
Reading Time: 6 minutes
భారత్ పాకిస్తాన్ల మధ్య డ్రోన్ దాడులు, క్షిపణి దాడులతో నాలుగురోజుల ఉద్రిక్తపూరితమైన ఘర్షణల తర్వాత మే 10న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన జారీ చేస్తూ రెండు దేశాలూ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు.
వెంటనే అటు ఇస్లామాబాద్ ఇటు ఢిల్లీల్లో రెండు దేశాల ప్రతినిధులు ఇదే ప్రకటనను వెలువరించారు. దీంతో ఎక్కుమంది హమ్మయ్య ఎట్టకేలకు ఉద్రేకాలు చల్లబడ్డాయి అని ఊపిరి పీల్చుకున్న వారుంటే కొందరు మాత్రం ఇంకా ఉద్రేకాలతో ఊగిపోతూనే ఉన్నారు. అదే రోజు రాత్రి అయ్యేసరికి శ్రీనగర్‌లో కొన్ని బాంబు పేలుళ్లు ఆయుధ ప్రయోగ శబ్దాలు వినవచ్చాయి. దీంతో ఈ శాంతి తాత్కాలికమేనా అన్న ప్రశ్న అందరి మనస్సుల్లోనూ మొదలైంది.
మే 10వ తేదీ అమెరికా కాలమానం ప్రకారం 7:55 గంటలకు అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ అనే ట్విట్టర్ ఖాతాలో ‘‘అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా జరిగిన చర్చలు, సంప్రదింపుల ఫలితంగా భారత్, పాకిస్తాన్‌లు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను.’’ అని ప్రకటించారు.
ట్రంప్ ప్రకటించిన వెంటనే పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తక్షణ కాల్పుల విరమణకు తాము సిద్ధమేనంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రి స్పందిస్తూ మే 10 సాయంత్రం ఐదు గంటల నుండి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన ప్రకటనలో పాకిస్తాన్‌కు చెందిన డైరెక్టర్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్, భారతదేశ డైరెక్టర్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్‌తో ఫోన్లో మాట్లాడారని, ఆ సంభాషణలో ఇరు పక్షాలూ భూతలంలోనూ, గగనతలంలోనూ తమ సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకరించారని తెలిపారు. తిరిగి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడుకుంటారని కూడా కేంద్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
ర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ ప్రకటనలో ‘‘రెండు దేశాలూ సైనిక చర్యలను నిలుపుదల చేసేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి’’అని తెలిపారు. ఇంకా ఈ ప్రకటనలో ‘‘భారతదేశం అన్ని రూపాల్లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన నికరమైన వైఖరిని తీసుకున్నది. ఈ వైఖరిని కొనసాగిస్తుంది’’ అని కూడా ప్రస్తావించారు.
గమ్మత్తైన విషయం ఏంటంటే అటు జైశంకర్ కానీ ఇటు విక్రం మిస్రి కానీ అమెరికా నెరిపిన మధ్యవర్తిత్వం గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. దీనికి భిన్నంగా అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ‘అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన’ సంధి అని బాహాటంగా చెప్పుకుంది.
కాల్పుల విరమణకు సంబంధించిన సాంకేతిక విషయాల్లో రెండు దేశాలకు చెందిన డెరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్‌లు ప్రత్యక్షంగా ఒప్పందానికి వచ్చినప్పటికీ ఈ సైనిక ఘర్షణను పూర్తి స్థాయి యుద్ధం కిందకు మార్చి విస్తృతమైన సైనిక లక్ష్యాలు సాధించాలనే యోచన పక్కకు పెట్టి ఈ అంగీకారం కుదుర్చుకోవడం వెనక అమెరికా ఒత్తిడి జోక్యంతో కూడినలోతైన దౌత్య, రాజకీయ జోక్యం ఉన్నాయనటంలో సందేహం లేదు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, సెక్రటరీ ఆఫ్ సేట్ రూబియో ట్విట్టర్లో ఓ ప్రకటన వెలువరిస్తూ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చొరవతో అమెరికా అధ్యక్ష ప్రతినిధులు భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రధాన నాయకత్వం, ప్రధాని మోడీ, పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో సహా విశాల సంప్రదింపులు జరిపిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని వివరించారు.
