
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌లు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి.
అత్యవసర పరిస్థితి కాలం ప్రజాస్వామ్యాన్ని గృహ నిర్బంధంలో ఉంచిన కాలంగా స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. అనంతరం ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా ఆయన కృషి గురించి వెలువడిన పుస్తకాన్ని ప్రోత్సహిస్తూ ప్రసంగించారు.
తర్వాత బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అదే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో పాత కాల యువకుడు వంశపారంపర్య రాజకీయాలను కాపాడుకోవడానికి విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి వంశ పారంపర్య రాజకీయాలను తుదమట్టించడంలో కీలకపాత్ర పోషించిన మోదీ 2014లో ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం దైవ నిర్ణయమని చెప్పారు.
ఢిల్లీలో నగరవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఇదే పేరుతో అన్ని రాష్ట్రాలు అత్యవసర పరిస్థితి సభలను నిర్వహించాలని బీజేపీ కోరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని బీజేపీ పాటించటం కేవలం నాటకం మాత్రమేనని ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వేసిన ఎత్తుగడని విమర్శించారు.
మరోవైపున ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దానికి నాయకత్వం ఇస్తున్న బీజేపీ అప్రకటిత అత్యవసర పరిస్థితిని అమలు చేస్తుందని విమర్శించాయి.
జూన్ 25వ తేదీ ప్రధానమంత్రి మోదీ ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో దేశ ప్రజలు జూన్ 25న సంవిధాన్ హత్య దివస్‌గా జరుపుకుంటున్నారని చెప్పారు. ఆరోజున అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గృహ నిర్బంధంలో పెట్టిందని ఆ పోస్టులో మోదీ వ్యాఖ్యానించారు.
“ఈరోజున భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక విలువలను పక్కన పెట్టారు. ప్రాథమిక హక్కులను రద్దు చేశారు. పత్రికా స్వేచ్ఛకు మంగళం పాడారు. పలువురు రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు సాధారణ పౌరులు జైళ్ళ పాలయ్యారు. ఇదంతా చూస్తే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గృహ నిర్బంధంలోకి నెట్టింది అనిపిస్తుంది” అని మోదీ ఎక్స్ ప్రకటన వ్యాఖ్యానించింది.
తరువాత సీరియల్‌గా పెట్టిన పోస్టులలో మోదీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ గౌరవ వందనం అందించారు. అటువంటి వారందరి ఉమ్మడి పోరాట ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి వచ్చిందని తాజా ఎన్నికలకు పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని ఆ పోస్ట్‌లో తెలిపారు. ఎమర్జెన్సీ అనంతర ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది.
“రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేయడానికి మేము పునరంకితం అవుతున్నాము. వికసితభారత్ లక్ష్య సాధన కోసం అందరితో కలిసి పని చేస్తాము. పేదల ఆకాంక్షలు నెరవేరుస్తూ భారతదేశం నూతన శిఖరాలు అధిరోహిస్తుందని ఆశిద్దాం” అని మోదీ తన పోస్టులో తెలిపారు.

తరువాత పెట్టిన పోస్టులలో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తనకు ఎమర్జెన్సీ రోజులు రాజకీయ పాఠాలు నేర్చుకోవడానికి పనికి వచ్చాయని ఈ వివరాలన్నీ త్వరలో విడుదల కానున్న పుస్తకంలో ఉన్నాయని ఈ పుస్తకానికి మాజీ ప్రధాని దేవి గౌడ ముందుమాట రాశారని మోదీ తెలిపారు.
“ఎమర్జెన్సీ విధించినప్పుడు నేను యువ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం నాకు ఎంతో నేర్పింది. ప్రజాస్వామ్య చట్రాన్ని సంరక్షించుకోవాల్సిన ప్రాధాన్యతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించింది. అదే సమయంలో వివిధ రాజకీయ స్రవంతులకు చెందిన నాయకుల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
“బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ నాటి నా అనుభవాలను క్రోడీకరించి పుస్తక రూపంలో వెలువరించినందుకు సంతోషిస్తున్నాను. ఈ పుస్తకానికి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట నాయకుడు, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ముందుమాట వ్రాశారు”
“ది ఎమర్జెన్సీ డైరీస్- నాయకుడు ఆవిర్భవించిన సంవత్సరాలు” పేరుతో బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సెక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంచిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మోదీ గురించి అమిత్ షా ప్రస్తావించారు.
“ఈ పుస్తకంలో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎమర్జెన్సీ కాలంలో ఆయన అనుభవాలను క్రోడీకరించారు. పాతికేళ్ల యువకుడైన మోదీ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో 19 నెలల పాటు పాల్గొన్నారు. ఆ రోజుల్లో రహస్య పత్రికలు వచ్చేవి. వాటిని ప్రచారం చేయడంలో విద్యార్థులు, దుకాణ సముదాయాలు, మహిళల వద్దకు చేర్చడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. సాధువు వేషం, సర్దార్ వేషం, హిప్పీ జుట్టు, సాంబ్రాణి అమ్మే వ్యక్తి, న్యూస్ పేపర్లు అమ్మేవాడిగా పలు వేషాలలో మోడీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేశారు” అని అమిత్ షా వివరించారు.
