
కాల్పులు, సైనిక చర్యలను విరమించనున్న రెండు దేశాలు
భారత్- పాకిస్తాన్‌లు పరస్పరం సైనిక చర్యలకు దిగటం, కాల్పులు- ప్రతికాల్పులు జరపుకోవడంతో రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఆరేళ్ల క్రితం నాటి స్థాయికి చేరాయి. ఆరేళ్ల క్రితం పుల్వామాలో సైనికులను తీసుకెళ్తున్న వాహనాల సముదాయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రంపై భారత సైన్యాలు మెరుపు దాడులకు దిగాయి. తిరిగి ఆరేళ్ల తర్వాత అటువంటి ఉద్రిక్తతల తీవ్రత కనిపిస్తోంది.
ఈ రోజు సాంయత్రం ఆరు గంటలకు మొదలైన విలేకరుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రి మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ భారతదేశానికి చెందిన డెరక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్‌కు ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేశారని వెల్లడించారు.
ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఇరు పక్షాలు భూమ్మీద, గగనతలంలోనూ, సముద్ర జలాల్లోనూ ఎటువంటి కవ్వింపు చర్యలకు, కాల్పులకు దిగబోమని ఇరువురూ అంగీకరించారు. ఈ అవగాహనను ఆచరణలో పెట్టేందుకు ఇరుపక్షాలు తదుపరి ఆదేశాలు జారీ చేశాయి. మే 12 వ తేదీన 12 గంటలకు తిరిగి ఇరు దేశాలకు చెందిన డెరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ మాట్లాడుకుంటారని విక్రం మిస్రి తెలిపారు.
ఇదిలా ఉండగా ఎన్డీటివి వరల్డ్ విభాగం ప్రచురించిన కథనం ప్రకారం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చొరవ తీసుకున్నారు. రెండు దేశాలు ఎక్కడివాళ్లక్కడే ఆగిపోవాలని, కాల్పుల విరమణకు అంగీకరించాలని వాషింగ్టన్లో ఓ ప్రకటనలో కోరారు.
నిన్న రాత్రంతా అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత శనివారం, మే 10న సాయంత్రం 5.25 గంటలకు రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్ నుంచి ఈ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే ఇదే ప్రకటనను భారత్- పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు విడుదల చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ భారతదేశానికి చెందిన అదే స్థాయి అధికారితో మాట్లాడిన తర్వాత సాయంత్రం ఐదుటంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
ట్రూత్ సోషల్ అనే వెబ్సైట్ ఈ రోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఓ కథనంలో ట్రంప్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ‘‘రాత్రంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగిన చర్చల తర్వాత రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలూ ఇంగితజ్ఞానాన్ని, తెలివితేటలను ప్రదర్శించినందుకు అభినందనలు. ఈ విషయంపై ఇప్పటి వరకూ ఆసక్తికి మీ అందరికీ ధన్యవాదాలు’’అని ఆ పోస్టులో ఉంది.
మరోవైపు శనివారం మే 10న భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తోనూ, పాకిస్తాన్ ఆర్మీ ఛీప్ ఆసిం మునీర్తోనూ నేరుగా మాట్లాడి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న విస్తృతమైన సమస్యల గురించి చర్చించుకోవడానికి సిద్ధమయ్యారి రూబియో ప్రకటన వెల్లడించింది.
భవిష్యత్తులో పాకిస్తాన్ ఎటువంటి ఉగ్రవాద చర్యలకు అవకాశం ఇచ్చినా అది యుద్ధంతో సమానమేనని ఉన్నత వర్గాలను ఉంటకిస్తూ ఎన్డీటివి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ కాల్పుల విరమణ ప్రకటించటానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాలకు చెందిన డైరెక్టర్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్‌లు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నేరుగా మాట్లాడుకున్నారనీ, తదుపరి చర్చలు సోమవారం పన్నెండు గంటలకు జరుగుతాయని ట్రంప్ ప్రకటన వెల్లడించింది. ఇది పాకిస్తాన్, భారతదేశాలకు సంబంధించిన సమస్య మాత్రమేననీ, దాంతో మాకు పని లేదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చేతులెత్తిన 24 గంటల్లోనే అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంగా జరిగిన చర్చల ఫలితంగా రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించటం గమనార్హం.