
ఇస్తాంబుల్: డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు, ఆతని అధ్యక్ష పాలన మామూలుగా ఉందబోదని నేను వాదించాను. అమెరికా అంతర్జాతీయ విదానము అప్పటికే దాని మూలాలలో బలహీనపడి ఉంది. ప్రాథమిక విలువలలోనూ, సంస్థాగతంగానూ అనేక వివాదాలతో సతమతమవుతూ ఉంది. ఇప్పుడు అది భూకంప సదృశ మార్పును ఎదుర్కొంటోంది.
ట్రంప్ రెండవ విడత పాలన మరింత గందరగోళాన్నిముందుకు తెచ్చింది. ఒకప్పుడు పరిమితస్థాయిలో ఉన్న అస్తవ్యస్తత ఇప్పుడు పూర్తి స్థాయి ‘వ్యవస్థాగత భూకంప’మయింది. ట్రంప్ రెచ్చగొట్టే మాటలు, అసంబద్ధమైన కార్యనిర్వాహక ఆదేశాలు, గాజా, ఉక్రెయిన్ యుద్ధాలపై అతని నిరంకుశ విధానాలు- నాలుగు శతాబ్దాల క్రితం అనేక యుద్ధాలు, ఈతి బాధలను దాటుకొని వెస్ట్ ఫాలియా శాంతి ఒప్పందం రూపంలో నిర్మించుకున్న బహుళ పక్ష వ్యవస్థ నిర్మాణపు పునాదులను కదిలించివేశాయి.
గత రెండు నెలలుగా ట్రంప్ చర్యలు, ప్రకటనలు మనం ఒక అనిశ్చిత యుగంలోకి ప్రవేశిస్తున్నామని, సంక్షోభం ఏ క్షణంలోనయినా పెల్లుబికి, పరిస్థితి తీవ్రమవవచ్చునని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఒకే సూత్రం ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బలవంతుడిదే రాజ్యం. అంతర్జాతీయ చట్టం “ఒప్పందానికి కట్టుబడి ఉండా”లన్న నియమంపై ఆధారపడి ఉంది. కానీ, వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన కొద్ది వారాల్లోనే ట్రంప్, తను ఇదివరకు చేసుకున్న ఒప్పందాలతో సహా, మునుపటి అమెరికా పరిపాలకులు చేసిన అనేక ఒప్పందాలను, కట్టుబాట్లను ఉల్లంఘించాడు. చెల్లుచీటీ ఇచ్చి వాటి నుండి వైదొలిగాడు.
80 సంవత్సరాల క్రితం రెండవ ప్రపంచ యుద్ధ భయానక అనుభవాలతో గాయపడిన ఒక తరం ఏర్పరుచుకున్న ప్రపంచ విధానాన్ని కూల్చివేసి, నయా వలసవాద పోటీ యుగాన్ని ప్రవేశపెట్టడమే స్థూలంగా ట్రంప్ విదేశాంగ విధాన లక్ష్యమని అనిపిస్తున్నది. గ్రీన్‌లాండ్‌ను “ఏదో ఒక విధంగా” స్వాధీనం చేసుకోవాలని, పనామా కాలువపై తిరిగి నియంత్రణను సాధించాలని, కెనడాను 51వ రాష్ట్రంగా మార్చాలని అతను బెదిరించడం. గాజా సమస్యను రియల్ ఎస్టేట్ ఒప్పందానికి అడ్డంకి అన్నంత చిన్న సమస్యగా చిత్రీకరించడం వంటివి అతని నయా సామ్రాజ్యవాద దృక్పథానికి ఉదాహరణలుగా కనపడుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కులీన స్వభావం ఉన్నప్పటికీ అది అమెరికా నాయకత్వంలో ఐదు శాశ్వత సభ్యుల(P5) ఆధిపత్యంలో ఉండేది. ఇప్పుడు తన ప్రపంచ ఆధిపత్య జైత్యయాత్రకు దాన్ని కూడా ఒక అడ్డంకిగా ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే దాని అడ్డు తొలగించుకోవడం కోసం తనకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకొనే P2 ఏర్పాటును ఎంచుకున్నాడు. ఈ ఏర్పాటు ప్రచ్ఛన్న యుద్ధ కాలము నాటి అమెరికా-సోవియట్ యుగపు ద్వైపాక్షికతను గుర్తుకు తెస్తున్నది. అతను విస్తృత స్థాయి అంతర్జాతీయ సంప్రదాయాలతో పాటుగా అనేక భద్రతా మండలి తీర్మానాలను బహిరంగంగా ధిక్కరించాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫాసిజం తిరిగి తలెత్తకుండా నిరోధించడం కోసం సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపుదాల్చింది. దానిలో “మానవీయతకు మొదటి ప్రాధాన్యత” అనే విలువను నొక్కి చెప్పారు. కానీ ఆ విలువకు పూర్తి విరుద్ధంగా నడవడమే ట్రంప్ ప్రథమ కార్యాచరణ అయింది. మానవ హక్కులకు సంబంధించిన ఆ ప్రకటన భౌగోళిక రాజకీయాల కంటే మనిషికి ఉన్నత స్థాయి గౌరవాన్నిఇచ్చే మహోన్నత ఉద్దేశానికి సంబంధించినది. దీని ఫలితంగానే ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి ఏర్పడింది.
