
చుండూరు పోరాటం ఒక చారిత్రాత్మకమైన దళిత ఉద్యమం. అది భారతదేశంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందింది. చుండూరు పోరాటంలో భాగంగా ఢిల్లి బోట్ క్లబ్లో జరిగిన ఉద్యమం చరిత్రలో మరుపురానిది. ప్రాంతీయం నుంచి జాతీయ స్థాయికి వెళ్లిన మహోద్యమం.
ప్రపంచం ముందుకు అనేక నూత్న ఉద్యమ రూపాలను చుండూరు ఉద్యమ చరిత్ర దర్శింపజేసింది. ఒక గ్రామంలో జరిగిన మారణహోమం ఢిల్లీ బోటు క్లబ్ దాకా ప్రకంపనలను సృష్టించింది. మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ ఉద్యమంలో నిలబడ్డారు. ప్రధానమంత్రితో మూడుసార్లు చర్చలు జరిగాయి. ఎందరో జాతీయ నాయకులు ఈ చర్చలలో భాగస్వాములయ్యారు. అదొక గొప్ప చరిత్ర, ఆ చరిత్ర అనేక ఉద్యమాలకు బాసటగా నిలిచింది. ఆ క్రమాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
చుండూరు పోరాటం మృతవీరుల రక్తదీప్తుల్లో కాంతిమంతమయ్యింది. చుండూరు దళితుల రక్తం ఒక మహోజ్వల ఉద్యమాన్ని సృష్టించింది. భారత దళిత విముక్తి పోరాటం అధికార పీఠాలను కుదిపివేస్తూ సింహగర్జన చేసింది. చుండూరు పోరాటం భారతదేశానికి మరో స్వతంత్ర నినాదాన్నిచ్చింది. పోరాట శిబిరాన్ని, పోరాట రూపాన్ని, పోరాట శక్తిని, దళిత జాతికి రక్త జ్వలనంతో అందించింది. ఆ పోరాటం అధికార పీఠాన్ని కుదిపి వేసింది.
ఉద్యమ నాయకత్వానికి ప్రధాని నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ దర్బారులో దళితుల సమస్య విశ్లేషితమైంది. సీబీఐ ప్రత్యేక కోర్టుతో విచారణ, బాధితులకు పునరావాసంలాంటివి సాధించబడ్డాయి.
చరిత్ర నిర్మాతలు దళితులని ఈ సందర్భం నిరూపించింది. పోరాటాల చరిత్రలో ఎందరో త్యాగమూర్తులు, అక్షరాలకందని ఉజ్వల శక్తులు, రక్తక్షేత్రపు వెలుగులో రగులుతున్నారు. అంతం కాదిది ఆరంభం.
మరో స్వతంత్ర పోరాటం..
చుండూరు మారణహోమం జరిగి ఆగష్టు 6 నాటికి 34 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంలో, అంబేడ్కర్ తాత్త్విక ఉద్యమం సమాజంపై దాని ప్రభావం, ప్రజాస్వామిక దృక్పథంలో భాగంగా చర్చనీయాంశంగా మారింది. భారతదేశ విముక్తికి దేశ వ్యాప్తంగా అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాలు అమలులోకి వచ్చాయి.
ఇకపోతే సంక్షేమం కాదు ముఖ్యం, ఆత్మగౌరవమని దళిత ఉద్యమనేతలు నినదించారు. ‘ప్రత్యేక కోర్టు, సీఐ, ఎస్సై అరెస్ట్ కావించండి గ్రామంలో అడుగిడుతాం’ అని ఒక్క పెట్టున పిడికిళ్ళు బిగించారు. రాజ్య ప్రతినిధులకు ఎదురు తిరిగారు. భాగ్యనగరాన్ని అధిష్ఠించిన రెడ్డి రాజ్యాన్ని అధిగమించారు. ఢిల్లీ కోట గుండెల్లోకి దళిత ఉద్యమ భేరిని వినిపింపజేస్తామని సవాలు విసిరి, ‘ఛలో ఢిల్లీ’ పిలుపునిచ్చారు.
ఆంధ్రా దళిత వీరుల సైన్యంతో రాజకీయ అధికార కుంభం, అగ్రవర్ణ, అధర్మ పీఠం, ఢిల్లీ నగరం కంపించాయి. అంబేడ్కర్ సిద్ధాంత శంఖారావంతో బులుగు, ఎరుపు జెండాల కోలాహలంతో ఢిల్లీ గుండెల్లో ప్రవహిస్తున్న యమునలా ఉత్తుంగతరంగాలై నినాదాలు హోరెత్తించాయి.
