
న్యూడిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతంలోగల కంచె గచ్చిబౌలి గ్రామంలోని సహజ అడవిని తలపించే 400 ఎకరాల భూమి వివాదాస్పమైంది. ఈ భూమిని ఇప్పటివరకు యూనివర్శిటీ తనదిగా భావిస్తోంది. అయితే ప్రభుత్వం గతంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC)కి భూమిని కేటాయించడానికి వీలు కల్పించే పభుత్వ ఉత్తర్వు (GO) 54ను 2024 జూన్ 26న జారీ చేసింది.
ఈ ఉత్తర్వును ఆకస్మికంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిశ్చయించుకుని పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని దింపి వేలాది చెట్లను పెకలించి, భూమిని చదునుచేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చర్యను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులే కాకుండా యావత్ పౌరసమాజం, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసించారు.
ఈ సమస్యపై హైకోర్టులో ఒక పిల్ దాఖలు కాగా గురువారం వరకు పనులను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే విషయం ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టీస్ బిఆర్ గవాయి, జస్టీస్ ఏజి మాసీ బెంచ్ మీదకు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తులు తెలంగాణ ప్రధాన కార్యదర్శిని “చెట్లను నరికివేయడానికి కావలసిన ముందస్తు అనుమతులను సంబంధిత అధికారుల నుంచి పొందారా? 400 ఎకరాలలోగల వేలాది చెట్లను తొలగించి హడావిడిగా అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది? అడవిని తలపించే భూమిపై అటువంటి అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించటం కోసం అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనా ధృవీకరణ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందిందా?” అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా దీనిపై ఒక నివేదికను పంపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది.
ఈ భూమి వేలాది చెట్లతోపాటు రెండు సరస్సులు, అనేక రకాల జీవజాలంతో కూడివున్నదని పిటిషనర్లు వాదించారు. అటవీ భూముల సమస్యలపై అమికస్ క్యూరీగావున్న సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర్ పిటిషనర్ల వాదనలో వాస్తవం ఉంది అని చెప్పగానే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అటవీ నిర్మూలనా కార్యక్రమాన్ని నిలిపివేయాలని, ఇప్పటికేవున్న చెట్ల రక్షణతప్ప మరేవిధమైన చర్యలు చేపట్టరాదని, ఇందుకు భిన్నంగా ఏమి జరిగినా అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యతవహించవలసి ఉంటుందని తన మధ్యంతర ఉత్తర్వులో సుప్రీంకోర్టు పేర్కొంది.