
నేను నాలుగున్నర సంవత్సరాలపాటు ఉద్యోగం చేసిన నగరమే ఢిల్లీ. వెనుకటి ఇంద్రప్రస్థ నగరం అందులో ఒక భాగం యమున ఒడ్డున ఏర్పడిన ఆధునిక నగరం. ఇప్పుడు పురాతత్త్వశాఖవారు తవ్వి తవ్వి పోశారు. దాన్ని చూసి ప్రాచీన కాలపు కల్పనా చిత్రంలో మునిగిపోయాను. ఢిల్లీలో ఉన్న మూడు రోజులూ కాస్త విశ్రాంతి దొరికింది. మిత్రులు భరద్వాజ గారింట్లో మంచి భోజనమూ లభించింది. భారతీయ విజ్ఞాన వికాస మండలి ప్రధాన సంపాదకులు డా బీవీ సుబ్బరాయప్పతో పరిచయమూ ఏర్పడింది. వారి కార్యాలయంలో కూర్చొని మహాభారత కాలంనాటి లోహ, విజ్ఞాన, గణిత, వ్యవసాయాది వికాసాలను గురించి దీర్ఘంగా చర్చించాము. స్వయంగా శాస్త్రజ్ఞుడైన సుబ్బరాయప్పగారు వాటిమీద ఆకర గ్రంథాలన్నింటినీ చదివి విశ్లేషించేవారు. వారి సంపాదకత్వంలో ప్రకటితమౌతున్న భారతీయ విజ్ఞాన ఇతిహాస ప్రతిని ఒకదాన్ని ఇచ్చి మరికొన్ని ఆధార గ్రంథాలను కూడా సూచించారు. వారిచ్చిన గ్రంథాన్ని తప్ప మిగిలిన వాటిని చదవాల్సిన అవసరం లేదని మనసులోనే నిర్ణయించుకున్నాను. మనస్సు భారత కాల జీవితాన్ని పునఃసృష్టించుకోవడంలో మునిగింది. అతి వివరాలు సృజన క్రియకు అడ్డు అవుతాయనిపించింది. నేను విజ్ఞానశాస్త్ర చరిత్రకారుణ్ణి కాదు. జీవితాన్ని గురించిన నవలా రచయితను మాత్రమే అనే స్పృహ కలిగింది.
ఢిల్లీ నుంచి రైలులో కురుక్షేత్రం వెళ్ళాను. బిర్లా ధర్మశాల గదిలో వస్తువులు ఉంచి స్థానికులు చూపించిన పుణ్య సరోవరాలు మొదలైనవి చూశాను. నాకు ఏ ప్రయోజనమూ కలగలేదు. హర్యానాలోని ప్రజలు బ్రహ్మాండమైన వ్యవసాయదారులు. చరిత్ర గిరిత్ర స్పృహలతో వారికి సంబంధం లేదు. అయితే సమీపంలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖను వెదుక్కుంటూ వెళ్ళాను. ఏవో గొడవల వల్ల సెలవులు రావడంతో అందరూ ఊళ్ళకు వెళ్ళారట. డా ఫడ్కే అనే వారున్నారని ఎవరో చెప్పారు. వారి చిరునామా తెలుసుకొని ఇంటికి వెళ్ళి నా ఉద్దేశ్యం వివరించాను. డా ఫడ్కే కురుక్షేత్రం మీదనే పరిశోధన చేశారు. యుద్ధం జరిగిన స్థలాలు ఏవి? ఒక్కొక్క రోజు యుద్ధం చోటు, దాన్ని మార్చిన వైనం వీటి గురించి వివరంగా అధ్యయనం చేసి తనదైన ఓ చిత్రాన్ని నిర్మించుకున్నారు. నాక్కావలసింది కూడా అదే.
భీష్మ పర్వం నుంచి ప్రారంభించి ముఖ్యమైన కొన్ని శ్లోకాలు వివరిస్తూ డా ఫడ్కే తమ వాదాన్ని వినిపించారు. నిజానికి కురుక్షేత్రం చుట్టుపట్ల యుద్ధానికి సంబంధించిన ఖచ్చితమైన ఐతిహ్యపూర్ణ స్థలాలున్నాయి. అభిమన్యుడు మరణించిన చోటని చెప్పే ఆమీన్ అనే వూరు థానేశ్వరం నుంచి దక్షిణానికి ఐదు మైళ్ళలో ఉంది. కర్ణుడు మరణించిన చోట రాజాకర్ణకి ఖిలా వుంది. తన గురువుకు అర్పించడానికి అర్జునుడు గంగను భూమిపైకి తేవడం కోసం బాణం సంధించి చేశాడని చెప్పబడే కొలను ఉంది. వాస్తవానికి కురుక్షేత్రం – థానేశ్వరం, సోనీపట్, ఆమీన్, కర్నాల్ లను కూడుకొని ఉన్న భాగం. వెనుకటికి ఉత్తరంవైపు సరస్వతి, దక్షిణాన దృశద్వతులు హద్దులుగా ఉండేవి. థానేశ్వరం నుంచి ఎనిమిది మైళ్లు పడమట ఉన్న భోరేవద్దే భూరిశ్రవుడు హతుడయ్యాడు. భీష్ముడు మరణించింది థానేశ్వరం నైరుతికి పదిహేడు మైళ్ళ దూరంలో ఉన్న నగ్గువిలో. థానేశ్వరం పడమటికి, అజసఘాట్ దక్షిణానికి ఉన్న అస్థిపురంలో యుద్ధంలో మరణించిన యోధుల శవాలన్నింటిని కుప్పవేసి కాల్చారట. వీటన్నింటిని చూస్తే యుద్ధం ఎంత విస్తారమైన ప్రదేశంలో జరిగిందన్న ఊహ వస్తుంది.
కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపుల నుంచి వచ్చి కలిసిన మొత్తం సైనికుల సంఖ్య ఎంతో నిర్దిష్టంగా చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. పదకొండు, ఏడు, మొత్తం పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం అంటారు, నిజం. అయితే ఒక అక్షౌహిణి సంఖ్య ఎంత. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతారు. నేను చదివిన గోరఖ్పూర్ పాఠం ఉద్యోగపర్వంలోని సైన్య నిర్ణాయ భాగంలో ఇలా ఉంది..
రథస్యాసన్ దశ గజా గజస్య దశవాజినః |
నరా దశహయస్యాసన్ పాద రక్షాః సమంతతః ॥
ఒక్కొక్క రథంతో పాటు పది ఏనుగులు, ఒక్కొక్క ఏనుగుతో పది గుర్రాలు(ఆశ్వికులు) ఒక్కొక్క గుర్రంతో పదిమంది పదాతియోధులు ఉ న్నారు.
రథస్య నాగాః పంచాశన్నాగస్యాసన్ శతం హయాః |
హయస్య పురుషాః సప్త భిన్న సంధాన కారిణః ॥
ఒక్కొక్క రథంతో యాభై ఏనుగులు, ఒక్కొక్క ఏనుగుతో వంద మంది ఆశ్వికులు, ఒక్కొక్క అశ్వంతో ఏడుగురు సైనికులను మరో సంధానం కోసం నియోగింపబడ్డారు.
సేనా పంచశతః నాగా రథాస్తావంత ఏవ చ ।
దశ సేనాచ పృతనా పృతనా దశవాహినీ II
అయిదువందల ఏనుగులు, అయిదు వందల రథాలు కలిసి ఒక సేన అవుతుంది. పది సేనలు కలిసి ఒక పృతన, పది పృతనాలు కలిసి ఒక వాహిని అవుతుంది.
సేనా చ వాహినీ జైవ పృతనా ధ్వజినీ చమూః |
అక్షౌహిణీతి పర్యాయైర్నిరుక్తా చ వరూథినీ ॥
సేనా, వాహినీ, పృతనా, ధ్వజినీ, చమూ, వరూధినీ, అక్షౌహిణీ ఈ పర్యాయ వాచి (లేదా, సమానవాచి) పేర్లతో చెప్పబడింది.
ఇవన్నీ చాలా గందరగోళంతో కూడిన లెక్క ఒక శ్లోకంలో పదిసేనలు కలిసి ఒక పృతన, పది పృతనాలు కలిసి ఒక వాహిని అవుతాయని చెప్పి తరువాతి దాంట్లో సేనా, వాహినీ, పృతనాలన్నీ పర్యాయవాచకాలే అని చెపితే ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరించిన మొదటి శ్లోకంలో మొత్తం సంఖ్య ఒక వేయి అవుతుంది. దానికి మూడో శ్లోకంలో ఒక అయిదు వందలతో గుణిస్తే అయిదు లక్షలైపోతుంది. మళ్ళీ పది పదులు వేయకుండా కేవలం పద్దెనిమిదితో హెచ్చవేస్తే కురుక్షేత్ర యుద్ధంలో తొంభైలక్షల సైనికులున్నట్లు అనుకోవచ్చు. ఆ కాలంలో మొత్తం ఆర్యావర్తం జనసంఖ్య అంత వుందా?
