
పిల్లలకు మంచి సాహిత్యాన్ని అలవాటు చేయండంటే ”వారికి అంత సమయం దొరకటం లేదండి, స్కూలు నుంచి వచ్చాక ట్యూషన్, హోమ్ వర్క్స్తోనే సరిపోతుంది” అని ప్రస్తుత తల్లిదండ్రులు సమాధానం చెప్తారు. ఇంకో సమస్య ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మోజులో పడిపోయి చాలామందికి తెలుగు కూడా రాని పరిస్థితి నెలకొంది. సరే పిల్లలకు వచ్చిన భాషలోనైనా సాహిత్య పఠనం అలవాటు చేసే పరిస్థితులు లేకపోవటం దురదృష్టకరం.
ఒకప్పుడు బాలజ్యోతి, బాలమిత్ర, చందమామలాంటి మాస పత్రికలు పిల్లలకు చక్కని సాహిత్యాన్ని అందించాయి. అదే సమయంలో రష్యాలోని రాదుగా ప్రచురణాలయం నుంచి వచ్చే పుస్తకాలు చాలా అద్భుతంగా ఉండేవి. చాలా తక్కువ ధరకు హార్డ్ బౌండ్‌తో ఎంతో నాణ్యతతో ఉండేవి.
పుస్తక పఠనం అత్యవసరం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి గంటలు గంటలు గడిపేస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంట్లో ఒక మినీ లైబ్రరీ ఉండేలా పేరెంట్స్ చూసుకోవాలి. పుస్తకాలపై వచ్చే సమీక్షలు పిల్లలతో చదివించి వారికి నచ్చిన పుస్తకాలను కొనుక్కునే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి నెల ఒకటి లేదా రెండు పుస్తకాలు కొనుక్కొని చదివేలా చేయాలి. మాతృభాషతో పాటు ప్రపంచంలోని మరే ఇతర భాషలు నేర్చుకున్నా కలిగే నష్టమేమీ లేదు ఎక్కువ లాభం తప్ప. సాహిత్య పఠనంతో పాటు పిల్లలు ఎక్కవ భాషలు నేర్చుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
సాధారణంగా చిన్నపిల్లలు బొమ్మలతో కూడిన కథలను, కార్టూన్స్‌ను చూడటానికే ఆసక్తి చూపిస్తారు. ఇక టీనేజీ పిల్లలు కాల్పనిక సాహిత్యం చదవటానికి ఇష్టపడతారు. పిల్లలు చిన్నప్పటి నుంచే సాహిత్యం చదువుకోవడం ద్వారా ఊహాశక్తి పరిధిని విస్తృతం చేసుకుంటారు. బాల సాహిత్యం అంటే బాలలే చదవాలని కాదు, ఆ సాహిత్యాన్ని పెద్దలు కూడా చదవాలి. చదివిన విషయాలను పిల్లలతో చర్చ పెట్టాలి. పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతూ పిల్లలకు చదివే సమయం దొరకనప్పుడు పెద్దలు వారికి రోజుకో కథ చెప్పే పరిస్థితులను కల్పించుకోవాలి. ప్రచురణ సంస్థలు తెస్తున్న పుస్తకాలను, బాల సాహిత్యాన్ని రాసే రచయితలను ఎప్పటికప్పుడు పరిచయం చేయాలి.
ఎదుగుదలకు దోహదం..
పిల్లల పుట్టినరోజుకు ప్లాస్టిక్‌తో చేసిన బొమ్మలకు బదులు మంచి పుస్తకాలను కానుకగా ఇస్తే బాగుంటుంది. ఏడాదంతా పాకెట్ మనీ దాచుకుని అందులో కొంత భాగాన్ని బుక్ ఫెయిర్స్‌కు వెళ్ళి పుస్తకాలను స్వంతం చేసుకొని ఆలోచన కలిగించాలి. విస్తృత పఠనం వల్ల ఇప్పుడు చూస్తున్న సమాజం, ప్రకృతి, పర్యావరణం మొత్తం గతంలో ఎట్లా ఉండేది అన్న ఆలోచనలు వారిలో కలుగుతాయి. ఇదే సమాజం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్న ఊహ వారిని వెంటాడుతుంది. ఇది వారి ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది.
కేవలం తరగతి గదిలో సిలబస్ నేర్చుకుంటే మార్కులు ర్యాంకులు సాధిస్తే సరిపోతుంది అని అటు విద్యాసంస్థలు, ఇటు పేరెంట్స్ అనుకుంటే మనం చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. తరగతి గది ఫ్యాక్టరీ కాదు వస్తువులను ఉత్పత్తి చేయడానికి, తరగతి గది అంటే భవిష్యత్తు తరాన్ని అందంగా తీర్చిదిద్దే నిలయం. తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ ముందు బెత్తం పట్టుకొని నిలుచునే ఉపాధ్యాయుడు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చూసే వారిగానే మిగలకూడదు. తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచనలో ఉండకూడదు.
శాస్త్రీయ ఆలోచన విధానంతో ఎదిగేలా చూడాలి. ప్రశ్నించే తత్వాన్ని, తార్కిక దృష్టిని బాల్యం నుంచే అలవర్చాలి. అందుకే బాల్యం నుంచే పుస్తక పఠనం అన్నది వారికొక వ్యసనంలా మారిపోయేలా చేయాలి. ఈ వేసవి సెలవులకు కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని పూర్తిచేసేలా పిల్లలకు మంచి ప్లానింగ్ ఇవ్వాలి. ఇలాంటి మంచి ఆలోచనలు ఆచరణలో రావాలని కోరుకుందాం.
పివి రావు
సీనియర్ జర్నలిస్ట్
(నేడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం )