
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను, వాటి శిక్షణ కేంద్రాలను ఎంపిక చేసి దాడులు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పరిస్థితికి సైనిక చర్యలే పరిష్కారమా?
పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి ఆపరేషన్ సింధూర్ లాంటి సైనిక చర్యలు ఉపయోగపడతాయా? లేనిపక్షంలో పరిష్కారం ఏంటి? సీమంతర ఉగ్రవాదం విషయంలో భారతదేశం రూపొందించుకున్న దీర్ఘ కాలిక వ్యూహం ఏంటి? భారత్- పాకిస్తాన్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక వివాదంలో అమెరికా జోక్యం ఏంటి? సైనిక ఘర్షణకు సంబంధించి మీడియా సంస్థలు ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వ్యాఖ్యానించుకొని విశ్లేషించుకుని వాళ్ళు చెప్పిందే వాస్తవం అన్నట్లు వార్తలు ప్రసారం చేయడం వల్ల కలిగే ఫలితాలు పర్యవసానాలు ఏంటి? ఇటువంటి అంశాలపై ది వైర్ ఇద్దరు ప్రముఖులైన వ్యూహాత్మక నిపుణులతో చర్చించింది. అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ భారత నావికా దళ అధిపతిగా 2004 నుంచి 2006 వరకు పనిచేశారు. గోవాలోని నౌక దళ యుద్ధ కళాశాలలో విశిష్ట అధ్యాపకుడిగా 2016 నుంచి 2022 వరకు పని చేశారు. అజయ్ సాహ్ని ఉగ్రవాద నియంత్రణ గురించి పలు అధ్యయనాలు చేశారు. పుస్తకాలు ప్రచురించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థాపక సభ్యులు. ప్రస్తుతం ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు రక్షణ రంగా నిపుణులతో ది వైర్ సంభాషణ..
ది వైర్: మే 12న ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం విషయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాతి కాలానికి సంబంధించిన దీర్ఘ కాలిక వ్యూహం ఏమైనా ఉందా ?
అరుణ్ ప్రకాష్: ఆపరేషన్ సింధూర్ అంకం ముగిసిపోలేదని ఇంకా కొనసాగుతోందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ఎంత మేరకు విజయవంతమైందో తెలుస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చిన లేదా చేసిన హెచ్చరికలను ఆ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందా లేక సీమాంతర ఉగ్రవాదానికి స్థావరంగానే కొనసాగుతుందానే విషయాలు ముందు ముందు తెలుస్తాయి. ఇక రెండో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పూర్తిస్థాయి యుద్ధం కాదు. ఎత్తుగడలకు సంబంధించిన సైనిక చర్య, మీరు ప్రతి కారం అనండి ఆవేశంతో వచ్చే స్పందన అనండి, ఇది ప్రధానంగా దేశ ప్రజల మనోభావాలలో సుడులు తిరుగుతున్న భావోద్వేగానికి సమాధానంగా చేపట్టిన చర్య. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పాకిస్తాన్‌ను నిలువరించడానికి మరింత వ్యూహాత్మక స్థాయిలో పనిచేయాల్సి ఉంది.
పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్, తొలిరోజే దాడులు చేసింది. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ వెల్లడించినట్లుగా భారతదేశం పాకిస్తాన్‌కు చెందిన వాయుసేన కేంద్రాలు రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు నష్టం వాటిల్లింది. తాజా ఘర్షణల్లో మొదటి దశ పాకిస్తాన్‌కి ఒక హెచ్చరిక లాంటిది. 2016 యూరి సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత భారత ప్రభుత్వం తరఫున పాకిస్థాన్‌కు చేసిన గట్టి హెచ్చరిక ఆపరేషన్ సింధూర్. మన దేశం ఇచ్చిన హెచ్చరికను పాకిస్తాన్ స్వీకరించిందా లేదా అన్నది ముందు ముందు తెలియబోతుంది. పాకిస్తాన్ భూభాగం కేంద్రంగా సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటే ఎప్పటి వరకు భారతదేశంలో హెచ్చరికలు పాకిస్తాన్ చెవికి ఎక్క లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అజయ్ సాహ్ని: ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలలో తాజా స్థితిని ముందు తెచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. తప్పు జరిగిన ప్రతిసారి ఆ తప్పు వలన భారతదేశానికి నష్టం జరిగిన ప్రతిసారి భారతదేశం ఇదేవిధంగా స్పందిస్తుం పేర్కొన్నారు. అయితే ఇక్కడ తప్పేమిటి, దాని స్వరూప స్వభావాలు ఏంటి? రూపురేఖలు ఏంటనే విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించలేదనుకోండి. పాకిస్తాన్ చేస్తున్న తప్పేమిటి అనే విషయాన్ని నిర్దిష్టంగా నిక్కచ్చిగా చెప్పకుండా ప్రధానమంత్రి సంయమనం పాటించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకునే ప్రతి ఉగ్రవాద చర్య యుద్దంతో సమానమే అంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాజాగా ప్రధానమంత్రి చేసిన ప్రకటన భిన్నంగా ఉంది. ప్రతి ఉగ్రవాద చర్య యుద్ధంతో సమానమనే అవగాహన ఆచరణ సాధ్యమైనది కాదు ఎందుకంటే ఉగ్రవాద చర్యలు చోటు చేసుకున్న ప్రతి సందర్భంలోనూ యుద్ధానికి దిగలేము. యుద్ధం చేయలేము.
అంతేకాకుండా ప్రధానమంత్రి ఉగ్రవాద చర్చలు జమిలిగా ముందుకు వెళ్ళవని స్పష్టం చేస్తుంటే మరోవైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్తాన్‌లు చర్చలకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రసంగంలో ట్రంప్ అభిప్రాయం అవగాహనతో భారతదేశం ఏకీభవించడం లేదనే అభిప్రాయాన్ని కలిగించడానికి శతవిధాల ప్రయత్నం జరిగింది.
అయితే చర్చలు ఉగ్రవాదం, వాణిజ్యం ఉగ్రవాదం ముందుకు సాగవని చెప్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటనలో లోతైన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన వివరాలు లేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది.
ది వైర్: నిలువరించడానికి దీర్ఘకాలిక యుద్ధానికి మధ్య ఉన్న తేడా ఏంటి?
అరుణ్ ప్రకాష్: భారతదేశంలో పౌరుల పైన సైన్యం పైన దాడులు చేసే ఉద్దేశంతోనే పాకిస్తాన్ చొరబాట్లకు సిద్ధమవుతోంది. నిరంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య సీమాంతర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవాధిన రేఖ వెంట కవ్వింపులు, ప్రతిస్పందనలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. లేదా తరచూ పహల్గాంలోలా ఉగ్రవాదులు బరితెగిస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది వాళ్లు విందుకో వినోదానికో పర్యాటకులుగా వెళ్లి రావటానికి కాదు. ఆపరేషన్ సింధూర్ ఒక కైనెటిక్ యాక్షన్. దీంట్లో పేలుడు సామాగ్రి బాంబులు, రాకెట్లు, యుద్ధ విమానాలు అన్ని వినియోగించబడతాయి. ఇది తక్షణ స్పందన. పాకిస్తాన్‌కు ఇవ్వదలుచుకున్న తొలి సందేశం.
ఈ హెచ్చరిక పాకిస్తాన్‌కు వినపడకపోతే మరింత తీవ్రమైన హెచ్చరిక చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు జరిగిన సైనిక చర్య కంటే విస్తృతమైన లోతైన ప్రభావం చూపగల సైనిక చర్యకు మనం సిద్ధపడాల్సి ఉంటుంది. తాజా సైనిక చర్యలు ఎంపిక చేసుకున్న లక్ష్యాల కంటే తీవ్రమైన స్వభావం గల లక్ష్యాలను తదుపరి దశలో ఎంచుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్ కూడా స్పందించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి తేవడానికి ఇతర మార్గాలు, పద్ధతులు అవకాశాలు కూడా ఉన్నాయి. దౌత్య మార్గాల ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడలతో పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందు ఉగ్రవాదుల శిక్షణకు పాకిస్తాన్ ఏ విధంగా సహకరిస్తుందో సాక్షాధారాలతో పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టవచ్చు. ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుల ద్వారా అందుతున్న ఆర్థిక మద్దతును నిలిపివేయవచ్చు. లేదా పాకిస్తాన్‌పై అప్పుల భారాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా వాణిజ్యం ఇతర కీలక అవసరాల విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా పాకిస్తాన్‌ను నిస్సహాయ స్థితికి నెట్టవచ్చు.