మొత్తం మీద ఈ సంఖ్యా గందరగోళంలో పడకుండా మహాభారత యుద్ధంలో భాగం వహించిన సేనాసంఖ్యను యుద్ధ క్షేత్ర వైశాల్యాన్ని బట్టి నేను ఊహించాను. ఆర్యుల స్మృతి పథంలో అప్పటికి ఎన్నడూ కనిపించని పెద్ద రూపం అది. ఆ కాలంలో ఉన్న చిన్నా పొన్న పాళయపట్టుల రాజులందరూ పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నారన్నది నిజం. అయితే ఆర్యావర్తంలోని సమస్త రాజులూ భాగం వహించిన మహాసమరం ఇది. అంతమందీ అసంఖ్యాకులు వచ్చి కలవడానికి కారణం ఏమిటి? సాంప్రదాయిక మహాభారతమేమో ఈ యుద్ధాన్ని ధర్మ యుద్ధం అంటుంది. అయితే ధర్మ(పాండవుల) వ్యతిరేకంగానే బహుసంఖ్యాకులున్నారు కదా..! బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు యుద్ధం చేసుకోనీ మనకెందుకు ఆ గొడవ అని అనేకులు ఊరకనే ఉండవచ్చుకదా? ఆర్య రాజుల వ్యవహారమే అలాంటిది. జూదం, యుద్ధం, పిల్ల దొరికే స్వయంవరం అంటే పరుగెత్తుకు వెళ్ళే జాతి అది. డా ఫడ్కే గారితో పాటు రిక్షాలో కూర్చుని ఆ విస్తారమైన దారుల్లో ఉన్న వాటి మధ్య తిరుగుతుండగా ఈ ఆలోచనలు వచ్చాయి. అంటే ఇది కేవలం ఆర్యజాతి, దాని సంపర్కానికి వచ్చిన ఆర్యేతర జాతుల జీవితాన్ని, వారి స్వభావాన్నీ సూచించే యుద్ధంగా కావాలి నా రచనలో అని మనస్సులోనే అనుకున్నాను.
రెండు దినాలు కురుక్షేత్రంలో గడిపాక హస్తినాపురికి బయలుదేరాను. అక్కడి నుంచి నేరుగా హస్తినావతికి వెళ్ళే దారీ లేదు. సులభమూ కాదు. ఢిల్లీ మీదుగా వెళ్ళడం మంచిదన్నారు. నాకు ఆ దారి అవసరం లేదు. ప్రక్కనే థానేశ్వరానికి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో మరో ఊరు చేరి అక్కడ్నుంచి మేరఠ్(మీరట్) వెళ్లాను. హస్తినాపురం మేరఠ్ కు ఇరవైరెండు మైళ్ళు. మేరఠ్ లోని ఒక హోటల్లో దిగాను. పొద్దున్నే హస్తినావతికి బస్సు దొరికింది. నేరుగా దారి ఉంటే కురుక్షేత్రానికి హస్తినాపురికి సుమారు అరవై మైళ్ళు.
వాస్తవానికి ఇప్పటి హస్తినాపురం చిన్న ఊరు లేదా పల్లె. ఒక జైన మందిరం ఉండడంవల్ల మార్వాడీలు వస్తుంటారు. స్థల వివరాలను చెప్పేవాళ్ళు కూడా లేరు. నది పాత ఒడ్డులో పురాతత్త్వ శాఖవారు కాస్త తవ్వకాలు జరిపారు. అక్కడొక తెలివైన మార్గదర్శకుడు లభించాడు. ఆ చోటు ఐతిహ్యాన్ని తెలిసినవాడు. నేనతన్నే ఆశ్రయించవలసి వచ్చింది. ఊరికే కథలు చెబుతాడా? లేక ఏవైనా ఆధారాలతో మాట్లాడతాడా అని పరీక్షించడానికి భారతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేశాను. కథలు, బాకాలు కాదనిపించింది. మొత్తం ప్రదేశాన్నంతటిని చూపించి తనకు తెలిసినదంతా చెప్పి నేను అడిగినవాటికి బాధ్యతగా సమాధానమిచ్చి మొత్తం మీద ఇరవై రూపాయలడిగాడు. నీకు సంతోషంగా కావలిసినంత తీసుకో అన్నాను. సాయంకాలం అయిదింటికి తిరిగి వచ్చాక అతనే చపాతీ పెట్టించి మేరఠ్ బస్సెక్కించాడు.
ఇప్పుడు హస్తినాపురం ఒడ్డులో గతంలో గంగ ప్రవహించిన గుర్తులున్నాయి. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ బుడీ గంగ అంటారు. ఇప్పటి గంగ ఏడుమైళ్ళ దూరానికి పోయింది. ఉత్తర భారత మైదాన భూముల్లో నది నిర్వహించిన పాత్ర, పొందిన మార్పులు అందరికీ తెలిసిన విషయమే. బుడీ గంగ ఒడ్డులోనే పాండేశ్వర మందిరముంది. దాని వెనుక విదురుని గృహం. కృష్ణుడిక్కడే విడిది చేశాడు. కుంతి ఉన్న స్థలం అదే. పాండవులు చివరికి ఈ చోటు నుంచే గంగను దాటి గంగా ద్వార (హరిద్వార్) మార్గంలో (నేరుగా నలభై మైళ్ళు) హిమాలయానికి వెళ్ళారు. నది పక్కన్నే పెద్ద దిబ్బ మీద, అది కూడా కోట గోడ అవశేషమనిపిస్తుంది, ద్రౌపది అంతపురముండేది. ధర్మజుని ఆస్థానముంది. విదురుని ఇంటికి ఉత్తరంగా సుమారు మూడున్నర ఫర్లాంగుల దూరంలో కర్ణుడు ప్రతిదినం స్నానంచేసి సూర్యోపాసన చేసిన చోటుంది. ఇప్పుడిక్కడ కర్ణుని గుడి ఉంది. దుర్యోధనుని అంతఃపురానికి నదీ తీరానికి ఒకటిన్నర మైలు దూరం. నేను బుడీ గంగను దాటి అటువైపుగా రెండున్నర మైళ్ళు తిరిగి వచ్చాను. కౌరవుల హస్తినాపురం కూడా దిబ్బ మీదనే ఉంది. ఉత్తర భాగమంతా ప్రవాహకాలంలో నీరు నిండిపోయే పల్లంలా ఉంది. ఇది ఇంద్రప్రస్థ, మథుర, ద్వారకల్లాగా విశాలమైన నగరం అనిపించలేదు. ద్వారకలాగా వ్యాపారంలో అభివృద్ధి చెందిన లక్షణమూ లేదు.
రాత్రి మేరఠ్ కు తిరిగి వచ్చాను. అక్కడి సిండికేట్ బ్యాంక్లో ని మేనేజర్ మల్యాగారింట్లో రెండ్రోజులు గడిపి తర్వాత అక్కడ్నుంచి బర్నావాక్కు వెళ్ళాను. మేరఠ్ నుంచి సుమారు 28 మైళ్ళు. ఇప్పుడు ఎక్కువ భాగం ముసల్మానుల నివాసంగా మారిన ఆ ఊరే వెనుకటి వారణావతం. కృష్ణా, హిండన్ అనే చిన్న నదుల సంగమ స్థానంలో ఉంది. స్థల ఐతిహ్యాన్ని, వివరాలను చెప్పేవారొకరూ దొరకలేదు. మహాభారత సంప్రదాయ ధర్మానికి చెందిన ప్రజలే లేనిచోట కొద్దిపాటైనా దాన్ని గుర్తు పెట్టుకునేవారెవరు? అయినా నేను ఆరేడుగుర్నడిగి చూశాను. అదేమిటో తమకు తెలియదన్నారు. మళ్ళీ మేరట్కు తిరిగి వచ్చి ఆ రాత్రి మల్యా గారింట్లో గడిపి మరుసటి దినం బస్సెక్కి హరిద్వారానికి వెళ్ళాను.
