
ఫాసిస్టు లక్షణాలను గట్టిగా ఎదుర్కొనగలిగే శక్తి సీపీఎం
కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) గురించి దేశం ఇంతగా ఆలోచించవలసిన అవసరం ఉందా? ఆ పార్టీ మహాసభల గురించి, అందులో చేసిన తీర్మానాల గురించి అవసరమైన దాని కంటె ఎక్కువగా వినపడుతోందా? ఆఫ్టరాల్ అయిదంటే అయిదు లోక్‌సభ సీట్లు ఉన్న పార్టీకి ఎంత మాత్రం ప్రభావశీలత మిగిలింది? ఎటువంటి భవిష్యత్తు కాచుకుని ఉంది? దేశంలోని ప్రగతిశీల మేధావులు అంతగా ఆలోచనచేయటానికీ, విమర్శలు చేయటానికి కారణం గత వందేళ్ల భారత మేధో జగత్తు లో వామపక్షాలు పోషించిన పాత్ర అది. నేడు భారత వామపక్షాలకు నాయకత్వ పాత్ర పోషిస్తున్నది సిపిఎం కాబట్టి సిపిఎం వర్తమానం, భవిష్యత్తు గురించిన పరిణామాలు సంఘటనలు, సందర్భాలు గురించిన ఆసక్తి.
రేపటి సంగతి ఏమో కానీ, సిపిఎంకు ఘనమైన గతం ఉంది. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ చీలిపోయిన తరువాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికల(1967)లోనే ఆ పార్టీకి 19 లోక్‌సభ స్థానాలు సాధించింది. ఆ తరువాత 2004లో 43 స్థానాలు గెలుచుకునే వరకు ఆ పార్టీది గొప్ప ప్రయాణం. 2009లో పదహారు స్థానాలకు పతనం, తరువాతి వరుస ఎన్నికలలో తొమ్మిది, మూడు, నాలుగుగా దిగజారింది. ఈ మధ్య కాలంలో పార్టీ పశ్చిమబెంగాల్‌ను, త్రిపురను కోల్పోయింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయ బలాన్ని కూడా పోగొట్టుకుంది. చట్టసభల బలంలోనే కాదు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే సామర్థ్యంలోనూ,
రైతాంగంలో, గ్రామీణ పేదల్లో, కార్మిక, ఉద్యోగ సంఘాల్లో కూడా పార్టీ అనుబంధ బలగాల సంఖ్య వేగంగా తగ్గుముఖంలో ఉంది. కేరళ రాష్ట్రం ఒక్కటే కేసెబియాంకలా పార్టీని వదలకుండా పట్టుకుని ఉంది. ఇవన్నీ గత రెండు దశాబ్దాలుగా పార్టీ పలు పత్రాల్లో ప్రస్తావించిన అంశాలే. ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న విషయాలే.
ఎంపీల ఎమ్మెల్యేల రాష్ట్ర ప్రభుత్వాల బలంతో నిమిత్తం లేకుండా, ఈ దేశంలో వామపక్ష శక్తులకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠ ఉంది. కమ్యూనిస్టుల పక్కన నిలబడో, వారిని పక్కన నిలబెట్టుకునో తాము కూడా ప్రజాసేవకులము అనిపించుకోవాలని ఇతర రాజకీయవాదులు తహతహలాడేవారు. కమ్యూనిస్టులతో పొత్తు ఇతర పార్టీల ప్రతిష్ఠను పెంచుతాయి. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మహాకూటమి ప్రయత్నాలు, దాని నేపథ్యం దీనికి చక్కని ఉదాహరణ. ఈ సొంత శక్తిని వామపక్షీయులు తాము కొంత సొంతంగా కోల్పోతూ వచ్చారు. మరికొంత, గత పదేళ్ల కాలంలో దేశంలో నిర్మితమయిన భావవాతారణం కారణంగా క్షీణించిపోతోంది. ఈ పరిణామాలు కమ్యూనిస్టులతో సహా, కాసింత సంస్కారభావాలతో ఉండే ప్రతిఒక్కరి విశ్వసనీయతనూ దెబ్బతీసే ప్రయత్నాలుగా మారుతున్నాయి. కమ్యూనిస్టుల వెంట వచ్చే వారి సంఖ్య, కార్యకర్తల సంఖ్య, ఓటర్ల సంఖ్య తగ్గిపోతున్నాయంటే, అందుకు వారి స్వయంకృతంతో పాటు, వారిని అవిశ్వసనీయం చేస్తున్న, అప్రతిష్ట పాలుచేస్తున్న ప్రచార యుద్ధమూ కొంత కారణమే.
