
భారత రాజకీయాలు తీవ్ర మితవాదం వైపు మొగ్గిన గత దశాబ్ది కాలంలో మేధో స్వాతంత్య్రానికి సంబంధించిన చర్చ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఉన్నత విద్యా వ్యవస్థల విషయంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రభుత్వం జోక్యం విధానపరమైన విషయాల్లో ప్రత్యేకించి రాజకీయ సైద్ధాంతిక కోణాల్లో పక్షపాతంతో కూడిన జోక్యం పెరగటం చూస్తున్నాము. ఈ విధమైన జోక్యం కొత్తదేమీ కాదు. 2014కు ముందు కూడా రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జోక్యాలు జరిగాయి. బోధనా ప్రమాణాలు, మేధో ప్రమాణాలు ఉన్నత స్థాయిల్లో పాటించిన దాఖలాలు తక్కువే. బోధనా సిబ్బంది రాసే విషయాల్లోనూ, చెప్పే పాఠాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు కూడా గతంలోనూ ఉన్నాయి. 1960 నాటికి దేశ రాజకీయాల్లో మేధో రంగంలో పలుకుబడి తగ్గిపోవటం మొదలయ్యాక కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా విద్యా సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోవటం పెరిగింది. అయినప్పటికీ అప్పట్లో మేధో స్వాతంత్య్రానికి ఎదురైన ముప్పు ఈ స్థాయిలో లేదు. 1975- 77 మధ్యకాలంలో అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితి కాలంలో మినహా ఎప్పుడూ సెమినార్లను పర్యవేక్షించటం, వక్తల ఉపన్యాసాలను పట్టిపట్టి చూడటం, నిర్దిష్ట అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు మేధావులపై చర్యలు తీసుకోవటం, బాధ్యతల నుండి తొలగించటం వంటివి జరగలేదు. బోధన సిబ్బంది ఎటువంటి ఆందోళనకు తావులేకుండా తమ విధులు నిర్వహించేందుకు అవకాశం ఉండేది. పరిశోధించటానికి, ఉపన్యాసాలివ్వటానికీ, నచ్చిన అంశంపై ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేపట్టడానికి, మేధో సమావేశాల్లో పాల్గొనటానికీ అవకాశాలు పుష్కలంగా ఉండేవి. తమకు సబబైన అంశాలను పరిశోధించి ప్రచురించేందుకు కూడా ఎటువంటి ఆంక్షలూ ఉండేవి కావు. అప్పుడప్పుడూ నియామకాల విషయంలో రాజకీయ జోక్యం గురించిన ఆరోపణలఱు ఉండేవి కానీ పదోన్నతులు, ఇతర విషయాల్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్వయంప్రతిపత్తితోనే వ్యవహరించేవి.
అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం బోధనా సంస్థలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొంటోంది. తన అభిప్రాయాలనూ, నిర్ధారణలనూ రుద్దుతోంది. విద్యాసంస్థల ప్రధాన బాధ్యతలకు సంబంధించిన నియామకాల్లో మేధో సామర్ధ్యానికి బదులు రాజకీయ అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. నిస్పాక్షికంగానూ, హేతుబద్దంగానూ ఉండాల్సిన బోధనాంశాలు పూర్తి పక్షపాతంతోనూ, నిర్హేతుకంగానూ ఉంటున్నాయి. ఉన్నత విద్యా సంస్థల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకం అవుతోంది. మేధో స్వాతంత్య్రంపై ఆంక్షలు, పర్యవేక్షణ, నియంత్రణ పెరిగాయి. ఆలోచనల స్వేఛ్చకు అవకాశాలు కుదించుకుపోతున్నాయి.
భారత స్వాతంత్య్రం అమృతోత్సవాల సందర్భంగా “భారతదేశం: ప్రజాస్వామ్యానికి మాతృక” అనే అంశంపై సభలు, సమావేశాలు, మేధో గోష్టులు జరపాలంటూ విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం దేశంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు 2022లో రాసిన బహిరంగ లేఖ ఈ జోక్యం తీవ్రతకు ఓ నిదర్శనం. ప్రధానమంత్రి కూడా హిందూ ధర్మశాస్త్రాలను ఉటంకిస్తూ భారతదేశమే ప్రజాస్వామ్యానికి మాతృక అని తేల్చేశారు.
