
కవి గుండెల్లి ఇస్తారి “నేల తడుముతూనే” కవితా సంపుటిని తన తల్లిదండ్రులైన గుమ్మిడెల్లి ఎట్టయ్య- రాములమ్మలకు అంకితం చేశారు. నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి ఈ పుస్తకానికి చక్కటి విలువైన ముందుమాటలు రాశారు. ఇందులోని చాలా కవితలు వివిధ పత్రికల్లో ప్రచురణై పాఠక ఆదరణ పొందాయి. తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. “నేల తడుముతూనే” పుస్తకాన్ని తెలంగాణ పబ్లికేషన్స్ ప్రమోట్ చేస్తోంది.
82 కవితలున్న ఈ కవితా సంపుటిలోని కవితలన్నీ గ్రామీణ మట్టి పరిమళాల సుగంధాన్ని వెదజల్లుతాయి. అంతేకాకుండా మానవ జీవిత– జీవన సారాన్ని ఒడిసిపట్టి చూపుతాయి. కరోనాపై రాసిన కవిత్వంలో ఒమిక్రాన్, జికా, ఎయిడ్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, నిఫా, అంతరాక్స్ మొదలైన వ్యాధులకు కారణమైన వైరస్ల మీద కవి కవిత్వాలను రాశారు.
ఇస్తారి కవిత్వంలో సామాజిక చైతన్యం అంతర్లీనంగా ఉంటుంది. సంపద వర్గాలను సృష్టిస్తే, సనాతనం వర్ణాలను సృష్టించింది. వర్ణధర్మం కులాలను ఏర్పరిచింది. మనుషులను విడదీసి శ్రమదోపిడి సాగిస్తోంది ధనిక వర్గం. ఈ అంశాలన్నింటిని బలంగా కవిత్వంతో కవి వ్యక్తీకరిస్తారు.
ఇస్తారి రాసిన పుస్తకంలోని గుండెలను హత్తుకుని, సమాజనాన్ని ప్రభావితం చేసే కొన్ని కవితలను చూద్దాం..
కవి కాలాన్ని నమోదు చేయాలి, కవిత్వంలో జనం బాధలు- గాధలూ కవిత్వీకరించాలి. ఇదే బాధ్యతతో, హైడ్రా ద్వారా ఇల్లు కూల్చివేతలకు గురైన పేదల “కన్నీళ్ల ప్రార్థన” కవితలో కవి బాధితుల తరఫున నిలబడి వారి బాధను తెలియజేశారు.
“కన్నీళ్లు గుండె నిండుతున్నాయ్/ భారము దింపలేనంత/ మనుషులు కదలలేనంత/ ఒక్కసారి బుల్డోజర్ పిడుగు పడ్డది/ ఏమి అర్ధం కాని వలయంలో/ జీవచ్ఛవాల కొట్టుకుంటున్నామ్ సారు/ తెలియక తప్పులు చేశాము” అని అమాయకుల ప్రతినిధిగా నిలబడి వారి తరఫున కవి ప్రార్థించారు.
కవి ప్రకృతి ప్రేమికుడని రుజువు చేయడానికి ఇస్తారి రాసిన ”మాయమై పోతున్న వసంతం” కవిత నిదర్శనంగా నిలుస్తుంది. ఇందులో పక్షులు, సెలయేర్లు, చెట్లు, చేమలు తమ అస్థిత్వాన్ని కోల్పోతున్న తీరును బలమైన అభివ్యక్తితో, “ఇప్పుడు పక్షుల పలకరింపులులేవు/ నది జీవం విడిచి ఎక్కడితో వెళ్లిపోయింది/ ఎండిన డొక్క మిగిలింది. ఈ గురుతులలో పక్షులు కన్నీళ్లు వదిలిపోతున్నాయి/ నేల తన చేతులతో తడుముతూనే ఉంది” ప్రస్థుత పరిస్థితిని పేర్కొంటారు. “కులం హత్యలు” కవితలో చివరి వాక్యాలు మనిషికి ఎంతో భరోసాను, ధైర్యాన్ని ఇస్తాయి. “మనిషిని మనిషిగా చూసే/ మహోన్నత సమాజం నిర్మించగా/ కదులుతాను నేను/ కవిత్వమై వెంబడిస్తాను నేను“ అంటారు.
“నేను అమాయకుడనే కదా“ అనే కవితలో కవి సామాన్యులకు అండగా వాగ్దానం చేస్తారు. “శ్రమజీవుల స్వేదబిందువులలో న్యాయ పోరాటమై నిలుస్తా/ అనాధల అభాగ్యుల జీవన శృతినై ఉంటా/ నేను అమాయకుడనే/ చదువులోని సంస్కారమై ముందు తరాల వెలుగునైతా” అంటారు కవి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.