
కాలం గుండెలపై
కుల నిర్మూలన జెండాగా నిలబడి
మాటలను మంటలుగా మార్చి
అన్యాయం పై అగ్నిపర్వతాల
సెగలను తాకేలా
రాతల దాడిని రాకెట్లా
మానవ అంతరంగాల్లోకి దూసుకెళ్లేలా
ఏమైనా చెయ్యగలడు
ఏమైనా చెయ్యగలడు.. కలేకూరి..
ఆధిపత్యానికి
ముచ్చెమటలు పట్టించగలడు
అణచివేతను
అంతరిక్షంలోకి విసరగలడు
భూమికే కాదు
నిండు పున్నమి వెన్నెలను
ఎరుపు రంగుగా మార్చగలడు
ఏమైనా చెయ్యగలడు.. కలేకూరి..
అంటరాని ప్రేమ చెరసాలలో
బంధీ అయి మోసపోయినా
సాటి మనిషినే ప్రేమించమని
మానవీయ కోణాన్ని బోధించగలడు
అగ్రవర్ణాల వివక్షత
శతాబ్దాలదే కానీ
మన వర్గమే మన వర్ణమే
మన ఎదుగుదలకు ఆటంకమైతే
హిమాలయ కొండలు
అదిరేలా గట్టిగా గర్జించగలడు
ఏమైనా చెయ్యగలడు.. కలేకూరి..
ఆంగ్లంపై ఆధిపత్యం చూపుతూనే
తెలుగు వెలుగు పంటను
ప్రపంచ పటంపై పండించగలడు
స్వేచ్ఛ సమానత్వపు నదీ జలాలను
నవభారత హృదయాల నిండా
ప్రవహించేలా చెయ్యగలడు
ఏమైనా చెయ్యగలడు.. కలేకూరి..
పిడికెడు ఆత్మగౌరవం కోసం
అనంత విశ్వంతో అనుదినం
ప్రపంచ యుద్ధమే చెయ్యగలడు
సూర్యుడు నడినెత్తిన
నిటారుగా నిలబడి
నా గుండెల్లోకి ఆవాహనం కాబడి
అరుణ కిరణమై
అభ్యుదయం చూపగలడు..
ఇప్పుడు నీలో మనలో
మనందరిలో మళ్లీ మళ్లీ
ఈ దేశంలో ప్రభవిస్తూనే ఉంటాడు
ప్రభావితం చేస్తూనే ఉంటాడు
ఏమైనా చెయ్యగలడు..
ఏమైనా చెయ్యగలడు.. కలేకూరి..
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
(మే 17న మహాకవి కలేకూరి ప్రసాద్ వర్థంతి సందర్భంగా..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.