ఫలితంగా ఏమి బోధించాలో అన్న అంశాన్ని నియంత్రించటానికి మాత్రమే పరిమితం కాకుండా ఎలా చెప్పాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తోందనే ఆరోపణలకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అవకాశమిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాంశాలపై పూర్తి నియంత్రణ ఉంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ జోక్యం ప్రత్యక్షంగా ఉంటే ప్రైవేటు విద్యా సంస్థలు తమను తాము నియంత్రించుకోవడమో లేక ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా ఉండేలా వ్యవహరించటానికి సిద్ధపడటమో జరుగుతోంది.
మేధో కేంద్రాలను తమ ప్రత్యక్ష అజమాయిషీ కిందకు తెచ్చుకోవాలనే ప్రయత్నం 2014లో తొలిసారి మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడే మొదలైఐంది. 2016లో జవహర్లాల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళన వెనక ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలను చూడొచ్చు. జెఎన్యూ ఆరంభం నుంచీ ప్రగతిశీల భావాలకు, జాతీయోద్యమ భావాలకు, ఆధిపత్య శక్తులు, వ్యవస్థలను సవాలు చేసే మేధో ఘర్షణకూ కేంద్రంగా ఉంది. అందుకే ప్రభుత్వం ఈ యూనివర్శిటీని లక్ష్యంగా ఎంచుకుంది. అసమ్మతిని సహించేది లేదన్నదే ప్రభుత్వం పంపదల్చుకున్న సందేశం. నిర్ధిష్టంగా చెప్పాలంటే జెఎన్యూపై దాడి మేధో సంఘర్షణా స్రవంతిపై దాడి. పాలకపక్ష భావాలను తప్ప మరేదీ అంగీకరించబోమన్న హెచ్చరిక.
అంతేకాకుండా పరిశోధన కేంద్రాలు, పిహెచ్డి అడ్మిషన్లలో సీట్లు కుదింపుకు గురయ్యాయి. పరిశోధనాంశాలను పిహెచ్డి సూపర్వైజర్లు ఖరారు చేయటం లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో యూనివర్శిటీల పాలకమండళ్లే ప్రభుత్వానుకూల అంశాలపై పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి. పాలక పార్టీ రాజకీయ ఎజెండాకు సార్వత్రిక విలువలు ఆపాదించే లక్ష్యంతో పరిశోధనాంశాలు నిర్ణయించబడుతున్నాయి. కేటాయించబడుతున్నాయి. దక్షిణాసియా దేశాల ఉమ్మడి సహకారం, భాగస్వామ్యంతో ఏర్పాటైన సార్క్ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం దేశంలో మేధో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రతను తెలియచేస్తుంది. 2024లో ఓ పరిశోధక విద్యార్ధి ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు మేధావి నోమ్ చోంస్కీ అభిప్రాయాన్ని తన పరిశోధన పత్రంలో ప్రస్తావించిన సందర్భంలో తలెత్తిన వివాదంలో ఓ ఫ్రొఫెసర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2025లో ఈ పరిశోధక విద్యార్ధి తన పరిశోధనను ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితులు మేధో కేంద్రాలు స్వతంత్రించి స్వయంప్రతిపత్తితో భావాలు వికసించేందుకు, స్వేఛ్చగా ఆలోచించేందుకు అవకాశం లేదనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. పలు కీలకమైన గ్రంధాలను యూనివర్శిటీ బోధనాంశాల నుండి బోధనేతర కారణాలతో తొలగించటం సమస్య తీవ్రతను మనముందుంచుతుంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పని చేసే అధ్యాపకులు ప్రభుత్వ విధానాలను విమర్శించే వేదికల్లో మాట్లాడాలన్నా, నిరసనల్లో పాల్గొనాలన్నా జీత భత్యాలు ఆపేస్తారేమోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన 48 మంది అధ్యాపకులకు యూనివర్శిటీ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయకూడదన్న నిబంధనల కింద ఈ నోటీసులిచ్చారు. యూనివర్శిటీ సిబ్బందిని ఈ నిబంధనల కిందకు తీసుకురావటం వారి భావప్రకటనా స్వేఛ్చకు వ్యతిరేకమని జెఎన్యూ అధ్యాపక సంఘం స్పష్టం చేసింది. ఆ ఆందోళన తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఆపేయటంతో రిటైరైన వాళ్లంతా న్యాయం కోసం కోర్టుకెక్కారు.
