
గతంలో ఉన్న సంబంధాలకు భిన్నంగా, నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా భారత గుత్త పెట్టుబడి రాజ్యాన్ని నియంత్రిస్తుంది. ఒకప్పుడు పెట్టుబడి జాతీయ స్వభావం కలిగి రాజ్యానికి లోబడి ఉండేది. ఇప్పుడు రాజ్యం మీద ఆధిపత్యం చెలాయిస్తూ, రాజ్యాన్ని అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలు ఈడేర్చుకోవడానికి వాడుకుంటుంది. దీని మూలంగా దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది.
భారతదేశ అంతర్గత, అంతర్జాతీయ రాజకీయాలు రెండింటిని ప్రైవేటు పెట్టుబడి అలవిమాలిన రీతిలో ప్రభావితం చేస్తున్నదనే విమర్శ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇందుకు ఉదాహరణనే ఆదానీ, అంబానీల పేర్లు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితికి కొంతమంది వ్యక్తులను బాధ్యులుగా చూపుతున్నామంటే మనం రాజ్యానికి- పెట్టుబడికి మధ్య ఉండే సంబంధాలు, జాతీయ ప్రయోజనాలను లేదా రాజ్య ప్రయోజనాలను పెట్టుబడే నిర్వచిస్తున్న తీరువంటి వ్యవస్థాగతమైన అంశాలను విస్మరిస్తున్నట్లే.
రాజ్యం ప్రైవేటు కార్పోరేట్ల వ్యాపార ప్రయోజనాలను ఈడేర్చే దళారీగా తయారవడం అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టకు మచ్చ కాదా? అభివృద్ధి చెందుతున్న దేశాలకు మన భారతదేశం నాయకత్వం వహిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న దశలో ప్రైవేటు విధానాలకు నష్టం కాదా? అందుకే మనం వ్యక్తుల మీద కంటే మిగిలిన వారి కన్నా ఒక గుప్పెడు మంది పెట్టుబడిదారులే రాజకీయంగా అనుచిత లబ్ధిపొందడానికి గల కారణాలను విశ్లేషించడం ముఖ్యమని గుర్తించాలి.
రాజ్యం ప్రైవేటు పెట్టుబడితో ఇంత లోతుగా, గాఢంగా భాగస్వామ్యం అవ్వడానికి గల కారణాలు ఏంటి? అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను పునఃపరిశీలన చెయ్యాలి. ‘భారత విదేశాంగ విధానం రాజకీయ అర్థశాస్త్రం’ పేరిట రాధారామన్ చక్రవర్తి ఓ పుస్తకాన్ని రాశారు. అందులో వలసపాలనా కాలంలో భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీతో అంటుకట్టబడి ఉన్నాయని తెలుస్తుంది. ఇందుకు తగిన ప్రధానమైన సంస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. భారత ప్రైవేటు పెట్టుబడి ప్రయోజనాలు అనివార్యంగా సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనాలకు అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. ఇమ్మాన్యుయేల్ వాలెస్టైన్ చెప్పినట్లు వలస నిర్మాణ వ్యవస్థలో భారత ప్రైవేటు పెట్టుబడి బయటి అంచులకే పరిమితమై(కేంద్ర ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి) అభివృద్ధికి నోచుకోని దుస్థితిలో ఉంది.
