
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న ఉన్నట్టు ఈరోజు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడం లేదు. వేగంగా మారుతున్న వర్తమాన పరిస్థితుల్లో తైవాన్ సముద్రతీరం చుట్టూ చైనా యుద్ధ ఓడలను మోహరించింది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చైనాకు మధ్య యుద్ధం మొదలవనుందా? తైవాన్ను చైనా తన భూభాగంలో కలిపేసుకుంటుందా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుత చైనా- తైవాన్ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. తైవాన్ను చైనా కోరుకోవడానికి కారణం ఏంటి? చైనా తైవాన్ లాంటి దేశాన్ని ఆక్రమిస్తుందా? అసలు చైనాకు తైవాన్‌కు మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అని ఇందులో భాగంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
చైనాకు కూతవేటు దూరంలో ఉండే సముద్ర దీవి దేశం తైవాన్. తైవాన్ రాజధాని తైపే. చైనా బీజింగ్ రాజధానిగా పరిపాలిస్తుంది. తైవాన్ తమ దేశంలో భాగం కావాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 1992లో ఒక తీర్మానం చేసింది. పునరేకీకరణకు కలిసి కృషి చేయాలని ప్రకటించింది. అయితే తైవాన్ చైనాకు దక్షిణ భాగంలో ఉన్న సముద్ర దీవి. ఇది 36వేల చదరపు కిమీ వైశాల్యంతో ఉంటుంది. చైనాకు తైవాన్ మధ్య దూరం 161 కిలోమీటర్లు మాత్రమే, దీన్ని బట్టి చైనాకు తైవాన్ చాలా సమీపంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చైనాను తైవాన్ను తైవాన్ జలసంధి వేరు చేస్తుంది. తైవాన్‌కు కూతవేటు దూరంలోనే దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనే దేశాలున్నాయి.
తైవాన్ను జూ పాలకులు పరిపాలిస్తున్న కాలంలో అన్వేషకులు తైవాన్ను గుర్తించారు. ఆ తర్వాత 1624లో డచ్ కాలనీగా ఉండేది. పోర్చుగీస్ నావికులు తైవాన్ను ఇలా ఫోర్మోసాగా అభివర్ణించారు. అంటే అందమైన సముద్ర దీవి అని అర్థం. డచ్‌వారు 1624 నుంచి 1661 వరకు పాలించారు. 1683లో తైవాన్ చైనా రాజు చింగ్ ఏలబడిలోకి దీవి వెళ్లింది. ఈ కాలంలోనే పెద్ద ఎత్తున చైనా వారు తైవాన్‌లోకి వలస వెళ్ళారు. వీరిని హక్కా చైనీస్ అంటారు. 1895 దాకా చైనా పాలన నడిచింది. ఈ కాలంలోనే సైనో జపాన్ యుద్ధంలో చైనా తైవాన్ను జపాన్‌కు కోల్పోయింది.
జపాన్ ఓటిమితో పెరిగిన చైనా ప్రాబల్యం..
ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటిమితో చైనా ప్రాబల్యం పెరిగింది. చైనా ఆర్ఓసి(రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏర్పడింది. దీనికి దన్నుగా బ్రిటన్, అమెరికా నిలిచాయి. తైవాన్ను చైనా నియంత్రణలోకి తెచ్చింది. ఆర్ఓసి మిలటరీ నియంతృత్వ పాలన చేసేది. చియాంగ్ కై షేక్ దీని నాయకుడు. ఇతని నియంతృత్వ వైఖరి వల్ల దేశం ఎప్పుడు అంతర్యుద్ధంలో ఉండేది. ఈ సమయంలో మావో నాయకత్వంలో ఎర్రసైన్యం ఏర్పడి చియాంగ్‌కు పోటీగా ఉద్యమం నడిచింది. 1944లో మావో పీఆర్పీని ఏర్పాటు చేశాడు. పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ అనతి కాలంలో ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో చియాంగ్ తైవాన్‌కు వెళ్ళిపోయాడు.
జపాన్ పాలనలో తైవాన్‌లో అవస్థాపన సౌకర్యాలు బాగా అభివృద్ధి చేశారు. పుష్కలంగా సహజ వనరులుండటంతో ఆహ్లాద వాతావరణం ఉండేది. 1.5 మిలియన్ ప్రజలు, వైమానిక రక్షణ దళం, రేడియో స్టేషన్, బీజింగ్ గ్రంథాలయం నుంచి పుస్తకాలు, ధనం, కనకం, వస్తు, వాహనాలు తైవాన్‌కు తరలించి ఎసైల్లోనే ప్రభుత్వాన్ని నడిపాడు.
