![IMG-20250130-WA0011](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/IMG-20250130-WA0011.jpg)
మాజీ సంపాదకులు, మాజీ కేంద్ర మంత్రి రచించిన కొత్త పుస్తకం ది న్యూ ఐకాన్ : సావర్కర్ అండ్ ఫాక్ట్స్ స్వాతంత్రోద్యమంలో సావర్కర్ పాత్ర, ఫ్రాన్స్ ఆయన అరెస్టు నేపథ్యం, ఆయన గురించిన కల్పిత వీర గాధలలో వాస్తవాల మోతాదు వంటి విషయాలను తడుముతుంది. ఈ గ్రంథంలో రచయిత సమాధానాలు వెదకటానికి ఎంచుకున్న కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
ఫ్రెంచ్ సముద్ర జలాల్లో మెరిసిల్స్ వద్ద ఓడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారా ? సావర్కర్ చెప్పుకుంటున్నట్టు లండన్ లో సావర్కర్, గాంధీలు స్నేహితులుగా కలిసి ఉన్నారా ? అండమాన్ లో జైలు అధికారుల కారణంగానే సావర్కర్ ముస్లిం వ్యతిరేకి అయ్యారా ? బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఎలా అర్థం చేసుకోవాలి ? తనను విడుదల చేస్తే బ్రిటిష్ వారికి ఉపయోగపడతానని హామీ ఇచ్చారా ? తన విడుదల కోసం బ్రిటిష్ పాలాకులు కూడా కోరని షరతులన్నీ సావర్కర్ తన క్షమాభిక్ష దరఖాస్తులో చెప్పి మరీ ఒప్పుకున్నారా ? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారికి హృదయ పూర్వక సహాయ సహకారాలు అందిస్తామని ఒప్పుకున్నారా ? నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు మార్గదర్శి సావర్కారేనా ? హిందూమతం గురించి, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, పవిత్ర గోవులు, పవిత్ర గ్రంథాలు గురించి సావర్కర్ అభిప్రాయం ఏమిటి ? భారతీయులు హిందుత్వ లో మునిగిపోయార? సావర్కర్ నిర్మించదల్చుకున్న రాజ్యం ఎటువంటిది ? ఆర్ఎస్ఎస్ కు అతి పెద్ద అసౌకర్యంగా ఉన్న గాంధీ జీ స్మృతులు చెరిపేయటానికే సావర్కర్ ను ప్రస్తుత పాలకులు మ్రజల మనోఫలకం పై పునఃప్రతిష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అన్నవి పెంగ్విన్ ప్రచురించిన ఈ గ్రంథం ద్వారా అరుణ్ శౌరీ సమాధానాలు చెప్పదలచుకున్న కొన్ని ప్రశ్నలు. వీటికి సమాధానం వెతకడానికి అరుణ్ శౌరీ సావర్కర్ రచనలు, ఉపన్యాసాలు, వ్యాసాలు, వివిధ సందర్భాల్లో వెలువరించిన ప్రకటనలను అధ్యయనం చేసి వడపోసి 550 పేజీల గ్రంథాన్ని మనముందు ఉంచారు.
ఒక ఉమ్మడి శతృవుని చూపించాడానికి మించి మరేదీ ఒక దేశ ప్రజలను ఐక్యం చేయటానికి ఉపయోగపడదు అన్న ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ గ్రంథంలో సావర్కర్ రాసిన విషయాలను వర్తమానానికి అన్వయించి చూసుకుంటే దేశంలో కమ్యూనిస్టుల నుండి భీమా కోరేగావ్ నిదితుల వరకూ, ప్రశ్నించే అప్ట్రికల నుండి ప్రతిపక్షాల వరకూ అందరూ దేశ ద్రోహులే అని బీజేపీ ,ఆర్ఎస్ఎస్ లు చేస్తున్న విపరీత విద్వేష ప్రచారానికి ముండుగుండు సామాగ్రి ఎక్కడ తయారవుతుందొ అర్థమవుతుంది. విద్వేషమే జాతి ఐక్యతకు పునాది అన్న సావర్కర్ మాటలు ఎంతమంది భావి తరాల మతోన్మాద సైన్యానికి సాటి భారతీయుల పట్ల గుడ్డి వ్యతిరేకత ను నూరి పోసిందో అర్థం చేసుకోవడం ఈ గ్రంథ అధ్యయనం ద్వారా సాధ్యమవుతుంది.
