
వివిధ దేశాల భవిష్యత్తును తమగుప్పెట్లో పెట్టుకోవాలని శక్తివంతులైన రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారు.
చరిత్ర అంతం, ఆఖరి మనుషులు అనే శీర్షికలతో 1992లో ఫ్రాన్సిస్ ఫుకుయామా రాసిన రెండు పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశాలు అయ్యాయి. ఈ రచనలలో ఫుకుయామా సోవియట్ రష్యా పతనాన్ని సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశారు. ప్రపంచం శాశ్వతంగా ఉదారవాద ప్రజాస్వామ్యం నీడన శరణుజొచ్చిందని తీర్మానించారు.
2025లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన సాహసవంతులైన సిద్ధాంతకర్తలు ఎవరో ఒకరు ప్రపంచం నియంతల బారిన పడిందని తీర్మానించినా తీర్మానించవచ్చు. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మేధావులకు వచ్చే ఊపుతాపులు ఇలాగే ఉంటాయి. ఒక్కోసారి ఎదురయ్యే కొత్త కొత్త ఉత్పాతాలు చూసిన తర్వాత మేధావులు కూడా మూర్ఖుల కంటే దారుణమైన ఆలోచనలు చేస్తారు.
డోనాల్డ్ ట్రంప్ – ప్రాచీన ప్రజాస్వామిక దేశం..
అధికారం చేతికి వచ్చిన తొలి రోజు నుంచి తాను నియంతనేనని గత ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న డోనాల్డ్ ట్రంప్ తన మాట మీద నిలబడ్డారు.
రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు, చేపట్టిన చర్యలు పరిశీలిస్తే తనను తాను మళ్లీ పుట్టిన 14వ లూయీ బోనపార్టే అనుకుంటున్నారని చెప్పటానికి సంకోచించనవసరం లేదు. ప్రపంచంలో అత్యధిక కాలం ఒక దేశాన్ని పరిపాలించిన నియంత ఎవరైనా ఉన్నారంటే అది 14వ లూయీ బోనపార్టే మాత్రమే. “నేనే రాజ్యం, రాజ్యమే నేను” అని చెప్పుకుంది కూడా 14వ లూయీ బోనపార్టే మాత్రమే.
ట్రంప్ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలన్నిటికి కారణం ఒకటే అమెరికాను మళ్ళీ అగ్రర్రాజ్యంగా నిలబెట్టమేనని ఆయన శ్రేణులు విశ్వసించవచ్చు.
ఈ నినాదమే వివిధ దేశాలలో తరతమ స్థాయిలలో వినిపిస్తోంది. నినాదాలు ఎలా ఉన్నా ఆచరణలో మాత్రం నాయకులు వారి అనుచరులు ఎక్కడలేని సంపద పోగేసుకుంటున్నారు. దేవుళ్ళు అయిపోతున్నారు.
బహుశా అందుకే కాబోలు 2020లో చట్టబద్ధంగా జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కూడా ఏకంగా తన ప్రైవేట్ సైన్యాలతో అమెరికా అధ్యక్ష భవనాన్ని ట్రంప్ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటనను కొంతకాలం వాయిదా వేయించ గలిగారు.
కానీ అదే మనిషి తీసుకుంటున్న విధానాలకు నిరసనగా లాస్ఏంజెల్స్లో సాధారణ ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, నేషనల్ గార్డ్ వంటి సాయుధ బలగాలతో నిరసన ప్రాంతాన్ని మోహరించి ఆ నిరసన శిబిరాన్ని నేలమట్టం చేయడానికి పూనుకున్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఇచ్చిందే అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ. ఇదే మొదటి సవరణ సాధన ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా గ్యారెంటీ చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈమధ్య రాజ్యాంగ సంరక్షకుడు మీరేనా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “నాకు తెలియదు మా లాయర్ని కనుక్కొని చెప్తాను” అని ట్రంప్ నిసిగ్గుగా ప్రకటించారు.
ఉగ్రవాద విషయంలో కూడా ఇలాగే స్పందించారు. సీమాంతర ఉగ్రవాదం వలన పాకిస్తాన్ కంటే భారతదేశం ఎక్కువగా నష్టపోయిందన్న వాస్తవాన్ని గుర్తించటానికి ట్రంప్ సిద్దంగా లేరు. ఈ మధ్యనే పాకిస్తాన్ సైనిక జనరల్ అమెరికాలో పర్యటిస్తూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ నిస్సందేహంగా భాగస్వామి అని ప్రకటించారు. అటువంటి ప్రకటనలు చూసిన తర్వాత నవ్వుకోకుండా ఎలా ఉండగలం.
ఒకప్పుడు ఉగ్రవాదిగా అమెరికాచే పిలవబడ్డ సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షారాను నేడు ట్రంప్ ఆహ్వానం పలికి మరీ ఆలింగనం చేసుకోవటాన్ని ప్రపంచం విస్మరించిందనుకోవటం పొరపాటు. ఇది ప్రపంచంలో అత్యంత దీర్ఘకాలం ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు పొందిన అమెరికా చేస్తున్న వ్యవహారం.
