
భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య బీజేపీ శ్రేణులు శనివారం నాడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కరాచి బెకరీకి చెందిన ఒక శాఖలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విధ్వంసం సృష్టించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ బేకరీ యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆందోళనాకారులను వదిలి వేశారు.
న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం మే 10న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరాచి బేకరీకి చెందిన ఒక శాఖలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు.
నివేదిక ప్రకారం, ఈ ఘటన శంషాబాద్‌లో ఉన్నటువంటి కరాచీ బేకరిలో చోటుచేసుకుంది. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్(ఆర్జీఐ) పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
పోలీసులు తెలిపిన దాని ప్రకారం, ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక ఆందోళన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకుంది. అక్కడ కాషాయ కండువాలు కప్పుకున్న నిరసనకారులు పాకిస్తాన్ జెండా మీద కాళ్లు పెడుతూ ఇంకా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కనబడ్డారు. వీడియో ఫూటేజ్‌లో వాళ్లు సైన్బోర్ట్ మీద లాఠీతో దాడి చేశారు. అందులో ప్రత్యేకించి “కరాచీ” పదాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
“శంషాబాద్‌లోని కరాచీ బేకరీ బయట మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ శ్రేణులు వచ్చారు. వాళ్లు నినాదాలు చేశారు. ఇంకా బేకరీ పేరు మీద వివాదాన్ని రాజేశారు. వాళ్లు సైన్‌బోర్డుకు నష్టం చేయడానికి ప్రయత్నించారు. దీని కంటే ముందు వాళ్లు ఎక్కువ నష్టాన్ని చేశారు. మేము వారిని అదుపులోకి తీసుకున్నాము” అని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ బలరాజు అన్నారు.
అయినప్పటికీ, విధ్వంసం సృష్టించిన ఆందోళనాకారులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వదిలివేశారు. “కరాచీ బేకరి వాళ్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని అనుకోలేదు” అని బాలరాజు తెలియజేశారు.
పదేపదే వివాదాల్లో చారిత్రాత్మక కరాచి బేకరి..
ఈ బేకరీని హైదరాబాద్‌లో 1953లో ప్రతిష్టాత్మకంగా స్థాపించారు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిసారి బేకరి నిరసనలకు కేంద్రంగా ఉంది. ఈ పేరు భారత స్వాతంత్య్రం కంటే ముందు సంస్థాపకుల సొంత ఊరిని ప్రతిబింబిస్తుంది. గడిచిన కొన్ని సంవత్సరాలలో పదేపదే జరిగిన ఘటనల కారణంగా బేకరీ దేశవ్యాప్తంగా తన సేవలను అందించడం ప్రారంభించింది. ఇంకా తమ సంస్థాపకుడి మూలాలకు ప్రతిగా శ్రద్ధాంజలి రూపంలో అదే పేరును కొనసాగిస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, దీని కంటే ముందు బేకరీ యజమాని రాజేశ్ ఇంకా హరీశ్రామ్నాని ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తమకు రక్షణ కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. 2019లో పుల్వామా దాడి నేపథ్యంలో కూడా బేకరిలో విధ్వంసం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా, ఈ చర్యను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వెంకట్ సుభాష్ ఖండించారు. ” ఏ బీజేపీ కార్యకర్త కూడా ఇటువంటి విధ్వంసంలో పాలుపంచుకున్నట్టుగా నాకు సమాచారం లేదు. అయినప్పటికీ, కరాచీ బేకరీలో విధ్వంసం జరిగిందని మాత్రం నాకు సమాచారం అందింది” అని ఆయన సౌత్ పోస్ట్‌కు చెప్పారు.
“కేవలం బేకరీ పేరులో కరాచీ ఉందని ఇలా చేయడం సరైందని నాకు అనిపించడం లేదు. పేరులో కరాచీ ఉన్నంత మాత్రానా ఇది కరాచీకి సంబంధించిందని అర్థం కాదు. బేకరీకి సంబంధించిన అనేక శాఖలు తమ స్టోర్ ముందు గర్వంగా భారతీయ జెండాను ఎగరవేస్తాయి.” ఆయన చెప్పుకొచ్చారు.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.