అంబేడ్కర్ భవన్లో ఉద్యమ శిబిరం ఆవిర్భవించింది. సిక్కు గురుద్వార్‌పై వెలుగుతున్న స్వర్ణ శిఖరాల స్వాగతాల వెలుగునీడలో దళిత శక్తుల ర్యాలీ, ఆకాశ హర్మ్యాల కాంతిరేఖల్లో వారి నినాదాలు ప్రజ్వలించాయి.
పార్లమెంటు నిలయాభిముఖుడై ‘అంబేడ్కర్’ ఉద్యమ స్ఫూర్తిగా నిలుచున్న ధీరుడు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు రెండు వేల మైళ్ళ నెగళ్ళు దాటి ఢిల్లీ మధ్యంతరాన ఉద్దీప్తమైన విజయ్‌చౌక్ చేరుకున్నారు. అక్కడ పరిభ్రమించి మానవహారం నిర్మించిన మానధనులు, ఆదిభారత నిర్మాతలు, అద్వితీయ త్యాగధనులు, శ్రమైక జీవులు వీరు. లాల్ ఖిలాను కోల్పోయిన దేశాధినేతలు దళితులు లాల్ ఖిలా వైపు కదిలారు. చింతలేదిక ఏనాటికైనా రాజ్యం మాదేనన్నారు.
బోట్‌క్లబ్‌లో నిరసన సెగ..
అది అక్టోబర్ రెండు భారత సామ్రాజ్యవాద రక్త పిపాసులకు ఆయువుపోసిన గాంధీ పుట్టినరోజు. చుండూరు దళితుల గుండె గొంతుకుల నుంచి పతాకలెత్తిన విప్లవ నినాదం, భారత దళిత ఉద్యమానికి మ్రోగిన ఢమురుక నాదం, ప్రథమ స్వతంత్య్ర పోరాటంలో సిపాయిలు పేల్చిన తూటాల సమరనాదం పుత్రవిగత తల్లి, గర్భశోకం ఆక్రోశమై ఆవేదనై సామ్రాజ్యం గుండెల్లో మండిన మంటలా ఢిల్లీని కుదిపిన రోజు.
బోట్‌క్లబ్‌లో ఒక పక్క తికాయత్ రైతు ఉద్యమ ధర్నా, మరోప్రక్క చుండూరు పోరాట శిబిరం. ఢిల్లీ మంచుకు చల్లబడ్డ సూర్యుడు ఆనాటి దళిత వీరుల కన్నుల్లో లాల్ ఖిలాను చూసి గర్వించాడు. బోట్ క్లబ్ పోరాట భూమి అయింది. దళితుడు పోరాట వీరుడయ్యాడు. అంబేడ్కర్ సిద్ధాంత పోరాట భేరికి ఢిల్లీలో భూకంపం జరిగింది. బూటాసింగ్ ఇంటి ముందు బైఠాయించారు. పార్టీలను వదలి జాతి విముక్తి పోరాటంలో భాగస్వాములు కమ్మని దళితశక్తులు పిలుపునిచ్చాయి.
అక్టోబర్ 2న సూర్యుడు అలసి నిద్రించాడు. బాధితులు పిడికెడు బువ్వతో కొండంత ధైర్యంతో నిద్రను జయించారు. అక్టోబర్ 3న దళితుల చరిత్రలో సువర్ణాధ్యాయానికి ఒక పుట కేటాయించబడింది.
ఏకం చేసిన ఉద్యమం..
దళితుల అగ్రనాయక వర్గంలో అగ్రజుడైన పాశ్వానుడు అశ్రుకణాలు రాల్చాడు. ఢిల్లీ ఆకాశ గర్భంలో మేఘగర్జన జరిగింది. పిడుగులుబడిన వార్త ప్రధాని కందింది. పొద్దు వాలేలోపు బూటాసింగ్ వెంకటస్వామి వచ్చారు. పదవులను వదలండని బాధితులు డిమాండ్ చేశారు.