కాబట్టి రాజకీయ స్వాతంత్య్రం లభిస్తే అంతర్జాతీయ పెట్టుబడి నుండి దేశీయపెట్టుబడికి రక్షణ కల్పించుకోవాలనే భారత పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరుతుంది. 1942 కాలంలోనే భారత వాణిజ్య వర్గాల సమాఖ్య ‘ఫిక్కీ’(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్) అధ్యక్షులు జీఎల్ మెహతా అయితే ‘సంపూర్ణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఆర్థిక స్వాతంత్రానికి పూచీ పడని రాజకీయ అర్థశాస్త్రానికి విలువ కానీ, ప్రాముఖ్యత కానీ లేదు’ అని ప్రకటించారు. అంతేకాదు ‘భారతదేశ కీలక ఆర్థిక ప్రయోజనాలను బ్రిటన్ ప్రయోజనాలకు లోబడి ఉండేలా చేశారు.’ అని కూడా స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేనాటికి శతాబ్దాల తరబడి వలసపాలన మూలంగా దేశం నిష్టదరిద్రంలో కూరుకుపోయి ఉంది. విదేశీ పెట్టుబడులు సామ్రాజ్యవాదాన్ని కొత్తకొత్త రూపాల్లో దొడ్డిదోవన తీసుకువచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉందనే భయం ఉండేది. అలానే బ్రెట్టల్వుడ్స్ చర్చలలో బ్రిటన్‌తో భారతదేశపు స్టెర్లింగ్ నిల్వల పరిష్కారం కోసం జరిగిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయి. దీంతో భారత విధాన రూపకర్తలను ఆందోళనకు గురయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో విదేశీ మారక ద్రవ్యం లోటు కొనసాగింది. అందుకే అప్పటి ప్రభుత్వాలు రెండు వ్యూహాలను అనుసరించాయి. అంతర్జాతీయ పెట్టుబడుల మీద నియంత్రణలు కొనసాగిస్తూ దిగుమతులకు ప్రత్యామ్నాయాలు రూపొందించి పెంపొందించుకోవడం. అలానే విదేశీ సాయం(ఎయిడ్) మీద ఎక్కువ ఆధారపడడంటాంటి వాటిని ఎంచుకున్నాయి.
అంతర్జాతీయంగా గణనీయమైన పాత్ర పోషించాలనే ఆకాంక్షలకు, దయనీయమైన ఆర్థిక వ్యవస్థకు మధ్య భౌతిక అంతరం నెహ్రు తదితర విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించింది. దేశ పారిశ్రామిక పునాదిని విస్తృతం చేసుకుని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇందుకు రాజ్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంబించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రాజ్యాన్ని ఆర్థికవ్యవస్థ రారాజునే నిలబెట్టింది. కీలకమైన రంగాలు అన్నీ రాజ్యం నియంత్రణలో ఉన్నాయి. కొన్ని రంగాలలోకి ప్రైవేటు పెట్టుబడిని అనుమతించారు.
అయితే, నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలనూ ప్రైవేటు పెట్టుబడులకు బార్లా తెరిచేశారు. దీంతో 1991కి ముందు కాలమంతా రాజ్యం అనుచిత జోక్యం వల్ల అంతులేని ఆధిపత్యం నడిచిందని, దానివల్ల ఆశించినంత ఆర్థిక పురోభివృద్ధి జరగలేదనే తప్పుడు ప్రచారం ఎక్కువ అయింది. చరిత్ర వక్రీకరణ పరిపాటిగా మారింది. రాజ్యం నియంత్రణ మూలంగా ప్రైవేటురంగం ఆశించినంత లాభాలు పోగేసుకోలేకపోయిందన్న ఆక్రోశం వల్ల ఇలాంటి కువ్యాఖ్యానాలు బయల్దేరాయి. కానీ వాస్తవానికి రాజ్యం జోక్యం మూలంగానే దేశ పారిశ్రామికీకరణ వేగవంతం అయ్యింది. ఎన్ని పరిమితులున్నా భారీ పరిశ్రమల స్థాపన, మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వపెట్టుబడులు పెట్టడం మూలంగానే ప్రైవేటు రంగం ఉత్పత్తి పెంచుకోవడానికి వీలయ్యింది.
రాజ్యం జోక్యం చేసుకోకపోయి ఉంటే ప్రైవేటు పెట్టుబడి, దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తట్టుకుని నిలబడలేకపోయి ఉండేవి. ఒకవైపు ప్రభుత్వం దేశంలో పరిశ్రమలను విస్తరించింది. మరోవైపు రష్యా తదితర సోషలిస్టు దేశాలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పింది. అంతేకాకుండా అలీన దేశాల కూటమికి నాయకత్వం వహించింది. ఇటువంటి సానుకూలతలరీత్యా ద్వితీయ, తృతీయ దేశాలకు ఎగుమతులు చెయ్యడంతో భారతదేశం అగ్రగామిగా నిలిచింది.
మన విదేశాంగ విధానంతో మన దేశప్రయోజనాలు ముడిపడి ఉండేవి. 1964- 67 మధ్యకాలంలో జెనీవాలో కెనడీ విడత ‘గాట్’ ఒప్పంద చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ‘ఫిక్కి’ ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపింది.
