన విధానం అటుంచితే దేశంలోని అల్ప సంఖ్యాక వర్గాలను రాక్షసులుగా చిత్రీకరిస్తూ మెజారిటీ మతస్తుల లేదా మెజారిటీ జాతీయుల ఆధిపత్యాన్ని ఖరారు చేసే దిశగా దేశాన్ని వ్యవస్థలను నడపటంలో అనుసరించిన నికరమైన వైఖరిని పద్ధతులను ప్రమాణాలను వాటి తీవ్రతను గమనించాలి. ఈ వ్యూహాలు, విధానాలు ఈ దారిలో నడవాలని. నిర్ణయించుకున్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు మార్గదర్శకంగా నిలిచాయి అనడంలో సందేహం లేదు. ఈ రకంగా చూసినపుడు నాజీయిజం అంటే దూకుడు అందిపుచ్చుకున్న మెజారిటెరియనిజమే. ఇంకా వివరంగా అర్థం చేసుకోవాలంటే దక్షిణాసియాలో మనం నేడు చూస్తున్న మెజారిటీరియనిజం నిదానంగా పాతుకుపోతున్న ఫాసిజమే.
ఆధునిక భారతదేశం వీమర్ కాలం నాటి జర్మనీలా కుప్పకూలుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇంకా భారత ఉపఖండంలో ప్రజాతంత్ర వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా ఇంకా వ్యవస్థాగతంగా బలంగానే ఉంది. అటువంటి దేశాన్ని పూర్తి స్థాయి హిందుత్వ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. జర్మనీలో జరిగినంత వేగంగా జరిగేది కూడా కాదు. 2024 లోక్సభ ఎన్నికలు ఈ దేశాన్ని కరుడుకట్టిన హిందుత్వ రాజ్యంగా మార్చే వ్యవహారం ప్రతిఘటన లేకుండా సాఫీగా సాగే వ్యవహరం కాదు అని రుజువు చేసింది. అలా అన్నంత మాత్రాన ప్రస్తుతం జరుగుతున్న మెజారిటేరియన్ వ్యవహారం క్రమానుగతంగా జరుగుతుందని చెప్పడం లేదు. మయన్మార్ లోని బౌద్ధ ఆదిపత్యంలో ఉన్న ప్రభుత్వం రాఖిన్ ప్రాంతంలోని మైనారిటీ ముస్లిం లైన రోహింగ్యాలను ఊచకోత కోసింది. శ్రీలంకలో తమిళ మైనారిటీలను నిర్మూలించి సింహళ బౌద్ధం ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది.
నిదానంగా అయినా వేగంగా సాగేదైనా జర్మనీలో ఏఎఫ్డి అయినా భారత్ లో బిజెపి అయినా వారికి సాంప్రదాయిక నాజీయిజం మైనారిటీల పట్ల అనుసరించిన కుటిలాత్మక వ్యూహాలు గొప్ప ప్రేరణ. చొరబాటుదారులు, అంటరానివాళ్ళు, మైనారిటీలు ఈ దేశపు జీవితంలో అంతర్భాగం కాలేక పోయారు అన్న మాటలు రాజకీయ నాయకుల నోట వింటున్నాము అంటే ఆ దేశంలోకి ఫాసిజం ప్రవేశించింది అని అర్ధం.
ముకుల్ కేశవన్
అనువాదం: కొండూరి వీరయ్య
ముకుల్ కేశవన్ రాజనీతి సిద్ధాంతవేత్త. పౌర మేధావి. నవల రచయిత. చరిత్రకారుడు.
(ద గార్డియన్ సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.