ఏప్రిల్ మొదటివారంలో తమిళనాడులోని మధురైలో జరిగిన మహాసభల తీరుతెన్నులు, నిర్ణయాలు, తీర్మానాలు అన్నీ కూడా పార్టీకి తిరిగి జవసత్వాలను తేవడం మీద కేంద్రీకృతమయ్యాయి. పార్టీని తిరిగి క్రియాశీలం, ప్రభావవంతం, సమరశీలం చేయాలంటే, దేశంలో ఇప్పుడు నెలకొన్న ప్రతికూల శక్తులతో, ప్రతీఘాత వాతావరణంలో, ప్రతీఘాత వాతావరంతో ముఖాముఖీ తలపడాలి. అందుకు నిజాయితీతో కూడిన ఆత్మసమీక్ష, దృఢమైన సంకల్పం అవసరం. మధురై మహాసభలలో ఆ ఉత్సాహం, పట్టుదల కనిపించాయని పార్టీ అభిమానులు చెబుతున్నారు. ఈ కాలంలో రెండు లక్షలకు లాగా జనంతో జరిగిన బహిరంగ సభ కూడా దానికి ఓ ఉదాహరణ. అయితే సవాళ్లను మౌలికంగా ఎదుర్కొనడం కాకుండా ఆచరణాత్మకతనే (ప్రాక్టికల్ అప్రోచ్) ప్రధానంగా పరిగణించారానే అనుమానం పరిశీలకులకు కలుగుతోంది.
ఈ మహాసభల నిర్ణయాలను గమనిస్తే, కేరళ కేంద్రిత ఆలోచనావిధానం కేవలం పార్టీ పదవుల ఎంపికలో మాత్రమే కాక పార్టీ రాజకీయ విధానం మీద సైతం ప్రభావం వేస్తున్నట్టు తెలుస్తూనే ఉన్నది.
దేశంలోని పరిస్థితికి అర్థం చేసుకోవడంలో, ప్రతివ్యూహం రచించడంలో మునుపటి ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధోరణికి, ప్రస్తుత నాయకత్వ ధోరణికి వ్యత్యాసం ఉంటుందని ఊహించిందే. పినరాయి విజయన్ విషయంలో పూర్తి సుముఖులు కానప్పటికీ, పనితీరులో కలుపుకునిపోయే తత్వం ఉన్ననాయకుడిగా బేబీకి పేరుంది. ప్రస్తుత దశలో కేరళ నాయకత్వానికి, పార్టీ కేంద్ర నాయకత్వానికి సామరస్య సంబంధాలు అవసరం.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబి ఎన్నిక ఊహించనిదేమీ కాదు. కాకపోతే, ఆయన పేరుతో పాటు మరి నాలుగైదు పేర్లు కూడా పోటీదారుల వరుసలో వినిపించాయి. బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన ప్రతినిధులు బేబి అభ్యర్థిత్వానికి బహిరంగంగా అభ్యంతరం చెప్పారు కూడా. కేరళకు కార్యకర్తల బలం, యంత్రాంగం దన్ను బాగా ఉన్నాయి కాబట్టి, ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి దక్కినా, ఆ రాష్ట్రంలో తేడా ఉండేది కాదు. బెంగాల్ మీద నిజంగా పెద్ద కృషి కేంద్రీకరించాలనుకుంటే, ఆ రాష్ట్రనాయకుడిని పార్టీ నేతగా చేయవచ్చు. కానీ, పార్టీ ఆ రిస్కు తీసుకోవాలనుకోలేదు. బెంగాల్లో అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్‌కు బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక బలహీనపక్షంగా ఉంది. ఈ నాలుగుస్తంభాల ఆటలో తాను కొంత లాభగలనని సిపిఎం అనుకుంటోంది. దాని లక్ష్యం అంత వరకే. కానీ, కేరళలో తాను, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు. ఇద్దరి మధ్య కొంత చోటు చేసుకుని లబ్ధిపొందాలని బిజెపి చూస్తున్నది. క్రైస్తవులను మంచి చేసుకుంటున్నది. వక్ఫ్ సవరణ చట్టానికి క్రైస్తవపార్టీల నుంచి మద్దతు పొందగలిగింది. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ మలయాళీకి ప్రధాన కార్యదర్శి ఎన్నికలో ప్రాధాన్యం లభించిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక అదనపు అంశం అయి ఉంటే ఉండవచ్చును కానీ, పార్టీ అధినేత స్థానానికి బేబీ అర్హుడేనని ఆయన రాజకీయజీవితాన్నిపరిశీలిస్తే తెలుస్తుంది.