నిజానికి హరిద్వారం వెళ్ళవలసిని అవసరం లేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు పదే పదే వెళ్ళినచోటే అది. దాని కంటే ఎక్కువగా హృషీకేశం. మళ్ళీ చూడనవసరం లేకుండానే మహాభారతానికి చెందిన ఆ స్థలాన్ని ఊహించుకోగలను. అయినా అంత దగ్గరకు వచ్చాక మరోసారి ఎందుకు చూడకూడదని ఆశతో వచ్చాను. అక్కడ్నుంచి అదే రోజు సాయంత్రం హృషీకేశానికి వచ్చాక పాండుకేశ్వరానికి ఎందుకు వెళ్ళకూడదనిపించింది. అదీ మునుపు చూసిన స్థలమే. జ్యోతిర్మఠానికి బదరికి మధ్య లోయ. మళ్ళీ హిమాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటన్నింటిని కావల్సినంత వివరంగా భారతాన్ని రాయాలనే ఆలోచన రాకముందే చూశాను. ఇక్కడ మరో విషయం చెప్పాలి. నిజానికి ‘పర్వ’ రాయడం కోసమై నేను చేసిన మొదటి ప్రయాణం కాదిది. పోయిన సంవత్సరం అంటే 1974 మే నెలలో నేనూ సరస్వతి హిమాలయాలకు వచ్చాము. డెహ్రాడూన్, బడ్కోట్, యమునోత్రి, ఉత్తర కాశీ ప్రదేశాలను చూశాము. అంతలో రైల్వే సమ్మె ప్రారంభం కావడంతో మధ్యలో ఆపి అతి కష్టం మీద ఢిల్లీ తిరిగి వచ్చాము. ఊరికి తిరిగి రావడానికి రైలు లేదు. విమానంలో టికెట్లు దొరకవు. విమాన శాఖా మంత్రిణి సరోజినీ మహిషి గారితో చెప్పి టికెట్లు సంపాదించి ఉస్సూరుమంటూ ఇంటికి చేరుకున్నాము.
ఇప్పుడు ఒక రోజైనాసరే పాండుకేశ్వరానికి వెళ్ళి రావాలని నిశ్చయించుకొన్నాను. సెప్టెంబర్ వర్షాకాలం. పర్వతాలలో భూకొట్టే భయం. ఈ సమయంలో హిమాలయాలను చూసి అనుభవించాలని నా ఆశ. దగ్గర ఉన్ని దుస్తులు లేవు. అయినా బస్సెక్కి బయలుదేరాను. హిమాలయాల ఎత్తు పల్లాల్లో ఒకటిన్నర రోజుల పాటు ప్రయాణం. ఈ మధ్యాహ్నం బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నానికి పాండుకేశ్వరంలో ఉన్నాను. రెండు పర్వతాల మధ్య లోయ ప్రదేశం. మూడువేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉండొచ్చు. ప్రచండమైన వాన, పర్వతాల కుదుపులకు గురయ్యి హిమాలయాల మృదువైన మన్ను మరోలా కూడా మారిపోయి ఉండవచ్చు. రెండు పర్వతాల నడుమ మైదానం, హిమపాతం, పర్వత దృశ్యాలు, క్రిందికి దూకే ఝరులు ఆ సస్యాలు అన్నీ అలాగే ఉంటాయి. ఇవన్నీ బాహ్య వివరాలు. నా మనస్సులో తిరుగుతున్నది కుంతి, పాండు, మాద్రిలు, దేవలోక ప్రజ. మరుసటి రోజు దొరికిన బస్సెక్కి కూర్చోడానికి చోటు లేకపోయినా అలానే తంటాలు పడి సాయంకానికి హృషీకేశ్ చేరుకున్నాను. రాత్రి రైలెక్కి మరుసటి రోజు పొద్దున్నే ఢిల్లీ స్టేషన్కి చేరాను.
మళ్ళీ ఢిల్లీ నగరంలోకి వెళ్ళలేదు. రైలెక్కి ఇటావాకు వచ్చాను. ఇటావాకు ఆగ్నేయంగా సుమారు పదహైదు మైళ్ళ దూరంలోని చకర్ నగరమే పాండవులు భిక్షాటన చేసిన బకాసురుని ఏకచక్రపురం. ఆ వూర్లో కూడా నాకెక్కువ స్థల సమాచారం దొరకలేదు. అయితే బర్నావాగా మారిన వారణావతంలోలాగా ఎవరూ ఏమీ చెప్పని పరిస్థితి కాదు. మళ్ళీ ఇటావా తిరిగివచ్చి బీహార్ లోని పాట్నా పట్టణానికి ప్రయాణం చేశాను.
జరాసంధుని గిరివృజమైన రాజగీరు వెళ్ళే మార్గంలో వున్న పాట్నాలో నేను తప్పక చూడాల్సిన ఒక వస్తువుంది. అక్కడి వస్తు సంగ్రహాలయంలో మౌర్యుల కాలానిదని (క్రీ.పూ. 320 – 185) చెప్పబడే ఒక రథ చక్రాన్ని పెట్టారు. అలాగని చదివాను. దాన్ని చూడాలని గుర్తు ఉండడం కోసం కూడా రాసుకున్నాను. మహాభారత కాలానికి, మౌర్యులకు మధ్య కనీసం వేయి సంవత్సరాలపైన తేడా ఉంది. ఈ అవధిలో రథ నిర్మాణం మరింత నిపుణంగా మారి ఉంటుంది. అయినా మనం చూడడానికి లభించే అతి ప్రాచీన రథభాగం ఇదే కదా..! ఈ చక్రానికి ఇరవై నాలుగు ఆకులున్నాయి. ఆకుల నిడివి 23 అంగుళాలు. బెత్తం కర్ర చాలా తేలిక. నాలుగు అంగుళాల కుంభి. నాలుగు అంగుళాల చుట్టూ పట్టి. మొత్తం మీద చక్రం ఎత్తు యాభైనాలుగు అంగుళాలు. దీనిమీద రథం రూపాన్ని ఊహించాలి. రాజర్లో రథచక్రాల గుర్తు దూరాన్ని నా అడుగులతో కొలిచి చూశాను. సుమారు నాలుగున్నర అడుగులు. అంటే రథం వెడల్పు మూడు ముక్కాలు అడుగులైనా ఉండాలి. ఇది యుద్ధ రథమా, ప్రయాణ రథమా అని అనుమానం కలుగుతోంది.
సాయంకాలం పాట్నా గంగా తటంలో నడుస్తుండగా చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. మొత్తం ఆర్య ప్రజల సంస్కృతి తీరంలో అభివృద్ధి పొందింది. ప్రాచీన ఉత్తర భారతంలోని ముఖ్య నగరాలన్నీ నదీ తీరంలోనే కట్టబడ్డవి. ఆ ప్రజలు తాగే నీటికోసమే కాదు. ప్రయాణానికి కూడా నదినే ఉపయోగించుకున్నారు. ఇప్పటిక్కూడా ఎన్నో ముఖ్య నగరాలు యాత్రా స్థలాలు. నదీ తీరంలో ఉన్నాయి. మహాభారతకాలంలో మాత్రం పాటలీపుత్ర (పాట్నా) స్థలంలో ఏ వూరైనా వుందేమో నాకు తెలియదు.
తరువాతి రోజు జరాసంధునికి, అతని సంతతికి రాజధానియైన గిరివృజానికి ప్రయాణ మయ్యాను. పాట్నా నుంచి సుమారు అరవై మైళ్ళు. బిహార్ అనే పేరున్న రైల్వే స్టేషన్లో దిగి పద్నాలుగు మైళ్ళు దక్షిణానికి బస్సులో వెళ్ళాలి. బౌద్ధుల కాలంలో రాజగృహమని ప్రసిద్ధమైన దీన్ని ఇప్పుడు రాజేర్ అంటున్నారు. దీనికి ఆరుమైళ్ళ దగ్గరలోనే ప్రసిద్ధమైన నలందా విశ్వవిద్యాలయం ఉండేది. ఇప్పటిక్కూడా త్రవ్వకాలు జరిగిన నలందా విశ్వవిద్యాలయాన్ని చూస్తే ప్రాచీన భారతంలోని భారీ విశ్వవిద్యాలయాల చిత్రం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
చుట్టూ కొండలు, అడవులు ఉన్న గిరివృజం ఆ కాలానికి దుర్భేద్యమైన ప్రదేశం. దీని చుట్టూ ఉన్న అయిదు కొండలని మహాభారతంలో వైహార, వరాహ, వృషభ, ఋషిగిరి, చైత్యకాలని పిలిచారు. ఇప్పుడు వైహారగిరి (బైబార్), విపులగిరి, రత్నకూటం, వృజగిరి, రత్నాచలం అంటున్నారు. భీమ జరాసంధులు మల్లయుద్ధం చేసినచోటు వైహారగిరి పాదంలో ఉంది. వైహారగిరి, రత్నాచలాల మధ్య ప్రదేశంలో జరాసంధుని అంతఃపురం ఉండేది. జరాసంధుడు తాను గెలిచిన రాజులను సోనగిరి అడుగులో చెరసాలలో పెట్టాడు. గిరివృజం నుండి ఆరుమైళ్ళ దూరంలో ఉన్న జరాసంధ్కా బైఠక్ అనే చోట అతను సభను నిర్వహించేవాడట. మునుపు ఆ చోటునే గిర్యాక్ కొండ అనేవారట. ఈ కొండ పక్కనే పంచాన అనే నది ప్రవహిస్తుంది. కృష్ణ భీమార్జునులు ఈ నది దాటి వేషాలు మార్చుకొని గిర్యాక్ కొండ నెక్కి విపుల, చైత్యక శ్రేణి భాగంలో జరాసంధుని పురంలోకి ప్రవేశించారు.