సింధు నది జలాల ఒప్పందం ఉండనే ఉంది. ఈ ఒప్పందాన్ని నిలువరించడం తక్షణ ప్రభావాన్ని కలిగించే అంశం. రైతులు ఇతర గ్రామీణ పాకిస్తాన్ ప్రజానీకంపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ సింధూ నది జలాలను దీర్ఘకాలం పాటు పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఆపాలంటే మన వైపు నుంచి కూడా కొంత కసరత్తు ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
అజయ్ సాహ్ని: తాజా సైనిక చర్య గురించి మరింత చర్చించుకుందాం. ఇది ప్రభావం ఉధృతి వంటి విషయాల్లో బాలాకోట్ కంటే చాలా తీవ్రమైన స్పందన. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలకు సంబంధించి తొమ్మిది కేంద్రాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇందులో రెండు భారీ ఉగ్రవాద స్థావరాలు మరో రెండు చిన్నవి. భగల్పూర్ మురేడ్కే ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు జైషే మహమ్మద్‌కు లష్కర్ ఏ తయ్యబాకు రాజధానులు లాంటివి. భారత సేనలు సాగించిన దాడుల ప్రభావం గురించి అన్ని వైపుల నుంచి ధ్రువీకరణ ఉన్నది. ఇప్పటివరకు సంయమనం పాటించిన భారతదేశం ఇకపై సహనంతోను సమయమంతోను వ్యవహరించదని పాకిస్తాన్‌కు అర్థమైంది. వ్యూహాత్మకంగా ఎంచుకున్న లక్ష్యాలు చిన్నవి అయినప్పటికీ భారత్ ప్రదర్శించిన సాయుధ నైపుణ్యం సామర్థ్య శక్తి చాలా పెద్దది, విస్తృతమైనది. ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేయాలన్నది భారతదేశపు సైనిక చర్యల్లో కీలకమైన లక్ష్యం. తద్వారా పహల్గాం దాడికి పాల్పడిన వారిని శిక్షించాలన్నది కూడా భారత లక్ష్యంగా ఉన్నది.
అయితే ఇది పూర్తిస్థాయి ఆట కాదు. తాజా సైనిక చర్యల వ్యూహాత్మక లక్ష్యం ఏంటి? వ్యూహాత్మక ప్రయోజనం ఏంటి? పాకిస్తాన్‌ను నిలువరించటం. మరోసారి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యలకు పాకిస్తాన్ పాల్పడరాదని హెచ్చరిక జారీ చేయడం. ఇక్కడే ఓ సమస్య ఉంది. ఆపరేషన్ సింధూర్ కానీ అంతకంటే తీవ్రమైన సైనిక చర్య కాని భారతదేశం ఆశించిన విధంగా పాకిస్తాన్‌ను నిలువరించడానికి దోహదం చేయవన్నది నా అభిప్రాయం.
