
2025 జూన్ 22న ఇరాన్‌లోని అణ్వస్త్ర నిల్వల కేంద్రాలైన ఫర్డో, నతాంజ్, ఇఫ్షాన్లపై ఓ నిర్దిష్ట పథకం ప్రకారం దాడి చేశారు. ఈ దాడులు అమెరికా ప్రతిపాదించి నిర్మించబూనుకున్న ఉదారవాద ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నంగా స్పష్టమవుతోంది. నిజానికి ఈ ఉదారవాద ప్రపంచ క్రమం (ఉదారవాదం ఆధారంగా నిర్మితమవుతున్న అంతర్జాతీయ సంబంధాలు)తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వస్త్ర సామర్థ్యం సమకూర్చుకోరాదన్న లక్ష్యంతో జరిగిన ఈ దాడులు ‘పూర్తిగా విజయవంతం అయ్యాయ’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటంలోనే అమెరికా పాలకుల నవనాడుల్లో ఇంకిపోయిన ధూర్త ఆధిపత్య సామ్రాజ్యవాద లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పశ్చిమాసియా ప్రాంతంలో ఆధిపత్య రాజకీయాల స్వరూప స్వభావాలను మార్చే లక్ష్యంతో సాగుతున్న యుద్ధమే తప్ప మరోటి కాదు. ఈ ప్రయత్నంలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌ల మధ్య ఖండాంతర వ్యూహాత్మక భాగస్వామ్యం ఘనీభవించింది.
ఇరాన్ ఓ సార్వభౌమత్వం కలిగినదేశం. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన దేశం. తొమ్మిది కోట్ల మంది పౌరులున్న దేశం. ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దేశం. అటువంటి దేశం అణ్వస్త్ర సామర్ధ్యం పెంపొందించుకుంటుందన్న సాకుతో లేని ఆయుధాలను నాశనం చేయటానికన్న పేరుతో పట్టపగలే అమెరికా దాడి చేయటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. చట్టవిరుద్ధం. అహంకారపూరితమైన దుందుడుకు చర్య. పశ్చిమాసియా దేశాల మధ్య అధికార పొందికను, అమరికను సమూలంగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగానే మొదలైన యుద్ధం. పశ్చిమాసియా దేశాల్లో అమెరికా ఆధిపత్యాన్ని అప్రతిహతంగా కొనసాగించటానికి వీలుగా ఇజ్రాయెల్ కేంద్రంగా, మధ్య యుగాల నాటి భూస్వామ్య వ్యవస్థలకు ప్రతిరూపాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు రక్షణకవచంగా ఇరాన్ లాంటి స్వతంత్ర విధానాలు అనుసరించే దేశాలను ధ్వంసం చేయటమే పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక లక్ష్యం. పాలస్తీనా ప్రజలు వలసవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రజాతంత్ర ఉద్యమాన్ని కూకటివేళ్లతో సహా నాశనం చేయటం ఈ లక్ష్యసాధనలో కీలకమైన మలుపు. సార్వభౌమ దేశమైన ఇరాన్ విధ్వంసం కూడా అటువంటి మరో కీలకమైన మలుపు. అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలను సవాలు చేసే ఏ హేతుబద్ధ శక్తులూ భూమ్మీద మనుగడ సాగించరాదన్నది అమెరికా నిర్ణయం.
ఇదే మొదటి సారి కాదు. అమెరికా ఆధిపత్య పాలకవర్గం దేశీయంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ సంక్షోభం నుంచి దేశ, ప్రపంచ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏదో ఒక సార్వభౌమ దేశం నుంచి అమెరికా మనుగడకు పెనుముప్పు వాటిల్లబోతోందన్న అపోహలు సృష్టించటం, ఆ సోకాల్డ్ పెనుముప్పును నిలువరించేందుకనే సాకును సృష్టించుకుని ఆయా దేశాలపై భీకరంగా విరుచుకుపడటం ఆయా దేశాల ఆర్థిక సామాజిక జీవనాన్ని ధ్వంసం చేసి విజయగర్వంతో దేశ ప్రజల మెప్పుకోసం తాపత్రయపడటం సామ్రాజ్యవాద దేశాలకు, ప్రత్యేకించి అమెరికాకు షరామామూలే. ఈ ప్రయత్నంలో ఆ దేశంలోని మీడియా, స్వతంత్ర మేధో బృందాలుగా ముసుగు వేసుకున్న పాలకవర్గ మద్దతుదారులు, విశ్లేషకులు, వ్యాఖ్యాతలు, మేధావులు, పరిశోధకులూ వంతపాడటం కూడా షరామామూలే.