ఈ ఆదర్శాన్ని ఉల్లంఘించడం ద్వారా ట్రంప్ భద్రతా మండలిని కేవలం బలప్రయోగ సాధనంగా మార్చే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాడు. అమెరికాలాగానే మిగిలిన నాలుగు శాశ్వత సభ్య దేశాలు కూడా ఇలాంటి జాతీయవాద ధోరణులనే అవలంబించినట్లయితే అది చివరకు ఆధిపత్యం కోసం ప్రమాదకరమైన పెనుగులాటగా మారుతుంది.
అదేవిధంగా అంతర్జాతీయ మానవ హక్కుల మండలి, పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థUNRWA), యునెస్కొ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి కీలక ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలను కూల్చివేయడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ వ్యవస్థ పునాదులను బలహీనపరుస్తున్నాయి. అతని విధ్వంసక విధానం కేవలం ఐక్యరాజ్యసమితి వ్యవస్థను మాత్రమే కాకుండా, దీర్ఘకాలంగా ఒక అంతర్జాతీయ విధానాన్ని పాటిస్తూ ప్రపంచానికి స్థిరత్వాన్ని అందిస్తూ వచ్చిన పాక్స్ అమెరికానా(POX AMERICANA) విధానాన్ని కూడా దెబ్బతీస్తున్నది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నేతృత్వంలోని విధానాలు మూడు స్తంభాలపై ఆధారపడ్డాయి. అవి అమెరికా నాయకత్వంలోని బహుపక్ష సంస్థలైన నాటో వంటి కూటములపై ఆధారపడి నిర్మించిన ప్రపంచ భద్రతా వ్యవస్థ, స్వేచ్ఛా వాణిజ్యవిధానం, ప్రపంచ ప్రధాన ద్రవ్య నిల్వలుగా డాలర్‌కు హోదా ఇవ్వడంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ.
ఇరవై ఒకటవ శతాబ్దం కోసం ట్రంప్ రూపొందించిన పాక్స్ అమెరికానా(POX AMERICANA) దృక్పథం పూర్తిగా దీనికి విరుద్ధంగా, పంతొమ్మిదవ శతాబ్ధపు సామ్రాజ్యవాద దుర్మార్గపు వైఖరిని పోలి ఉంది. ఇది అనియంత్రితంగానూ, సాంకేతికత ప్రేరిత నిరంకుశవాదంగానూ తయారయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని పదేపదే అవమానించడానికి ట్రంప్ అనుసరించిన బెదిరింపు వ్యూహం ప్రపంచ నాయకులను భయపెట్టింది. ఇది తను చెప్పిన దాన్ని అంగీకరించేలా చేయడం కోసం చేసిన విస్తృత ప్రయత్నంలో ఒక భాగం.