వైహారగిరిపై సమతలంలో ఒక గుడిలో ఉన్న రెండు అడుగుల గుర్తులను కృష్ణుని పాదాలు అంటారు. వైహారగిరి పాదంలో ఉత్తర ద్వారానికి దగ్గరగా నేడు వేడినీళ్ళ బుగ్గలున్నాయి. వీటికి తూర్పుగా కొద్ది దగ్గరలో అయిదు వేడినీళ్ళ కుండాలున్నాయి. వీటికి తూర్పుగా ఒక పెద్ద ఉష్ణకుండం. ఉత్తరద్వారం దగ్గర జరాదేవి మందిరం ఉంది. ఊరిలో మధ్యగా సరస్వతి అనే పేరున్న ఒక చన్నీటి ఏరు పారుతుంటుంది. కొండలమీద అంతా చిరువెదురు, సీగలాంటి ముళ్ళతీగలు, తేగ, బిల్వ మొదలైన చెట్లు నిండి ఉన్న అడవి. ఇక్కడ గిరివృజం పూర్తి వివరాలు అవసరం లేదు.
అయితే, జరాసంధ భీముల యుద్ధ ప్రకరణాన్ని వ్యాస భారతంలో వివరంగా చదివి, ఆ కాలపు ఆర్య, ఆర్యేతర వర్గాల వసతి ప్రదేశాలను రేఖా మాత్రంగా ఊహించుకుని అక్కడికి వెళ్ళిన వాడికి భారతంలోని ఆ నాటకానికి రంగస్థలం ఇదే కావచ్చనిపిస్తుంది. మునుపు గిరివృజం ఉన్న చోట ఇప్పుడు ఊరులేదు. ఆ గిరివృజానికి అటువైపే, అంటే కొండల వరుసకు బయటే ఇప్పటి రాజేర్ ఉన్నది. అక్కడ ఒక బెంగాలీ హోటల్లో దిగిన నేను రెండు రోజుల పాటు ప్రాచీన గిరివృజపు ఖాళీ ప్రదేశంలో తిరిగిచూశాను. పర్యాటకులు విడిగా గానీ చిన్న గుంపులుగా గానీ వెళ్ళకూడదంటూ దొంగలు, హంతకుల భయం ఉందంటూ పోలీసులు చెపుతారు. నేను చేతిగడియారం, షర్టు, ప్యాంటులను హోటల్లోనే పెట్టి ఓ పాత నిక్కరు, చిరిగిన బనియన్లతో వెళ్ళి తిరిగాను. ఒక రాత్రి హోటల్లోని మరోవ్యక్తి తోడు తీసుకుని పదకొండు గంటలవరకు అక్కడ ఉండి వచ్చాను. అక్కడి వేడినీళ్ళ గుండాలలో కుత్తుక వరకు మునగడం ఆరోగ్యానికి, చర్మానికి, ఒళ్ళు నొప్పులకు చాలా మేలంటూ వేలాది సంవత్సరాలనుంచి నమ్మకం ఉంది. హిమాలయాల్లోని కేదారం దగ్గర గౌరీకుండం, బదరి దగ్గర ఉష్ణ కుండాలలో ఈ సుఖాన్ని అనుభవించిన నేను ఇక్కడ వదిలిపెట్టడం ఎలా సాధ్యం?
ఉత్తర భారతదేశంలో మొట్ట మొదటి సామ్రాజ్యం ఏర్పడింది మగధలోనే. మౌర్యుల కాలంలో. అయితే దానికి ఓ వెయ్యేళ్ళ ముందే అదే మగధలో జరాసంధుడు సామ్రాజ్యస్థాపనకు పూనుకున్నాడని నాకనిపిస్తుంది. కావలసినన్ని దారులు, సంచార సౌలభ్యాలు పెరక్కుండానే సామ్రాజ్య నిర్మాణం అసాధ్యం. ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలు లేకుండా కేవలం పాలనావసరాలకోసం దారులు వెయ్యడం కానీ, వాటిని సరిచేయడం కానీ, నియత సంచారం నెలకొల్పడం కానీ సాధ్యం కాదు. మౌర్యుల కాలానికి వ్యాపారం, చేతి వృత్తి పరిశ్రమలు బాగా వికసించాయి. జరాసంధుని కాలానికి పెరగలేదు. అతన్ని భారతంలోని మొట్టమొదటి సామ్రాజ్యకాంక్షిగా గుర్తించవచ్చు. అయితే అతని నైతిక విలువలు, స్వభావం మొదలైనవన్నీ కలిసి అతని ఆకాంక్ష పూర్తిరూపం ధరించాయి. వ్యక్తిగతమైన ఓటమికి ప్రతీకారం చెయ్యాలనుకోవడంతో పాటు, అతని ఆకాంక్షను గుర్తించి అతన్ని అంతమొందించే అవకాశం కోసం కృష్ణుడు వేచి ఉన్నాడు. జరాసంధుని ప్రభావం ఎంతటిదైనా అది కేవలం వైయక్తిక పరిధిలోని శక్తిదే. అతను మరణించినా ముందుకు సాగగలిగే ఆర్థిక రూపాన్ని అతను నెలకొల్పలేదు. అందువల్ల అతను చచ్చిన తక్షణం తూర్పు భాగంలోని రాజులందరూ భయపడ్డారు. తరువాత మొత్తం ఆ భాగమే ప్రాముఖ్యం పొందలేదు. ఇలాంటి ఆలోచనలతో జరాసంధుని నేపథ్యం స్పష్టం కాసాగింది. కృష్ణుని మహత్త్వమూ అర్థం కాసాగింది. అలాగే చూస్తే ఆర్థిక ఉద్దేశ్యం లేకుండానే గిరివృజం నుంచి మధుర వరకు సుమారు అయిదువందల మైళ్ళు ప్రభావం చూపి, అంతదూరం వచ్చి యుద్ధం చేసిన అతని సన్నాహక శక్తి తక్కువైందేమీ కాదు. పడమటికొన లోని ద్వారక నుంచి మొత్తం ఆర్యావర్తాన్ని గూర్చి చింతించి, జరాసంధుని హతమార్చి, సామ్రాజ్యాన్ని అంతమొందించిన కృష్ణుని సాధన కూడా సాధారణమైంది కాదు. ఈ రాజకీయ జీవన నేపథ్యంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని మనసులోనే గుర్తు వేసుకొన్నాను. గిరివృజంతోటి నా పర్యటన ముగిసింది. గాంధారం, రుక్మిణి ఊరైన కుండినపురాన్ని చూడాలనే ఆలోచన మిగిలింది. గాంధారంలో ముఖ్య సంఘటన ఏదీ జరగలేదు. ఇప్పటి పెషావర్, రావల్పిండి జిల్లాలను కలుపుకొని ఉన్న పాకిస్తాన్ భాగానికి వెళ్ళి రావడం అంత సులభమైన విషయం కాదు.
కుండినపురంలో రుక్మిణి స్వయంవరం ఏర్పాటు కాగా కృష్ణుడు ఆమెను అపహరించుకొని వెళ్ళిన సంఘటన జరిగింది. కుండినపురం అమరావతి (మహారాష్ట్ర)కి నలభై మైళ్ళు తూర్పుగా ఉందని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ ఈ స్థలాల్లో ఈ ఈ సంఘటనలు జరిగాయని చెప్పటం సాధ్యంకాదని, తెలిసినవారు చెప్పగా విన్నాను. విదర్భను ఇంతకు మునుపే మరో సందర్భంలో చూసి ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళాలనే ఆలోచన విరమించాను. గిరివృజం నుండి నాగపురానికి వచ్చి కుండినపురం వెదుక్కొని వెళ్ళడం ఏం కష్టం కాదు. అందువల్ల నా పర్యటనను విరమించి అక్కడి నుంచి కలకత్తా వెళ్ళి హౌరా – మద్రాస్ బండి పట్టుకోవడమా లేదా బనారస్ నుంచి మద్రాసు పెట్టెలోకి కష్టపడి దూరడమా అనే ఆలోచనలో ఉండగానే పాట్నా నుంచి బొంబాయి వెళితే మరోసారి మధ్య భారతాన్ని అడ్డంగా చూసే అవకాశంతో ఆ విస్తీర్ణత వివరాలు మరింత స్పష్టమౌతాయనే భావన కలిగింది. కష్టపడి పాట్నా మీదుగా బొంబాయి చేరుకున్నాను. రిజర్వేషన్ దొరకలేదు. మరుసటి రోజుకు అయిదు రెట్లెక్కువ పెట్టి మొదటి తరగతిలో ప్రయాణం చేశాను. ఓ మంచి హోటల్లో దిగి స్నానాల గదిలో బట్టలుతుక్కుంటుండగా ఓ ముఖ్యమైన అంశం తట్టింది. క్రమంగా దానికి ఓ రూపం వచ్చింది.