పాకిస్తాన్‌ను నిలువరించాలంటే అడపాదడపా జరిగే సైనిక చర్యల ద్వారా మాత్రమే సాధ్యం కాదు. నిరంతరం అమలు చేయడానికి వీలైన వ్యూహం రూపొందించుకోవాలి. సైనిక చర్యలను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించలేము. అందులోనూ ప్రతి సందర్భంలో ఈ స్థాయిలో సాయుధ ప్రయోగానికి సిద్ధం కాలేము. ఉదాహరణకు ఉగ్రవాద సంబంధిత చర్యల విషయంలో పాకిస్తాన్ తన మిత్రులతోటే ఎలా వ్యవహరిస్తుందో చూడండి. అమెరికా పాకిస్తాన్‌కు కీలకమైన సన్నిహితమైన మిత్ర దేశం. అయినా ఆఫ్గనిస్తాన్‌లో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో అమెరికా మునిగిపోవలసి వచ్చింది. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ భూభాగం పైన ఉన్న నిర్దిష్టమైన ఎంపిక చేసిన ఉగ్రవాద స్థావరాలపై అమెరికా అత్యంత ఆధునికమైన సైనిక శక్తి నావికా దళ శక్తి వైమానిక శక్తితో ఎన్నో దఫాలుగా దాడులు చేసింది. ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ సైనిక స్థావరమైన కాకుల్ సైనిక్ అధికారుల శిక్షణా కేంద్రంలో ప్రత్యక్షంగా పట్టుకొని అమెరికా వధించింది. అమెరికా వంటి శక్తివంతమైన దేశంతో తలపడాల్సి వస్తుందని తెలిసినప్పటికీ తాలిబాన్, జైషే మహమ్మద్, లష్కర్ ఏ తయ్యబా లాంటి కీలకమైన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తూనే ఉంది. అమెరికా సాగించిన ఆప్ఘన్ యుద్ధంలో ఈ మూడు ఉగ్రవాద సంస్థలు కూడా లక్ష్యాలుగానే ఉన్నాయి.
సంకీర్ణ బలగాలకు వ్యతిరేకంగా అప్పట్లో కాబూల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సమర్థించి వెనకేసుకురావడంలో పాకిస్తాన్ ఏనాడు వెనుకంజ వేయలేదు. దీన్నిబట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటి? ఎంత తీవ్రమైన భారీ నష్టం కలిగించేదైనా ఒకటో రెండో సైనిక చర్యలతో పాకిస్తాన్‌ను నిలువరించటం సాధ్యం కాదన్నది అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన వాస్తవం.
ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పాలంటే, సుదీర్ఘమైన మన్నికైన సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించాలి. సింధు నది జలాల ఒప్పందం అటువంటి వ్యూహాల్లో ఒకటిగా కనిపిస్తుంది. సింధు నది నుంచి ప్రవహించే నీరు మొత్తాన్ని ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఆపలేము. ఆ పని చేయాలంటే కనీసం 30 ఆనకట్టలు కట్టాలి. 30 ఆనకట్టలు కట్టాలి అంటే కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడున్న సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ ఆనకట్టల నిర్మాణం పూర్తి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని వివాదంగా మార్చి కాలడ్డు పెట్టటానికి ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకుంటుంది.
భారతదేశ నుంచి పాకిస్తాన్లో ప్రవహించే జలాలకు సంబంధించిన సమాచారాన్ని మనం బహిర్గతం చేయకుండా ఉండవచ్చు. ఈ పరిస్థితులు పరిణామాలు పాకిస్తాన్ రైతాంగాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ఎవరైనా కరువు కాటకాలు, నీటి కొరత ఎంత కాలం భరిస్తారు! విదేశీ పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధి నమూనా వంటి రూపాల్లో అనేక ఆటంకాలు కలిగించడం ద్వారా పాకిస్తాన్‌ను నిస్సహాయ స్థితికి నెట్టవచ్చు.