పశ్చిమబెంగాల్, త్రిపురలను కోల్పోయిన తరువాత మార్క్సిస్టుపార్టీ ప్రాంతీయపార్టీగా మారిపోయిందనే వ్యాఖ్యలు విన్నాము. ఒక్క మార్క్సిస్టు పార్టీ మాత్రమే కాదు సెక్యులర్, లిబరల్, సెంట్రిస్ట్ పార్టీలుగా చెప్పుకునేవన్నీ క్రమంగా దక్షిణాది పార్టీలు (దక్షిణాది రాష్ట్రాలకు పరిమితం అయిన పార్టీలు) అయిపోతున్నాయి. దేశంలో రూపొందిన రాజకీయ, భావ వాతావరణాల పర్యవసానం ఇది. ఈ పరిణామం ఆయా సానుకూల శక్తులను మరింతగా మూలలకు నెట్టేస్తోంది. వచ్చే సంవత్సరం బెంగాల్లోను, కేరళలోను అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. బెంగాల్లో సిపిఎం అధికారం కోల్పోయి మూడు విడతలు గడిచింది, ఇప్పట్లో పూర్వస్థితి వచ్చే అవకాశం లేదు. కానీ, ఎంతో కొంత ఇంగువ కట్టిన గుడ్డగా బెంగాల్ ఉండకపోతుందా నే ఆశకు, కొన్ని రాజకీయ విన్యాసాలుకూడా జోడిస్తే, చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్థానాలు, తరువాత నాలుగైదు ఎంపీస్థానాలు రాకపోతాయానే ఊహ కూడా పార్టీకి ఉన్నది. కేరళను పదిలపరచుకోవడం, బెంగాల్లో కొంత మెరుగుదల పొందడం, ఈ రెండు లక్ష్యాల నేపథ్యంలో, మధురై మహాసభలు జరిగాయి. ఆ పైన త్రిపురలో పూర్వవైభవం అనే పగటికల కూడా మిగిలే ఉంది.
అయితే, పార్టీ పునరుజ్జీవన సంకల్పానికి అనేక పరిమితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగానే ఎన్నికల రాజకీయాలలో కూరుకుపోయి, పొత్తుల జంజాటంలో తలమునకలై, కాళ్ల కింది నేల జారిపోతున్నా గమనించకపోవడం వల్ల పునాదులు తుడిచిపెట్టుకుపోవడం అనే స్థూలమైన చారిత్రక కారణం ఎలాగూ ఉంది. ఇప్పటి నిర్దిష్ట పరిస్థితులలో సిపిఎంకు అనివార్యతా, ముందరికాళ్లకు బంధమూ కూడా- కేరళ కేంద్రిత దృక్పథం. ఒంటరి కోట కేరళను కాపాడుకోవడానికి, కేరళ పార్టీ నాయకత్వాన్ని స్థిరపరచుకోవడానికి లోబడి మాత్రమే పార్టీ ప్రయాణం ఉండబోతోంది. పార్టీ ఉద్దేశ్యం అది కాకపోవచ్చు, కానీ, ప్రస్తుత గమనం చేర్చిన మజిలీ అదే.