ఇదిలా ఉండగా రూబియో మరో అడుగు ముందుకేసి తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించటంతో పాటు ముందుముందు ఉమ్మడి వివాదాస్పద అంశాలకు సంబంధించి మరో దేశంలో చర్చలు జరిపేందుకు కూడా పాకిస్తాన్ అంగీకరించిందని వివరించారు. ఇదే భాష అదేరోజు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటనల్లో కూడా కనిపించింది. విదేశాంగ శాఖ ఇచ్చిన ప్రకటనలో రెండు దేశాల మధ్య భవిష్యత్తు ఘర్షణలు నివారించేందుకు అవసరమైన రీతిలో చర్చించేందుకు అమెరికా సహకరించనున్నదని తెలిపారు.
ఈ ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం అబ్బే అటువంటిదేమీ లేదని, భారత్ పాకిస్తాన్లో ఎక్కడో మూడో దేశంలో ముచ్చటించేందుకు తాము అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మీడియాకు వివరించారు. ఇప్పటి వరకూ ఉగ్రవాద చర్యలు, చర్చలు ఏకకాలంలో సాధ్యం కాదన్న అవగాహనతో భారత్ ఉంది. ఇప్పుడు అమెరికా చెప్పిందే నిజమైతే ఈ మౌలిక అవగాహన నుండి వైదొలగినట్టు అవుతుంది.
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాలు ద్వైపాక్షిక అంశాలనీ, వీటి పరిష్కారానికి మూడో దేశం జోక్యం అవసరం లేదని సిమ్లా ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి మధ్యవర్తిత్వమైనా భారత దేశం మర్యాద పోగొట్టుకోవటమే అవుతుంది.
ప్రస్తుత కాల్పుల విరమణ భారత్ పాకిస్తాన్‌లు ఇరువురూ కుదుర్చున్నదే అన్న విషయాన్ని వక్కాణిస్తున్న భారతదేశం ఈ ఒప్పందంలో అమెరికా పోషించిన పాత్రను అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. భారతదేశం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో సైతం కాల్పుల విరమణ అన్న పదానికి బదులు రెండు దేశాలు సైనిక చర్యలను, కాల్పులను నిలిపివేసేందుకు అన్న పదబంధాన్ని వాడుతోంంది. ఇది కేవలం ఇరుపక్షాల అవగాహనతో తీసుకున్న నిర్ణయమే తప్ప కాల్పుల విరమణ కాదని అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
పాకిస్తాన్ స్పందన దీనికి భిన్నంగా ఉంది. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ దక్షిణాసియా ప్రాంతంలో శాంతి సాధనకై అమెరికా పోషించిన పాత్రకు కృతజ్ఞత తెలిపారు.
మే 10వ తేదీ రాత్రి 11:35 గంటలకు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రకటనలో ‘‘ఈ ఫలితాన్ని సాధించటానికి అమెరికా తీసుకున్న చొరవను పాకిస్తాన్ ప్రశంసిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతల ప్రయోజనాల రీత్యా ఆ ప్రతిపాదనలు మేము అంగీకరించాము. ఒక బాధ్యతాయుతమైన దేశంగా అమెరికా తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించాము.’’ అని స్పష్టంచేశారు. ఈ మధ్యవర్తిత్వంలో జోక్యం చేసుకున్న ట్రంప్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, ఇంగ్లాండ్‌లతో పాటు చైనా ప్రీమియర్ జి జిన్పింగ్లకు కూడా కృతజ్ఞతలు.’’ అని పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటికీ నుండీ దాని గురించి బహిరంగంగా ప్రధాని మాట్లాడలేదు. (ఈ వ్యాసం రాసిన తర్వాత సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి స్రంగించారు). భారత్ పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పంద వివరాల గురించి కూడా ప్రస్తావించలేదు.
ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు రావటంతో షరీఫ్, మోడీలతో మాట్లాడిన జెడి వాన్స్
శనివారమంతా నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. ఆ రోజు ఉదయాన్నే బున్యాన్ ఉర్ మర్సూస్ పేరుతో పాకిస్తాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగింది. భారతదేశం పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై చేసిన దాడికి ఇది సమాధానం అని పాకిస్తాన్ తన చర్యలను సమర్ధించుకుంది.