దీర్ఘకాలిక ఘర్షణ అంటే ప్రత్యర్థి బలహీనతలను ఉపయోగించుకోవటం, బలాలను నీరుగార్చడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడం. అయితే, పాకిస్తాన్‌కు ఉన్న బలాలు, బలహీనతలు ఏంటి? పాకిస్తాన్ ఏకైక బలం దాని సైన్యం. అంతర్గత కలహాలతో కొట్టమిట్టాడుతుంది. ఆదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థపై సైన్యానికి ఉన్న పట్టును ప్రజలు సవాలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు ఏమైందో చూడండి. ఈ వ్యూహంలో కొన్ని బహిరంగంగా తీసుకునే చర్యలు ఉంటే మరికొన్ని పరోక్షంగా తీసుకొని చర్యలు ఉంటాయి. ఆ వివరాల జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు. నిజానికి మనం పెద్దగా హంగామా చేయకుండా ఉంటే ఆపరేషన్ సింధూర్ మరిన్ని విజయాలు సాధించిపెట్టే పరిస్థితులు ఏర్పడి ఉండేవి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కీలకమైన ఉగ్రవాద నేతలు హఫీజ్ గాని అజర్ గాని మన సైన్యానికి దొరికుండేవారు. వారికి చెందిన స్థావరాలపైనే మన సైన్యం దాడులు చేసింది. కానీ అప్పటికే వారు మరో చోట తలదాచుకునేందుకు కావలసిన సమయం దొరికింది.
ది వైర్ : భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించామని అమెరికా చెప్పుకుంటుంది. రానున్న కాలంలో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలో ఇది ఏరకమైన ప్రభావాన్ని చూపనుంది? అమెరికా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలని మనపై ఒత్తిడి ఉంటుందా?
అరుణ్ ప్రకాష్: మొట్టమొదటి విషయం ఏమిటంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మన దేశం పాకిస్తాన్ ప్రకటించి ఉండాల్సింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంప్ చేసిన కాల్పులు విరమణ ప్రకటనతో భారత ప్రభుత్వం విభేదించలేదు. ట్రంప్ కనీసం మర్యాదను పాటిస్తే ఈ ప్రకటన విషయాన్ని భారత్ పాకిస్తాన్ దేశాలకు వదిలేసి ఉండాల్సింది. దీనికి భిన్నంగా ట్రంప్ స్వయంగా ప్రకటించడం దౌత్యనీతిలో ఆయన పరిణతి రాహిత్యాన్ని వెల్లడిస్తోంది. ట్రంప్ ఒక వ్యాపారి. కేవలం అంతర్జాతీయ వాణిజ్యమే అమెరికాను తిరిగి అగ్రరాజ్యంగా నిలబెడుతుందనే అపోహలలో బ్రతుకుతున్నాడు. అందుకే అన్నిచోట్ల వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ను ధిక్కరించి భారత నేతలు నిలబడతారా లేదా చూడాలి. భారతదేశం పట్ల ట్రంప్‌కు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు. వాణిజ్య సంబంధిత విషయాల్లో రెండు దేశాలను లొంగదీసుకోవచ్చనే లక్ష్యంతోటి కాల్పులు వివరమణకు ఒప్పించామని బాహటంగానే చెప్తున్నారు.
కచ్చితంగా భారతదేశ నుంచి ఏదో ఒకటి సాధించే ఉంటాడు. కాల్పుల విరమణ కోసం భారతదేశ ఎంతో కొంత మందిని చెల్లించి ఉంటుంది. అమూల్యం ఏమిటి అన్న విషయం ముందు ముందు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
అజయ్ సాహ్నీ: ఈ పరిణామం దురదృష్టకరమైనది. సిమ్లా ఒప్పందాన్ని మనమే భూస్థాపితం చేశామని చెప్పేందుకు తాజా సందర్భం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి మూడవ దేశం జోక్యం చేసుకునే అవకాశం లేదని సిమ్లా ఒప్పందం స్పష్టం చేస్తోంది. కాల్పుల విరమణ పేరుతో మధ్యవర్తిత్వం చేసిన ట్రంప్ కశ్మీర్ వివాదంలో కూడా తలదూర్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి దౌత్య మార్గాల ద్వారా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాల పరిష్కరించుకోవడం ముందు ముందు సంక్లిష్టం కానున్నది. మూడో పక్షం జోక్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్- పాకిస్తాన్ల మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా మూడో పక్షం జోక్యం కోసం పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తూ వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కాల్పుల విరమణ పేరుతో సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి రెండు దేశాల మధ్య మరో మధ్యవర్తి తల దూర్చాడు.
