
అమెరికా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6న పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలిపారు. డోనాల్డ్ ట్రంప్, అతని ప్రియ మిత్రుడు ఎలాన్ మస్క్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. మొత్తం 50 రాష్ట్రాలలో 1,200 నగరాలలో ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరుతో ఆందోళనలు జరగడం చర్చనీయాంశమైంది. ప్రజల ఆగ్రహంతో కూడిన నినాదాలు, హేళనతో రాసిన నినాదాల ప్లకార్డుల ప్రదర్శన ప్రపంచ మీడియాను ఆకర్షించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రొండో సారి బాధ్యతలు స్వీకరించిన సుమారు 90 రోజుల్లోనే ఆయన నిర్ణయాలతో దేశంలో గందరగోళం మొదలైంది. పన్నుల పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, శ్రామిక వర్గాల పట్ల అసహనం, వలస దారులపై అణచివేత, ప్రభుత్వ పాలన, విద్యార్థులపై కక్ష సాధింపు, ఆర్థిక విధానాలు సంపన్నులకు అనుకూలంగా మలచబడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇవన్నీ ధనిక రాజ్యాన్ని పేద రాజ్యంగా మార్చే చర్యలుగా పలువురు అభివర్ణించారు. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా ఒక్కరోజులోనే 5 లక్షల మందికి పైగా ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్, బోస్టన్, న్యూయార్క్, ఫ్లోరిడా, హ్యూస్టన్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. “వాళ్లు ధనవంతుల ఎజెండాను అమలు చేస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు” అని నిరసనకారులు అన్నారు.
ఈ ఆందోళనలు వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా జరిగాయి. ఎక్కడా అరెస్టులు జరగలేదు. దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నవారు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతనికి ఉన్న శ్వేతవర్ణ ఆధిపత్య వైఖరిని, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్లకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘అమెరికాలో రాజు ఉండరు’ అని రాసిన ప్లకార్డులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నినాదాలుగా మారాయి.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
9849328496
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.