నేను రాయాలనుకుంటున్న నవలలో భీష్ముడి దగ్గరనుంచి అభిమన్యుడు వరకూ పెద్దా చిన్నా పాత్రలు ఒక చిన్న అవధిలో ఒకే కాలంలో జీవిస్తాయి. భీష్ముని కంటే ఎంతో చిన్నవాళ్ళైన తమ్ముల భార్యల, పిల్లల, పిల్లల, పిల్లలు ఈ అభిమన్యు, అతని సోదరులు. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఎవరెవరికి ఎంతెంత వయస్సు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరు పుట్టారు? ఎవరు చచ్చారు? వీటన్నింటిని ఒకే చూపులో గ్రహించడానికి అనుకూలంగా ఒక పట్టిక చేసుకోకుంటే రాసేటప్పుడు చాలా గందరగోళం కలిగే స్థితి ఉంటుంది. ఇంతకు మునుపే హరివంశం నుంచి యాదవుల వంశావళి పట్టిక తయారుచేసి పెట్టుకున్నాను. పార్గిటర్ వివిధ పురాణ భారత రామాయణాదులను అధ్యయనం చేసి సిద్ధపరిచిన ప్రాచీన రాజవంశావళి వృక్షానికి ఒక ప్రతిని తయారుచేసి పెట్టుకొన్నాను. ఈ విధంగా మనువునుంచి ప్రారంభమై ఉపపాండవుల వరకు తొంభై ఆరు తరాలు వస్తాయి. పార్గిటర్ గారి పట్టికలోని విశేషం ఏమిటంటే యాదవ, హైహయ, ద్రుహ్యు, తుర్వసు, కాన్యకుబ్జ, పౌరవ, కాశీ, వాయవ్య పాలకులు, పూర్వ భాగ పాలకులు, అయోధ్య, విదేహ, వైశాలి – ఇలా పన్నెండు వంశావళులలోని తరాల పట్టిక తయారుచేసి ఏ వంశంలోని ఏ తరం ఇతర వంశాల, ఏ తరాలకు సమకాలీనమౌతుంది? అనే దాని లెక్క ఆయన ఎంతో జాగ్రత్తగా ఈ లెక్కలను తయారుచేసి ఉన్నారు. ఈ తొంభై ఆరు తరాల అవసరం లేకున్నా నా మనసులో నేపథ్యంగా పార్గిటర్ గారి వంశవృక్ష వివరం బలంగా నాటుకొని ఉంది. అదే విధంగా భీష్ముడినుంచి ఉప పాండవుల వరకు ఒక వంశవృక్షాన్ని సిద్ధపరచుకోవాలనిపించింది.
ముఖ్యమైన సమస్య అంతా యుద్ధం జరిగే నాటికి భీష్ముని వయస్సు ఎంత అనేది..! అతని జీవితంలోనూ, ఇతరుల జీవితంలోనూ జరిగిన సంఘటనల క్రమాలకు ఒకవైపు నుంచి సమంజసమైన అవధి ఇస్తూ వెళ్ళాలి. మరోవైపు నుంచి భీష్మునికి యుద్ధ రథం మీద కూర్చొనగలిగే త్రాణమున్నపాటి వయసైనా ఉండాలి. వందా, వందా ఇరవైఏళ్ళ వాళ్ళుకూడా ఒకట్రెండు మైళ్ళు తిరుగాడడం గురించి నేను విన్నాను, చదివాను. వందా ఇరవైఏళ్ళపాటు బ్రతికిన వారిని చిరంజీవి అనాలంటూ, హిమాలయంలో ఒక సాధువు నాకు చెప్పారు. ఇలాగ రెండు వైపుల నుంచీ లెక్కవేసుకు వెళితే భీష్మునికి నూట ఇరవై ఏళ్ళ వయసు మంజూరు చేయవచ్చనిపించింది. త్వర త్వరగా బట్టలుతకడం పూర్తిచేసి, ప్రయాణపు ఫైలు నుంచి పెద్ద కాగితం తీసుకొని, మిగిలిన పాత్రలకు కూడా ‘కాలం’ వేసి, సంఘటనల అవధికి అడ్డు గీతలు గీసి, ఒక్కొక్క పాత్ర పుట్టిన కాలంమీద ప్లస్ గుర్తు వేస్తూ, మరణ కాలం మీద ఎర్రటి సిరాతో బిందువు గుర్తు వేస్తూ వెళ్ళాను. మధ్యలో కొన్ని సంఘటనలు మరచిపోయినట్లో లేదా వెనుక ముందైనట్లో జ్ఞాపకం కలిగింది. వాటన్నింటిని దిద్దుతూ వెళ్ళాను. ఆ రోజంతా అదే పని ఇంటికి వెళ్ళాక దీన్ని మళ్ళీ రాసుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇప్పుడు చేసిన క్రమం సమంజసం అనిపించింది. ఆ రాత్రి అన్ని తరాలకి సంబంధించి అదే లెక్కాచారం తలలో తిరుగుతోంది, మరుసటి సాయంత్రం రైలు ఎక్కేదాకా ! ఇలా లెక్కవేసుకోకుండానే వ్యాసభారతంలో వున్నట్లు సంవత్సరాలను లెక్కిస్తూ పోతే భీష్ముని వయస్సు పట్టుకోలేనంత ముందుకెళ్ళిపోతుంది. పాత్రల పరస్పర కాలీనత కలిసిపోతుంది. చెదిరిపోతుంది. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఇతరులు మరీ ముసలివారైపోతారు. ఆ వయసువారు అలాంటి యుద్ధంలో అన్ని దినాలు స్వయంగా పోరాడటం సాధ్యమా. నేను వేసిన కాలగణితాన్ని నవలలోని కొన్ని పాత్రల ఆలోచనల్లోనో, సంభాషణల్లోనో అక్కడక్కడ కాస్త కాస్త సూచిస్తూ వెళ్ళాను.
రైలులో ఒక కూపే దొరికింది. ముంబయిదాకా మరెవరూ రాలేదు. ప్రయాణం చేస్తున్నపుడు, అందులోనూ ఇతరుల నుంచి మానసికమైన అడ్డంకులు కలగనప్పుడు, వేగంగా వెనక్కి వెళ్ళిపోయే దృశ్యాల ఎదురుగ్గా కూర్చొని వెళుతున్నప్పుడు, ఊహలు మరీ ముసురుకుంటాయి. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మొత్తం భారతకథ భూగోళానికి అడ్డంగా ఎదురువెళుతున్న ఈ మనస్సు ఇప్పుడు అంతర్ముఖమైంది. ఇందాక చదివి ఆలోచించిన, పర్యటించి సేకరించిన అంశాలన్నీ బాహిరరూపానికి సంబంధించినవే. వీటన్నిటినీ ఎలా రాయగలం? వీటి మూలంగా నేను చెప్పగలిగేదేమిటి? మొదట్నుంచి ఎత్తైన పర్వతాలను చూడటానికి, చూసిన వాటిని ఎక్కి దిగడానికి ఓ ఆసక్తి, పట్టుదల నాకు సహజలక్షణం. వ్యాసుడనే ఈ పర్వతాన్ని ఎక్కాను. అది తెలిపే ఆ కాలపు చరిత్ర చదివాను. నా ఎరుక పెరిగింది. ఈ పర్యటన వల్ల దానికొక మూర్తరూపమూ కలిగింది. ఇది చాలు. నవల రాయడం వద్దనిపించింది. ఇంతవరకు వ్యాసుని వస్తువు మీద ఎంతో మంది భారతీయ కవులు రచించారు. కన్నడంలో పంప, కుమార వ్యాసులు రచించారు. వాళ్ళు చెప్పని కొత్త విషయం నేనేం చెప్పగలను? రాయనవసరం లేదన్న ఆలోచన కలిగాక మనసు తేలికపడింది. నెమ్మది కలిగింది. మధ్యలో వచ్చిన భోజనం తిని తలుపు వేసుకుని క్రమబద్ధమైన సద్దు వింటూ అలాగే పడుకున్నాను. సుఖంగా నిద్రపోయాను.