ఒకసారి మూడో పక్షం జోక్యం తర్వాత ఏ సందర్భంలో ఏ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు ముందుకు వస్తాయో ఆ ప్రయోజనాలు నేపథ్యంలో మధ్యవర్తులు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటారో లేదా భారత్‌కు అనుకూలంగా ఉంటారో తెలియని అనిశ్శితి ఏర్పడుతుంది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు పని చేస్తారు. అనేక సందర్భాలలో సీమాంతర ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్ పాత్ర ఖరారు అయిన తర్వాత కూడా అమెరికా పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చిన సందర్భాలు చూశాము. అమెరికా నిలకడ లేని అగ్రరాజ్యం. ట్రంప్‌కు అంతకంటే నిలకడ లేదు.
ది వైర్: సైనిక ఘర్షణ కొనసాగుతున్న సమయంలోనే ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు వంద కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇటువంటి పరిణామాలు భారత్ పాకిస్తాన్లకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి?
అరుణ్ ప్రకాష్: పాకిస్తాన్ పతనం అవ్వాలని ప్రపంచం కోరుకోవడం లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దైన్యంగా ఉంది. ఉన్న అప్పులు తీర్చడానికి పాకిస్తాన్ కొత్త అప్పులు చేస్తుంది. వడ్డీ భారాలు పెరుగుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు, తాగునీరు లాంటివి మౌలిక అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఆ దేశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఐఎంఎఫ్ ఆదేశానికి అప్పు మంజూరు చేయకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరస్థాయికి చేరుకుని ఉండేవి.
భారతీయులుగా పాకిస్తాన్ స్థిమితంగా ఉండాలని మనం కోరుకోకపోవచ్చు. కానీ ఐఎంఎఫ్‌కు వేరే ప్రాధాన్యతలు ఉండవచ్చు. 130 కోట్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేసే ముందు అమెరికా, ఐఎంఎఫ్‌లు కూడా పాకిస్తాన్ నుంచి ఎంతో కొంత మూల్యం రాబట్టుకునే ఉంటాయి. ఇవి మన దేశం కోణంలో సానుకూలమైనవిగా ఉండాలని ఆశిద్దాం. సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు సంబంధించినవిగా ఉండాలని కోరుకుందాం.
అజయ్ సాహ్ని: భారతదేశంలో రక్షణ రంగ నిపుణులతో సహా ప్రతి ఒక్కరు ఇప్పటివరకు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మనం తీసుకున్న చర్యలన్ని అద్భుతమైనవిగా పరిగణిస్తూ వచ్చాం. తదనగుణంగానే భవిష్యత్తు వ్యూహాలు రూపొందించుకుంటూ వచ్చాం. ఇప్పటివరకు మనకు సానుకూల ఫలితాలు ఇచ్చిన చర్యల్ని మరింత ఉధృతస్థాయిలో అమలు చేయాలని కోరుకుంటాం. ఆ కోణంలో చూసినప్పుడు మరింత సాయుధ ప్రయోగం మరిన్ని లక్ష్యాలు వంటివి ఉండాలని ఆశిస్తాం. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలించి ఉంటే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా ఎందుకు బతుకి బట్టకట్ట గలిగింది అని మాత్రం ప్రశ్నించుకోము. పాకిస్తాన్‌ను నిలువరించడం కోసమే సైనిక చర్య అనుకుంటే 2019 నుండి పహల్గాం వరకు మనకు ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రశ్నలు.
మనం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటంటే, సుదీర్ఘమైన దీర్ఘకాలిక వ్యూహాత్మక ఘర్షణ విధానం. పాకిస్తాన్‌కు ఉన్న సానుకూల అంశాలను బలహీనపర్చుకుంటూ రావాలి. ప్రతికూల అంశాలను ఉద్ధృతం చేస్తూ రావాలి. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ సైనిక వ్యవస్థలో ఉన్న అంతర్గత వైరుధ్యాలను గమనిస్తూ ఉండాలి. ఇప్పటికే పాకిస్తాన్లో అనేక అంతర్గత ఘర్షణలు చెలరేగుతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. పాకిస్తాన్ సైన్యం పట్ల ప్రజల్లో వేగంగా విముఖత కలుగుతుంది.