వలసపాలన నుంచి విముక్తిపొందిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడికి ఒక ప్రత్యేకమైన స్థాయి సమకూరడానికి, 1991కి ముందు వరకు ఉన్న సంస్థాగత సానుకూలతలు ఎంతగానో దోహదం చేశాయి. వలసపాలన నుంచి విముక్తి చెందిన దేశాలతో జాతీయ బూర్జువా వర్గం సర్వసాధారణంగా కీలక సామ్రాజ్యవాద శక్తులతో సంబంధాలు నెరుపుతూ, వాటిపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఒకప్పటి వలసదేశంలో ఉత్పాదక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి బదులు కౌలు ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడుతుందని ఫ్రారిగ్ ఫానన్ అంటాడు.
అయితే, ఆ కాలపు భారతీయ పెట్టుబడిదారీ వర్గంలో అంతర్జాతీయ గుత్త పెట్టుబడికి దళారీగా వ్యవహరించాలనే ధోరణి ప్రస్ఫుటంగా కానరాదని చక్రవర్తి అంటాడు. భారతీయ పెట్టుబడివారీ వర్గం మౌళిక సౌకర్యాలు, ఉత్పత్తికి అవసరమయ్యే వనరులు, దీర్ఘకాలిక రుణసౌకర్యాల కోసం రాజ్యంతో షరీకయ్యే ధోరణితో వ్యవహరించిందని వివరించాడు. ఆ రకంగా దేశీయపెట్టుబడి ప్రభుత్వ రంగానిదా, ప్రైవేటు రంగానిదా అన్న తేడా లేకుండా భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో జాతీయ అస్థిత్వాన్ని సంతరించుకున్నదని సైద్ధాంతికపరంగా వాదించవచ్చు.
కానీ ఈ సూత్రీకరణ కాలానుగుణంగా మార్పులకు లోనవుతూ వచ్చింది. గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా రాజ్యం జోక్యం చేసుకోవడం, వాణిజ్యం మీద నియంత్రణలు కొనసాగించారు. దీని మీద అప్పటికి ఒక మేరకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దానికి తోడు ఇవాళ ప్రైవేటు పరిశ్రమ బలపడడంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారిన లైసెన్స్‌ల రాజ్యం అంటూ గతాన్ని తూర్పారబట్టే వైఖరి జోరందుకుంది.
రాజ్యానికి, పెట్టుబడికి మధ్య చిక్కులు ఉన్నట్లు పైకి కనబడినా దేశ పారిశ్రామికరంగం నయా ఉదారవాదం పట్ల ఓ కొట్టుకులాడిపోలేదు. 1993లో ప్రముఖ దేశీయ పారిశ్రామికవేత్తలు కొందరు బాంబే క్లబ్‌గా చిరపరిచితమైనవారు దీని మీద స్పందించారు. మార్కెట్ అనుకూల విధానపరమైన నిర్ణయాలు తీసుకునేముందు తగిన జాగ్రత్తలు వహించాలని నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్‌ను హెచ్చరించారు. అయితే, దేశీయ పరిశ్రమలలో కొన్ని అంతర్జాతీయ పోటీకి తట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా నయా ఉదారవాద విధానాలకు బలమైన మద్దతుగా నిలబడ్డాయి. సరళీకరణమూలంగా విదేశీపెట్టుబడులకు అవకాశం ఏర్పడడం, పెట్టుబడుల మీద నియంత్రణలు సడలడం, కొత్త మార్కెట్లలో ఎగుమతులకు అవకాశం కలగడంతో దేశీయ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్యానికి, పెట్టుబడికి మధ్య ఉన్న మౌళిక సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.
ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే రాజ్యం ఒకప్పుడు బలమైన ఆధిపత్య స్థానంలో ఉన్నదని మనకు స్పష్టమవుతుంది. అయితే, క్రమంగా రాజ్యం తన ఆధిపత్యాన్ని భావజాలపరంగానూ, భౌతికంగానూ, కోల్పోతూ వచ్చింది. మీడియా, టీవీ ఛానళ్లు, వార్తా పత్రికారంగంలో ప్రైవేటు పెట్టుబడి పెద్దఎత్తున చొరబడిరది. దీంతో ఈ రంగాలు ఆర్థిక సంస్కరణలకు వంతపాటగాళ్లుగా తయారయ్యాయి. కార్మికుల, రైతుల సమస్యలకు వార్తా పత్రికలలో చోటు లేకుండా పోయింది. బడ్జెట్ మంచి చెడులు కార్పొరేట్ అధిపతులే నిర్ణయించసాగారు. స్టాక్ మార్కెట్లో సంపద ఆధారంగా భారతీయ డాలర్ శతకోటీశ్వరుల గణన మొదలయ్యింది. 1999- 2000వ సంవత్సరంలో డాట్ కామ్ల విజృంభణతో మొదలుపెట్టి స్టాక్‌మార్కెట్ పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నూతన కొలమానంగా మారింది. ఈ రోజుకీ అదే కొనసాగుతుంది.
