
వియన్నా: కొండలు తొలిచి నిర్మించిన ఫార్దో అణ్వాయుధ తయారీ కేంద్రం అమెరికా దాడుల్లో గణనీయంగా దెబ్బ తిని ఉంటుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నష్టం ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా చెప్పలేమని అణు ఇంధన సంస్థ సెక్రటరీ జనరల్ రఫాల్ గ్రోసి సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తన అమ్ముల పొదిలో ఉన్న అత్యంత భారీ ప్రభావం చూపగల బాంబులను ఆదివారం నాడు ఇరాన్‌పై అమెరికా ప్రయోగించింది. ఈ దాడుల్లో తొలిసారి బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించింది. ఫార్దోలో కొండల మధ్య నిర్మించిన యురేనియం శుద్ధి కేంద్రం కూడా అమెరికా బాంబు దాడుల్లో ధ్వంసం అయిన కేంద్రాల్లో ఒకటి.
అణుఇంధన సంస్థతో సహా ఫార్దోలో భూమిలోపల నిర్మితమైన యురేనియం శుద్ధి కేంద్రానికి జరిగిన నష్టం ఎంత అన్నది చెప్పలేమని రఫాల్ గ్రోసి అన్నారు. జూన్ 13 నుంచి ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నందున అంతర్జాతీయ సంస్థ తరఫున ఆయా యురేనియం శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసే అవకాశం లేకుండా పోయింది. అమెరికా ఉపయోగించిన పేలుడు సామాగ్రి తీవ్రత, అనంతరం ఏర్పడిన భూకంపం వంటి వాటిని పరిశీలించినప్పుడు నష్టం భారీగానే ఉండే అవకాశం ఉందని గ్రాసి ప్రకటనలో తెలియజేశారు.
యురేనియంను 90 శాతం వరకు శుద్ధి చేస్తే అణ్వాయుధాలు తయారు చేయగల నాణ్యత వస్తుంది. ప్రస్తుతానికి ఫార్దో యురేనియం శుద్ధి కేంద్రంలో60 శాతం వరకు శుద్ధి చేయబడిన యురేనియం నిల్వలు సుమారు నాలుగు వందల కిలోల వరకూ ఉంటాయని అంచనా. ఆ దాడుల్లో ఆ నిల్వలు ఏమయ్యాయన్నది అంతర్జాతీయ సమాజానికి పెద్ద మిస్టరీగా మిగిలింది.
ఈ నాలుగు వందల కిలోల యురేనియంను 90 శాతం వరకు శుద్ధి చేస్తే కనీసం తొమ్మిది అణ్వాయుధాలు తయారు చేయటానికి కావాల్సిన ముడిసరుకు సిద్ధం అవుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంచనా. తాము శుద్ధి చేస్తున్న యురేనియంను శాస్త్రీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించామని, ఆయధాల తయారీ లక్ష్యం కాదని ఇరాన్ పదేపదే ప్రకటించింది.
జూన్ 10న అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆమోదించిన తీర్మానం మేరకు తమవద్ద ఉన్న యురేనియం నిల్వలను జాగ్రత్తగా భద్ర పరుస్తామని జూన్ 13న ఇరాన్ ఐఏఈఏకు లేఖ ద్వారా తెలిపింది. ఈ జాగ్రత్తలు ఐఏఈఏ పర్యవేక్షణలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెలిపినట్లు సంస్థ సెక్రటరీ జనరల్ వెల్లడించారు.
అదే రోజు తాను స్పందిస్తూ ఫార్దో యురేనియం శుద్ధి కేంద్రం నుంచి ఏ కారణంతోనైనా యురేనియం వేరే చోటికి తరలిస్తే ఆ విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు తెలియచేయాల్సిందిగా కోరానని ఆయన అన్నారు. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ రూపొందించిన భద్రతా ప్రమాణాలు రీత్యా ఇరాన్‌లోని యురేనియం శుద్ధి నిల్వలు కాపాడేందుకు అవకాశం ఉందని గ్రాసీ తెలిపారు.