తాజా ఘర్షణల్లో పాకిస్తాన్ సైనిక చర్యకు ఓ పేరు పెట్టడం వ్యూహరచన చేయటం ఇదే మొదటిసారి. అప్పటి వరకూ వాస్తవాధీన రేఖ వెంట కాల్పులు, డ్రోన్ల ప్రయోగంతోనే సరిపెట్టుకుంది ఈ చెదురుమదురు కాల్పులను ఇస్లామాబాద్ సాధికారంగా గుర్తించినట్లుకానీ లేక దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా కానీ పాకిస్తాన్ భావించలేదు. పాకిస్తాన్ డ్రోన్ దాడికి సమాధానంగా భారతదేశం కూడా డ్రోన్లు ఉపయోగించింది. ఈ దాడి, దానికి పేరు పెట్టడం, భారత వైమానిక స్థావాలపై దాడులు చేసేందుకు ఫతా 1 క్షిపణులను ప్రయోగించటం అన్నీ రాత్రంగా సరిహద్దు ప్రాంతాల వెంబడి జరుగుతున్న కాల్పులకు స్పందన మాత్రమే కాదు. రెండు దేశాల మధ్య సైనికచర్యలు తీవ్రతరమవుతున్నాయనేందుకు గుర్తుకూడా.
డ్రోన్ల స్థాయినుండి పరస్పరం క్షిపణుల ప్రయోగం స్థాయికి చేరుకోవటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందింది. అమెరికా, సౌదీ అరేబియాలు రంగప్రవేశం చేశాయి. ఈ జోక్యం భారత్, పాకిస్తాన్‌లు కూడా తమ సైనిక చర్యల స్థాయికి తగ్గించేందుకు కొత్త అవకాశాన్ని కల్పించింది. సిఎన్ఎన్ వార్తా సంస్థ కథనం ప్రకారం భారత్ పాకిస్తాన్ పరిణామాలు అధ్యయనం చేస్తున్న అధ్యక్ష బృందం భారత్ పాకిస్తాన్లకు సంబంధించిన సున్నితమైన, ఆందోళనకరమైన పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్న వార్తలందుకున్నది. అయితే ఈ సున్నితత్వం, ఆందోళనకరం అయిన పరిణామాల గురించి ఎక్కువగా వివరించలేదు. కానీ అప్పటికే భారతదేశం తమ సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఆరోపిస్తూ పాకిస్తాన్ పూర్తిస్థాయి సైనిక స్పందనకు సిద్ధమవుతున్నామని ప్రకటించింది. దీంతో పాటు పాకిస్తాన్ అణ్వస్త్ర నియంత్రణ సంస్థ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు వార్తవలు వచ్చాయి. కానీ తర్వాత ఈ వార్తలను పాకిస్తాన్ తిరస్కరించింది.
జేడి వాన్స్ స్వయంగా ప్రధాని మోడీతో శుక్రవారం రాత్రి మాట్లాడారని సిఎన్ఎన్ కథనం చెప్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోడికి ఫోన్ చేసిన జెడి వాన్స్ పాకిస్తాన్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించట్లు సమాచారం. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా దేశాధినేతలతో సంప్రదింపులు జరిపినట్లు సిఎన్ఎన్ కథనం చెప్తోంది.
శనివారం ఉదయం రూబియో నేరుగా పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేయటం ఆ దేశంలో కీలకమైన అధికారాలు నేటికీ సైన్యం చేతుల్లోనే ఉన్నాయన్న వాస్తవాన్ని ధృవీకరిస్తుంది. పౌర ప్రభుత్వం నామమాత్రమే. అప్పటి వరకూ రుబియో పాక్ ఉప ప్రధాని ధర్‌తో సంప్రదింపుల్లో ఉన్నారు. సంయమనం పాటించమని చెప్తూనే ఉన్నారు. ‘‘ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని, కీలకమైన సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా మాట మంతీ సాగిస్తూ ఉండాలి, లేని పక్షంలో అపోహలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తు వివాదాలు రాకుండా చూసుకునేందుకు ఇరు దేశాల మధ్య అర్థవంతమైన చర్చలను అమెరికా సమర్ధిస్తుందని రూబియో వెల్లడిచారు’’అని అధికారిక ప్రకటనలు తెలియచేస్తున్నాయి. తర్వాత అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలు కూడా కుడిఎడంగా ఇదే భాషను ఉపయోగించాయి. రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ధర్లతో ఫోన్ సంభాషణలు జరిపినట్లు విదేశాంగ శాఖ ప్రకటనలు వెల్లడించాయి.
రూబియోతో ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విటర్లో పోస్ట్ చేసిన ప్రకటనలో ఉపయోగించిన పదజాలం మారుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతుంది. ఈ ప్రకటనలో జైశంకర్ ‘‘భారతదేశం వైఖరి నియమితంగానూ, సంయమనంతో కూడినది గాను ఉన్నది. అలాగే ఉంటుంది. ’’ అన్నారు. అంతకు ముందు మే 8వ తేదీ విడుదల చేసిన ప్రకటనలో ‘‘పాకిస్తాన్ స్పందనకు దీటుగా జవాబిస్తాము’’ అని పేర్కొన్నారు. మే 9న విడుదల చేసిన ప్రకటనలో దీటైన జవాబు అన్న పదాలు మాయమయ్యాయి.