ఆర్థిక రంగాల్లో కూడా మనం జోక్యం చేసుకోవాల్సి ఉంది. పాకిస్తాన్‌కు రుణాలు ఇస్తున్న అంతర్జాతీయ రుణ దాతల వద్దకు వెళ్లి మీరు ఇచ్చే రుణాలు ఉగ్రవాదులను బలోపేతం చేస్తున్నాయి. తప్ప ఆ దేశ ఆర్థికస్థితి బాగుపడదని స్పష్టంగా వివరించగలగాలి. ఏదో ఒకటి జరిగిన తర్వాతనే మనం అర్జీలు పెడుతూ ఉంటాం. ఉదాహరణకు మన ఓటు హక్కు లేకపోయినా ఈ రుణాన్ని మంజూరు చేయటంలో మన అభ్యంతరాలు నమోదు చేయాలి. పాకిస్తాన్ నినాదాన్ని రివర్స్‌లో వంద ముక్కల నినాదాన్ని అమలు చేయాలి రక్తం బొట్టు నేల రాలకుండానే..
ది వైర్: ఎలక్ట్రానిక్ మాధ్యమాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్న వార్తలు విశ్లేషణలు, విషయాలలో ఏమాత్రం సాధికారిక వాస్తవం ఉండటం లేదు. పహల్గాం దాడి నేపథ్యంలో యుధోన్మాదం రక్తపిపాస ప్రోత్సహించడానికి మీడియా సంస్థలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీ పరిశీలన ఏమిటి?
అరుణ్ ప్రకాష్: టీవీ స్టూడియోలలో చెలరేగిపోతున్న యుధోన్మాదాన్ని అరుపులు, కేకలను కొన్ని నేను కూడా గమనించాను. మన మీడియా ఛానళ్ల అవగాహన రాహిత్యాన్ని గమనిస్తే బాధేస్తుంది ఆందోళన కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది, ఏదో జరిగింది. ఇప్పటికైనా కేంద్రం కలగ చేసుకొని ఈ అర్థంపర్థం లేని వాగడంబరాన్ని అదుపులో పెట్టడం మంచిది. ఈ మీడియాను ఇలాగే వదిలేస్తే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి యుద్ధాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి కొన్ని వీడియో చానల్స్ కొన్ని టీవీ ఛానల్స్ భారతీయ సైన్యం కరాచీ, ఇస్లామాబాద్‌ను ఆక్రమించుకుందని ప్రచారం చేశాయి. ఇది కొట్టిపారేయ్యాల్సిన విషయం కాదు, ప్రమాదకరమైన అంశం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తక్షణమే కలగ చేసుకొని ఇటువంటి డిజిటల్ పూటేజిని కనీసం ఉపసంహరించేలా ఆయా మీడియా మాధ్యమాలకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం ముందు మనం తల దించుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపు అన్ని టీవీ ఛానల్స్ చేస్తున్న చర్చలు, సాగిస్తున్న విశ్లేషణలు చూపిస్తున్న దృశ్యాలు ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.
ఇతర సందర్భాల్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన సందర్భం ఇది. కానీ అటువంటి జోక్యం చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అంటే ఆ మీడియా సాధనాలు సాగిస్తున్న ప్రచారానికి ప్రభుత్వం ఆమోదం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతవిదేశాంగ కార్యదర్శిపై, భర్తను కోల్పోయిన నావిక దళ కుటుంబ సభ్యురాలిపై సాగిస్తున్న ట్రోల్స్ గమనించండి. పహల్గాం ప్రతీకారం పేరుతో అమాయకులపై దాడులు చేయవద్దని మాత్రమే ఆ మహిళ కోరుకున్నది. అయినా సరే ఆమెపై డిజిటల్ స్పేస్‌లో పెద్ద ఎత్తున దాడులు దుర్భాషలు జరిగాయి. మాజీ సైనికుడిగా ఈ పరిణామాలు నాకు దుఃఖాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి.