పుస్తకాన్ని ముగిస్తూ అరుణ్ శౌరి రాసిన తుది పలుకులు మతోన్మాద మత్తులో జోగుతున్న దేశాన్ని చెర్నకొల తో కొట్టి మరీ లేపుతాయి. అవే ఈ క్రింది వాక్యాలు :
” హిందూ మతం ప్రధానంగా ఆత్మ శుద్ధి కేంద్రితం.
దీనికి భిన్నమైనది హిందుత్వ. హిందూత్వ అనేది రాజ్య కాంక్ష. రాజ్యాన్ని స్వాధీనపర్చుకుని, దానిపై ఆధిపత్యం చెలాయిస్తూ తన లక్ష్యాలకు అనుగుణంగా రాజ్యాన్ని తిమ్మిని బమ్మిని చేసే ప్రాజెక్ట్.
ఆత్మ పరిశుద్ధత కు సత్యానికి కట్టుబడి ఉండటం, అణుకువ, నమ్రత, సేవా భావన, నైతిక ప్రవర్తన అనివార్యం.
దీనికి భిన్నమైనది హిందూత్వ. రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని పోరు పెడుతుంది. సమాజాన్ని అన్ని రకాలుగా గుప్పిట్లో పెట్టుకోవాలని కోరుతుంది. అలా గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇతరుల్ని రెచ్చగొట్టడానికే కానీ, అసత్యాలు అర్థ సత్యాలు ప్రచారం చేయటానికి కానీ, హింసాత్మక చర్యలకు కానీ, మోసానికి, అవినీతికి కానీ వెనకాడదు. ఇంకో మాటలో చెప్పాలంటే తన లక్ష్యసాధన కోసం ఏమి చెయ్యటానికి అయినా సిద్ద పడేది హిందూత్వ. అంటే నాయకత్వం ఏది కరెక్ట్ అనుకుంటే అదంతా చేయటానికి అనుయాయులు సిద్ధపడటం హిందుత్వ లక్షణం.
హిందూమతంలో అన్ని ఉపచారాలు – క్రతువులు, ఆచార వ్యవహారాలు, ధ్యానం, ప్రార్థనలు ఆత్మ పరిశుద్ది కి మార్గాలు. కానీ వీటన్నింటికీ వక్రభాష్యాలు చెప్పి రాజ్యాధికారాన్ని సాధించటం కోసమే రాజ్యంపై పెత్తనం. చేయటం కోసమే ఈ క్రతువులు, ఆచారాలు, భక్తి ప్రపత్తులు అన్నిటినీ ఉపయోగించుకుంటుంది. రాజ్యాధికారం కోసం సమాజాన్ని ముక్కలు ముక్కలు చెయ్యటానికి కూడా వెనకాడదు. తీర్థయాత్రలు అన్న పదానికి ఉన్న సాంప్రదాయక అవగాహనకు భిన్నంగా ధార్మిక పర్యాటక రంగం వంటి వింత వింత విధానాలకు తెర తీస్తుంది. ప్రసన్నవదనం, ప్రశాంత చిత్తంతో దేవుడికి తనను తాను అర్పించుకోవడం అన్న భావన స్థానంలో భూనాభోంతరాలు పిక్కటిల్లేలా ప్రచారం చేయటమే భక్తి అని నమ్మిస్తుంది. విభిన్న మార్గాల్లో భగవంతుని చేరుకోవడం అన్న హిందూమత వాస్తవికత స్థానంలో నాయకుడి అడుగుజాడల్లో నడవడం ద్వారానే పుణ్యం పురుషార్ధం అని నమ్ముతుంది.
ఏ రోజైతే మతం రాజ్యాధికార కాంక్ష ను నెరవేర్చుకోవడానికి సాధనంగా వాడబడుతుందో అటువంటి మతాన్ని అధికార దాహం మింగేస్తుంది. ఏసు క్రీస్తు ప్రారంభించిన క్రైస్తవానికి, సూఫీ తెగకు చెందిన ఇస్లాం మతానికి ఏ గతి పట్టిందో చూడండి.
అందుకే…
నా విన్నపం ఏమంటే….
హిందూత్వ నుండి హిందూ మతాన్ని కాపాడుకుందాం.”
అంటూ అర్ద్రమైన విజ్ఞప్తి తో తన రచనను ముగిస్తారు అరుణ్ శౌరి.