తెల్లవారుజామున మూడు గంటలకు మెలకువ వచ్చాక మనసంతా ఖాళీ ఖాళీగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఎవరో నన్ను దోచేసినట్లుగా అనిపించింది. కిటికీ బయట పల్చటి వెన్నెల. సాగిపోతున్న భూమి, ఆకాశాల విస్తారత. మనస్సు మళ్ళీ అంతర్ముఖమైంది. రైలు శబ్దం చెవికి వినబడ్డం లేదు. ఈ వస్తువునంతా ఒక స్వరూపానికి తీసుకురావడం ఎలాగా అన్న మథన ప్రారంభమైంది. వ్యాసుడు కూడా మొత్తం భారతకథను ఒక కథన కారుడు మరొకరికి చెపుతున్న రీతిలో చెప్పాడు. మధ్య మధ్యలో సంజయుని వంటివాడు, లఘు సారాంశరూపంలో కొసలను చెప్పిన అనంతరం ధృతరాష్ట్రుడు వివరాలను అడిగితే, అప్పుడు వివరంగా కథను చెప్పిన రీతి కూడా వస్తుంది. అయితే వ్యాసుడు వీటిని సాహిత్యక సాంకేతికతల్లాగా ఉపయోగించలేదు. మొత్తం మీద అదో ప్రత్యేక కథా నిరూపణ విధానం. పంప, నారణప్ప (కుమారవ్యాస)లది కూడా ఇదే విధానం. ఆధునిక కాలంలో ఈ వస్తువును తీసుకున్న రాజాజీ, మున్షీలది అయితే నేరుగా సాగే సరళ నిరూపణ విధానం. ఈ సాంకేతిక రీతిలో నాకు కలిగిన భావాలన్నీ అభివ్యక్తీకరణ పొందలేవు. అంతే కాకుండా నా భావాలు కూడా చివరిదాకా నిలబడవేమో అనే ఆలోచన కూడా ఇంతకుముందు కొన్ని పర్యాయాలు కలిగింది. నిరూపణామార్గం పట్టుకుంటే మొత్తం వస్తువు క్రమానుక్రమణిక చెదిరిపోనూవచ్చు, వికసించనూవచ్చు అని మళ్ళీ అనిపించింది. అలాగైతే ఈ రచనా స్వరూపం ఎలా ఉండాలి అనే ప్రశ్న వెంటాడింది. మళ్ళీ పడుకున్నా నిద్ర రాలేదు. ఒళ్ళంతా బడలిక.
కిటికీ అద్దం గుండా సూర్యకిరణాలు తగిలేపాటికి వస్తు స్వరూపానికి సంబంధించి కొద్దిగా స్పష్టత వచ్చింది. నన్ను వెంటాడుతున్న సమస్య దృష్టినుంచి మొత్తం కథలోని ముఖ్యపాత్రలను స్థూలంగా గుర్తుబట్టాలి. ఒక్కొక్క పాత్రకు సంబంధించిన ఏదో ఒక తీవ్ర కల్లోల ఘట్టాన్ని పట్టుకొని ఆ ఘట్టంలో ఆ పాత్ర తన మొత్తం జీవితాన్ని చూసి గ్రహించిన జీవిత అర్థాన్ని, గెలుపోటములను, తృప్తి వైఫల్యాలను కనిపెట్టాలి. అన్ని పాత్రలూ, ఘట్టాలు కాలపరంగా మొత్తం కథలోని ఒక సన్నివేశంగా సమావేశమైతే లేదా ఆ ఒక మొత్తం సన్నివేశంలోని వేరే వేరే భాగాలుగా పాత్రల ఘట్టాలు విప్పారితే వస్తువుకు స్వరూపపరమైన ఐక్యత – రూపైక్యత – వస్తుంది. రచనకు ఒక స్పష్టమైన ఉద్దేశం రూపొందుతూ వచ్చి వస్తువు మీద పట్టు దొరుకుతుంది అనిపించింది. హుషారుగా లేచి కూర్చున్నాను. ఈ నవల రాయకుండా విడువను అనుకొని రైల్లోనే దంతమార్జన స్నానాదులు పూర్తి చేసుకున్నాను.
భారతకథకంతా మొత్తం కీలకఘట్టం ఏది అనే ప్రశ్న తలెత్తింది. నవలా పాఠకులకు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు గనుక ఆ తరువాత రాసిన, రాయాలనుకున్న ఆలోచనల గురించి ఇక్కడ చెప్పనవసరం లేదు. అయితే అన్ని పాత్రలకు ఒకేరకమైన ఆంతరిక కల్లోలం, వెంటాడే ప్రశ్నలు ఉండడానికి సాధ్యం కాదు. అన్ని పాత్రలూ ఒకేవిధంగా అంతర్ముఖులు కావడం కూడా కృతకమౌతుంది. ఆయాపాత్రల మనోధర్మం, వయస్సు మొదలైన మానసిక గుణాలకు అనుగుణంగా ఆంతరిక చింతనను తీసుకురావాలి, అనే హెచ్చరిక కలిగింది. దీంతో కుంతికి కలిగిన స్మృతిలహరికి మరే సంవాది అవసరం లేకపోయింది. భీమ అర్జునుల విషయంలో ఆ అవసరం ఉంది. ద్రౌపదికి ఆమె పిల్లలున్నారు. అయితే ఈ ఒక్క సాంకేతికతే మొత్తం నవలంతా రాయకూడదు. నవలలోని ఒక పార్శ్వం లేదా ముఖాన్ని ఈ సాంకేతికత విప్పి చూపవచ్చు. మొత్తం మీద ఇలాగే ఆరంభించాలి. ఒక పార్శ్వం స్పృశించిన తర్వాత లోని ద్రవ్యాన్ని అనుసరించి కొత్త విధానాన్ని వెదుక్కోవచ్చు – అనిపించింది. ఇలాంటి అతి పెద్ద వస్తువును ఏదో ఒక నిర్దిష్ట సాంకేతికత అచ్చుకట్టులో పెట్టి బయటికి తేవడం మూర్ఖత్వం అవుతుందనే స్పృహా కలిగింది.
ముంబై నుంచి రిజర్వేషన్ కోసం మా బావగారికి తంతి పంపినా అది అంతవరకు చేరలేదు. అతికష్టం మీద విమానంలో టిక్కెట్టు సంపాదించి బెంగుళూరుకు వెళ్లి అక్కడ్నుంచి బస్సులో మైసూరు చేరుకున్నాను. వెనక్కి తిరిగి వచ్చిన రెండు రోజులు సర్దుకోవడంలో సరిపోయింది. రాయడం వెంటనే ప్రారంభించాలన్న ఒత్తిడి లోనుంచి పెరిగిపోతోంది. కుదుటపాటు లేనందువల్ల దగ్గర కాగితాలుంటే విమానంలోనే మొదలెడదామన్నంత ఒత్తిడి. అయితే ప్రారంభ బిందువును ఇంకా ఆలోచించలేదు.
పాత్రల అంతర్ముఖీనతతో ప్రారంభించడం వద్దు, యుద్ధానికి పూర్వం ఆర్యావర్తంలోని ప్రజాజీవితం క్షత్రియుల రీతి రివాజులు, కురుగృహ కలహాన్ని వారు చూసిన విధానం వివరించే ఆరంభమయితే వ్యాప్తి – కేంద్రకాల దృష్టి నుంచి బావుంటుందనిపించి. ఇప్పుడున్నట్లుగా మద్రరాజు గృహసన్నివేశం నుంచి ప్రారంభించాను. ప్రారంభం ఎప్పుడూ తొట్రుపాటుతో కూడిన పని. దానికితోడు ఎంత సిద్ధత ఉన్నా, నాకు ప్రత్యక్షానుభవంలో లేని కాలాన్ని పట్టుకుంటున్నానన్న స్పృహలో పుట్టే ఒక అధైర్యం, విశ్వాసపు కొరత. మొదటి దినం ఒక పేజీ రాసేపాటికి చాలనిపించింది. రెండవరోజు మూడు పుటలు, మొత్తం మీద తొమ్మిది పది పుటలు రాసేపాటికి పట్టు దొరికింది.