అజయ్ సాహ్ని: వీడియోలలో కనిపిస్తున్న ఈ ధోరణిని, మదాన్ని చూసి నేనేమీ ఆశ్చర్య పడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరంతరం తన లక్ష్యాలు సాధించుకోవడానికి ప్రజలు మభ్య పెట్టడానికి మీడియాను కీలకమైన సాధనంగా మార్గంగా ఉపయోగించుకుంటూ వచ్చింది. దేశ పరిణామాలపై ఓ సాధికార వ్యాఖ్యానాన్ని ప్రజలకు చేరవేయాలనే విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదు. అందుకని ప్రభుత్వానికి ప్రసారమాధ్యమాలు కూడా తమ ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలు అర్థసత్యాలు అపోహలని వాస్తవాలు, సత్యాలు, శాస్త్రీయమైన అంశాలుగా చర్చకు పెడుతూ ఉన్నాయి.
గతంలో కూడా అనేక సందర్భాలలో ఇరుదేశాల పైన యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పటికీ భారత ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి దౌత్య మార్గాలన్నింటినీ అధ్యయనం చేసి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దావా వంటి సంస్థలు ఉగ్రవాద చర్యల్లో పాలుపంచుకున్నాయని నిరూపించగలిగాము. వారి నాయకులపై గృహ నిర్బంధం విధించేలా పాకిస్తాన్‌ను ఒత్తిడి చేయగలిగాము. మురుడికే కేంద్రంగా పనిచేస్తున్న మదర్సాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురాగలిగాము. అటువంటి వ్యూహరచన చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ని అత్యంత బలహీనమైన ప్రధానమంత్రిగా విమర్శిస్తున్న మీడియాలను మనం చూశాం.
ఇప్పుడు కూడా దేశానికి నాయకత్వం ఇస్తున్న రాజకీయ నాయకత్వం తెచ్చిపెట్టుకున్న సౌర సహస్రాల గురించి అపోహలు ప్రచారం చేస్తున్నాము. యుద్ధం జరగాలని కోరుకునే వారిని ఎంపిక చేసి టీవీ చర్చల్లో కూర్చోబెట్టి వారిది ప్రజాభిప్రాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదేదో కేవలం ఇండియాలో మాత్రమే జరుగుతున్న ప్రరిణామం కాదు, పాకిస్తాన్లో కూడా ఇలాగే జరుగుతుంది. తెలిసే తెలియక జరుగుతున్న వ్యవహారం కాదిది. వ్యూహాత్మకంగా సాగుతున్న ప్రచారం. అంటే మన ముందున్న ప్రమాదం పెరుగుతుంది.
జరిగిన ఒక ప్రమాద ఘాతుకాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించుకోవటం అనైతికమే కాదనటం లేదు. మనం ఈ మాట అంటే రాజనీతిలో నైతికమనేది అంటూ ఏమీ ఉండదని చాణిక్యుడు చెప్పాడని దబాయిస్తారు. అంతా వ్యాపారమే. గతంలో బ్లాక్ మార్కెట్లో సినిమా టికెట్లు కొంటే అది చట్టవిరుద్ధంగా పరిగణించబడేది. ఇప్పుడు ఫలానా సినిమా టికెట్ ధర పెరిగిందని పరిగణించేలా చేస్తున్నారు. సమాజంలో నైతిక విలువలు ఒక తరం నుంచి మరోతరానికి మారేటప్పడికి ఏ రూపం తీసుకుంటాయో మనం ఈ ఉదాహరణతో గమనించవచ్చు.
ఏదైనా ఒక పరిస్థితిని నాకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలి అన్నదే వీరి వాదన. దీన్ని ప్రశ్నించిన, దీనికి భిన్నంగా వ్యవహరించిన, ఆలోచించినా మనం దేశద్రోహులమవుతాం. ఎందుకంటే దేశానికి సేవ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నామనేది ఈ ప్రచారం నడుమ అంతర్లీనంగా సాగుతున్న అవగాహన. మారిన రాజకీయ నైతిక ప్రమాణాలలో కనిపిస్తున్న కొత్త తరహా కలనగణితం ఇది.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.