మేధో గోష్టులపై నిఘా
ప్రభుత్వ నిధులు, సహకారంతో జరిగే అన్ని మేధో గోష్టులనూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వద్ద నమోదు చేయించుకోవాలని, విదేశాంగ శాఖ అనుమతులు పొందిన తర్వాతనే సమావేశాలు జరుపుకోవాలని కేంద్ర విద్యాశాఖ 2021లో ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశాల్లో జాతీయ భద్రత, సున్నితమైన జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాలను చర్చించటాన్ని నిషేధించారు. తర్వాత శాస్త్రవేత్తలు, మేధావులు, అంతర్జాతీయ సమాజం నుండి పెద్దఎత్తున ప్రతిఘటన రావటంతో ఈ ఆదేశాలను విరమించుకున్నారు.
పలు సందర్భాల్లో విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు మేధో గోష్టుల నిర్వాహకులపై నిఘా సాధనాలుగా మారారు. ఢిల్లీ విశ్వవిద్యాలం పరిధిలోని రామ్ జస్ కాలేజీలోనూ, భోపాల్, లక్నో, జోధ్‌పూర్ వంటి చోట్ల జరిగిన పరిణామాలు దీనికి తార్కాణం. 2023 నవంబరు నుంచి ఐఐటి బొంబాయి కాంపస్‌లో రాజకీయ స్వభావం కలిగిన కార్యక్రమాలు నిర్వహణపై నిషేధం అమల్లో ఉంది. ఒకవేళ అనుమమతులు తీసుకుని ఏర్పాటు చేసుకున్న కార్యకలాపాలు కూడా హిందూత్వవాదానికి ప్రాతినిధ్యం వహించే సంస్థలు ఆందోళన చేస్తే రద్దు చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఇటువంటి చర్యల ఫలితంగా ఉన్నత విద్యాలయాలు స్వేఛ్చగా మేధోమధనం జరిపేందుకు అవకాశం కల్పించే కేంద్రాలన్న భావనకు కాలం చెల్లుతోందా అన్న సందేహం కలుగుతోంది.
లండన్ నుండి వెలువడే టైమ్స్ ఉన్నత విద్యా విషయక ప్రత్యేక సంచికలో కొందరు మేధావులు ఏ తరహా నిరసన పిటిషన్లపై ఏయే మేధో కేంద్రాల నుండి ఎవరెవరు సంతకాలు చేస్తున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించిన వారిని విశ్వవిద్యాలయాల యాజమాన్యం పిలిపించి సంజాయిషీ తీసుకున్న సందర్భాలు కూడా నమోదయ్యాయి. అటువంటి మందలింపు సమావేశాలకు హాజరైన ఓ ఫ్రొఫెసర్ తాను ఎటువంటి విషయాలకు స్పందించాలో ఎటువంటి విషయాలకు స్పందించనవసరం లేదో తెలుసుకుని వ్యవహరించాలని సోకాల్డ్ పెద్దలు చెప్పారు.
2013లో కొల్హాపూర్‌లో ఓ కళాశాలలో ఏ మతానికి చెందినవారైనా దారితప్పినప్పుడు ఎంతటి ఘోరానికి, నీచానికైనా పాల్పడతారని ఉదాహరణలతో చెప్పిన ఓ లెక్చరర్‌కు కలిగిన ఇబ్బందిని గుర్తు చేసుకుంటే రాజకీయాల చేతుల్లో పావుగా మారిన మతం మేధో వ్యతిరేకతకు సాధనంగా ఉంటుందన్న వాస్తవాన్ని రుజువు చేస్తుంది. హిందూత్వవాదంపై ప్రశ్నలు లేవనెత్తిన లెక్చరర్లు, ప్రొఫెసర్లకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్‌మీడియాలో గింగిర్లు తిరగడం గమనిస్తే రాజకీయం చేతిలో పావుగా మారిన మతం సృష్టించే మేధో విధ్వంసం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సదరు అధ్యాపకురాలు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ను ఆమె తిరస్కరించింది. దాంతో పరిస్థితులు శాంతించేంత వరకూ కళాశాలకు రావద్దని యాజమాన్యం ఆదేశించింది.