మార్కెట్ అనుకూల ప్రభుత్వ విధానాలకు మాత్రమే ‘సంస్కరణలు’ అన్న పద ప్రయోగం పరిమితం అయ్యింది. సంక్షేమ విధానాలను ప్రజాకర్షక విధానాలుగా ఈసడించడం, కార్మిక- పర్యావరణ నియంత్రణలు ఆర్థికాభివృద్ధిని కుంటుపరుస్తున్నాయని తోసిపుచ్చడం పరిపాటిగా మారింది. ఆఖరికి విదేశాంగ విధానాన్ని కూడా ఆ చారిత్రకమైన నయా ఉదారవాద చట్రంతో అంచనా వెయ్యడం ఫ్యాషన్‌గా మారింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించారు. సోషలిస్టు రష్యాతో సన్నిహిత సంబంధాలను నెరపారు. ప్రస్తుతం వీటిని చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాతో సన్నిహిత సంబంధాలను దేశం పెంపొందిచుకుంటుంది. ఇందులో మంచి చెడులను వివేచించకుండా గంపగుత్తగా ఈ విదేశాంగ విధానం మనకు లాయకీ అయినదిగా ప్రచారం చెయ్యడం బలంగా సాగుతుంది.
నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన ఈ అంగీకారోత్పత్తి ప్రచారానికి తోడుగా ప్రైవేటుపెట్టుబడి అలవిమాలిన రీతిలో అభివృద్ధి చెందాయి. దీంతో రాజ్యానికి పెట్టుబడికి మధ్య ఉన్న బలాబలాల పొందికలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పారిశ్రామికరంగం ప్రభుత్వ విధివిధానాలకు లోబడి ఉన్నదా లేదాని రాజ్యం పర్యవేక్షించేది. ఓటు ఇవాళ రాజ్యం ప్రైవేటు పారిశ్రామికరంగ అవసరాలకు అనుగుణంగా నడుస్తుందా లేదా అనే అజమాయిషీ పెరిగింది. మన్మోహన్సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వ చివరి రెండేళ్ల పరిపాలనలో ఈ రకమైన ధోరణులు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
2004 నుంచి 2009 వరకు సాగిన యూపీఏ-1 పరిపాలన కంటే యూపీఏ-2 ప్రభుత్వం మరింత మార్కెట్ అనుకూల విధానాలను అవలంభించిది. మావోయిస్టు తీవ్రవాదాన్ని అణిచివేసే పేరిట సైనిక చర్యలు చేపట్టింది. అయినా కూడా మన్మోహన్సింగ్ ప్రభుత్వం(2009-14) ‘విధానపరమైన పక్షవాతానికి’(పాలసీ పెరాలసిస్) గురయ్యిందని ప్రధాన స్రవంతి మీడియా పెద్దపెట్టున ప్రచారం చేసింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు, ఒక తరగతి మేధావి వర్గం యూపీఏ-2 ప్రభుత్వం ‘ప్రజాకర్షక విధానాల’ వైపు మొగ్గుచూపుతుందని దెప్పిపొడవడం ఎక్కువ చేశాయి. ‘మౌళిక సామాజిక సంక్షేమ పథకాలు’ కూడా వారి దృష్టిలో ‘ప్రజాకర్షక విధానాలు’ అయ్యాయి. ఈ నేపథ్యంలో అవినీతిని అంతమొందిస్తానని, అనిశ్చితికి తావియ్యనని, నియంత్రణలు సడలిస్తానన్న వాగ్ధానాలతో నరేంద్రమోదీ నూతన ఆర్థిక శకపురుషుడిగా అవతరించాడు.
