
దేశంలో వక్ఫ్ చట్టానికి భారీ సవరణలు చేసి, పార్లమెంట్లో కొత్త బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఏపీలో వక్ఫ్ ఆధీనంలోని భూములలో ప్రజోపయోజన ప్రాజెక్టులంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో దీని వెనుక ఏం అర్థముంది, ఈ సమయంలోనే ఈ నోటిఫికేషన్‌ను వక్ఫ్ బోర్డ్ ఎందుకిచ్చింది? ఎవరి ప్రయోజనం దీని వెనుక దాగి వుందన్న ప్రశ్నలు తెరమీదికొచ్చాయి. వక్ఫ్ భూములలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడానికి పీపీపీ విధానంలో కేటాయింపు జరపడానికి వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని వందల ఎకరాల వక్ఫ్ భూములు ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇదంతా ప్రభుత్వ కనుసన్నలలోనే జరుగుతోందా? లేక వక్ఫ్ బోర్డ్ పెద్దలు తమ లాభాపేక్షతో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలవదు. కానీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు తమ అధీనంలోని వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించింది. దీని కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఆసక్తిని తెలుపవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను దీర్ఘకాలిక లీజ్ ప్రాదిపదికన లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్(PPP)విధానంలో అభివృద్ధి చేయటానికి అవకాశం ఉందని ఆప్షన్ ఇచ్చారు. వక్ఫ్ భూములు ఎకరం నుంచి రెండు వందల ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయని, ఇందులో ఏ ప్రాజెక్టు అభివృద్ధికయినా ముందుకు రావొచ్చని తెలిపింది.
ఆసక్తి ఉన్న సంస్థలు మే 8వ తేదీ నాటికి తమ ఆసక్తిని తెలియచేయాల్సి ఉంటుంది. కమర్షియల్ డెవలప్మెంట్తో పాటు సోలార్ ఎనర్జీ పార్క్స్, ఇండస్ట్రియల్ వెంచర్స్, విద్యా సంస్థలు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌కు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నోటిఫికేషన్లో వెల్లడించారు. అయితే ధరఖాస్తు చేసుకున్న సంస్థలు తమ కంపెనీ ప్రొఫైల్‌తో పాటు గతంలో చేసిన ప్రాజెక్ట్‌ల వివరాలు అందివ్వాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ టర్నోవర్, ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంది. వక్ఫ్ బోర్డు భూములను డెవలప్ మెంట్‌తో పాటు పీపీపీ మోడల్ , దీర్ఖకాల లీజుకు అప్పగించాలని నిర్ణయించారంటేనే ఇందులో ఏదో అర్థముందన్న టాక్ నడుస్తోంది. అదీకాక అర్హత ఉన్న ఈఓఐలను ఎంపిక చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన కంపెనీలు వక్ఫ్ బోర్డు ఆయా కంపెనీలతో పంచుకున్న భూముల వివరాలను బహిర్గతం చేయమనే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అనుమానం మరింత బలపడుతోంది. భూముల వివరాలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందుగానే నోటిఫికేషన్లో కొన్ని ప్రాజెక్టులకు అనుకూలంగా సోలార్ ఎనర్జీ పార్క్స్, ఇండస్ట్రియల్ వెంచర్స్, విద్య సంస్థలు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అని పేర్కొనడంతో ముందుగానే టార్గెట్ ఫిక్స్ చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చారా ఇందులో ఎవరెవరి పాత్ర వుందని అనుమానిస్తున్నారు.
కొత్త వక్ఫ్ సవరణల చట్టం ఏమి చెబుతోంది?
దేశ వ్యాప్తంగా వున్న వక్ఫ్ భూములు కొందరి చేతుల్లో వుండి పోయి మొత్తం ముస్లిం పేద వర్గాలకు ఎలాంటి ప్రయోజనం వుండటం లేదని వక్ఫ్ బోర్డులను పరిరక్షించడానికే సవరణలు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వక్ఫ్ భూములను నిర్థారించాల్సిన భాద్యతను జిల్లా కలెక్టర్లకు బదలాయిస్తోంది. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్రం అటు లోక్ సభలో ఇటు రాజ్య సభలో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసుకుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ- జనసేనలు కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. వైసీపీ బిల్లును వ్యతిరేకించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి వుంది. మరోవైపు కాంగ్రెస్, కొన్ని ముస్లిం సంఘాలు కొత్త బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు తమ స్థలాలను ఎందుకు లీజుకు ఇవ్వడానికి సిద్దమయిందన్నది పెద్ద ప్రశ్నగా వుంది.
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనేనా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పేరిట ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పనులు చేపట్టడానికి ఆసక్తి చూపుదుంది. ఆ దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యులను మార్చింది. ఇప్పుడు పీపీపీ పద్దతిలో వక్ఫ్ భూముల అభివృద్ధికి నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారానే సందేహం వస్తోంది.
వృధాగా వున్న వక్ఫ్ భూములను అభివృద్ధి చేయడం, ముస్లిం సమాజంతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయడం మంచి విషయం. కానీ దీర్ఘకాలిక లీజుతో భూములు అన్యాక్రాంతం, ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారన్న వాదన వినిపిస్తోంది. అయితే చంద్రబాబు, పవన్ కావాలనే వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తాటిపత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్ వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్‌ను జోడిస్తూ ట్వీట్ చేశారు. వక్ఫ్ భూములు ప్రైవేటు పరం చేయడానికి సర్వం సిద్దం అంటూ ట్వీట్ చేశారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించిందని వైసీపీ 2020లోనే ఆరోపణలు చేసింది. ఏదైనా ఏపీ వక్ఫ్ బోర్డు చర్య ఇప్పుడు చర్చలకు దారితీసింది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.