చుండూరు ఉద్యమం ఎన్నో కొత్త అంశాలను భారతదేశంలోకి తీసుకువచ్చింది. అప్పటి రాష్ట్రపతి నూట పదకొండు మంది ఎంపీలకు ఆహ్వానం నిరాకరిస్తే దళిత రాష్ట్రపతి కావాలనే పిలుపు నాడు ఆచరణబద్ధం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఆచరణబద్ధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అయ్యాయి. ఉద్యమం జాతీయ నాయకులందరిని ఏకం చేసింది. ఆచరణాత్మక ఉద్యమంగా ముందుకు నడిచాయి. దళితుల ఆత్మగౌరవ ఉద్యమం ఒక చారిత్రక జాతీయ ఉద్యమంగా మలుపు తిరగడమే గాక రాష్ట్రపతిగా దళితుణ్ణి నియమించాలనే ప్రతిపాదన వరకు వెళ్ళింది.
107 మంది ఎంపీలు ఆనాటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ని కలవడానికి వెళ్ళారు. అప్పుడు ఆయన నిరాకరించగా, దళితుడే రాష్ట్రపతిగా ఉండాలనే వివాదం రాజుకుంది. దీనికి చుండూరు ఉద్యమం ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నిర్వహించింది. ఇది చారిత్రక నిర్వివాదాంశం.
ఒక గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఉద్యమం వెళ్లడంలో రామ్‌విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అటాలే. అరుణ్కాంబ్లే, దళిత్ ఏలుమలై, సీఆర్దాస్(కేరళ), భగవాన్‌దాస్ వంటి ప్రముఖ దళిత ఉద్యమ కారులతో పాటు ఢిల్లీ బోట్ క్లబ్లో చుండూరు బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడిన వీపీ సింగ్, శరద్ పవార్, వెంకటస్వామి, బూటాసింగ్ వంటి వివిధ పార్టీల ప్రతినిధులు ఉద్యమ విస్తృతికి దోహదకారులయ్యారు. ముఖ్యంగా ఆనాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుతో చర్చల సందర్భంలో బూటాసింగ్ మధ్యవర్తిత్వం నడిపారు.
పలు డిమాండ్లు..
ఆనాడు జేఎన్‌యూలో దళిత స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఈ చర్చల్లో ఎంతో చురుకుగా పనిచేశారు. ఢిల్లీలో అంబేడ్కర్ భవన్ నుంచి రోజూ బోట్ క్లబ్ వరకు పదిరోజులు జరిగిన ర్యాలీలు భారతదేశాన్నే కుదిపి వేశాయి. ముఖ్యంగా పీవీ నర్సింహారావు ముందు పెట్టిన డిమాండ్స్‌లో ప్రధానమైంది. చుండూరులో ప్రత్యేక కోర్టు. ఆ డిమాండ్‌ని ఒప్పుకోవడానికి మొత్తం పార్లమెంట్ పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావల్సివచ్చింది. ఆరోజు చేసిన ఉద్యమ ఫలితమే ఈనాడు చుండూరులో కోర్టు.
పీవీ నర్సింహారావు ముందు పెట్టిన రెండవ ప్రధానమైన డిమాండ్ రెసిడెన్షియల్ కాలేజి, ఈ కాలేజ్ రూపొందించిన తరువాత చుట్టుప్రక్కలకు చెందిన సుమారు 50 గ్రామాల దళిత విద్యార్థులు విద్యావంతులు అయ్యారు. అంతేకాకుండా 50% సీట్లు చుండూరు బాధితులకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్యకలిగిన దళిత వాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొందింది. ఈ డిమాండ్‌ని మొట్టమొదట జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది. పీవీ నర్సింహారావు అంగీకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు.
నంద్యాల బై ఎలక్షన్లో పీవీ నర్సింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంలో దళిత ఉద్యమం కీలక పాత్ర పోషించింది. చుండూరు మారణహోమంలో భర్తలను కోల్పోయిన భార్యల్ని ఆయన మీద పోటీగా నిలబెట్టడారు. ఈ విధంగా నంద్యాలకు దళిత ఉద్యమం చేరుకున్నాకే ఆయన చర్చలకు కబురు పంపారు. ఈ చర్చల్లో ఆయన రెసిడెన్సియల్ కాలేజిని అంగీకరించారు. అయితే ఇప్పటి వరకు దాన్ని హైస్కూలు స్థాయిలో అంబేడ్కర్ భవన్లో నడిపిస్తున్నారు. దానికి సంబంధించిన భూమిని కాని భవనాలు కాని ఇంకా నిర్మించలేదు. దానికోసం కూడా దళిత ఉద్యమం పోరాటం చేస్తూనే వుంది.
