
లిక్కర్ కుంభకోణం చుట్టూ అల్లుకుంటున్న కథలు, రాజకీయాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి కంటే అవినీతినిపై పోరాటం పేరుతో కక్ష సాధింపు రాజకీయ వ్యూహాలు ప్రధానంగా మారాయా అన్న సందేహం కలుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రయాణించాల్సిన రాష్ట్రం ఇప్పుడు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్రమైన రాజకీయ పోరుకు కేంద్రమైంది. తాజాగా రూ 3,200 కోట్ల లికర్ స్కామ్ కేసు రాజకీయ కక్షసాధింపులకు, పరస్పర ఆరోపణలకు వేదికవుతోంది.
ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నియమించిన సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) 2019- 2024 వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ 3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో వైసీపీ నాయకులు, బ్యూరోక్రాట్లు, డిస్టిలరీ యజమానులు కీలక పాత్ర పోషించారని అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
సిట్ అధికారుల విచారణ..
సిట్ నివేదిక ప్రకారం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని ఎక్సైజ్ విధానం ప్రముఖ వాడుకలో ఉన్న మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ఎవరికి తెలియని నాసి రకం బ్రాండ్లకు ప్రాధాన్యత ఇచ్చారని , ఇందుకుగాను నెలవారీ రూ 50- 60 కోట్ల ముడుపులు తీసుకున్నారని సిట్ ఆరోపిస్తోంది. దేశమంతా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న సమయంలో లిక్కర్ దుకాణాలన్నీ నగదు చెల్లింపులను మాత్రమే అనుమతించడం వెనక ఉన్న కారణాలు అవినీతి పంపకాల మధ్య సంబంధం ఏమైనా ఉందాని సిఐడి దర్యాప్తు చేస్తోంది.
మద్యం సేకరణ కోసం ఉపయోగించే సి టెల్ సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసి, మాన్యువల్ ఆర్డర్ల కేటాయింపును అనుమతించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ నిధులు హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఎంపీ పివి మిథున్ రెడ్డి, మాజీ సలహాదారు కెరాజా శేఖర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ జి బాలాజీలు వ్యవహారించారని సిట్ తన దర్యాప్తులో చెబుతుంది. ఈ నేపథ్యంలో ఒక్క మిథున్ రెడ్డి మినహా మిగిలి వారందరిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
బాబు అవినీతి కప్పిపుచ్చడానికే ఈ కేసులు: వైసీపీ
అయితే, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి, తన గత అవినితీ నుంచి దృష్టి మరల్చడానికి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా ఉపయోగిస్తోందని వైసీపీ వాదిస్తోంది. 2014-2019 కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని మంత్రులు మద్యం మాఫియాలో పాల్గొన్నారనే ఆరోపణలపై గతంలో బాబుపై నమోదైన క్రైమ్ నం. 18/2023ను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం తమ హాయంలో మద్యం విధానం ద్వార విచ్చలవిడిగా ఉన్న మద్యపానాన్ని, అక్రమ బెల్ట్ షాపులను అరికట్టడానికి చాలా దోహాదపడిందని అంటున్నారు. అంతేకాకుండా, అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రంలో మధ్యం అమ్మకాలను 33% తగ్గించిందని చెబుతున్నారు. అమ్మకాలు తగ్గినా రూ 16,912 కోట్ల (2018-19) నుంచి రూ 24,760 కోట్లకు (2023-24) ఆదాయం పెరిగేలా చేసిన ఘనత తమ పార్టీదేనని అంటున్నారు.
కక్ష సాధింపుతో తుంగలో తొక్కుతున్న నిబంధనలు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వ్యవహార శైలిపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఏప్రిల్ 17న దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లో(డబ్ల్యూపీ నం. 10008/2025), ఒక నిందితుడి తండ్రి రిటైర్డ్ పోలీసు అధికారిని గుర్తు తెలియని అధికారులు అర్ధరాత్రి సాధారణ దుస్తుల్లో తీసుకెళ్లడంపై మండిపడింది. హైకోర్టు వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, కోర్టు అనుమతి లేకుండా అతన్ని సిట్ పిలవకూడదని ఏదైనా వాంగ్మూలాన్ని అతని నివాసంలో, న్యాయవాది సమక్షంలో మాత్రమే నమోదు చేయాలని ఆదేశించింది.
మరొక పిటిషన్లో(డబ్ల్యూపీ నం. 8586/2025), శర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్లు తమను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. ఆరోపణలపై హైకోర్టు స్పందిస్తూ భవిష్యత్తులో విచారణ వారి న్యాయవాది పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది. డబ్ల్యూపీ నం. 10339/2025 పిర్యాదుదారుడికి కూడా హైకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. మరొక నిందితుడి తల్లిదండ్రులు దర్యాప్తు అధికారులు తమను దుర్భాషలాడారని భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ 179 కింద ఎలాంటి అధికారిక నోటీసు లేకుండా సిట్ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన డబ్ల్యూపీ నం. 11620/2025లో కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ను జారీ చేసింది. ఈ సంఘటనలతో ఈ కేసు దర్యాప్తు లక్ష్యాలపై నీడలు కమ్ముకున్నాయనే ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై స్పందిస్తూ సిట్ అధికారులు తాము ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని చర్యలు చట్ట ప్రకారం జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దర్యాప్తు విషయంలో హైకోర్టు అన్ని సార్లు జోక్యం చేసుకోవడం అంటే దర్యాప్తులో తీవ్రమైన ఉల్లఘనలు ఉన్నాయని అర్థం అవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషకులు అంటున్నారు.
అరెస్టులు, కోర్టుల్లో వాదనలు, రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం ప్రస్తుతం వార్తల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంపై జరుగుతున్న విచారణ ఇప్పుడు పలు ఆందోళనలకు తావిస్తోంది. ఒకప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రించడం, ఆదాయం ఆర్జించడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం వంటి లక్ష్యాలతో ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ఇప్పుడు కక్ష సాధింపులకు ప్రధాన ఆయుధంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ పై నీలినిడలు కమ్ముకుంటున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.