
సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం – రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం అమరావతి, ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన 6వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ. 33 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గత 11 నెలల్లో SIPB ఆరుసార్లు సమావేశమైంది. ఇప్పటివరకు మొత్తం 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టుల్లో ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఉన్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ:
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రాజెక్టులను శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో ఒక పోర్టల్‌ను కూడా రూపొందించాలని అన్నారు. SIPB సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు, ఇదివరకే ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిని కూడా వివరించాలని అధికారులకు సూచించారు.
50 వేల హోటల్ రూములు లక్ష్యం:
టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై మాట్లాడుతూ రాష్ట్రంలో హోటళ్లు, రూములకు కొరత ఉందని, పెద్ద ఎత్తున హోటల్ రూమ్‌లు అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హోటల్ రూమ్‌ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేస్తారని చెప్పారు. కారవాన్లకు సంబంధించి ఒక పాలసీని రూపొందించి అమలు చేయడం ద్వారా కొత్త పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందని, తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవాలయాలకు వచ్చే భక్తులకు మంచి వసతి సౌకర్యం కల్పించడం చాలా ముఖ్యమని, రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని మరింత ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని అన్నారు. పారిశ్రామిక రంగంపై మాట్లాడుతూ వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టకుండా వాటిని చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్ ఎకానమీగా మార్చాలని, వ్యవసాయ వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.
తాజాగా జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో డక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలోని కుమరవరంలో రూ.1,560 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా 1,800 ఉద్యోగాలు రానున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో రూ.1,400 కోట్లతో తమ కార్యకలాపాలు విస్తరించనుండగా, 800 మందికి ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,286 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు ద్వారా 1,200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రూ.2,300 కోట్లతోనూ, జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్లతోనూ తమ యూనిట్లను నెలకొల్పనుండగా వరుసగా 1,750 మరియు 2,216 ఉద్యోగాలు రానున్నాయి.
టెక్స్టైల్ రంగంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.228 కోట్లతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ ద్వారా 250 మందికి, కృష్ణా జిల్లా మాలవల్లిలో మోహన్ స్పింటెక్స్ రూ.482 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా 1,525 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,779 కోట్లతో టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండగా 600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఏపీఐఐసీ శాఖ ద్వారా తిరుపతి జిల్లాలో వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,061 కోట్లతో మొబైల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండగా భారీగా 10,098 ఉద్యోగాలు రానున్నాయి. చిత్తూరు జిల్లా అలీప్ కుప్పంలో రూ.5 కోట్లతో మరో ప్రాజెక్టు ద్వారా 1,500 ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇక ఎనర్జీ రంగంలో ఏలూరు జిల్లాలో నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.150 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు ద్వారా 500 మందికి, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,920 కోట్లతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ల ద్వారా 230 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కడప జిల్లాలో ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,941 కోట్లతోనూ, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ రూ.9,000 కోట్లతోనూ ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల ద్వారా వరుసగా 260 మరియు 3,900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
టూరిజం రంగంలో తిరుపతిలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్ పి రూ.150 కోట్లతోనూ, స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.327 కోట్లతోనూ హోటళ్లను ఏర్పాటు చేయనుండగా వరుసగా 350 మరియు 570 ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్నంలో వరుణ్ హాస్పటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.899 కోట్లతో ఏర్పాటు చేయనున్న హోటల్ ద్వారా 1,300 మందికి ఉపాధి లభించనుంది.
ఐటీ రంగంలో శ్రీసిటీ, తిరుపతి జిల్లాలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,475 కోట్లతో ఎయిర్ కండీషనర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండగా 5,150 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కర్నూలు జిల్లాలో సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,057 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా 622 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
బాలకృష్ణ.ఎమ్, సినియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.