
వాడు గోడలు కడతాడు
వాటికి అటుగా ఇటుగా కూడా పూలు పూస్తాయి
వాటిని మా శ్రామికులే కట్టారు కదా
గోడని కడుతూ వాటి పునాదుల్లోనే కొన్ని విత్తనాలు చల్లి వెళ్ళేరు వాళ్లు
వాడు కంచెలు కడతాడు
ముళ్ళ తీగెలు పేరుస్తాడు
అలాగే చెయ్యనీ
అక్కడా పువ్వులే పూస్తాయి
మా వాళ్ళు వాటిని పూల చేతులతో చేశారు
మరి వాడు ఓపెన్ కాస్టుల్లో నేలని కుళ్ళబొడిచేస్తాడు
ఊళ్ళకూళ్ళని భూగర్భంలోకి తొక్కే స్తాడు
అలాగే కానీ
మరి అక్కడా పువ్వులే పూస్తాయి
ఆ నేలంతా మావాళ్ళు వ్యవసాయం చేశారు
మరి వాడు బుల్ డోజర్లని నడపనీ
వాటిని రేపు ఎలా నడపాలో నా వాళ్ళకి వాడే నేర్పుతున్నాడు కదా
నేలని అడవుల్నీ సమస్తాన్నీ
ధ్వంసం చేసెయ్యనీ
రక్తసిక్తం చేసెయ్యనీ
అదంతా వాళ్లు తరాలుగా
నడిచి జీవించి పారాడి పొర్లాడి పోరాడిన నేల అది
వాళ్ళూరుకున్నా ఊరి ఉసురు తగలదా..!
రైతుల దారి మూసేస్తూ
దారంతా ముళ్ళు నాటనీ
వాటిని ఎలా తీసేయడమో
వాళ్ళకి ఎప్పుడో తెలుసు.
– ధీర