అబూ అబ్రహంగా చిరపరిచితమైన వ్యంగ్య చిత్రకారుడు అట్టుపురాతు మాథ్యూ అబ్రహం శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన వ్యంగాత్మక సృజనాత్మక ఊహాశక్తిని విస్తృతంగా లోతుగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ‘అబూ ప్రపంచం’ పేరిట 1950ల నుండి 2002లో ఆయన మరణించేవరకూ గీసిన కార్టూన్ల నుండి ఎంపిక చేసిన 300 చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. కోచిలోని దర్బాల్ హాల్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఏడాది మార్చి నెలలో తొలిసారిగా నిర్వహించిన ప్రదర్శన తర్వాత వివిధ మాధ్యమాలలో దాని గురించిన కథనాలు విస్తృతంగా వెలువడ్డాయి. (2024 ఏప్రిల్ 12న కార్టూనిస్టు అబూ రాజకీయ మేథో జ్ఞాపకాలు శీర్షికన ఇదే పత్రికలో ఒక వ్యాసం వెలువరించాం) అయితే ఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ప్రదర్శనకు ఒక ప్రత్యేకత ఉన్నది.అబూ ఇద్దరు కుమార్తెలు ఆయేషా, జానకి వాళ్ళ తండ్రిగారి వారసత్వానికి ప్రతీకగా ఈ ప్రదర్శనకు హాజరు కావడంతో పాటు ప్రముఖ చరిత్రకారిణి రొమిలాథాపర్ ఈ ప్రదర్శన ప్రారంభించడంతో మరింత ప్రత్యేకత సంతరించుకున్నది. 1950 వ దశకంలో తాను లండన్‌లో గడిపిన రోజుల్లో అచ్చం తన మనసులో ఉన్న ఆలోచనలను ప్రతిబింబిస్తున్న ఈ ‘అపరిచిత భారతీయుడు’ ఎవరా అని నేను తెగ ఇదయిపోయేదాన్ని అని రొమిలా గుర్తు చేసుకున్నాడు.
ఉపన్యాసం కన్నా మరింత పదునుగా, విమర్శనాత్మకంగా బొమ్మలు గీసే మేథస్సు అబూ ది. ద ట్రిబ్యూన్ (లండన్) దినపత్రిక వియత్నాం యుద్ధాన్ని తీవ్రంగా నిరసించేది. అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ నిలువెల్లా తుపాకులు, బాంబులు ధరించి నిరాయుధుడయిన ఒక వియత్నాం యువకుడిని ‘నువ్వు హింసకు పాల్పడడం ద్వారా చాలా చెడ్డ దృష్టాంతాన్ని నెలకొల్పుతున్నావు’ అన్న దబాయింపు వ్యాఖ్యలతో కార్టూన్ గియ్యడం మామూలుగా అయ్యే పనేనా. కానీ ఆ పత్రికా సంపాదకులు అబూ కు ఆ స్వేచ్ఛ ఇచ్ఛారు. ఈ విషయమై అబూ తదనంతర కాలంలో ఇలా గుర్తు చేసుకున్నాడు . కార్టూనిస్టుగా నాకు ఏపాటి స్వేచ్ఛ ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానంగా (అబ్జర్వర్ పత్రిక) సంపాదకుడు ‘మీరు గీసిన రాజకీయ వ్యంగ్య చిత్రాలనల్లా మేం ప్రచురిస్తాం అని వాగ్దానం చెయ్యబూనడం తొందరపాటు అవుతుంది. కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చని అంశం, విషయాల మీద మా ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ కార్టూన్లు గీసి ఇమ్మని ఎట్టి పరిస్థితుల్లో అడగం అని ఖచ్చితంగా వాగ్ధానం చేస్తున్నాం’ అని లిఖిత పూర్వకంగా బదులిచ్చారట. కానీ ఇవాళా రేపూ అలాంటి వారు సంపాదకులు అయ్యే అవకాశం లేదు.
అబూ భారతదేశానికి తిరిగి వచ్చాక ఆయన కృషి అప్పటి కాలంతో, ఆ కాలానికి సంబంధించిన వ్యక్తుల పాత్రలతో ఇట్టే ఇంకిపోయింది. ఈ కార్టూనిస్టుకి శ్రీమతి గాంధీ అంటే మహా సంబరం. ఆమె బొమ్మ లోని ప్రతి రేఖా ఆవిడలోని గర్వాన్ని, అహంకారాన్ని ప్రతిబింబించేవి. కాంగ్రెస్ పార్టీలోని పాతకాపులయిన నిజలింగప్ప, కామరాజ్ నాడార్లతో శ్రీమతి గాంధీ తలపడే సందర్భాన్ని కార్టూన్‌గా మలుస్తూ కామరాజ్ ఊతపదం అయిన ‘పార్కలాం’ (చూద్దాం) అన్న పదాన్ని శ్రీమతి గాంధీ నోట పలికించాడు. అలాగే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మహమ్మద్ ఆలీ శ్రీమతి గాంధీతో ‘నేనే అత్యంత బలశాలిని’ అన్నప్పుడు ఆమె నోట ‘అవునా, నిజమా’ అని పలికిస్తాడు.
శ్రీమతి ఇందిరాగాంధీ అధికారం కోల్పోయిన సందర్భంలో అబూ కత్తి వాదర వంటి చురుకైన కార్టూన్ గీసాడు. శ్రీమతి గాంధీ సూట్‌కేస్‌తో రైల్వేస్టేషన్లో ‘చిక్కమంగళూర్’ అన్న బోర్డు దగ్గర నిలబడి ఉంటుంది. ఆ పక్కనే ‘ఇక్కడ మారండి’ అన్న సైన్బోర్డ్ మీద ఢిల్లీ, రాయ్‌బరేలీ, లక్నో, పాట్నా, జైపూర్‌లకు దారి అంటూ వివిధ బాణం గుర్తులు గీసి, ‘చేరవలసిన అన్ని ప్రాంతాలకూ’ అంటూ ఇంకో బాణం గుర్తువేసి ఆవిడ ఏ మార్గం ఎంచుకుంటుందో అన్న ప్రశ్న పాఠకులలో రేకెత్తిస్తాడు. శ్రీమతి గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెను అదే గర్వాతిశయ అవతారంలో మన కళ్ళకు కట్టిస్తాడు అబూ. అయితే ఈసారి పక్కన రాజీవ్‌గాంధీని కూడా కలిపాడు. రెండో పక్కన నేపథ్యంలో కీచులాడుకుంటున్న రాజకీయ నాయకుల గుంపుని గీసి ‘తెలివైన ఆలోచన` అసమ్మతివాదులకు, తిరుగుబాటుదార్లకు పోషకాహార పథకం’ అంటూ తల్లితో కొడుక్కి చెప్పిస్తాడు. (జులై 1982)
— పమెలా ఫిలిప్పోస్
అనువాదం : సత్యరంజన్