
నిజం లోపలినుంచి బయటిదాకా నా హృదయం ఉడికి పోతున్నది!
ఎప్పటిలాగే గుంపు దాన్ని అణిచి వేసిందనుకోండి!
ఎక్కడెక్కడి జ్వాలల్ని ఆర్పుకుంటూ వెళ్ళను చెప్పండి?
చూడండి శవాలు ఎలా గంగలో తేలుతూ ఉన్నాయో ?
శవాల్ని అనాథల్లా వదిలేసే అలవాటు చేసుకోమని
నా మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటాను.
కానీ ఈ నిలకడ లేని మనసు ఊరుకోదు కదా!
ఎంతకని ఈ అల్లకల్లోలపు కెరటాలను వేడుకోవాలి చెప్పు?
అవి పాదాల కింది ఇసుకను ఈడ్చుకుని పోతూనే ఉంటాయి.
అలాంటప్పుడు ..తడబడకుండా స్థాణువులా స్థిరంగా నిలబడ్డం నేర్చుకోమని నేను పాదాలకి చెప్పాను !
చూడూ..వాళ్ళ ప్రకారం నువ్వు బ్రహ్మ దేవుడి పాదాల నుంచి పుట్టావు మరి !
వామనుడి పాదాలు నిన్ను ఏడు పాతాళ లోకాల లోతుల్లోకి నిలువునా భూమిలో పాతరవేశాయి!
నీ శక్తినంతా ఇముడ్చుకుని లే..నిలబడు ఇప్పుడు!
దండన భయాన్ని విసిరి పడెయ్యి..లే !
పాదాలే తిరుగుబాటు చేస్తే ఇక దండన ఏ పాటి చెప్పు?
తిరగబడే పాదాలు నిన్ను తీసుకెళ్లిన చోటికల్లా..దండన కూడా వెన్నాడుతూ ఉంటుందన్న పాఠం నేర్చుకో !
అయినా సరే.
పద..వామనుడిని మరుగుదొడ్డిలో పాతాల్సి ఉంది !
గుర్తు పెట్టుకో..మన పాదాల నుంచే ఇక ఆ ఈశ్వరుడు పుట్టాలి !
మన శిరస్సు నుంచి సమస్త మానవాళిని విముక్తి చేసే రాజ్యాంగం స్థాపించ బడాలి !
అందుకే..లే ..నిలబడు ! పాదాలను ముందుకే నడిపించు!
శరణ్ కుమార్ లింబాలే రాసిన మరాఠీ కవిత్వాన్ని హిందీలోకి రీనా త్యాగి అనువదించారు. తెలుగు అనువాదం గీతాంజలి చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.