
ఉప ముఖ్యమంత్రి రేసులో లోకేష్
సొంత ముద్ర కోసం పవన్ ఆరాటం
ఆంధ్ర ప్రదేశ్ లో పాలక ఎన్‌డిఎ కూటమి వాగ్దానాల అమలులో జాప్యం, కేసులలో వేగం వంటివి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు అంతే బలంగా కూటమి అంతర్గత పరిణామాలు చర్చకొస్తున్నాయి. ప్రచ్చన్న యుద్ధం(కోల్డ్‌వార్) దశ దాటి ప్రత్యక్ష రూపమే తీసుకుంటున్నాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.బయిటివారికి కలిగే ఇలాటి సందేహాలకు కూటమిలోని మూడు పక్షాల నేతలు ఇచ్చే సమాధానాలు, సంకేతాలు పెరుగుతున్న దూరాలే కారణంగా ఉన్నాయి.
2024 ఎన్నికల్లో జగన్ సర్కారును గద్దెదించాలంటే కలిసి పోటీ చేయడం అనివార్యమన్న పిలుపుతో ముందుకు వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన వత్తిడి, చొరవతో పొత్తుకు సిద్ధమైన బిజెపి నేతలు టిడిపి పట్ల వ్యూహాత్మక దూరం పాటిస్తున్నారా?
జనాకర్షణ రీత్యా ఇది పవన్‌పై చర్చగా కనిపించినా వాస్తవానికి అంతకంటే లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీనివెనక వున్నాయని పరిశీలకులు నిర్ధారణకు రావలసి వస్తోంది.
తిరుపతి లడ్డూ సమస్యపై ప్రాయశ్చిత్త దీక్ష, తొక్కిసలాట ఘటనపై క్షమాపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయాల ప్రతినిధిగా ముందుకురావడమే గాక ప్రభుత్వ పరంగానూ తన మాట ప్రత్యేకంగా వినిపించారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లతో సహా మిగిలిన వారు వ్యవహరించిన మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నంగా ఉంది. చంద్రబాబుఅనుభవంపై అపారగౌరవం ప్రకటిస్తూనే తన స్వంత ముద్ర కోసం పవన్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం అందరికీ అర్థమవుతున్నది, కనీసం మూడునాలుగు సందర్భాలోహోం శాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు విసుర్లు సాగించడం కూడా యాదృచ్చికం కాదు.
అంతకుమించి లోకేశ్ పాత్రపై పదేపదే చర్చ రావడం కూడా దీని కొనసాగింపే. చంద్రబాబు తర్వాత లోకేశ్ తమ ఏకైక నాయకుడనీ ఆయనను ఉపముఖ్యమంత్రిని చేయాలని బాహాటంగా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు సమక్షంలోనే గట్టిగా కోరడం, వాటిపై ఆయన అక్కడ స్పందించకుండా తర్వాత లాంచనంగా అధికార ప్రతినిధులతో మం దలింపచేయడం కూడా నమ్మకం కలిగించలేదు. కార్యాలయాల్లో తనతో పాటు పవన్ ఫోటో కూడా పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గానీ నెమ్మదిగా లోకేశ్ ఫోటో కూడా అధికారిక ప్రకటనల్లో చోటు సంపాదిస్తోంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనతో ఇది పరాకాష్టకు చేరింది.
నిజానికి లోకేశ్,పవన్‌కళ్యాణ్ ఉభయులూ చంద్రబాబు జైలులో వున్న సమయంలో బిజెపి అగ్రనాయక ద్వయం మోడీ అమిత్ షాలతో ప్రత్యక్ష ఛానళ్లు ఏర్పాటు చేసుకున్నారు.వారు ఇచ్చిన హామీలేమిటనేది కూడా అస్పష్టమే.అధికార యంత్రాంగంలోనూ టిటిపి లోనూ లోకేశ్ ఆదేశాలు బలంగా పనిచేస్తున్నాయి. మరింత బలంగా లోకేశ్‌ను ప్రతిష్టించకపోతే పవన్ అల్లుకుపోతాడనే ఆందోళన అభ్యంతరాలు టిడిపి లో యువ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట కాదనలేనిది. సూపర్ సీనియర్లను పక్కన పెట్టాలని లోకేశ్ టీం భావిస్తున్న మాట కూడా నిజం. ఈ మేరకు బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేశారు కూడా. తనే జాతీయ కార్యదర్శిగా దిగిపోతానని ఆయన అన్నారు. వర్కింగ్ అద్యక్షుడైనా ఉపముఖ్యమంత్రి అయినా తమ నాయకుడు మాత్రం లోకేశేనని అచ్చెం నాయుడు వంటి సీనియర్ మంత్రులే ప్రకటించారు.టిడికి అంతర్గత వ్యవహారంగా కనిపించే ఈ పరిణామానికీ పవన్ కళ్యాణ్ వ్యూహాలు బిగించడానికి స్పష్టమైన సంబంధం వుంది. కడప నుంచి దావోస్ వరకూ కేంద్ర రాష్ట్ర మంత్రులు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆయనే భావి నేత అని ప్రకటిస్తుంటే పవన్ రెండవ స్థానం ప్రశ్నార్థకమైపోవడం సహజమే.కనీసం దాన్ని లోకేశ్‌తో పంచుకోవలసిన పరిస్థితి.వాస్తవానికి చంద్రబాబు తర్వాత లోకేశ్ కాకుండా నారా భువనేశ్వరిని మధ్యంతర ఏర్పాటుగా తెరమీదకు తెస్తే ఎన్టీఆర్ సెంటిమెంటు పెరుగుతుందనే ఆలోచనలు కూడా టిడిపిలో లేకపోలేదని కీలకమైన వర్గాలు కొన్ని సూచిస్తున్నాయి. అప్పుడు కూడా జనసేనానికి ఈ ప్రశ్నలు తప్పదు.