కేరళను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు విషయమై పెడసరపు ధోరణి వహిస్తున్నారేమో అనిపిస్తుంది. మతతత్వ లేక నయా ఫాసిస్టు లక్షణాల ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలో అన్ని సానుకూల శక్తులను కూడగడతామని, కలసి నడుస్తామని చెప్పుకుంటున్నప్పుడు, కాంగ్రెస్‌ను మినహాయించడం ఎట్లా కుదురుతుంది? సర్వశక్తుల మోహరింపు లేకుండా, ప్రమాదాన్నిఎట్లా ఎదుర్కొనడం? పోనీ, కేరళ, బెంగాల్ వంటి సమస్యాత్మక రాష్ట్రాలు మినహా తక్కిన దేశమంతా కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తామని, ఎన్నికల పొత్తులు పెట్టుకుంటామని ఒక వైఖరిగా చెప్పవచ్చు. కానీ, అటువంటి వైఖరి, కేరళలో తాము, కాంగ్రెస్ బద్ధవైరులమన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన సిపిఎం ను వెన్నాడుతోంది. అంతేకాదు, బెంగాల్లోను, కేరళలోనూ ఆపద్ధర్మంగా, శత్రువులకు శత్రువు మిత్రుడు అన్న వైఖరి అనుసరించవలసి వస్తే, ప్రత్యక్షంగా సాధ్యం కాదు కానీ, పరోక్షంగా బిజెపితో కూడా ఒక అనధికార అవగాహన అవసరమైతే ఎట్లా అన్నది సిపిఎం ఆచరణాత్మక సంశయం. ఇదేమీ కొత్త విషయం కాదు, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో, మార్క్సిస్టు పార్టీయే కాదు, విప్లవపార్టీలని చెప్పుకునే ఎంఎల్ పార్టీలు కూడా బిజెపితో కలసి పనిచేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. సీపీఎం ఓటింగ్ కూడా గతంలో మమతాను వ్యతిరేకిస్తూ బీజేపీ ఖాతాలో పడిన విషయాన్ని ఆ పార్టీ పత్రాలే పేర్కొంటున్నాయి.
కేరళలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బిజెపితో రహస్య స్నేహం అవసరం అవుతుందా ? అవసరం అయితే పార్టీ అందుకు సిద్ధం అవుతుందా అన్నవి తక్షణ ప్రశ్నలు. కేంద్రం ఏజెన్సీల నుంచి ఇబ్బంది ఎదురుకాకుండా మంచి చేసుకోవలసిన అవసరం కూడా ఉందన్న విమర్శలు ఉందనే ఉన్నాయి. ఈమధ్య నే జరిగిన కేరళ శాఖ మహాసభల్లో పినరయి వ్యవహారశైలి పట్ల పార్టీ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసినట్లు పత్రికల్లో విశ్లేషణలు చూసాము. ఒక్కోసారి విశాలమైన, స్థూలమైన సైద్ధాంతిక అవగాహనలు ఒకరకంగా ఉంటే, క్షేత్రస్థాయిలో పడే రాజీలు మరోరకంగా ఉంటాయి. ఫాసిజం కాదు, నయాఫాసిజం కాదు, లక్షణాలు మాత్రమే అని ప్రత్యేకంగా వక్కాణించి చర్చకు తెరలేపడంలో కూడా, పట్టువిడుపుల అవసరాలకు పనికివచ్చే వ్యూహమేదో ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానించారు కూడా. అన్నట్టు ముసాయిదాలోని ఈ లక్షణాల సూత్రీకరణను అంతిమంగా పార్టీ మహాసభ ఆమోదించింది.
అమెరికా వ్యతిరేక వైఖరి సిపిఎం అంతర్జాతీయ విధానంలో భాగం. అది సరే. కానీ, చైనా కేంద్రితంగా భూభౌగోళిక రాజకీయాలను దర్శిస్తుందని, చైనా మీద మొగ్గు చూపుతుందని సిపిఎం మీద ఉన్న విమర్శ ఇప్పటిది కాదు. చైనా యుద్ధం కాలం నుంచి ఉన్న ముద్రలనే ఇప్పుడు మరింత ప్రస్ఫుటంగా వేస్తున్నారు. ఇది పార్టీ మనుగడకు ఇబ్బంది కలిగించే అంశమే. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు శిబిరాలు లేకపోవడం వల్ల గతంలోని ముద్రలను తొలగించే అవకాశం భారత కమ్యూనిస్టులకు వచ్చింది. చైనాను ఆదర్శంగా చెప్పడంతో పాటు, భద్రతా అంశాలలో ఆ దేశాన్ని సమర్థించడం ఇప్పుడు అవసరమే లేదు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల విషయంలో యుపిఏ 1 హయాంలో పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో దివంగత కార్యదర్శి ఏచూరి మార్గం చూపించే ఉన్నారు. నిజానికి నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం పైకి చైనాను విమర్శిస్తూ ఆ దేశంతో అవకాశవాద మైత్రి సాగిస్తున్నారు. పైగా కమ్యూనిస్టులను చైనా అనుకూలురని నిందిస్తున్నారు. సిపిఎం మహాసభలకు చైనా కమ్యూనిస్టుపార్టీ పంపిన సందేశం చూస్తే, అందులో ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించిన గోలే తప్ప, పార్టీల సంబంధం గురించి మాటే లేదు. కమ్యూనిస్టు పదజాలానికి చెందిన ఒక్క వ్యక్తీకరణా లేదు.
