![mcms](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/mcms-3.jpeg)
అమెరికా ఫస్ట్ నినాదంతో మొదలైన ట్రంప్ కొత్త పరిపాలన అవలంబించే విధివిధానాలను ఎదుర్కోవటానికి కేవలం ఆశపై ఆధారపడటం సరైన వ్యూహం కాదు.
వివిధ దేశాలపై గణనీయమైన సుంకాలను విధించాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత విధాన నిర్ణేతలు వివిధ ప్రత్యామ్నాయాలను రూపొందించే కసరత్తు ప్రారంభించారని కొన్ని వారాల క్రితం వార్తలు వచ్చాయి. సుంకాలను పక్కన పెడితే, 15% కార్పొరేట్ పన్ను, ఆర్థిక నియమ, నిబంధనలను పూర్తిగా సడలించటం జరుగుతుందని చేసిన ట్రంప్ వాగ్ధానం పెట్టుబడికి అమెరికాను చాలా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తుంది. దానితో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడులు నిష్క్రమించే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో ఆవిర్భవిస్తున్న మార్కెట్లకు చెందిన స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు క్షీణించటం ఇప్పటికే కనిపిస్తున్నది.
గొలుసుకట్టు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ట్రంప్ విచ్ఛిన్నకర విధానాల ప్రభావం నుంచి తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి చైనా ఇటీవల 400 బిలియన్ డాలర్లకు మించిన మొత్తంతో ఒక ఉద్దీపన ప్రణాళికను ప్రకటించింది. చైనాలా భారతదేశం అటువంటి ముందస్తు ప్రకటన చేయలేదు.
ట్రంప్ విధానాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై భయపడేంత కఠినంగా ఉండదని ప్రభుత్వం ఆశిస్తోంది. ‘‘అమెరికా ఫస్ట్’’ అనే నినాదాన్ని అమలులోకి తేవటానికి కొత్త పరిపాలన రూపొందే విధానాలను ఎదుర్కోవటానికి కేవలం ఆశపైనే ఆధారపడటం సరైన వ్యూహం కాదు.
ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు విడదీయలేనంతగా అనుసంధానించబడి, పరస్పరం ఎంతగా ఆధారపడివున్నాయంటే అమెరికా ఒక్క చైనాను మాత్రమే తన ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నా, అది అనివార్యంగా అనేక ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఉదాహరణకు అమెరికా విధించే అధిక సుంకాలను ఎదుర్కోవడానికి చైనా తన కరెన్సీ విలువను 7-8% తగ్గించాలని నిర్ణయించింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట్లో చైనాపై 10% అధిక దిగుమతి సుంకం విధిస్తామని చెప్పారు. అంటే సగటు ఎగుమతి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఫలితంగా చైనా నుండి అమెరికా కి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని తటస్తీకరించేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గించింది. అమెరికాకు తను చేస్తున్న ఎగుమతుల విలువను డాలర్ పరంగా పెద్దగా మారకుండా చూసుకోవటానికి ఆవిధంగా అవకాశం ఏర్పడింది.
జాతీయవాదంతో ముడిపెట్టే వైఖరి వల్ల ప్రయోజనం శూన్యం…
ట్రంప్ విధించబోయే సుంకాలను ఊహించి భారతదేశం కూడా ఇటీవల తన కరెన్సీ విలువను తగ్గించుకోవడానికి సిద్ధమవుతోంది అని సమాచారం. ఆర్థిక మనుగడకు సంబంధించిన కారణాలతో, మోడీ గతంలో అనుసరించిన జాతీయవాదంతో ముడిపెట్టిన విధానాన్ని ఇప్పుడు వదిలివేయవలసి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కి ఇది ఎప్పుడూ సరైన విధానం కాదు.
భారతదేశాన్ని అత్యధిక సుంకాలను విధించే దేశాలలో ఒకటిగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా పేర్కొన్నందున భారతదేశం ఆందోళన చెందాల్సిన అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. దేశీయ తయారీని, ఉపాధిని ప్రోత్సహించడం పేరుతో ఇప్పటివరకు మోడీ పదవీకాలంలో భారతీయ సగటు దిగుమతి సుంకాలు గణనీయంగా పెరిగాయి.
మరో విషయం ఏమిటంటే, స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం నిష్పత్తి దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది. యువత నిరుద్యోగం కూడా వేగంగా పెరిగింది.
ట్రంప్ పాలన తీసుకువచ్చిన పెద్ద అనిశ్చితితోపాటు అనేక దేశీయ, ప్రపంచ స్థాయి సమస్యలపట్ల విధాన రూపకర్తల అంతిమ ప్రతిస్పందనను రాబోయే బడ్జెట్ ప్రతిబింబిస్తుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి…
భారతదేశం సమస్య ఏమిటంటే, తాజా త్రైమాసికంలో ఊహించని రీతిలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనా 5.4%కి పడిపోయిన కారణంగా ఆర్థిక వ్యవస్థ గందరగోళంలోకి వెళ్ళిన స్థితిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లు ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7% కంటే ఎక్కువగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేయటంతో భారతదేశం చివరకు స్థిరంగా కోలుకునే మార్గంలో ఉందని ప్రకటించడం విధాన రూపకర్తలను, స్టాక్ మార్కెట్లను భయపెట్టింది.
మోడీ హయాంలో ఇప్పటివరకు వృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి స్థిరమైన రీతిలో పుంజుకోకపోవడం చాలా ఆందోళనకరం. గత పదేళ్లలో ఇది పడుతూ, లేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కోలుకున్నట్లు అనిపించినా, ఆ తర్వాత అకస్మాత్తుగా వృద్ధి తడబడుతుంది.
