
స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటింది, స్వాతంత్ర పోరాట కాలంలో వలస పాలన అంతం తో పాటు నవ భారతంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆనాటి నాయకులు ఆకాంక్షించారు. అందుకే స్వాతంత్రానంతరం ప్రజలందరికీ సార్వత్రిక ఓటుహక్కుతో పాటు అనేక సంస్థలలో ప్రజాస్వామ్యబద్దంగా నడవటానికి వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. జాతీయోద్యం స్పూర్తి నశించిందో లేక దేశం పూర్తిగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే నాయకుల చేతుల్లో నుండి పూర్తి కార్ర్పోరేట్లు, నయా భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిందో కానీ ప్రజాస్వామ్య స్పూర్తి అనేక చోట్ల నశించింది, ప్రజాస్వామ్యం అంటే కేవలం 5 యేండ్లకు ఒకసారి ఓటు వేయటం మాత్రమే అనే స్థాయికి కుదించబడింది.
విద్యాసంస్థలు
కొన్నేండ్ల ముందు ప్రభుత్వ విద్య బలంగా ఉన్న కాలంలో అన్ని పాఠశాలలో స్కూల్ పీపుల్ లీడర్ ను ఎన్నుకోవటనికి ఎన్నికలు జరిగేవి, కాలేజీలలో, విశ్వవిద్యాలయాలలో విద్యార్ధి సంఘాల ఎన్నికలు జరిగేవి. వీటి ద్వారా కొత్త తరం కౌమార దశ నుండే ఎన్నికలు, రాజకీయాలు , ఓటు హక్కు వినియోగం , ఉపయోగాలు తెలుసుకునే వారు . తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇవి చాలా ఉపయోగపడేవి , కౌమార దశ నుండే ప్రజాస్వామ్య స్పూర్తి పిల్లలకు అందేది . నేడు కేవలం సెంట్రల్ యూనివర్సిటీలు , కొన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలలో తప్పితే ఎక్కడా ఎన్నికలు జరగటం లేదు. ఇక ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే ఇటువంటివి పూర్తి నిషేధం. విధార్ధి దశలో ఎక్కడా ప్రజాస్వామ్యమ్యాన్ని అనుభూతి చెందని వారు 18 యేండ్లు నిండాక ఓటు హక్కును ఎలా పరిపక్వమైన ఆలోచనలతో ఉపయోగించుకుంటారు అని అనుకుంటున్నారో పాలకులే చెప్పాలి. విధార్ధి సంఘాల ఎన్నికలల్లో గొడవలు అవుతున్నాయి అనే సాకుతో ప్రజాస్వామ్య స్పూర్తిని పీక నులిమారు, ఒకప్పుడు విద్యార్ధులనుండి పుట్టిన నాయకులు ఈనాడు కార్పోరేట్లు, భూస్వాముల వారసులు డబ్బుల కట్టలతో వస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులు ఈ దశ నుండే కదిలించబడుతున్నాయి.
ట్రేడ్ యూనినన్లు, సహకార సంఘాలు
పని ప్రదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలని అప్పుడే పనిలో సమర్ధత, ఆరోగ్యకరమైన పని వాతవరణం ఉంటుంది అనేది నిరూపించబడిన సత్యం. కానీ ఈనాడు దేశంలో చాలా పరిశ్రమలలో ట్రేడ్ యూనియన్లు లేవు. ఆఖరికి ప్రభుత్వ సంస్థలలో కూడా వాటి పీక నులిమివేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహకారసంఘాలను ఒక పద్దతి ప్రకారం అనేకచోట్ల రద్దు చేశారు, మిగిలిన వాటిని చేయాలని చూస్తున్నారు . కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు యూనియన్లు అంటేనే మండిపడి వాటి మీద నిర్బంధాలు అమలు చేస్తున్నారు. ప్రైవేటు పరిశ్రమలలో అయితే వాటి ఊసే ఉండదు . పని ప్రదేశంలో అసమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని కార్మికుడు పూర్తిగా పరాయీకరణకు గురవుతున్నాడు. ఒకప్పుడు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగేవి , వారికి ఏమి సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు సంఘాల ఎన్నికల ద్వారా పరిష్క్రుతమయ్యేవి. ఆఖరికి సహకార సంఘాల ఎన్నికలు కూడా నామమాత్రానికి పరిమితం చేశారు. కార్పోరెట్ కంపెనీలలో అయితే పెట్టుబడిలో పెద్ద వాటాలు ఉన్న గుప్పెడు బోర్డు మెంబర్స్ చేతొలోనే సంస్థలో జరగాలిసిన అన్నీ నిర్ణయాలు జరిగిపోతాయి . పనిప్రదేశంలో ప్రాజాస్వామ్యం లేకపోతే మానవ జీవితంలో ఎక్కువ కాలం గడిపే ప్రదేశం సగటు మానవుడికి అది పూర్తి పరాయీకరణ అవుతుంది.ట్రేడ్ యూనియన్ రాజకీయల ద్వారా పార్లమెంటరీ రాజకీయాలలోకి వచ్చిన వారు ఆ వర్గం యొక్క ప్రయోజనాలకు ప్రాతినిద్యం వహించారు. పని ప్రదేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం ద్వారా రాజకీయాలలో కార్మిక వర్గ వాణి వినపడకుండా చేస్తున్నారు .