మనం మన దేశాన్ని ప్రపంచంలోనే అతి విశాలమైన ప్రజాస్వానికి దేశమని చెప్పుకుంటూ ఉంటాం. మన ప్రయోజనాలు కాపాడే విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుకు దిగ్భ్రాంతి చెందుతున్నాము. అమెరికా పదే పదే భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్న తీరు కొత్తేమీ కాదు. ఈ కొత్త లూయిస్ చక్రవర్తికి తమ నాణేలు ఎక్కడ కరగదీస్తున్నారో తెలుసు. ఈ వ్యవహారాలేవీ అమెరికాను తిరిగి అగ్రరాజ్యంగా మార్చటానికి అక్కరకొచ్చేవి కానేకావు.
లోకం తీరు..
ప్రపంచమంతా చూడండి. ఎక్కడైనా రాజ్యాంగబద్ధమైన శాసన ఆధారిత ప్రజాస్వామ్యాలు బతికున్నాయేమో. మహా అయితే బ్రిటన్లో రాజ్యాంగ ఆధారిత నియంతృత్వం బ్రతికుంది. యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు నియంత్రధికారానికి సవాలు విసిరి నిలబడుతున్నాయి.
ఇవన్నీ చూస్తున్నప్పుడు అమెరికాలో అతి కొద్దిమంది ఆకాశానికి ఎత్తుకుంటున్న ట్రంప్ నిరంకుశత్వం వెలుగులో చిన్నా చితకా నియంతలుగా మారాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్ళు కూడా ఆయా దేశాల్లో రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యం, పౌరహక్కుల మీద మితిమీరిన ఉత్సాహంతో దాడులు చేయడానికి సిద్ధం కావచ్చు.
కేవలం ప్రపంచ కుబేరుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడే ప్రయత్నంలో రూపొందుతున్న విధానాలు ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చెంతకు చేరుస్తున్నాయన్న వాస్తవాన్ని కూడా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ సమస్యనైనా అవలీలగా పరిష్కరించగల అద్భుత శక్తి సంపన్నులు, కార్యశూరులు మనకు ఏలికలుగా ఉన్నారు కదా!
ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలాన్ మాస్క్ వైదొలగటం మంచిదే కదాని మురిసిపోకండి. ఇవాళో రేపో రెట్టించిన బలంతో వెనక్కి రాబోతున్నారు.
మనదేశంలోనూ మన ప్రియతమ గౌతం అదానీ ఎలా రోజురోజుకు శక్తివంతుడు అవుతున్నాడో చూడండి.
సహస్ర కుబేరులు అనుసరిస్తున్న దివాలా కోరు దోపిడి విధానాలను తట్టుకొని మళ్లీ మళ్లీ బంగారాన్ని తవ్వి తీసేందుకు అవకాశం ఇచ్చే అంత ఓపిక భూమాతకు, ప్రకృతికి ఉందనుకోవడం పొరపాటు. పరిశ్రమల స్థాయికి చేరిన జాతీయ భద్రత వ్యవహారాలు, సాధారణ ప్రజల గుర్తింపు, గౌరవాలు, సామాజిక న్యాయం వంటి నినాదాలను సహించేందుకు భరించేందుకు సిద్ధంగా లేవు.
ఆకాశవాణి ఎక్కడి నుంచో వినపడుతూనే ఉంటుంది. కాకపోతే మనం ఆశించిన భవిష్యవాణిని వినిపించడానికి కాదు.
బీభత్సంగా దోపిడీకి గురవుతున్న భూమాతే ప్రేతాత్మగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎంత బలహీనమైన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి పాత ప్రభుత్వాలు అమలు చేసుకుంటూ వచ్చిన విధానాలను, చట్టాలను ఏకపక్షంగా ట్రంప్ రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నారు. అర్థవంతమైన అంతర్జాతీయ వేదికలను అర్ధరహితమైన కబుర్లు చెప్పుకునే వేదికలుగా మారుస్తున్నారు. పర్యావరణ సంగతి పక్కన పెట్టి కంపెనీలు కోరుకున్నంత దోచుకుని దాచుకోమని చెప్తున్నారు.
పర్యావరణ దోపిడి ఏ స్థాయిలో ఉందంటే భూమ్మీద మనుషులు మనుగడ సాగించడానికి కావలసిన పరిస్థితులు అంతరించి, రాక్షసబల్లులో రాకాసి అవతారాలో మాత్రమే బ్రతకగల ఒక నూతన ఆటవిక ప్రపంచాన్ని చూడబోతున్నామేమో అనిపిస్తుంది. ట్రంప్ లేదా ఆయన్ను అనుసరిస్తున్న ఆధునిక లూయీ బోనాపార్టేలు ఈ రాక్షసి బల్లులపై కూడా పెత్తనం చేస్తారేమో! మచ్చిక చేసుకుంటారేమో చూడాలి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.