
టిడిపి కీలక నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఇదంతా ఏపీ లోనే వున్న విశాఖపట్నం నుంచి విమానంలో విజయవాడ రావడానికి ఆయన పడిన పాట్లు.. అయనకే కాదు విశాఖపట్నం నుంచి రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు,ఇలా ఎవరైనా విజయవాడ వెళ్లాలంటే వయా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది.. నీ ముక్కు ఎక్కడరా అంటే చేతిని తల చుట్టూ తిప్పి చూపించినట్లు తయారైంది. కారణం ఏదైనా విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య తిరిగే విమానాలు రద్దు కావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రస్తుతం రాత్రిపూట రెండు సర్వీస్‌లు మాత్రమే నడుస్తున్నాయి. సాయంత్రం 6:55కీ ఇండిగో, రాత్రి 8:05కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రమే వైజాగ్ వాసులకు అందుబాటులో ఉన్నాయి.పగటిపూట అర్జంటుగా విజయవాడ వెళ్లాలను కునే విశాఖ వాసులకు విమాన ప్రయాణం అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ ,అక్కడి నుంచి విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి. విశాఖపట్నం నుంచి నేరుగా విజయవాడ వెళ్లే విమానాలు ఎందుకు రద్దు అయ్యాయో చెప్పడంలేదు. ఇంతకుముందు పగటిపూట కూడా రెండు సర్వీసులు నడిచేవి. వాటిని రద్దు చేశాయి ఆయా విమానయాన సంస్థలు. కేంద్ర విమానయాన శాఖ కూడా టీడీపీ చేతిలోనే వుంది. ఆ శాఖ మంత్రి గా రామ్మోహన్ నాయుడు వున్నారు. అయినా ఇదేం ఖర్మరా బాబు అంటూ కొందరు నిట్టూర్పులు విడుస్తుంటే.. టీడీపీ నేత గంటా తాను ప్రయాణించిన టిక్కెట్లు ట్విట్టర్ లో వైరల్ చేసి సమస్య ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ రన్ వే విస్తరణ కారణంగా అప్పట్లో పగటి సర్వీస్‌లు రద్దయ్యాయి అని చెబుతుంటే..తగిన రీతిలో ట్రాఫిక్ లేకపోవడంతో విమానాలు రద్దు చేశారని మరికొందరు చెబుతున్నారు.పోనీ వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ ట్రైన్లో వెళ్ళిపోదాం అనుకున్నా వర్కింగ్ డే మంగళవారం పూట వందే భారత్ అందుబాటులో ఉండదు. అందుకే మంగళవారం నా బాధ అంటూ గంటా సమస్య హైలెట్ చేశారు. విమాన ప్రయాణ చార్జీ కూడా 4000 లోపే ఉండడంతో ఎక్కువమంది ఫ్లైట్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే వారందరికీ పగటిపూట విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నారు. విజయవాడ కేంద్రం గా రాజకీయ కార్యక్రమాలు, రాజధాని కూడా అమరావతి కావడంతో రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాలతో పాటు విశాఖ నుంచి వచ్చేవారు ఎక్కవయ్యారు. “ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది” అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.అందుకే గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తన పోస్టులో ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ , ట్రేడ్ ప్రతినిధులు కూడా హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. ఇప్పటికైనా విమానయాన శాఖ స్పందించి, విశాఖ వాసుల సమస్యను పరిష్కరిస్తుందో లేదో చూడాలి. గంట ట్వీట్ కు రామ్మోహన్ నాయుడు రిప్లై ఏంటో.?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.