మతతత్వాన్ని దృఢంగా ఎదుర్కోవాలని తీర్మానాలు చెబుతున్నప్పటికీ, ఆచరణలో తాము మతవ్యతిరేక పార్టీగా కనిపించకుండా జాగ్రత్తపడాలని సిపిఎం చూస్తున్నట్టుంది. బలహీనపడడానికి తమకు నాస్తిక పార్టీగా ముద్ర పడడం కూడా కారణమని నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. మతవిశ్వాసుల మధ్యకు కూడా పార్టీని తీసుకుపోవాలనుకోవడం కానీ, మతానికి మతతత్వానికి మధ్య తేడాను ప్రచారం చేయాలనుకోవడం కానీ మంచి ఆలోచనలే. కానీ, కమ్యూనిస్టు పార్టీకి దైవం మీద, మతం మీద విశ్వాసం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నంత మాత్రాన, అది ఒక ప్రతికూల అంశంగా మారుతుందా అన్నది ప్రశ్నించుకోవాలి. తెలంగాణ సాయుధపోరాటంతో సహా, దేశంలో అనేక చోట్ల రైతాంగ, కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించినప్పుడు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం కాలేదు? ఆ నాడు కూడా కమ్యూనిస్టులు ప్రజల మతవిశ్వాసాలలో కల్పించుకోలేదు, నాస్తిక ప్రచారాలూ చేయలేదు. అనేక దైవారాధనలకు, ఉధృతమైన సాంస్కృతిక మత వ్యక్తీకరణకు పేరుపొందిన తమిళులు, నాస్తికులమని చెప్పుకునేవారి రాజకీయ నాయకత్వాన్ని ఏ సమస్యా లేకుండా ఆమోదిస్తున్నప్పుడు, కమ్యూనిస్టులకు వచ్చిన ఇబ్బందేమిటి? ఇటీవలి కాలంలో కమ్యూనిస్టుల ప్రభ తగ్గిపోయాక, యువకులు కొత్తగా తమ వెంట రాకపోయేసరికి, వామపక్షాలు అనేక తప్పుడు ఆత్మవిమర్శలు చేసుకుంటున్నాయి. అట్లాగే, సాంకేతిక సాధనాలను, సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం మీద కూడా వారికిప్పుడు చాలా పశ్చాత్తాపంగా ఉన్నది. ఈ విషయాన్ని పార్టీ సమీక్ష నివేదిక లోనూ ముసాయిదా తీర్మానంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవడం గమనించాల్సిన విషయం. రాజకీయ వైఫల్యాలకు కారణాలను సాంకేతికతలో వెదకడంలో ప్రయోజనం లేదు. అయితే, విడిచిపెట్టవలసినవి వదలేయవలసిందే, కొత్తగా అలవరచుకోవలసినవి స్వీకరించవలసిందే. తాము పనిచేసే సమూహాలతో సజీవసంబంధంలో ఉంటే, అన్ని సాంకేతికాలూ హేతువాదాలూ ఏవీ సమస్యగా ఉండవు.
మార్క్సిస్టు పార్టీ ఇప్పటిదాకా సాగించిన ప్రయాణానికి అనుగుణమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటేనే దాని జనాదరణ పెరుగుతుంది. మతతత్వాన్ని, నియో ఫాసిస్టు లక్షణాలను గట్టిగా ఎదుర్కొనగలిగే శక్తి సీపీఎంకు ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న పాటీ చేయలేరా ఆ పార్టీ నేతలు? రాజీలేని ప్రజాస్వామ్యపోరాటాలను చట్టసభలలోను, బయటా చేయాలనుకున్నప్పుడు, అందుకు తగ్గ వ్యూహరచనే చేయాలి. ఆచరణాత్మకత పేరుతో సర్దుబాట్లలోకి దిగినా, బలశాలి ప్రత్యర్థిని చూసి బెదిరి తనలోనే లోపాలున్నాయనుకునే ఆత్మన్యూనతలో పడిపోయినా, సంస్థలు ఆత్మను నిలబెట్టుకోలేవు.
కె. శ్రీనివాస్
రచయిత ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ సంపాదకులు. ఇందులో ప్రస్తావించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం – సంపాదకులు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.