ఆర్ఓసీ, పీఆర్సీ రెండు పార్టీలు మాదే నిజమైన చైనా అని ప్రకటించాయి. దీంతో రెండు చైనాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు భిన్న రాజకీయాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరికి వారు అంతర్జాతీయ వేదికలపైనా ఈ విషయాన్ని చాటటానికి ప్రయత్నాలు చేశారు. అత్యంత వ్యూహాత్మకంగా తైవాన్ ఉండటంతో పశ్చిమ దేశాలు తైవాన్నే అసలైన చైనాగా గుర్తించాయి.
తైవాన్ జలసంధుల సంక్షోభం..
1954లో మొదటి తైవాన్ జలసంధుల సంక్షోభం తలెత్తింది. ఇరుకుగా ఉండే జల భాగాలు చైనాకు అత్యంత సమీపంలో ఉన్నాయి. దీంతో సంక్షోభంలో రెండు ప్రాంతాలైన కిన్మెన్, మత్సు కీలకంగా మారాయి. ఈ రెండు ప్రాంతాలలో చియాంగ్ తన సైన్యాలను పెట్టాడు. దానికి ప్రతిగా మావో సైన్యాలు బాంబులు వేశాయి. 1958లో తైవాన్ జలసంధుల యుద్ధం జరిగింది. ఈ సారీ బాంబుల వర్షం కురిపించి ఆర్ఓసీ సైనిక దళాలను అక్కడి నుండి తరిమివేయాలని మావో నిర్ణయించాడు.
1960- 1980 కాలంలో తైవాన్ ఆర్థికంగా బాగా పుంజుకుంది. ఉత్పాదకత పెరిగింది. శ్రమదోపడితో అధికోత్పత్తి సాధ్యమైంది. దీంతో ఈ కాలంలోనే తైవాన్ ఉత్పత్తులు ప్రసిద్ధిగాంచాయి. నిరంకుశ అధికారంతో కూడిన పాలన వల్ల శ్రామికులను ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీలలో పనిచేయించటం వ్యవసాయ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. ఎగుమతులు వృద్ధి చెందాయి.
అమెరికా మావో ఆధ్వర్యంలోని చైనా ప్రభుత్వానికి ప్రాధాన్యమిచ్చింది. చైనా దిగుమతులకు అమెరికాలో ప్రాధాన్యత ఉంది. దీంతో పీపుల్స్ రిపబ్లిక్ చైనాను ప్రోత్సహించి, తైవాన్ ప్రాధాన్యతను అమెరికా తగ్గించింది. 1971లో పీఆర్సీ చైనాకు ఐక్యరాజ్య సమితిలో అధికారిక గుర్తింపు లభించింది.
1975 ఏప్రిల్ 5న చియాంగ్ కామ్- షేక్ మరణించాడు. ఒక సంవత్సర కాలం తర్వాత 1976లో సెప్టెంబర్ 9న చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ మరణం ఇట్లా రెండు దేశాల వ్యూహకర్తలు, అధ్యక్షులు చనిపోయిన తర్వాత చైనా తైవాన్ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆర్థిక ప్రయోజనాలు బలపడ్డాయి. రాక పోకలు సాగాయి. కానీ సాంస్కృతికంగా ఇరుదేశాల ప్రజలు ఒకే జాతి వారమనే భావన కలగలేదు. తైవాన్ ప్రజలు తాము తైవాన్లమని చెప్పుకోసాగారు. చైనీయులం కాదన్న భావన బలపడింది.
1992లో హాంకాంగ్‌లో రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరి రెండు దేశాలు ఒకటే అని ఆమోదం తెలుపుకున్నాయి. ఐతే చైనా కమ్యూనిస్టు పార్టీ బీజింగ్ కేంద్రంగా పాలన సాగాలని, రెండు దేశాలు జాతీయ పునరేకీకరణకు పూనుకోవాలని కోరింది. కానీ చైనా కోరిక తైవాన్‌కు నచ్చలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన ఉండటం తైవాన్‌లో బహుళపార్టీ ప్రజాస్వామిక ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్నందున తైవాన్ కమ్యూనిస్టు చైనాను ఇష్టపడలేదు. 2000 మే 20న తైవాన్ నూతన అధ్యక్షుడిగా చెన్ సూబాన్ ఎన్నికైయ్యాడు. డెమెక్రటిక్ పీపుల్ పార్టీ నుంచి దేశ అధ్యక్షుడిగా పదవీ స్వీకరణ చేశాడు. దీంతో తైవాన్ ప్రజాస్వామిక దేశంగా ఉండాలని ప్రజలు భావించారు. తైవాన్ స్వతంత్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు.
సన్‌ఫ్లవర్ ఉద్యమానికి నాంది..
