
ఒక అబ్బాయి క్రికెట్ ఆటస్థలం కోసం చేసిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో భూఆక్రమణకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగంలోకి దిగిన హైడ్రా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా రాయదుర్గంలోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. నార్నే ఎస్టేట్ నిర్మించిన అక్రమనిర్మాణాలను నేలమట్టం చేసింది. అక్రమార్కులు పక్కకే ఉన్నటువంటి నీటి కుంటను కూడా మట్టితో పూడ్చేశారు.
అంతేకాకుండా, 39.2 ఎకరాలలో అభివృద్ధి పనులను చేస్తున్న హాఫీజ్‌పేట్‌లోని వసంత హోమ్స్ మీద ఏకకాలంలో హైడ్రా బృందం చర్యలు తీసుకుంది. అయితే గతంలో ఈ భూమి మీద సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత భూమిగా కోర్టు పేర్కొన్నా, అందులో వసంత హోమ్స్ నిర్మాణాలు చేపట్టింది. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
క్రికెట్ ఆటస్థలం కోసం విజ్ఞప్తి..
క్రికెట్ ఆటస్థలం కోసం ఒక చిన్న అబ్బాయి చేసిన విజ్ఞప్తి, భూఆక్రమణలపై భారీ చర్యలకు ప్రభుత్వ అధికారులను పురికొల్పింది. అంతేకాకుండా రాయదుర్గంలోని అక్రమ నిర్మాణాలను, 39 ఎకరాల ప్రభుత్వ భూమి పునరుద్ధరణకు దారితీసింది. అయితే హెచ్డీఆర్, హైడ్రాకు ఓ అబ్బాయి ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో రాయదుర్గ్‌లోని భూమిలో స్థానిక పిల్లలు ఒకప్పుడు క్రికెట్ ఆడేవారని, ఆ భూమి చుట్టూ ప్రస్తుతం కంచె వేసి రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేశారని పేర్కొన్నాడు. దగ్గరలో ఉన్నటువంటి కుంటను కూడా పూడ్చేసి, హౌసింగ్ ప్లాట్స్ కోసం రోడ్లను నిర్మించారని ఫిర్యాదు లేఖలో ప్రస్తావించాడు.
తమకు ఫిర్యాదు అందగానే హైడ్రా అధికారులు వెంటనే రాయదుర్గ్‌లోని షేక్‌పేట్ మండలంలో చెప్పబడిన ప్రాంతానికి క్షేత్రపరిశీలనకు వెళ్లారు. సర్వే నెంబర్ 5/2 భూమిలో భారీ మొత్తంలో చట్టవిరుద్ధ భూఆక్రమణను గుర్తించారు.
ఈ అంశం మీద హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. “తనిఖీలో 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్టు తేలింది. అది వివాదాస్పదమైన భూమి అని సైన్ బోర్డులు స్పష్టంగా చెప్తున్నాయి. అయినప్పటికీ కాంటాక్ట్ నంబర్లు, మార్కెటింగ్ ప్లాట్లతో ఉన్నటువంటి తమ సొంత సైన్ బోర్డ్లను నార్నే ఎస్టేట్స్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆ స్థలంలో వారు రోడ్లు వేశారు, ఎటువంటి అనుమతి లేకుండా భూమిని అమ్ముతున్నారు. దగ్గరే ఉన్నటువంటి కుంటను కూడా పూడ్చేశారు” అని అన్నారు.
అయితే, రంగంలోకి దిగిన హైడ్రా చట్టవిరుద్ధ నిర్మాణాలను కూల్చివేసింది, ఆక్రమణలను తొలిగించేసింది, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి గుర్తులను పునరుద్ధరించింది. అంతేకాకుండా భూకబ్జా చేయడం, అనధికారికంగా అభివృద్ధి పనులను చేపట్టడం, నీటి వనరులను ఆక్రమించడంలాంటి కేసులను నార్నే ఎస్టేట్స్ మీద పోలీసులు నమోదు చేశారు.
హఫీజ్‌పేట్‌లో కూడా భారీ ఆక్రమణ..
ఇదిలా ఉంటే మరోవైపు ఏకకాలంలో హఫీజ్‌పేట్‌లో కూడా భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి. శేర్లింగంపల్లి పరిధి సర్వే నెంబర్ 79లో 39.2 ఎకరాల నిషేధిత ప్రభుత్వ భూమిని అక్రమార్కులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ భూమిలో నివాస, వాణిజ్య ఆస్తులను సగానికి పైగా అభివృద్ధి చేశారు.
“వసంత హోమ్స్ నిర్మాణ సంస్థ, అధికారులను తప్పుదారి పట్టించడానికి మోసపూరిత సబ్ సర్వే నంబర్‌ను సృష్టించడానికి సర్వే రికార్డులను తారుమారు చేసింది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా 19 ఎకరాలలో గృహనిర్మాణాలు చేసింది. మిగిలిన భూమిని కార్యాలయ స్థలాలు, షెడ్లుగా మార్చి ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇచ్చింది” అని రంగనాథ్ తెలియజేశారు.
ఈ భూమికి సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉంది, తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి అభివృద్ధి పనులను చేయకూడదని స్పష్టమైన ఆదేశాన్ని కోర్టు జారీ చేసింది. అయినప్పటికీ సంస్థ అక్రమ నిర్మాణాలను స్థలంలో చేపట్టింది. కొన్ని రోజుల క్రితం విచారణ సందర్భంగా, ఈ విషయం మీద కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతేకాకుండా న్యాయపరమైన అనుమతి లేకుండా ఇటువంటి ఉల్లంఘనలను ఎలా అనుమతించారని అధికారులను ప్రశ్నించింది. అప్పటి నుంచి అక్రమ సరిహద్దు గోడలు, అంతర్గత నిర్మాణాలను కూల్చివేసి, ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తూ హైడ్రా సంకేతాలను ఏర్పాటు చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.