ఆనాడు దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేయడానికి కోరిన మరో డిమాండ్ ప్రతి ఇంటికి ఎకరం భూమి. దానికి ఆనాడు జనార్దన్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించి 450 కుటుంబాలకు అర ఎకరం చొప్పున 225 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇది భూమి కొనుగోలు పథకంలోనే ఎక్కువగా పంపిణీ చేశారు. ఇంకా రావల్సిన కుటుంబాలు 70కు పైగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన వారికి భూమి ఇవ్వడానికి నిరాకరించింది. అందులో అప్పుడు 65 మందికి సామూహిక వివాహాలు ఒకే వేదిక మీద చేశాము. అప్పుడున్న కలెక్టర్ నాగార్జున వీరందరికి ఇళ్ళు, భూమి ఇస్తామని ఒప్పుకున్నారు.
ఈ పథ్యంలోనే పార్లమెంటు ముందు పెట్టిన డిమాండ్ చుండూరులో 10వ తరగతి పాసైన వారందరికి ఉద్యోగ వసతి. దీన్ని వీపీ సింగ్ సపోర్టు చేశారు. ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఒప్పుకుంది. చనిపోయిన వారి కుటుంబాలతో కలిపి 40 మందికి ఉద్యోగాలు సాధించాము. ఇంకా ఐదుగురికి ఉద్యోగాలు రావల్సివుంది. భారతదేశంలోనే ఒకే పల్లెలో ఇన్ని ఉద్యోగాలు ఏ ఉద్యమంలోను రాలేదు. అంబేడ్కర్ జ్యోతి రథయాత్ర సందర్భంగా ఈ విషయాన్ని రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. అంబేడ్కర్ రథయాత్ర చుండూరులో ప్రారంభమై ఢిల్లీకి చేరింది. ఇది కూడా దళిత ఉద్యమ విజయమే. ఆనాటి కలెక్టర్ నాగార్జున చుండూరు ఉద్యమ డిమాండ్స్‌లో పెక్కింటిని జిల్లా పరిధిలో వుండే అన్ని డిపార్టుమెంట్స్ నుంచి నెరవేర్చారు. ముఖ్యంగా గృహ వసతి 450 కుటుంబాలకు కల్పించారు.
చుండూరు ఉద్యమంలో తొమ్మిది నెలలు తాత్విక అంశం ప్రధానమైంది. కారంచేడు ఉద్యమంలో బాధితుల కాలనీ చీరాలలో నిర్మించటం జరిగింది. వాళ్ళు తమ ఊరిని వదిలిపెట్టామనే బాధను అనేక సార్లు వ్యక్తం చేశారు. అయితే చుండూరులో ఆ గ్రామానికే తెనాలి చర్చిలో తలదాచుకుంటున్న వారిని తరలించడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశం. తమ గ్రామంలోనే తాము నిలదొక్కుకోవాలనేది. అందుకే మృతవీరుల స్మృత్యర్థం చుండూరులోనే రక్తక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. చుండూరులో చనిపోయిన వారి భార్యలకు ఆత్మస్థైర్యాన్ని, జీవన భృతిని, తన పిల్లల్ని పెంచుకోగలిగే సామాజిక వాతావరణాన్ని దళిత ఉద్యమం కల్పిస్తోంది.
ఒక యుక్తవయస్సులో వున్నటువంటి దళిత స్త్రీ తన భర్త చనిపోతేను ఒంటరై పిల్లల్ని బ్రతికించుకోలేని పరిస్థితిలో వుండకూడదనే దళిత ఉద్యమం సునిశిత మనస్సుతో కాపాడుతూ వచ్చింది. ఉద్యమానికి వుండే ఆ సున్నితత్వం, ఆ నిర్మలత్వం, ఆ మానవత్వం, ఆ ఆదరణ బాధితుల్లో కూడా ప్రోదిచేయాలనేదే ఉద్యమ లక్ష్యం. అందువల్లే వారి పిల్లల్ని చదివించడానికి రెసిడెన్షియల్ స్కూలు ఎంతో ఉపయోగపడ్డాయి.
