
హైదరాబాద్: మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు 19వ శతాబ్దంలో జన్మించిన విద్యా విప్లవ జ్యోతులని దళిత ఉద్యమ రచయిత కత్తి పద్మారావు అన్నారు. వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మహత్మ ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లోని లుంబినివనంలో కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్ రిసెర్చ్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని దళితమహాసభ నిర్వహించింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, నివాళులు అర్పించారు.
కత్తి పద్మారావు కార్యక్రమంలో పాల్గొని, మహాత్మాఫూలేకు నివాళులు అర్పించి మాట్లాడారు. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు మొదటి దళిత ఉపాధ్యాయులని, స్త్రీ విద్య కోసం భారతదేశంలో మొదటి పాఠశాలను నిర్మించిన జాతి వైతాళికులని గుర్తుచేశారు. వీరివురు ఆదర్శ దంపతులని, ఆత్మగౌరవ పతాకాలని ఆయన ప్రశంసించారు. ప్రతి మండలంలో మహాత్మా ఫూలే సావిత్రిబాయి ఫూలేల పేరు మీద విగ్రహాలు- లైబ్రరీలు నిర్మించాలని పద్మారావు డిమాండ్ చేశారు.
ఆ తర్వాత దళిత మహాసభ కోశాధికారి వేము మాధవ్ కార్యక్రమంలో మాట్లాడారు. మహాత్మా ఫూలే ఎందరికో విద్యాదానం చేసి, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు ప్రస్తుత సమాజానికి ఆదర్శమని మాతా రమాబాయి అవార్డు గ్రహిత కత్తి స్వర్ణకుమారి అన్నారు. వారొక వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగా జీవించారని ఆమె గుర్తుచేశారు.