ఆధిపత్యం, పెత్తనం కేవలం సాయుధపరమైన ఒత్తిడితోనే సాధించే అంశం కాదు. పరోక్షంగా సైద్ధాంతికంగా నాయకత్వ పాత్ర పోషిస్తూ కూడా ఈ పెత్తనాన్ని చలాయించవచ్చు.
అమెరికా అధికార చట్రం ఖండాంతర భాగస్వామ్యంతో కూడి ఉంటుంది. ఇందులో రాజ్యం, పెట్టుబడి, పౌరసమాజ మేధావుల త్రయం విడదీయలేనంతగా పెనవేసుకుని ఉంటుంది. ఈ త్రయమే, వాటి మధ్య ఏర్పడే బలమైన బంధమే ఆటవిక న్యాయాన్ని అమల్లోకి తెస్తుంది. ఈ సంకీర్ణమే పెట్టుబడిదారీ వ్యవస్థను అంతర్జాతీయ దౌత్యనీతితో విడదీయరాని విధానంగా మారుస్తుంది. దొంతరులుగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థలోకి జొప్పిస్తుంది. ఈ వ్యవస్థను సవాలు చేసే ఏ దేశంపైనైనా అమెరికా దాడి చేస్తుంది. ఈ వ్యవస్థను పదిలంగా కాపాడటమే ఈ దాడుల లక్ష్యం. అంటే అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయటమే ఈ దాడుల లక్ష్యం. అమెరికా ఆధిపత్యం శాశ్వతం కావటం అంటే ఈ ఆధిపత్యానికి మూలమైన రాజ్యం, పెట్టుబడి, పాలకవర్గ అనుకూలపౌర సమాజం ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగటమే. ప్రస్తుత దాడులను అంతర్జాతీయ భద్రతా అవసరాల రీత్యా చేస్తున్న దాడులుగా అమెరికా చెప్తోంది. నియమ నిబంధనల ఆధారంగా నడుస్తున్న అంతర్జాతీయ వ్యవస్థను ధిక్కరించిన ఇరాన్ అచ్చోసిన ఆంబోతులా వ్యహరించేందుకు సిద్ధమవుతుందన్న కథనూ, కథనాన్నీ అల్లటానికి, వల్లె వేయటానికి పాలకవర్గ అనుకూల మీడియా మాధ్యమాలు, మేధావులు, పౌరసమాజం ముందు ఉండనే ఉన్నాయి.
ఇరాన్‌ను చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్న అమెరికా దీర్ఘకాలిక వ్యూహంలో భాగమే ట్రంప్ అడ్డగోలు చర్యలు. అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలన్న తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇరాన్ ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసింది. అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమాన్ని రద్దు చేసుకునేందుకు ఇరాన్ తిరస్కరించింది. 2020 ప్రాంతంలోనే ఇరాన్‌కు చెందిన సొలైమాన్ను హత్యచేయటంలోనే ట్రంప్ 1979లో ఇరాన్లో విప్లవం ద్వారా అధికారానికి వచ్చిన ఇస్లామిక్ రాజ్యాన్ని పునాదులుతో సప పెకలించాలన్న అమెరికా దీర్ఘకాలిక వ్యూహం, తదనుగుణంగా ట్రంప్ ఉద్దేశ్యాలూ స్పష్టంగా వెల్లడయ్యాయి. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పొంచి ఉన్న అణ్వస్త్ర ప్రమాదాన్ని నివారించేందుకే తాజా దాడులు అని చెప్తున్నప్పటికీ అమెరికా దాడి చేసిన 24 గంటల్లోపే ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే మా లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు.
బలవంతం, ఒప్పుకోలు, కథనాల నియంత్రణ..