సాహిత్య సృష్టిలో ప్రత్యక్షం పరోక్షం అని అనుభవాన్ని విడదీయడమే తప్పు. నేను రాస్తున్న ద్రవ్యమంతా నాకు ప్రత్యక్షమే. ఒకట్రెండు వివరాల్లోనో, శబ్దాల్లోనో అనుమానం కలగొచ్చు. అయితే మూలద్రవ్యం నా అనుభవం నుంచే రూపుగడుతుంది. దానికి ఆ కాలం ఈ కాలమనే భేదం లేని భావం బలపడుతుంది. సులువుగా ఆ విభాగాన్ని అంటే మద్రరాజు, ఇద్దరు పిల్లలు, అతను సైన్యంతో హస్తినావతికి రావడం, అక్కడి పరిస్థితి, అనంతరం యుద్ధరంగానికి ప్రయాణం, యుద్ధరంగ వాతావరణం, పాండవులతో సమావేశమై యుద్ధ నియమాల నిరూపణ, దండోరా చాటించడం, భీష్ముడు కృష్ణద్వైపాయనుని దర్శించడానికి వెళ్ళడం, అతని బాల్య జీవన స్మరణ ఇదంతా రాశాను. తరువాతి ఘట్టంలో మద్రరాజు హస్తినావతికి వచ్చేదాకా ఒక అధ్యాయాన్ని తొలగించి మిగిలిన భాగాలను నవలలోని మధ్యభాగానికి కలిపి భీష్ముడు కృష్ణద్వైపాయనుని చూడడానికై వెళ్ళడాన్నే ముందుకు సాగించి శకుని ప్రసంగం, భీష్ముని తిరుగు ప్రయాణాలను జోడించాను. మొత్తం మీద మొదటి ఈ భాగం రాసేపాటికి వస్తు, కాల, దేశాది వివరాలమీద పూర్తి పట్టువచ్చినట్లనిపించింది. తరువాత కుంతి విదురుని ఇంటిముందు నదీ తటంలో కూర్చుని జ్ఞాపకాలను స్మరించే సన్నివేశాన్ని రాశాను. అది పూర్తయ్యేపాటికి ఇక నవల కూడా పూర్తయ్యింది, అంతేగాక ఒక మంచి రచన కూడా అవుతోంది అనే సంపూర్ణ విశ్వాసం కలిగింది. అపరిచిత సరోవరంలో కొంత దూరం సఫలంగా ఈదిన తరువాత ఇక క్షేమంగా దాటగలను అనిపించే విశ్వాసం వంటిది. వేదాంత కాలేజీలోని పుస్తకాలను, నోట్సును మళ్ళీ స్వస్థానానికి చేర్చాను. రాసిన భాగాన్ని ఆచార్య ప్రభుశంకర్ గారు చదివి చర్చించారు. వారితో చర్చించిన తరువాత రాయాలన్న ఉత్సాహం మరీ ఉప్పొంగింది. రాయకుండా ఉండడం అసాధ్యమనిపించింది. పాఠాలను త్వరత్వరగా ముగించి అదనపు సెలవు కూడా తీసుకొని పూర్తి చేయాలనే పట్టుదల పెరిగింది. మాట్లాడడం శక్తి విసర్జనం, పాఠాలు వదలడం చైతన్య స్ఖలనం.
ఈ మధ్యలో తరువాతి భాగం రాసే విధానానికి సంబంధించి మరింత ఆలోచించాను. భీమ, ద్రౌపది, అర్జునులను ఒక సన్నివేశంలో నిలిపి, ఆ సన్నివేశ కాంతిలో ముగ్గురి జీవితాల్లోని లోనాడిని వెతుకుతూ వెళ్లాలి. వారు కుంతిలాగా వృద్ధాప్యం పైబడి మరొకరి ప్రేరణ లేకుండానే అంతర్ముఖులయ్యేవారు కారు. అందువల్ల వారి ఆలోచనలు కాస్త సంవాద రూపంలో కాస్త భావలహరిగా మిగిలినవి రాసేటప్పుడు తట్టే ఇతర సందర్భాల రూపంలో బయటికి రావాలి. మాటలు, భావ లహరులు వారి వారి మనోధర్మాన్ని, స్వభావాలను ధ్వనించేసేలాగా ఉండాలి అని స్థూలంగా ఒక పద్ధతిని ఏర్పరచుకున్నాను. అదే రీతిలో రాయడం ప్రారంభించాను.
భీమ, ద్రౌపదుల భాగాలను పూర్తిచేసి అర్జున భాగాన్ని మొదలుపెట్టాను. అంతలో శారీరకంగానూ, మానసికంగానూ చాలా అలుపు కలగసాగింది. రాత్రిళ్లు నిద్ర తప్పిపోయింది. సాధారణంగా రాత్రి తొమ్మిదిన్నరకు పడుకొని తెల్లవారు ఝాము మూడున్నకు లేవడం నా అలవాటు. అప్పుడు ఒకట్రెండు గంటలు రాస్తాను. ఇప్పుడు నడిరాత్రిలోనే రెండు, ఒకటి, పన్నెండుకలా ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తోంది. ఎంత ప్రయత్నించినా నిద్రరాదు. కొన్ని రోజులయ్యాక మరుసటి రోజు నేను రాయవలసిన అంశం కలల రూపంలో కనిపించడం మొదలైంది. కలలు నిద్రను చెడగొడతాయి, ఆత్మీయులైన మానసిక వైద్యులు మనసులోని ఒత్తిడివల్లే ఇదంతా జరుగుతోందంటూ ‘ఒక అధ్యాయం రాయడం పూర్తయ్యాక ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్ళి వారితో నాలుగైదు రోజులు గడిపి తరువాతి అధ్యాయాన్ని రాయండి, ఇలా మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ పూర్తయినప్పుడు అవుతుందనే ఆలోచనతో రాయండి’ అని సలహా ఇచ్చి నిద్రమాత్రలు ఇచ్చారు. వైద్యమిత్రుడు చెప్పిన క్రమంలోనే రచనను సాగించాను.
అర్జునుని ప్రయాణభాగం పూర్తయిన తరువాత యాదవులు – కృష్ణ వృత్తాంతం తీసుకున్నాను. మొత్తం భారతీయ సాహిత్యంలో శ్రీకృష్ణునివంటి సంకీర్ణ పాత్ర మరొకటి లేదు. శ్రీరాముడు సరళంగా అర్థమౌతాడు. కృష్ణునిలో మన అవగాహనకు మించిన ఏదో ఒక పార్శ్వం మిగిలి ఉంటుంది. ఆయన పనులన్నీ కనీసం రెండు కోణాలనుంచి చూడవచ్చు. ఇలాంటి పాత్రను కుంతి, భీమ, ద్రౌపది, అర్జునులను చూపిన విధంగా అంతర్ముఖ చింతన, స్మృతి ప్రవాహం, ప్రజ్ఞా స్ఫురణలు మొదలైన విధానంలో రూపీకరించడం సాధ్యం కాదు. అలా చేస్తే వ్యక్తిత్వంలోని బహుముఖీనత, సందిగ్ధత పోగొట్టుకుపోతాయి. అంతేకాక ఆయనను ఆదర్శీకరించే ప్రమాదమూ కలుగుతుంది. మొత్తం ఉత్తర భారతానికి సంబంధించిన సమగ్ర భావనను మొట్ట మొదటి సారిగా పెంపొందించుకున్న రాజనీతిజ్ఞుడు ఆయన. తన కాలానికంటే కొన్ని శతాబ్దాలో, సహస్రాబ్దాలో తరువాతి నైతిక దృష్టి కలిగిన వ్యక్తి. అలాగే చూస్తే మహాభారతంలో ఆయన శక్తి వంటి శక్తి స్వరూపుడు మరొకడు లేడు. గదగు నారణప్ప (కుమారవ్యాసుడు) ఇవన్నీ ఆలోచించే తన భారతాన్ని కృష్ణ కథగా మార్చుకొని ఉండవచ్చు, వైష్ణవ ప్రభావమొకటే దానికి కారణమని అంటే కవిలోని సాహిత్య వివేచనను తక్కువ పరిచినట్లే అవుతుంది. అయితే కృష్ణుని మహిమకు చిక్కుకున్న ఈ కవి ఆ మేరకు తన సాహిత్యపర స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని ఉన్నదీ స్పష్టమే. మున్షీ గారైతే కృష్ణుని చిన్నా పెద్దా కథలన్నింటినీ స్వీకరించి వాటిని సమర్థిస్తున్న దృష్టితోనే వ్రాసినట్లగుపిస్తుంది. గాంధీ యుగంలోని ఆదర్శాల వెలుగులో కృష్ణుని చరిత్రను ప్రకాశింపచేసే ఉద్దేశం ఆయనది. బంకించంద్ర విమర్శ చాలా వివేచనాత్మకంగా ఉంటుంది. డీవీ గుండప్ప (కన్నడంలో ఆధునిక యుగ నిర్మాత) గారిలో శ్రద్ధాభక్తుల పాలు ఎక్కువ. సాహిత్యపర స్వాతంత్ర్యాన్ని ప్రధాన ఆవశ్యకంగా నేను ప్రజ్ఞాపూర్వకంగా భావిస్తాను. ఏ పాత్రనైనా అభిమానించడంకాని, ద్వేషించడంకాని, పూజించడంకాని, తిరస్కరించడం కాని చేయకూడదనే ప్రజ్ఞ నాకు మొదటి నవల రాసినప్పటినుంచి ఉంది. అంతేకాక కృష్ణుడు ఎంత గొప్ప పాత్ర అయినప్పటికీ మహాభారతంలో ఆయనే ప్రధానమై మిగిలిన వారినందరినీ వెనక్కి నెట్టేయడానికి నేను సిద్ధంగా లేను.