పోరాటంలో ఎంతమంది కలిసివచ్చినా బాధితులు జాతీయ స్థాయి వరకు డిమాండ్స్ నెరవేరేవరకు నిలబడటం ఎంతో గొప్ప విషయం. లీగల్ పోరాటంలో కూడా బాధితులు సుప్రీం కోర్టు వరకు తీసుకువెళ్ళగల్గారు, నిలబడగల్గారు. చుండూరు నడిబొడ్డులో నిర్మించిన రక్త క్షేత్రం రుధిర క్షేత్రానికి కొనసాగింది. ఎందుకంటే చనిపోయినవారు మృతవీరులు వారు మరో స్వాతంత్ర పోరాటంలో మృతవీరులు. ఈ రెండు క్షేత్రాలు దళితుల ఐక్యతకు నిదర్శనాలు కారంచెడు, చుండూరు, పిప్పర, నీరుకొండ, లక్ష్మిపేట, బండ్లపల్లి వరకు దళితుల ఐక్యతతోనే ఉద్యమం సాగింది.
కారంచేడు, చుండూరు మృత వీరులు దళితుల ఐక్యతకు పిలుపునిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమము కాక సామాజిక సాంస్కృతిక తాత్విక కళా జీవన రంగాలన్నిటిలో కారంచేడు నుంచి లక్ష్మిపేట వరకు జరిగిన ఉద్యమాలు అన్ని కూడా దళితుల ఐక్యత పోరాటాన్ని నినదిస్తున్నాయి. కానీ అంతిమంగా రాజ్యాధికార భావనా వీరి ఐక్యతతో ముడిపడివుంది.
హైదరాబాద్‌లోను విజయవాడలోను నిలువు ఎత్తుగా నిలబడిన అంబేడ్కర్ విగ్రహాలు భారతదేశ వ్యాప్తంగా వున్న మహాత్మాఫూలే పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమాలు అన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల ఐక్యతను నిర్దేశిస్తున్నాయి. మరో స్వాతంత్ర పోరాటంలో మృత వీరులు అయిన దళితులు, బహుజనులు, స్త్రీలు మానవహక్కుల పోరాటాన్ని విజయవంతం చేయటానికి పిలుపునిస్తుంది.
సంఘటనల నుంచి ఉద్యమాలు ఆవిర్భావించాక వాటి నుంచి సిద్ధాంతాలు ఆవిర్భవిస్తాయి. కొత్త కొత్త పోరాట రూపాలు మన ముందుకు వస్తాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళ్ళడం మన చారిత్రక బాధ్యత. అనేక పునరుద్ధరణ వాదాలు, విభజన వాదాలు ఆ తరువాత వచ్చాయి. దళిత ఉద్యమ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం పాలక వర్గాలు చేస్తూనే వస్తున్నాయి. కాని అనేక రూపాల్లో వీరి అంతర్గత శక్తి పెరుగుతూనే వస్తుంది. ప్రత్యామ్నాయ జీవన విధానం, రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణ స్ఫూర్తి రాజ్యాంగ హక్కుల పోరాటం అటు పార్లమెంటులోను బయట జరుగుతూనే వస్తున్నాయి.
మనం గమనిస్తే చరిత్ర గమనంలో మార్పు అనివార్యం అని తెలుస్తుంది . చరిత్ర పరిణామం అనివార్యం. ఆక్రందనలు, ఆవేదనలు, అణచివేతలు, నిరంతరం కొనసాగవు. ప్రజలు ఎప్పటికప్పుడు తననుతాను సమర సన్నాహులుగా ప్రజాస్వామ్య లౌకిక వాదులుగా తీర్చిదిద్దుకుంటూ వుంటారు.
చుండూరు పోరాటం మొత్తం అంబేడ్కర్, ఫూలే ఆలోచనలతో నడిచింది. ఎస్సీ, ఎస్టీ, బిసీల రాజ్యాధికారం మీద ఆచరణ మీద కార్యక్రమాల మీద పార్లమెంటులో బయట అన్ని పార్టీలపై చుండూరు ఉద్యమ ప్రభావం వుంది. అంతిమంగా దళిత బహుజన రాజ్యాధికారానికి చుండూరు పోరాటం చారిత్రకం అవుతుంది.
చరిత్రను ఎవ్వరం మార్చలేము. ప్రజలే చరిత్ర నిర్మాతలు. దళిత, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు సెక్యులరిస్టులు ఐక్యతా పోరాటాలకు ఇది ఒక చారిత్రక ప్రేరణ. ఫూలే అంబేడ్కర్ ఆలోచన మార్గంలోనే చారిత్రక పోరాటాలు చేయవలసిన సందర్భం ఇది.
డాక్టర్ కత్తి పద్మారావు, 9849741695
(వ్యాస రచయిత అంబేడ్క్రర్ రీసెర్చ్ సెంటర్ సభ్యులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.