బలవంతం చేయటం, ఒప్పుకోలు కలగలిపితేనే ఆధిపత్యం చలాయించటం సాధ్యమవుతుంది. ఇరాన్ అభివృద్ధి చేసుకున్న అణ్వస్త్ర సామర్ధ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో సాగిన అమెరికా దాడి బలవంతంగా ఓ దేశాన్ని అదుపులోకి తెచ్చుకునే దుండగీడు వ్యవహారం. ట్రంప్ మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు సాధ్యమైనంతగా ఒత్తిడి చేయటం అన్న ఓ వినూత్న విధానాన్ని ప్రకటించారు. మాతో సంధి చేసుకుంటావా లేక మరిన్ని దాడులు ఎదుర్కొంటావా అన్న ట్రంప్ ప్రశ్న ఈ విధానానికి కొనసాగింపే. ఇరాన్ విషయంలోనూ, ఆమాటకొస్తే ఇతర దేశాల విషయంలోనూ అమెరికా అమలు చేస్తున్న వ్యూహాత్మక లక్ష్యాలను ట్రంప్ కొనసాగిస్తున్నప్పటికీ వాటిని కొత్త కొత్త పేర్లతో పిలవటం ప్రజలను దారి మళ్లించే వ్యూహం మాత్రమే. ఈ దాడులు ఇరాన్‌ను కోలుకోలేనంతగా దెబ్బతీశాయన్న కథనం ఇప్పటికే చలామణిలో ఉంది. ఈ కథనాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా సేనలు ఇరాన్‌పై అద్భుత విజయం సాధించాయని ఢంకా భజాయించారు. దీని ఆధారంగా ప్రపంచ మీడియా మొఘల్స్ అందరూ ఈ కథనాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారంలో పెట్టే పనిలో మునిగి తేలుతున్నారు. భిన్నాభిప్రాయాలకు, అసమ్మతికీ వేదికగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ సోషల్ మీడియా కూడా రణక్షేత్రమైంది. యుద్ధ వ్యతిరేక స్వరాల గురించిన ప్రస్తావన కూడా పాఠకులు, వీక్షకులకు దరి చేరనీయకుండా అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బిగ్ డాటా అనలిటిక్స్ ఇంటర్నెట్లో ప్రాధాన్యతలను, వ్యక్తీకరణలనూ, చర్చలను, స్వయం చాలిత సందేశాలనూ వండి వారుస్తున్నాయి.
దేశీయంగా ఈ చర్యల పట్ల ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ట్రంప్ దుందుడుకు జాతీయోన్మాదం ఈ ప్రయత్నాలను మరింత సంఘటితం చేస్తోంది. దేశీయంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నంలోనే ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించామని చెప్పుకోవడం. ఇలాంటి బలవంతపు చర్యలు ఒక్కోసారి ఉద్రిక్తతలు పెంచుతాయి. తప్పుడు అంచనాలు, ఇజ్రాయెల్ మీదకు దూసుకెళ్తున్న క్షిపణుల వర్షంతో ఈ యుద్ధాన్ని మరింత విస్తృత స్థాయికి విస్తరించే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. శక్తివంతంగా ప్రతిఘటిస్తామని ఇరాన్ రివల్యూనషరీ గార్డ్స్ ప్రకటించింది. హార్ముజ్ జల సంధి గుండా రవాణాకు ఎటువంటి అవరోధాలు ఏర్పడినా ప్రపంచ చమురు మార్కెట్లు స్థంభించుకుపోతాయి. సామ్రాజ్యవాద సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రారంభించిన దాడి చివరకు అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యం నెర్రెలుబారుతుందన్న వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయి. తమ ఆధిపత్యాన్ని ఖరారుచేసుకోవడానికి కావల్సిన ఒప్పుకోళ్లను సాధించలేని సామ్రాజ్యవాద శక్తుల దుర్భలత్వాన్ని ఈ దాడులు ప్రపంచం ముందుంచుతున్నాయి.
కులీనుల అధికారం- వర్గ పొందిక..
అమెరికా అనుసరించే విదేశాంగ విధానం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఆధిపత్య శక్తులను ఒకే తాటిమీదకు తెస్తుంది. ఈ దాడులు ప్రధానంగా అమెరికా పాలకవర్గంలోని రెండు దొంతర్లను సంతృప్తి పరుస్తాయి. మొదటి ఆయుధ తయారీ పరిశ్రమల అధిపతులు, రెండోది చమురు పరిశ్రమల అధిపతులు. బి2 స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానాలు తయారు చేసే లాక్‌హీడ్ మార్టిన్, ఖండాంతర క్షిపణులు తయారు చేసే రేథియాన్ వంటి కంపెనీలు గల్ప్ దేశాలకు ఆయుధాలు అమ్మకం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందాయి.