అయితే ఆయన అదమ్య పాత్ర అనే స్పృహ కూడా ఉంది. ఇలాంటి పాత్రను ఎలా చిత్రించడం. మొత్తం నవలకు కేంద్ర సంఘటనైన యుద్ధ సందర్భంలో ఆయనా రావాలి. భగవద్గీతా నాయకుడిగా కాదు, భగవద్గీత నా రచనలో రానే కూడదు, వచ్చినా మనుష్య సంబంధాల గూర్చి నాలుగు వాక్యాలలో పూర్తి కావాలి తప్ప తత్త్వశాస్త్ర సంగ్రహంగా కాదు. సాహిత్య దృష్టినుంచి భగవద్గీత వ్యాసభారతానికి కేంద్ర దృష్టి బిందువు కాదు. మొత్తం మీద కృష్ణ పాత్రను రూపీకరించడం ఎలా? సుమారు రెండు వారాల పాటు దీని గురించే ఆలోచించిన తరువాత యుయుధానుని సంకేతం స్ఫురించింది. ఏదైనా ఒక పాత్ర కృష్ణున్ని, అతని సాధనలను, వాటి విమర్శలను సహృదయతకు లోపం రాకుండా చూడాలి. కృష్ణునికి వ్యతిరేకమైన వ్యక్తి అభిప్రాయాలూ రావాలి. అందుకు అనుగుణంగా ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. ఈ సన్నివేశం రచనలోని కేంద్ర సన్నివేశమైన యుద్ధ సందర్భంలోనే రావాలి అనే అంశాలు స్పష్టంగా స్ఫురించాయి. ఇలా చేయడం వల్ల రచయితనైన నాకు కృష్ణునికి మధ్య అంతరం అలాగే మిగిలి నా సాహిత్య స్వాతంత్య్రం కూడా నాకు దక్కుతుంది. సత్యకుని కుమారుడైన యుయుధానుడు ఎలాగూ యాదవులలోని వాడు. కురుక్షేత్ర యుద్ధంలోనూ అతని పేరు వస్తుంది. అతని పాత్రను నాకు కావాల్సిన తీరులో ఉపయోగించుకున్నాను. మిగిలిన కొన్ని పాత్రలను, సన్నివేశాలను నాకు అవసరమైనట్లు చిత్రించాను.
నేను రాస్తున్నది భారతపాత్రల కథ కాదు. మానవ అనుభవానికి సంబంధించిన వివిధ ముఖాలను, రూపాలను, మానవ సంబంధ స్వరూపాలను, వాటి వివేచనలను అనే ప్రజ్ఞ నాకు చివరిదాకా ఉంది. ఒక్కొక్క కొత్త పాత్ర లేదా సన్నివేశాన్ని రాస్తున్నప్పుడు కూడా వాటి కొత్త కొత్త ఆయామాలు గోచరించేవి. ఒక పాత్ర మరొకదానికి ప్రతిముఖంగా సార్థక్యాన్ని పొందుతుండేది లేదా ఇంకొకదాని మరో ముఖంగా అర్థ సంపత్తిని పెంచుతుండేది. అయితే వీటిన్నిటిని ఎలా ఒక్కటిగా చేయడం? వీటి ఐక్య దర్శనమేమిటి, కేంద్ర సంకేతమేమిటి? అన్నది తెలియడం లేదు. భీష్ముడు కృష్ణద్వైపాయనుని ఆశ్రమానికి వెళ్ళాక, శకుని మరణ సన్నివేశం వచ్చాక (ఇవన్నీ పూర్తిగా నా సృష్టి) మొత్తం నవల కేంద్ర అర్థం నాకు అస్పష్టంగా కనిపించినట్టైంది.
భీష్ముడు వెనక్కి వస్తూ, దారిలో, ఓ లోహకారుని గర్భిణి ఇల్లాలును చూడ్డం రాసిన తరువాత అంతదాకా రాసిన దాన్నంతా మొదటి నుంచీ ఓసారి చదవాలనే మనస్సు కలిగింది. అధ్యాయం పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చదవాలని నిర్ణయించుకున్నాను. నాలుగైదు దినాల తర్వాత మరో ఆలోచన కలిగింది. ఇంకా రాయవలసిన భాగాలున్నాయి. ఇప్పుడు రాసిన భాగాల అర్థాన్ని నా ప్రజ్ఞా స్థాయిలో గ్రహిస్తే, తరువాతి భాగాలు బుద్ధి స్థాయిలో తమ విన్యాసం చూపవచ్చు. అందువల్ల ఇప్పటి ఈ తడుములాట స్థితే కొనసాగనీ అని నిర్ణయించుకొని చదవలేదు. సాహిత్య సృష్టి పూర్తిగా అప్రజ్ఞాస్థితిలోనే సంభవిస్తుందని నేనెప్పుడూ భావించలేదు. అయితే అది ప్రజ్ఞయొక్క భౌతిక స్థాయిలో రూపొందకూడదని ఖచ్చితంగా నమ్ముతాను.
రచనలోని తరువాతి ప్రతి మజిలీని ఇక్కడ వివరించడం అనవసరం. చివరివాక్యం ఓ మధ్యాహ్నం మూడున్నర గంటలకు పూర్తయ్యాక ‘విడుదల’ పొందినట్లైంది. ఇన్నేళ్లూ పీడించిన నరాల మహారోగం దిగిపోయిందన్నభావం. అలాగే పదినిమిషాలు ఊరకే కూర్చుండిపోయాను. తరువాత వీధిలోకి వెళ్ళి కాస్త నడవడం ప్రారంభించాను. మనస్సు గాలికంటే తేలిగ్గా ఉంది. ఎప్పుడూ దారి నడక నియమాలను ఉల్లంఘించని నేను, నట్ట నడివీధిలో నడుస్తున్నాను. వెనుకనుంచి ఒక లారీ వేగంగా వచ్చి కిర్రుమంటూ ఆగింది. తెలివి వచ్చేసరికి డ్రైవరు తిట్టుకుంటూ వెళ్తున్నాడు. కాస్తైతే ప్రమాదం జరిగి అక్కడి కక్కడే చనిపోయేవాడిని. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే సాయంకాలం దాకా కూర్చుండిపోయాను. అదో నిరుద్వేగ మనస్థితి. ఇన్నేళ్ళ ప్రయత్నం, నిమగ్నతల నుంచి విముక్తి పొందిన పరిణామమని భావించాను. నిజానికి అదికాదు.
చివరికి నాలో జరిగిన పరివర్తన అర్థమైంది. జీవితంలో మరణం కంటే సత్యమైనది మరేదీ లేదు. ఈ నేపథ్యం బుద్ధి, మనస్సు అంతఃకరణల లోతుల్ని స్పృశించిన తరువాత మానవ సంబంధాల్లో, మానవ సామాజిక వ్యవస్థల్లో మనం రూపొందించుకున్న నీతి నియమాల నిరర్థకత అర్థం అవుతుంది. లోక రూఢ బహుభాగం మన నమ్మకాలకు మూలం ఇవన్నీ వదిలి. జీవితానికి చివరిదైన మరణ దృష్టినుంచి జీవితాన్ని చూస్తే కొత్త ఎరుక పుట్టవచ్చు అనే భావం కలిగింది. ఇవన్నీ నాకు తెలియని విషయం కాదు. ఎవరికీ తెలియని విషయాలూ కావు. అయితే తెలిసిన విషయాలన్నీ ‘భావాలు’గా మారుతుంటాయా? ‘పర్వ’ రాసిన అనుభవం నాలో ఈ కొత్త భావాన్ని పుట్టించింది. నాకో కొత్త జన్మ నిచ్చింది. ఇంతదాకా నాకు అయిన వయస్సెంత? మిగిలిన ఆయుః ప్రమాణం సుమారు ఎంత? అంతలోగా చూడగలిగే అర్థం ఏదైనా ఉందా? అనే మూడు మీటల శ్రుతి మనస్సు లోలోతుల్లో సదా మోగుతున్నట్లుగా ఉంది.
– ఆచార్య ఎస్ఎల్ భైరప్ప
(జూన్ 1979)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.