గత పదేళ్లలో వాగ్ధానం తప్ప దేశంలోని అత్యంత సంపన్న వర్గాలకు ఉపయుక్తమైన చివరి రెండు వాగ్ధానాలను మోదీ నిలబెట్టుకున్నాడు. కేవలం 2023- 24 ఒక్క ఏడాదిలోనే భారతీయ శతకోటీశ్వరుల సంపద 40 శాతం పెరిగింది. 3.5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్వవస్థలో 100 మంది భారతీయకుబేరుల సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 2019- 22 మధ్య మూడేళ్ల కాలంలో ఆదానీ దేశంలోని ఏడు విమానాశ్రయాలను స్వంతం చేసుకుని అతి పెద్ద విమానాశ్రయాధిపతిగా ఎదిగాడు. ఆదానీ గ్రూపు దేశ పశ్చిమ తీరంలోని ఏడు నౌకాశ్రయాలు, తూర్పుతీరంలోని ఎనిమిది నౌకాశ్రయాలు స్వంతం చేసుకుని మొత్తంగా 15 నౌకాశ్రయాలు తన ఆధీనంలోకి తీసుకుంది.
జాతి సంపద ఈ రకంగా ప్రైవేటు పరంకావడానికి దారి తీసిన ప్రభుత్వ విధివిధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 2018 నవంబరు నెలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రయిజల్ కమిటీ దేశంలోని ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా మరో రెండు కీలక సవరణలు తీసుకు వచ్చింది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీలకు గతంలో విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉండి తీరాలన్న ‘నీతి అయోగ్’ నిబంధనను సడలించింది. అలాగే ఏ కంపెనీ అయినా నియమిత సంఖ్యకు మించి విమానాశ్రయాలు ప్రైవేటు బిడ్డింగ్‌లో పాల్గొనకూడదన్న ఆర్థికమంత్రిత్వశాఖ నిబంధనను కూడా సడలించింది. దీంతో దేశంలోని ఏడు విమానాశ్రయాలు అదానీ కంపెనీపరం అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. అలాగే మరోవైపు కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భార్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ జియో మొబైల్‌ని ప్రధాని మోడీ ఫొటోతో మార్కెట్చేసుకోవడాన్ని అనుమతించారు.
మోడీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి రెండు వైరుధ్యాలకు గురయ్యింది. బడా పారిశ్రామిక సంస్థలు మరింత బలోపేతమై కీలకమైన అనేక రంగాలలో గుత్తాధిపత్యం సాధించాయి. ఆయా రంగాలలో చిన్న పారిశ్రామిక సంస్థలు మనుగడ కోసం పెనుగులాడతు ఉన్నాయి. నయా ఉదారవాద, మార్కెట్ అనుకూల విధానాలతోపాటు అంతర్జాతీయ పెట్టుబడి నుండి రక్షించడానికి రాజ్యమే కొన్ని బడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకుంది. రిటైల్ రంగంలో రిలయన్స్ గుత్తాధిపత్యం దెబ్బతినకుండా చూడడానికి కేంద్ర ప్రభుత్వం అమెజాన్ కంపెనీతో వివాదానికి తలపడింది. పైకి భారతీయ జనతా పార్టీ సంప్రదాయ పునాది వర్గాలయిన రిటైల్ వర్తకుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ తగాదాకు దిగినట్టు ప్రచారం చేసుకున్నా అసలు ఉద్దేశ్యం మాత్రం రిలయన్స్ రిటైల్ మార్కెట్‌ను పరిరక్షించడమే.
ఆదానీ వ్యాపార సామ్రాజ్యం దేశాంతరాలకు వ్యాపించడానికి రాజ్యమే ఒక సాధనంగా మారిపోయింది. విదేశాంగ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యాపార సంస్థలను ఉపయోగించుకోవడం తప్పు కాదని కొంతమంది మేధావులు వాదిస్తున్నారు. ఆదానీ కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు అమ్మేలా చూడడం ద్వారా ఆ దేశాలతో మైత్రీబంధం మరింత బలపరుచుకోవచ్చని చెప్పుకొస్తున్నారు. కానీ ఆదానీ కంపెనీ అమ్మే విద్యుత్‌కు ఆ సంస్థ చాలా ఎక్కువ రేటు వసూలు చేస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరోపిస్తుంది. అలాగే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితులలో భారత్ సాయం కోసం అభ్యర్ధించిన శ్రీలంక ప్రభుత్వాన్ని ఆదానీ కంపెనీకి విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చేలా భారత ప్రభుత్వం ఎంతలా ఒత్తిడి తీసుకువచ్చిందో స్వయంగా శ్రీలంక మంత్రియే వెల్లడించారు. కెన్యా, ఆస్ట్రేలియా ప్రభుత్వాల నుంచి కూడా ఆదానీ కంపెనీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆదానీ కంపెనీకి మన సౌర్వభౌమ ప్రభుత్వం దళారీగా వ్యవహరించడం అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టకు మచ్చ తీసుకురావడం కాదా?
అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను ఫణంగా పెట్టి మరీ ఆదానీ వ్యాపార సామ్రాజ్య ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఎందుకు ఇంతలా పాకులాడుతుంది? రాజ్యం తన స్వీయ ప్రయోజనాలను ఎందుకు దెబ్బ తీసుకుంటుంది? ఈ ప్రశ్నకు జవాబు రాబట్టడాని కంటే ముందు అసలు ‘రాజ్యం’ అంటే ఏమిటనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలి.
నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, హింస మీద గుత్తాధిపత్యం కలిగి ఉండే రాజకీయ సంస్థను రాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే, ఇటలీ దేశపు మార్కిస్టు మేధావి ఆంటోనియో గ్రాంసీ మాత్రం ‘పాలకవర్గాల చారిత్రక ఐక్యత రాజ్యంలో సిద్ధిస్తుంది’ అని భాష్యం చెప్పాడు. అంటే రాజ్యం అనేది ఆధిపత్య వర్గాల మధ్య నెలకొన్న తాత్కాలిక ఏకాభిప్రాయం ద్వారా నియంత్రించబడుతుంది అని ప్రతిపదార్థం.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి దశాబ్దాలలో ప్రైవేటు పెట్టుబడి కొన్ని అంశాల వరకు ప్రభావశీలంగా ఉన్నప్పటికీ రాజకీయాధికారాన్ని సవాలు చేసేంత స్థాయికి అభివృద్ధి చెందలేదు. అయితే, నయా ఉదారవాదం నేపథ్యంలో ‘బడా పెట్టుబడి’ రాజ్యాన్ని నియంత్రించే ‘పాలకవర్గం’గా ఎదిగింది. పర్యవసానంగా గతంలో పెట్టుబడి మీద రాజ్యం తన ప్రయోజనాలను చెలాయించే స్థితి ఇప్పుడు తిరగబడింది. పెట్టుబడి తన ప్రయోజనాలను రాజ్యం మీద చెలాయిస్తుంది. గతంలో పెట్టుబడి రాజ్యానికి లోబడి ఉండి జాతీయ అస్థిత్వాన్ని సముపార్జించుకునేది. ప్రస్తుతం రాజ్యం మీద పెట్టుబడి ఆధిపత్యం చెలాయించడం ద్వారా దానికి అదే జాతీయతగా మారింది.
ఇందుకు తాజా సంఘటనను ఉదాహరణగా మనం పరిగణించవచ్చు. ఆదానీ గ్రూపు సంస్థ అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో పాటు లంచాలు కూడా ఇవ్వచూపిందని హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించడం పెను రాజకీయ తుఫానుకు దారి తియ్యాల్సింది. కానీ ఇంతటి తీవ్ర ఆర్థికనేరాలపట్ల స్పందన చప్పగ అణిగిపోయింది. దీనికి కారణం హిండెన్‌బర్గ్ నివేదిక మన దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించినదే అని కార్పెరోట్ మీడియా పెద్దపెట్టున ప్రచారం చెయ్యడమే. సామాజిక మాధ్యమాల్లో కుట్ర సిద్ధాంతాలు కోడై కూశాయి. జార్జ్ సోరోస్, కాంగ్రెస్‌పార్టీ, కమ్యూనిస్టులు తదితర దేశద్రోహ శక్తులన్నీ ఏకమై భారతదేశ ప్రతిష్టను మసకబార్చడానికి ఆదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారం సాగిస్తున్నాయని నిందలు వేశారు.