సౌదీ రంగ ప్రవేశం
మే 10వ తేదీన సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ కూడా భారత్, పాక్ విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. ఈ చర్చలు ‘‘ఉద్రిక్తతలు తగ్గించి సైనిక చర్యలను నిలువరించే దిశగా సాగాయని’’ ఆ దేశం ప్రకటించింది. అంతేకాక ‘‘రెండు మిత్ర దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగించటం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి కోసం కృషి చేయాలన్నది యువరాజు ఆకాంక్ష’’ అని కూడా తెలిపింది. మే 9 రాత్రి సౌదీ విదేశాంగ మంత్రి చక్రవర్తి ఆదేశాల మేరకు భారత్, పాకిస్తాన్‌లు పర్యటించి ఉద్రిక్తతలు నివారించే దిశగా చర్చలు జరిపారని కూడా ప్రకటించింది. ఈ పర్యటన మౌలిక ఉద్దేశ్యం ‘‘ఉద్రిక్తలు నివారించటం, సైనిక చర్యలు ఉపసంహరించుకోవటం, రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాంతియుతంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవటం’’ అని ప్రకటనలో తెలిపారు.
ఈ పరిణామాల తర్వాత సంక్షోభ మేఘాలు తొలగిపోయే పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.
భారత్ స్పందనలు
ఈ ప్రయత్నాలకు భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న సూచనలు మే 10వ తేదీ ఉదయం ఇచ్చిన ప్రకటనలో అర్థమైంది. మే 10న ఉదయం ఇచ్చిన ప్రకటనలో మే 7వ తేదీ వేకువజామున భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడిస్తూ ఆ ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు తొలిసారి ప్రకటించింది. తద్వారా తమ సైనిక చర్య లక్ష్యాలు సాధించిందన్న సందేశాన్ని వ్యక్తం చేసింది. కానీ మే 8వ తేదీ భారత విదేశాంగ ప్రకటనలో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదులను ఇప్పటికిప్పుడు గుర్తించటం సాధ్యం కాదని తెలిపారు. మే 10 వ తేదీ ప్రకటన దీనికి పూర్తి భిన్నంగా ఉంది.
మే 10న మధ్యాహ్నం 1:30 గంటలకు పాక్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అమెరికా విదేశాంగ మంత్రి, సౌదీ విదేశాంగ మంత్రుల జోక్యం తర్వాత పాకిస్తాన్ వైపు నుండి కాల్పులకు విరామం ప్రకటించినట్లు తెలిపారు. ‘‘ అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ ఇచ్చిన హామీ భారతదేశం కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే తాము పాల్పడబోమని హామీ ఇస్తున్నాము. కానీ భారతదేశం ఏదైనా కార్యచరణకు దిగితే మేము కూడా కార్యాచరణతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చర్చలకు తావులేదు’’ అని పాక్ విదేశాంగ మంత్రి ప్రకటన వివరించింది. ‘‘కాల్పుల విరమణ జరుగుతుందా?’’ అన్న విలేకరుల ప్రశ్నకు దర్ ‘‘ఓపిగా ఉండండి. చూద్దాం. రెండు దేశాల సైన్యం మధ్య హాట్ లైన్ ఫోన్లు పని చేయాలి. ఇరు దేశాల సైన్యం ఓ అవగాహనకు రావాలి’’ అన్నారు. ఆ హాట్ లైన్ ఫోన్ కాల్ శనివారం మే 10న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మోగింది. పాకిస్తాన్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్ నుంచి భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్‌కు ఆ ఫోన్ వచ్చింది. అదే రోజు సాయంత్రం 3:50 గంటల సమయంలో ‘‘పాకిస్తాన్ వైపు నుండి భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్య జరిగితే అది యుద్ధంతో సమానమ’’అని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ కథనం ప్రసారం అయ్యింది. వర్తమాన ఘర్షణ ల గురించి మాట్లాడకుండా భవిష్యత్తు ప్రమాదం గురించి మాట్లాడటం అంటే ప్రస్తుత సైనిక ఘర్షణలు నిలిచిపోయాయన్న అవగాహనకు భారత ప్రభుత్వం వచ్చిందన్నది స్పష్టం.