అయితే అమెరికా విధానాలలోని ఈ మార్పు ఎక్కడి నుండో రాలేదు. అమెరికా నాయకత్వంలోని ప్రపంచ విధానం సంవత్సరాలు గడిచేకొద్దీ బలహీనపడడం వల్ల ఇది రూపొందుతూ వచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, అమెరికా విదేశాంగ విధానం గతం నుండి వ్యూహాత్మకంగా విడివడింది. ఒక్కో పాలకుడు విభిన్నమయిన విధానపత్రాలను అనుసరించడం మొదలుపెట్టాడు. జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ “నూతన ప్రపంచ విధానం” (NEW WORLD ORDER) కోసం పిలుపునిస్తే, బిల్ క్లింటన్ “మానవీయ జోక్యా”న్ని అనుసరించాడు. 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడులు జరిగాక జార్జ్ డబ్ల్యూ బుష్ అనుసరించిన నయా సంప్రదాయవాద హేతువు(NEO CONSERVATIVE RATIONALE) ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లపై దాడి చేయడానికి కారణమయింది. బరాక్ ఒబామా పాటించిన బహుపాక్షిక, నిష్క్రియాత్మక దౌత్యవిధానాలకు అభివృద్ధి నిరోధక ప్రతిచర్యగా ట్రంప్ మొదటి విడత పరిపాలనను నిర్వచించవచ్చు. జో బైడన్ విధానాలు ఒబామా పాటించిన విధానాలలాగానే నిలకడలేనివి. మొత్తంమీద, విదేశాంగ విధానాలలో, గాజాలోవలే ప్రభావశూన్యమయినవి. వీటివల్లనే ట్రంప్ తిరిగి రావడానికి మార్గం సుగమమయింది.
ఇప్పుడు ట్రంప్ మునుపటికన్నా ధైర్యవంతుడయ్యాడు. దీంతోనే మనం అమెరికా తన గత విధానాలనుండి వ్యూహాత్మకంగా విడివడడంవల్ల కలిగిన పరిణామాలను చూస్తున్నాము. ఫలితంగా క్రైస్తవ జాతీయవాద చోదక శక్తితో నడిచే నయా వలసవాద విధానం. దీనికి సాధికారతను అందించే అధునాతన సాంకేతికత. వీటికి వత్తాసుపలికే అహేతుక చర్యలు. సిగ్గుమాలిన వాక్విన్యాసాలు
9/11 తర్వాత అమెరికాలో పెచ్చుపెరిగిన తీవ్ర జాతీయవాద ఉధృతిని గురించి నేను 2002 వసంతకాలంలో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసంలో పేర్కొన్నాను. సైనిక శక్తి ద్వారా ఆధిపత్యం కోరే సీజర్ వంటి నాయకుడు అమెరికాకు అవసరం లేదని దానికి బదులుగా జ్ఞానం, సంయమనం, అంతర్జాతీయ చట్టం పట్ల గౌరవంతో సంక్లిష్టమైన ప్రపంచ వ్యవస్థను నడిపించగల మార్కస్ ఔరేలియస్ వంటి ఒక తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు అవసరమని హెచ్చరించాను.
కొంతకాలం పాటు, ఒబామా అలాంటి నాయకుడిగా మారగలడని నేను నమ్మాను. 2009లో అతను అధికారంలోకి వచ్చాక, తన మొదటి విదేశీ పర్యటనగా టర్కీని ఎంచుకున్నప్పుడు. ఆ తర్వాత ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లను సందర్శించినప్పుడు నాకు నిజంగానే విశ్వాసం కలిగింది. కానీ నా అంచనా వమ్మయింది. టర్కీ విదేశాంగ మంత్రిగా ఆ తరువాత దేశ ప్రధానమంత్రిగా పని చేశాక నా స్వంత అనుభవాల నుంచి సంతులిత దౌత్యం, ప్రపంచ దేశాల ప్రయోజనాలను కాపాడే విధానాల శక్తిపైనా నమ్మకం మరింత బలోపేతమైంది. ఈ పని ప్రపంచ ఆధిపత్యశక్తులు చేయలేవని నాకు తెలిసివచ్చింది.
అమెరికా ఏ ప్రశ్ననైతే ఎదుర్కొన్నదో అదే ప్రశ్నకు అర్జెంటీనా నుంచి టర్కీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ఇప్పుడు సమాధానం చెప్పవలసి వస్తున్నది. అధికారం పెరిగే కొద్దీ ఎక్కువగా అణచివేసే నిరంకుశ సీజర్లకు మనం లొంగిపోతామా, లేక సంయమనంతో పాలన చేసే మార్కస్ ఔరేలియస్ వంటి నాయకులను ఎంచుకుంటామా? ఇది మన కాలాన్ని నిర్వచించే ప్రశ్న. మనమందరమూ కలిసి దానికి సమాధానం ఇవ్వాలి.
అహ్మెత్ దావుతోగ్లు
(టర్కీ మాజీ ప్రధానమంత్రిగా(2014-16), విదేశాంగ మంత్రిగా(2009-14) పని చేశారు)
ప్రాజెక్ట్ సిండికేట్ తో ది వైర్ తెలుగు ప్రతేక ఏర్పాటుతో ప్రచురించిన వ్యాసం ఇది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.