రాజకీయ ప్రతిపక్షపార్టీలు ఆదానీ మీద ఆరోపణలు వస్తే అది ఇండియా మీద దాడిగా చిత్రీకరిస్తూ ఆదానీ అంటే ఇండియా అన్నట్టు ప్రభుత్వ వర్గాలు వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శించాయి. కానీ, అసలు వాస్తవమేమిటంటే ఇవాళ దేశీయ బడా పెట్టుబడియే రాజ్యంగాను, బడా పెట్టుబడి ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగానూ మారిపోయాయి. అందుకే రాజ్యం ఈ దేశీయ పెట్టుబడిదారులు ఆకర్షణీయమైన విదేశీ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సాధనంగా ఉపయోగపడుతూ అంతర్జాతీయ పోటీ నుండి, విమర్శల నుండి కాపాడుకుంటూ వస్తుంది.
ఇక్కడ మనం పెట్టుబడికి, బడాపెట్టుబడికి మధ్య ఉండే తేడాను కూడా గుర్తించాలి. మోడీ ప్రభుత్వ హయాంలో బడాపెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదానీ, అంబానీ వ్యాపార సామ్రాజ్యాలకు రాజకీయంగా అండదండలు అందిస్తుంది. బడా ప్రైవేట్ కార్పోరేట్ సంస్థల పట్ల రాజ్యం సానుకూలంగానే ఉంటుంది. కానీ అన్ని కార్పొరేట్ సంస్థలను సమాన ప్రయోజనంలో చూడదు. కొన్ని కార్పెరేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరుస్తుంటుంది. గుజరాత్ కార్పొరేట్ సంస్థలకు రాచమర్యాదలు చేకూరుస్నున్నారని అడపాదడపా సణుగుళ్లు వినరావడానికి గల కారణం ఇదే. అంటే బడా పెట్టుబడి ప్రభావం ఏ మేరకు ఉన్నదని అంచనా వెయ్యడంతో పాటుగా రాజ్యం ఏ జాతి స్వభావం గల బడా పెట్టుబడికి ప్రాధాన్యత కల్పిస్తుందనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన రోజులు దాపురించాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే రాజ్యం మీద మనకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? రాజ్యం పెట్టుబడి తోకగా మారిపోయినట్టు అనిపించడం లేదూ? అయితే దీనికి సూటిగా సమాధానం చెప్పుకోవడం చాలా సంక్లిష్టమైనది. రాజ్యమే ఒక సంక్లిష్ట భూమిక. రాజ్యం ‘దిశ’ను ప్రభావితం చేసేందుకు అనేక శక్తులు, ఒక్కోసారి ప్రజలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే దేశీయ పెట్టుబడి పాలకవర్గాల్లో కూడా ఒక భాగమే. అయితే రానురాను ఇది మిగిలిన అన్ని శక్తులను దాటుకుంటూ అగ్రభాగానికి వచ్చి నిలుస్తుంది. గత పదేళ్లుగా రాజ్యం బడాపెట్టుబడికి ‘సేవకుడి’గా మారిపోయింది.
కార్పోరేట్ వ్యాపార సంస్థలే రాజ్యానికి ప్రతినిధులుగా తయారయితే, అంతర్జాతీయ యవనిక మీద దేశ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఎక్కువ అవుతుంది. ‘న్యూఢిల్లీలోని ప్రభుత్వం, భారత ప్రైవేటు కార్పోరేట్ సంస్థల మధ్య నెలకొంటున్న సహకారం, అధికార సమతుల్యతలను పరిశీలిస్తే దేశం అమెరికా మార్గాన్ని అనుసరిస్తుందని అర్థమవుతుంది’ అని క్రిజిస్టాఫ్ ఇవానెక్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి నాకు టీవీలో ప్రసారమయ్యే ‘ఫ్లాప్ షో’ ధారావాహిక గుర్తుకు వస్తుంది. పీహెచ్డీ పట్టాపొందేందుకు ఉత్తీర్ణత సాధించాలంటే తన మరదలిని వివవాహమాడాలని షరతు విధించిన ప్రొఫేసర్ పాత్రను పోషించిన జస్టాల్ భట్టి తలపుకొస్తున్నారు.
‘విశ్వగురువు’గా మారాలని ఆకాంక్షిస్తున్న మనదేశం ప్రతిష్టను, గౌరవభావాన్ని బయటి వారెవరో కాదు సొంత బంధువగణంలో భాగంగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులే నష్టపరుస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగేనా?
అమిత్ జుల్కా
అనువాదం: కె సత్యరంజన్
(అమిత్ జుల్కా హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల బోధనా ఆచార్యులుగా పనిచేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.