స్థానిక సంస్థలు , గ్రామ స్వరాజ్యం
గ్రామస్థాయిలో జరిగే నిర్ణయాలు ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ ప్రజల ప్రమేయం ఉండాలని తెచ్చిన స్థానిక సంస్థలు ఈనాడు స్వయంప్రతిపత్తి కోల్పోతూ ఊగిసలాడుతున్నాయి . చాలా రాష్ట్రాలలో కండబలంతో లేదా అధికారంలో ఉన్న పార్టీ కనుసైగల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి . ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అయితే ఇవి అధికరపార్టీకి నామినేటెడ్ పదవుల్లా చేశారు . క్రమతప్పకుండా నిర్వహించాలిసిన గ్రామసభలు కాగితాలకే పరిమితం చేశారు . గ్రామాలలో 99 శాతం మందికి అసలు గ్రామ సభలు అనేవి ఉంటాయనే తెలియదు . స్థానిక సంస్థలలో , వారి గ్రామానికి సంబంధించిన సమస్యలు , పరిష్కారాలు, అభివ్రుద్ది కార్యక్రమాలు ప్రజల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి . ప్రజాస్వామ్య స్పూర్తి గ్రామస్థాయినుండే ధ్వంసం చేయబడుతుంది
రాజకీయ పార్టీలు
దేశంలోని అన్ని పార్లమెంటరీ పార్టీలు తమ పార్టీ లోపల ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలనేది నిబంధన . క్రమం తప్పకుండా ప్లీనరీ సమావేశలు, మహాసభలు వంటివి జరిపి పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని నడపాలి . ప్రజాస్వామ్య పద్దతిలో తమ నాయకత్వాన్ని ఎనుకోవలనేది నిబంధన. దేశంలో ఎన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్నాయి? చాలా వరకు పార్టీలు కేవలం కాగితాల మీదనే వాటిని చూపిస్తున్నాయి . వ్యక్తి, కుటుంబం కేంద్రం గా నడిచే పార్టీలలో నామమాత్రంగా కూడా ఈ ప్రజాస్వామ్య స్పూర్తి ఉండదు. ఆ సుప్రీం నాయకులు చెప్పిన వారిని పదవుల్లో నియామకం జరుగుతుంది. ఆఖరికి వారి రోజువారి రాజకీయ కార్యక్రమాలు కూడా అధినాయకుని ఆదేశాల మీద జరుతుతాయి తప్పితే ఎక్కడా కూడా పార్టీ కేడర్ నిర్ణయాలు అభిప్రాయాల మేరకు జరగవు. అంతర్గతంగానే ప్రజాస్వామ్యం పాటించని రాజకీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని వ్రుద్ది చేస్తాయని అనుకోవటం బ్రమ అవుతుంది. ఒక్క వామపక్ష పార్టీలు వంటివి తప్పితే ఎక్కడా కూడా తమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నడపటం లేదు .
ముగింపు
అడుగడుగునా హత్య చేయబడుతున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో మరణ శయ్య పై ఉన్నదనేది ఖఠోర వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనంలో ఉంచుకోని క్రమపద్దతిలో ప్రజాస్వామ్యం హత్య చేయబడుతున్న చోట ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకుండా దేశం ముందుకు నడవదు. దేశం పూర్తిగా నియంత్రుత్వం లోకి చేజారుతూ అన్ని వ్యవస్థలలోనూ ప్రజాస్వామ్య స్పూర్తి పీక నులిమివేయబడుతుంది. కేవలం 5 యేండ్లకు ఒకసారి వేలుకు ఇంకు రాయించుకొవటాన్నే ప్రజాస్వామ్యం అనే దుస్థితికి దేశ ప్రజానీకాన్ని దిగజార్చారు. వువ్వెత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ , పునరుద్ధరణకై ఉద్యమాలు జరిగితే తప్ప ఈ గమనాన్ని మార్చలేము.
– ఆంజనేయ రాజు ,
డివైయఫ్ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.