ఇదే రీతిలో విద్యా సంస్థల్లో విద్యార్ధి రాజకీయాలు కూడా కుదేలవుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, దక్షిణాసియా విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు ఎప్పుడు ఎక్కడ ఆందోళనలు చేయాలి, ఏయే అంశాల మీద ఆందోళనలు చేయాలనే అంశాలకు సంబంధించి కొత్తగా షరతులు ఉనికిలోకి వచ్చాయి. జెఎన్యూ బోధనా కేంద్రాల సమీపంలో ఆందోళనలు చేయకూడదని ఆంక్షలు విధిస్తే దక్షిణాసియా విశ్వవిద్యాలయం అడ్మిషన్ల దశలోనే విద్యార్ధులు ఆందోళనల్లో పాల్గొనబోమని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తప్ప సీట్లు రావటం లేదు. రాజకీయంగా ఎటువంటి నిశ్చితాభిప్రాయాలు లేని విద్యార్ధులు. అధ్యాపకులూ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు తప్పు అని భావించి ఆ చట్టాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాల్లో పాల్గొంటే వారిని అరెస్టు చేయటం, బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడం ఆనవాయితీగా మారింది. రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేసే చట్టానికి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారు ప్రత్యేకించి అలా పాల్గొన్న వారు ముస్లింలు అయితే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ముందు పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు చేసిన ఢిల్లీల్లోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల్లో 300 వందల మందికిపైగా నిర్భంధించబడ్డారు.
సంస్థాగత నియంత్రణలు
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన లక్షలాదిమంది విద్యార్ధులు చేరారు. ప్రభుత్వ రంగంలో విశ్వవిద్యాలయాలు, అందులో రిజర్వేషన్లు లేకపోతే మేధో కేంద్రాల్లో సామాజిక పొందిక నేడు మనం చూస్తున్నట్లుండేది కాదు. ఇటువంటి ఉన్నత విద్యాకేంద్రాల్లోనూ అన్ని రకాల సామాజికంగా, ఆర్థిక అంతరాలున్న విద్యార్ధులు అందరూ ఏదో ఒక మేర కలిసి మెలిసి ఉండేందుకు ఈ విశ్వవిద్యాలయాలు అవకాశం ఇస్తున్నాయి.ఈ రకమైన సామాజిక వైవిధ్యం యూనివర్సీటీ బోధనాంశాల్లో వైవిధ్యానికి కూడా దారితీసింది.
అయితే ఈ కాలంలో ప్రైవేటు ఉన్నత విద్యాకేంద్రాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఉన్నత విద్యకు నిధులు పెంచకపోగా విద్యారంగాన్ని స్థూలంగానే నిధుల కోత వేధిస్తోంది. ప్రభుత్వ రంగంలో విద్యారంగానికి నిధులు కోత, ప్రైవేటు రంగంలో విద్యాలయాలు, ఉన్నత విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదాలు అనులోమానుపాతంలో ఉన్నాయి. అయితే ఈ సామాజిక ఆర్థిక ప్రాధాన్యత కలిగిన అన్ని కోర్సులతో సమగ్ర ఉన్నత మేధో కేంద్రాలుగా ఎదగటానికి బదులు ప్రైవేటు ఉన్నత విద్యా కేంద్రాలు మార్కెట్ అవసరాలకు కావల్సిన కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ కోర్సుల్లో సాధారణంగా పేద కుంటుంబాలకు చెందిన విద్యార్ధులు చేరే అవకాశాలు రానురాను కుదించుకుపోతున్నాయి.
చివరి భాగంలో నయా ఉదారవాదంతో మిలాఖత్ అయిన హిందూత్వ రాజకీయాలు ఉన్నత విద్యావ్యవస్థపై చూపిస్తున్న ప్రభావం, ఆ పరిస్థితుల నుండి బయటపడేందుకు ఉన్న అవకాశాలు, పాటించాల్సిన పద్ధతులు ముందుకు తేవాల్సిన ఎజెండా గురించి తెలుసుకుందాం.
జోయా హసన్
అనువాదం : కొండూరి వీరయ్య
(రెండో భాగం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.