2005 మార్చి 14న చైనా ప్రభుత్వం యాంటీ సెషన్ చట్టం చేసింది. చట్టం ప్రకారం తైవాన్‌పై నిర్బంధం కొనసాగించి, తమ దేశంలో కలపాలని నిర్ణయించింది. 2014 మార్చిలో తైవాన్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తైవాన్ ప్రజాస్వామ్య దేశం కనుక చైనాతో ఎటువంటి ఒప్పందాలు ఉండకోడదని, ప్రజలు పోరాటం చేశారు. ఇదే ప్రసిద్ధ సన్‌ఫ్లవర్ ఉద్యమంగా అభివర్ణిస్తారు. చైనాకు వ్యతిరేకంగా, బహిరంగంగా చేసిన ఉద్యమం 2013లో చైనా అధ్యక్షుడిగా జింపింగ్ ఎన్నికైనాడు. ఇతను తైవాన్ చైనా పునరేకీకరణ పూర్తి కావాలని చెప్పడంతో, తైవాన్ అధ్యక్షురాలిగా 2016లో త్యాయి ఇంగ్ వెన్ ఎన్నికైయ్యారు. ఆమె తైవాన్ చైనాలో భాగంగా ఉండడాన్ని వ్యతిరేకించారు. తైవాన్ ప్రజాస్వామిక దేశమని అది స్వతంత్య్రంగా ఉంటుందని బలంగా వాదించారు.
దీంతో తైవాన్ ప్రజలు త్సాయి ఇంగ్ వెన్కు బ్రహ్మరథం పట్టారు. 2020లో బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి ఎన్నికైయ్యారు. తైవాన్ స్వతంత్ర దేశం, ప్రజాస్వామ్యదేశం. దేశ పతాకం, జాతీయగీతం, ప్రత్యేక కరెన్సీ, అనేక సంస్థలు కలిగి ఉంది. అంతేకాకుండా తలసరి ఆదాయంలో 33,000 డాలర్ల వాటా కలిగి ఉంది. చిప్‌ల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇన్ని ఉన్నా కూడా తైవాన్ను ఒక దేశంగా 14 దేశాలు మాత్రమే గుర్తించాయి. బ్రెజిల్, గ్యాటిమాలా, హైతీ వాటికన్ సిటి, హుండరస్, మార్షల్ దీవులు గుర్తించినట్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నౌరు, పలావు, పరాగ్వే సెయింట్ కిట్స్, నేవిస్, సెయింట్ లూసియా, గ్రెవేడియన్స్, తువాలు లాంటి దేశాలు తైవాన్ను గుర్తించడం. మిగతా ప్రపంచ దేశాలు తైవాన్ను ఒక దేశంగా ఇప్పటికీ గుర్తించడం లేదన్న విషయం గమనార్హం.
మావో కల- సాంస్కృతిక ఏకీకరణ..
మావో కలలు కన్న మహత్తర చైనా సాంస్కృతిక ఏకీకరణలో తైవాన్ ఉండాలని చైనా ఆశించింది. అది తమ భూభాగంలో కల్వాల్సిందేనని నేటి చైనా అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. దీంతో చైనా తైవాన్ను ఎలాగైనా తమ భూభాగంలో కలుపుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. 2049 నాటికి పీపుల్స్ రిపబ్లిక్ చైనా శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఆలోగా పునరేకీకరణ పూర్తి చేయాలనే దృఢ వైఖరితో చైనా పాలకులున్నారు. ప్రపంచ దేశాలు తైవాన్‌కు మద్ధతు ఇవ్వకూడదని ఒకే చైనా విధానాన్ని అనుసరించాలని కోరుతుంది.
గత చరిత్ర, 1992 అంగీకారాల ప్రాతిపదికన చైనా తైవాన్ను తనలో కలపుకోవాలని తహతహలాడుతుంది. కానీ తైవాన్ ప్రజాస్వామిక దేశంగా మనుగడలో ఉంది. బహుళపార్టీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1992 తీర్మానం కూడా నిజమైన రెండు దేశాలకు సమ్మతం కాదన్నది తైవాన్ వైపున్న ఆరోపణ. బలవంతంగా లొంగదీసుకోవడం ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. 97% తైవాన్ ప్రజలు చైనాలో కలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం చైనాకు తెలిసినా తైవాన్ చుట్టూ యుద్ధ ఓడలను మోహరించి కాలుదువ్వుతుంది.
2023 నాటికే 193 సంపన్న దేశాలలో తైవాన్ 14వ స్థానంలో నిలిచింది. జీడీపీలో గణనీయ వాటా కలిగి ఉంది. ప్రపచ సెమికండక్టర్ ఉత్పత్తిలో 70% ఒక్క తైవాన్ దేశమే ఉత్పత్తి చేస్తోంది. ఐఫోన్ల ఉత్పత్తిలో అగ్రస్థానం తైవాన్‌దే. సాంకేతికంగా అత్యున్నత ఉత్పత్తులు అందిస్తున్న తైవాన్ను యుద్ధంలోకి లాగితే ఆర్థిక వ్యవస్థకు చేటు కాకుండా, ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం కలగక మానదు.
డా. సుంకర రమేశ్
ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు
94921 80764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.