“దైవ నిర్ణయం ఎలా ఉందో చూడండి. ఇందిరాగాంధీ నేతృత్వాన్ని గ్రామగ్రామాన ఇంటింటికి తిరిగి వ్యతిరేకించిన పాతికేళ్ల యువకుడే 2014లో వంశ పారంపర్య రాజకీయాలను తుద ముట్టించారు” అంటూ మోదీ గురించి అమిత్ షా వివరించారు.
“ఎమర్జెన్సీ అనుభవాలు నిరంతరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తకూడదు యువత సంఘటితం కావాలి. మెరుగైన సంస్కృతిని అలవరించుకోవాలి” అన్నారు అమిత్ షా. అందుకే ప్రధానమంత్రి మోదీ జూన్ 25న సంవిధాన్ హత్య దివస్‌గా ప్రకటించారని అమిత్ షా చెప్పారు.
బీజేపీ నాటకాలు..
జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దివస్‌గా జరుపుకోవాలనే బీజేపీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా ఓ పెద్ద డ్రామా అని, బీజేపీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆడుతున్న నాటకమని ధ్వజమెత్తారు.
దేశ విముక్తి కోసం సాగిన పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేని వారు, రాజ్యాంగ రచనలో భాగస్వామ్యం లేనివారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు. 50 ఏళ్ల తర్వాత అత్యవసర పరిస్థితి గురించి చర్చించడం దయ్యాలు వేదాలు వల్లె వేసినట్టు ఉందని ఖర్గే విమర్శించారు.
“భారతీయ సంస్కృతి, మనుస్మృతికి తావులేని రాజ్యాంగం అంటూ విమర్శించిన వారు గత సంవత్సరకాలంగా కాంగ్రెస్ సంవిధాన్ బచావో యాత్ర నిర్వహిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటున్నారు. సంవిధాన్ బచావో యాత్రతో బీజేపీ అల్లకల్లోలమైంది. అందుకే 50 ఏళ్ల క్రితం జరిగిన అత్యవసర పరిస్థితి గురించి చర్చకు తెస్తున్నారు” అంటూ ఖర్గే విమర్శించారు.
” వీళ్లు దేశాన్ని పాలించడంలో విఫలమైన వాళ్ళు. అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి, ఆర్థిక వైఫల్యాలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు” అన్నారు ఖర్గే. ఈ వైఫల్యాలు కప్పించుకోవడానికే పాలక పార్టీ నాటకాలు ఆడుతోందని, అసత్యాలు ప్రచారం చేస్తోందనీ విరుచుకుపడ్డారు.

ఇందిరాగాంధీ పై బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితి విధించటానికి రాజ్యాంగం అవకాశాలు కల్పిస్తూ ప్రతిపాదించిన అధికరణాలను సవరిస్తూ 1978లో మొరార్జీ దేశాయి ప్రభుత్వం ప్రతిపాదించిన 44వ రాజ్యాంగ సవరణను ఇందిరా గాంధీ సమర్థించిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. ఈ సవరణ ద్వారా ఆంతరంగిక అల్లర్ల పదం స్థానంలో సాయిధ తిరుగుబాటు అన్న పదాన్ని చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమర్థన తెలిపారని ఖర్గే గుర్తు చేశారు.
అప్రకటిత ఎమర్జెన్సీ..
భారత ప్రజాస్వామ్యం వ్యవస్థాగతంగా ప్రమాదంలో ఉందని, పంచముఖ దాడులను ఎదుర్కొంటుందని అప్రకటిత ఎమర్జెన్సీ@11 పేరుతో విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ వివరించింది.
ఎమర్జెన్సీ విధించిన 50 ఏళ్ల తర్వాత పాలనలో అధిక సంఖ్యాకుల రాజకీయాలను అమలు చేస్తున్న సంఘ్ పరివార్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లోకి తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ విమర్శించారు.
వర్తమానంలో ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతున్న అణచివేత శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు
ఎమర్జెన్సీ అనుభవాలు గుర్తు చేసుకోవాలని పినరై అన్నారు.
ఎమర్జెన్సీ దేశ రాజకీయ యవనికపై మాయని మచ్చ అని, అదే సమయంలో ఇందిరాగాంధీ సైతం ఆ తర్వాత ఎన్నికలు జరిపి బహిరంగంగా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ గుర్తు చేశారు.
“ఎమర్జెన్సీని కాపీ కొట్టే హడావుడి పనులు పక్కనపెట్టి ప్రధానమంత్రి మోదీ విలేకరుల సమావేశానికి హాజరు కావచ్చు కదా అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇందిరాగాంధీ వీడియోను సాగరిగా ఘోష్ పోస్ట్ చేశారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ కే ఝా స్పందిస్తూ అత్యవసర పరిస్థితి వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుందని వ్యాఖ్యానించారు.
“1975 జూన్ 25 భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం అనటంలో సందేహం లేదు. అయినా ఎమర్జెన్సీని గుర్తు చేసుకునేటప్పుడు అదేదో గతానికి సంబంధించిన అంశంగా పరిగణించరాదని వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి అద్దంలా పనికొస్తుంది అన్న విషయాన్ని మర్చిపోరాదని” ఝా అన్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.