కాల్పుల విరమణ ప్రకటనపై స్పందనలు
కాల్పుల విరమణ ప్రకనటతో ఊపిరి తీసుకున్న వివిధ దేశాలు భారత్, పాకిస్తాన్‌లపై ప్రశంసలు కురిపించటం మొదలైంది. తొలుత బ్రిటన్ విదేశాంగ శాఖ ‘కాల్పుల విరమణను చాలా స్వాగతిస్తున్నాము’’ అని స్పందించారు. మరోవైపున పాక్ ప్రధాని ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపినప్పటికీ సరిహద్దులో వేడి చల్లారలేదని వార్తలు వెల్లడిరచాయి.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ ‘‘శ్రీనగర్‌లోని వైమానిక రక్షణ స్థావరాలు ఇప్పుడు తలుపులు తెరుచుకున్నాయ’’ని ప్రకటించారు. నగరంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సరిహద్దుకిరువైపులా అడపాదడపా కాల్పుల శబ్దం వినిపించింది. బారాముల్లాలో భారీ పేలుళ్ల శబ్దం రావటంతో నగరంలో కరెంటు సరఫరా నిలిపివేశారు. నగరంలో విమాన సైరన్లు మోగుతూ ఉంటే సరిహద్దుల్లో కాల్పుల తర్వాత వచ్చే మంటలు కనిపించాయని జమ్మూ వాసులు తెలిపారు. దీంతో కాల్పుల విరమణ జరుగుతుందా లేదా అన్న ఆందోళన మొదలైంది.
నగ్రోతాలో ఉగ్రవాదులు సైనిక శిబిరాలపై కాల్పులు జరిపారనే వార్తలు ప్రసారం చేశాయి. ఈ వార్తలు వచ్చిన పదిహేను నిమిషాల్లో సైన్యం దీన్ని ఖండిరచటంతో ఆయా వార్తసంస్థలు ఈ వార్తలను ఉపసంహరించుకున్నాయి. అదే రోజు సాయంత్రం చీకటిపడుతున్న సమయంలో భారత విదేశాంగ శాఖ కార్యద్శి విక్రం మిస్రి మూడో సారి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. జవహర్లాల్ నెహ్రూ భవన్లో మీడియాతో మాట్లాడుతూ శనివారం భారత్ పాకిస్తాన్ల డైరెక్టరేట్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరషన్స్ అవగాహనకు భిన్నంగా పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. సైన్యం ఈ ఉల్లంఘనలకు తగిన విధంగానే స్పందిస్తునన్పటికీ వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంట జరుగుతున్న ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఉల్లంఘనలను నిలుపుదల చేయించేందుకు పాక్ తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా వ్వవహరించాలని ఆయన కోరారు. ఈ చెదురుమదురు ఘటనలను సాకుగా తీసుకుని కాల్పుల విరమణ ఒప్పందం నుండి భారత్ వైదొలగటానికి సిద్ధంగా లేదన్న వాస్తవాన్ని మిస్రి ప్రకటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రికల్లా పాకిస్తాన్ విదేశాంగ శాఖ నుండి ‘కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, తుచ తప్పక పాటిస్తాం’’అనే ప్రకటన వచ్చింది. కొన్ని చోట్ల భారత్ కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పాక్ సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆ ప్రకటనలో తెలిపారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో సమస్యలు ఉంటే తగిన స్థాయిలో చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చు. క్షేత్రస్థాయిలోని సైన్యం కూడా సంయమనం పాటించాలి’’ అని పాక్ విదేశాంగ శాఖ ప్రకటన కోరింది.
లాహోర్ నుండి ది వైర్‌తో మాట్లాడిన పాకిస్తాన్ రక్షణ శాఖ వర్గాలు తమకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశాయి. పాకిస్తాన్‌పైన కూడా పెద్దఎత్తున పలు చర్యలు జరుగుతున్నాయని, కానీ రెండు దేశాలు స్వయంప్రతిపత్తితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయటానికి కట్టుబడి ఉన్నామని సదరు అధికారి అన్నారు. ‘‘ప్రయోగించిన డ్రోన్లలో పైలట్లు లేరు కాబట్టి అవి అక్కడికక్కడ కూలిపోవటమో లేక బ్యాటరీ ఉన్నంత వరకూ అడ్డదిడ్డంగా గాల్లో తిరగటమో జరుగుతుంది తప్ప మనమేమి చేయలేం’’ అని సదరు అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో నాలుగు రోజులుగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణ నిలిచిపోయింది.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.