చమురు సరఫరాలో వచ్చే ఎగుడుదిగుడుల వలన చమురు కంపెనీలు సొమ్ము చేసుకుంటాయి. కానీ అమెరికా కార్మికవర్గం, సాధారణ ప్రజలు ఆర్థిక భారాలు మోయాల్సి ఉంటుంది. నష్టపోతున్న ప్రజానీకాన్ని, సామాజిక తరగతులను నోరెత్తకుండా చేయటానికి ట్రంప్ ప్రజాకర్షక వాగాడంబరం పనికొస్తుంది. ఇరాన్ అణ్వస్త్ర సామర్ధ్యం సంపాదించుకోరాదు అన్న ట్రంప్ నినాదం ఆయన ఓటుబ్యాంకును ఆకర్షించే నినాదమే. కాకపోతే ట్రంప్ అనుయాయుల్లోనే ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చాలనే వారి మధ్య, చేసింది చాల్లే సర్దుకొండి అనే వారి మధ్య భిన్నాభిప్రాయాలు పెచ్చరిల్లుతున్నాయి.
యుద్ధాలకు శాశ్వతంగా ముగింపు అన్న ట్రంప్, బైడెన్, ఒబామాల నినాదాలు నేతిబీరలో నెయ్యిలాగానే మారిపోతున్నాయి.
సమీకృత సంక్షోభాలు- ప్రత్యాధిపత్యం..
అమెరికా దూకుడుగా చేస్తున్న దాడులు ఆ దేశం ఎదుర్కొంటున్న బహుముఖ సంక్షోభాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ దాడులు ఓ కోణంలో చూస్తే ఆధిపత్య ధృవీకరణ సంకేతాలు. మరో కోణంలో చూస్తే సడలుతున్న ఆధిపత్యానికి సంకేతాలు. సవాళ్లు, ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పాలకవర్గాలు, రాజ్యం ప్రదర్శించే ఆరాటాన్ని కూడా ఈ దాడులు వ్యక్తం చేస్తున్నాయి.
ఉదారవాద ప్రపంచంలో ఉదారవాద సూత్రాల ఆధారంగా నిర్మితమైన అధికార సోపానాలు దేశీయంగా తలెత్తే ప్రజాకర్షక ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఆవిర్భవించే నూతన ఆధిపత్య శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటాయి. మితిమీరి విస్తరిస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని నిలువరిస్తూ రష్యా, చైనాలతో జత కట్టిన ఇరాన్ పశ్చిమాసియాలో ప్రత్యామ్నాయ ఆధిపత్య కూటమిని నిర్మించేందుకు పావులు కదిపే అవకాశం ఉంది. ప్రతిఘటనకు పచ్చ జెండా ఊపిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాసి దౌత్యమే ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయం, పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. యుధ్ధోన్మాద వ్యతిరేక భావోద్వేగాలకు వేదికలైతే సోషల్ మీడియా మాధ్యమాలు పాలకవర్గం ప్రపంచం ముందుంచుతున్న కథనాన్ని సవాలు చేయవచ్చు. ఎదురుదాడులతో ఇరాన్ విజృంభించినా, ఇజ్రాయెల్‌కు కవచంలా ఉన్న పశ్చిమాసియా మిత్ర దేశాలు తమ పరోక్ష భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకున్నా అమెరికా ఆధిపత్యానికి పడుతున్న తూట్లు బట్టబయలవుతాయి. ఈ పరిస్థితులు అమెరికా ఆధిపత్యానికి ఎదురవుతున్న సమీకృత సంక్షోభాన్ని ముందుకు తెస్తాయి. అస్థిరత కమ్ముకుంటున్న ప్రపంచంలో మారుతున్న అధికార కేంద్రాలు సామ్రాజ్యవాద శక్తుల పొరపాట్లకు, బహుళధృవ ప్రపంచం ఆవిర్భావానికి కారణాలవుతాయి. ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చలాయించాలనుకుంటున్న అమెరికా ఈ పరిణామాలను ఆహ్వానించలేదు.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత యూవర్సిటీ ఆఫ్ లండన్ పరిధిలోని సిటీ సెయింట్ జార్జి కాలేజీలో స్కూల్ ఆఫ్ పాలసీ అండ్ గ్లోబల్ అఫైర్స్ డీన్‌గా పని చేస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాలు బోధిస్తారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.