
తాజాగా పాక్‌తో కాల్పులు ఒప్పందం జరిగిన తీరు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిన నేపథ్యంలో, దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద “ఇందిరా హోనా ఆసాన్ నహీ” అనే పోస్టర్లు దేశవ్యాప్తంగా అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి ఈ పోస్టర్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ పై దాడుల అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ తీసుకున్న సాహాసోపేత నిర్ణయాలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ద్రుతంగా స్పందించడంలో వెనుకబడిందని విమర్శిస్తున్నారు. దేశ భద్రతా విషయంలో కఠిన వైఖరిని కనబరిచే నేతల అవసరం ఇప్పుడు దేశానికి ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసలు 1971లో ఇందిరా గాంధీ ఏం చేశారు?
1971లో పాకిస్తాన్ ఆర్మీ తూర్పు పాకిస్తాన్లో (ఇప్పటి బంగ్లాదేశ్) బంగాళీ ప్రజలపై అమానుషంగా దాడులు చేసింది. లక్షలాది మంది శరణార్థులు భారత్‌లోకి ప్రవేశించడంతో, అప్పుడు పాక్ ను ఎదుర్కొనడానికి ప్రధాని ఇందిరా గాంధీ కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఆమె పర్యటనలు చేస్తూ పాకిస్తాన్ హింసను ప్రపంచానికి తెలియజేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా వంటి దేశాలకు వెళ్లి మద్దతు కూడగట్టారు. కానీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, ఆయన సలహాదారు హెర్నీ కిస్సింజర్ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ఒత్తిడులకు స్పందనగా ఇందిరా గాంధీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా ధైర్యంగా ముందడుగు వేశారు. “భారత సార్వభౌమత్వం పై మేము రాజీ పడం. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం మా దేశ వ్యాహారాలు పూర్తిగా మా వ్యక్తిగతం” అని ఆమె స్పష్టంగా చెప్పారు. అనంతరం భారత సైన్యాన్ని తూర్పు పాకిస్తాన్లోకి పంపారు.
13 రోజులకే భారత సైన్యం విజయాన్ని సాధించింది. 1971 డిసెంబర్ 16న 93,000 పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవడం ద్వారా యుద్ధం ముగిసింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సైనిక లొంగుబాటు సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ విజయంతో ప్రపంచం మొత్తానికి ఆమె “ఐరన్ లేడీ”గా పేరు తెచ్చుకోగా, దేశంలో ఆమెను “దుర్గ”గా కీర్తించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్కచేయకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆమె నాయకత్వం చిరస్మరణీయమైంది.
మళ్లీ ఆ స్థాయిలో నాయకత్వం అవసరం అంటున్న కాంగ్రెస్
ఇప్పటివరకు, పాకిస్తాన్ 15 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కానీ విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చర్యలు ఇంకా ఎక్కవగానే ఉన్న ప్రభుత్వం ప్రజలకు తెలియజేయటం లేదని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు “ఇందిరా హోనా అసాన్ నహీ” అనే పోస్టర్లతో ప్రస్తుత ప్రధానిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందిరా గాంధీలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. 1971లో దేశం ఎదుర్కొన్న పరిస్థితులు మానవ హక్కుల ఉల్లంఘనలు, విదేశీ ఒత్తిళ్లు, భద్రతా సమస్యలు ఇవన్నీ ఇప్పటికీ పునరావృతమవుతున్న తరహాలో కనిపిస్తున్నాయి. కానీ అప్పట్లో నేతలు చూపిన ధైర్యం, స్పష్టత ఇప్పుడు ఎంతవరకు కనిపిస్తుందనే ప్రశ్నే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.