మందగమన దశలో భారత ఆర్థిక వ్యవస్థ…
భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మందగమన దశలో ఉందని స్విస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, యుబీఎస్ పదిహేను రోజుల క్రితం విడుదల చేసిన ఒక తాజా అధ్యయనం పేర్కొంది.
‘‘భారతదేశ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మందగమనంలోకి ప్రవేశించిందని, దీనిని చమురు ధరల పెరుగుదల లేదా తగ్గుతున్న ప్రభుత్వ వ్యయం వంటి చక్రీయ కారకాల ద్వారా వివరించలేము’’ అని బ్యాంక్ పరిశోధనా బృందం పేర్కొంది.
పరపతి వృద్ధి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతి పోటీతత్వం, ఆదాయ సంభావ్యతలలో దీర్ఘకాలికంగా నెలకొన్న అననుకూలత ఈ క్షీణతకు కారణమని యుబీఎస్ పరిశోధన తెలిపింది.
ట్రంప్ ప్రకటనలో మార్పు…
ఈ నేపథ్యంలో, ట్రంప్ అనుసరించనున్న ‘‘అమెరికా ఫస్ట్’’ విధానాలతో భారతదేశానికి ఇబ్బంది ఉండదని చేసిన వాదనపై యుబీఎస్ కూడా సందేహాస్పదంగా ఉంది. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై గతంలో కఠినంగా ఉంటామనడంతో పోలిస్తే ట్రంప్ చేసిన ప్రారంభ బహిరంగ ప్రకటనలు చైనాపై ఎక్కుపెట్టిన తీవ్రతలో కాస్త సడలించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మీడియనుద్దేశించి చేసిన ప్రసంగంలో చైనా గురించి సామరస్యపూర్వకంగా మాట్లాడారు. అమెరికాలో టిక్ టాక్ ప్లాట్ఫామ్లో 50% భాగస్వామ్యం కలిగి ఉండాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. 2020లో లడఖ్‌లో చైనా సరిహద్దు అతిక్రమణ తర్వాత నిషేధించబడిన భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా టిక్‌టాక్ వివాదాస్పదంగా మారింది.
కనుచూపు మేరలో లేని వ్యూహ రచన…
ఇప్పుడు ట్రంప్ చైనాతో భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుండగా, భారతదేశానికి ఎటువంటి వ్యూహం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ట్రంప్ తన మ్యానిఫెస్టోలో చైనాపై 60% దిగుమతి సుంకాన్ని విధిస్తానని బెదిరించినప్పటికీ, 10% ప్రారంభ అదనపు సుంకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది చైనాను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తి ఉండవచ్చు. దీనికి విరుద్ధంగా, ఫిబ్రవరి 1 నుండి తన దీర్ఘకాల వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25% దిగుమతి సుంకాన్ని విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు.
ఒకవేళ ట్రంప్ చైనాపై చేసిన వాగ్ధాడి కంటే ఆయన వేయబోయే వేటు చాలా తక్కువ స్థాయిలో ఉంటే భారతదేశం తన వ్యూహాన్ని మార్చుకుని, అమెరికా, చైనా – రెండింటితోనూ సీరియస్‌గా వ్యాపారం చేయడం గురించి ఆలోచించడం ప్రారంభించాలి. ప్రస్తుతం ట్రంప్ తన ఆర్థిక వ్యవస్థను పెద్దగా దెబ్బతీయకూడదని భారతదేశం ఆశిస్తోంది. లడఖ్ సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంతో ప్రచారం చేసిన తర్వాత కూడా చైనాతో లోతైన ఆర్థిక సంబంధాల కోసం ఇప్పటికీ భారతదేశం సమగ్ర వ్యూహాన్ని రూపొందించలేదు.
చైనా, భారత్ మధ్య సంబంధాల బలోపేతం…
చైనాతో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి అవసరమైన సమగ్ర విధానాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలు సమర్థిస్తున్నాయి. భారత తయారీ రంగంలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సౌర భాగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి కీలక విభాగాలు చైనా నుండి చేసుకునే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయనేది రహస్యం కాదు. చైనాతో ఈ రంగాలలో ఉదార విదేశీ పెట్టుబడినీ ఆకర్షించేందుకు కావల్సిన విధానాన్ని రూపొందించటం చాలా అర్థవంతంగా ఉంటుంది.
రాబోయే బడ్జెట్ ప్రకటన, ఆ తర్వాత విధాన సర్దుబాటు ప్రపంచంలోని అతిపెద్ద, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో మన సంబంధాలకు సంబంధించిన క్షేత్ర స్థాయి వాస్తవికతను పరిగణనలోకి తీసుకోవలసివుంటుంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని వ్యవస్థీకృత, ఇతర దీర్ఘకాలిక బలహీనతలను ముందుగానే పరిష్కరించుకోవాలి. మోడీ, సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా అంతా సవ్యంగానే ఉందని చెప్పే ఆయన అధికారగణం 2047 నాటి వికసిత్ భారత్ గురించి మాట్లాడటం మానేసి, ముసురుకుంటున్న తుఫాను ముప్పు నుండి ఆర్థిక వ్యవస్థను దూరంగా నడిపించాల్సిన తక్షణ అవసరంపై దృష్టి పెట్టాలి.
ఎంకే వేణు
అనువాదం : నెల్లూరు నరసింహారావు