మా వల్ల మళ్లీ అధికారంలోకి వచ్చి మమ్మల్నే నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన నాయకులు అంటుంటే మీ ఓటింగు 11 శాతానికి మించిన పదవులు,వనరులు, ఫోకస్ ఇచ్చామనేది టిడిపి వారి వాదన, పైగా పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ మిగిలిన వారందరికీ అతీతుడుగా వున్నట్టు ఫోకస్లో వుండే ప్రయత్నం చేస్తున్నారని టిడిపిలో కీలక స్థానాల్లో వున్నవారే సందేహిస్తున్నారు.నిధుల సేకరణ, విధానాల రూపకల్పన, నిర్ణయాలు వీటన్నిటిలో ఆయన పాత్ర పరిమితం కాగా యంత్రాంగాన్ని పనిచేయించడానికి లోకేశ్, ప్రభుత్వాన్ని నడిపించేందుకు సమీక్షలతో చర్చలతో చంద్రబాబు తంటాలు పడుతుంటే పవన్ మాత్రం తన శాఖలకు పరిమితమై సినిమాలు చేసుకుంటూ సమతుల్యత లేని సనాతన వాదంతో రాజకీయంగానూ సమస్యలు పెంచుతున్నారని వారంటున్నారు.
దీనికి సమాధానంగానే ఉపముఖ్యమంత్రి ఇప్పుడు దక్షిణభారత తీర్థయాత్ర జరుపుతున్నారు. అది కూడా వామపక్షాలకు నిలయమైన కేరళతోనూ, ఎన్డీఎ మరీ అధ్వాన్నంగా వున్న తమిళనాడుతోనూ మొదలెట్టారు. అంటే బిజెపి దక్షిణాది విస్తరణ వ్యూహానికి, పవన్ కదలికలకు స్పష్టమైన సంబంధం వుందనుకోవాలి. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కూడా ఔరంగజేబ్‌పై పోరాటం వంటి ఇతివృత్తంతో రూపొందుతున్నదని సూచిస్తున్నారు.వ్యక్తిగతంగా,సనాతన పరంగా పవన్ కళ్యాణ్ బిజెపినేతలతో పూర్తిగా కలసి వ్యవహరిస్తున్న తీరు టిడిపి లెక్కలను మించిపోతున్నది. సిఎం పవన్ అంటూ అల్లు అరవింద్ ఆహా ఛానల్లో కార్యక్రమం ప్రకటించడం కూడా దీనికి మసాలా జతచేసింది.తాజాగా తాను రాజకీయాలకు దూరంగా వుంటానంటూనే చిరంజీవి పెద్ద పెద్ద నాయకులతో కలసికొన్ని సేవలు పనులు సాధించడానికి ప్రయత్నిస్తుంటానని తలుపులు తీసి వుంచారు.
ఇటీవలనే ప్రధాని మోడీని కలసి వచ్చిన నేపథ్యంలో ఆయన కలిసేది ఎవరినో చెప్పనవసరం లేదు.పవన్ బాధ్యత తీసుకోకుండా అధికారం చలాయిస్తున్నారనేది టిడిపి వారి ఆరోపణ అయితే అపత్సమయంలో పవన ఆకర్షణను ఉపయోగించుకుని ఇప్పుడు తగ్గిస్తున్నారనే భావన జన సైనికులది. మేము శాశ్వతంగా చంద్రబాబు కుటుంబాన్నే మోయలేము కదా అని వీరంటే నలభై ఏళ్ల చరిత్రగల ఇంత పెద్ద పార్టీనీ, యంత్రాంగాన్నీ మరెవరికో ధారదత్తం చేయము కదా అనే ప్రశ్న తెలుగు తమ్ముళ్లు అన్నయ్యలది. పాలక పార్టీల ప్రయోజనాల ఘర్షణ దాంతోపాటే సామాజిక సమీకరణాల సంఘర్షణ వీటి వెనక వుందనేది కాదనలేని నిజం.ఈ వారంలోనే జరగనున్న జనసేన సమావేశాల తర్వాత దీనిపై వివరణలు, సవరణలు జరగొచ్చు. వాస్తవానికి విస్త్రతమైన ప్లీనం జరపాలని భావించినా ఎండల వల్ల పరిమితం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఆ ఎండలు ఎలా వున్నారాజకీయ వేడి మాత్రం పెరగడం తథ్యం
సరిగ్గా ఇక్కడే తన హిందూత్వ ఎజెండాతో బిజెపి ప్రవేశిస్తుంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారు టిడిపి అయినా ఎపికి పెద్దగా ఒరగబెడుతున్నదేమీ లేదు.పైపెచ్చు చంద్రబాబును కష్టకాలంలోజగన్ నుంచి కాపాడి మళ్లీ గద్దెక్కించినందుకు తమను మోయవలసిందేనన్న ఆలోచనలో బిజెపి వుంది.2014లో కలసి వున్నప్పుడు ఇప్పుడు కూడా ఇది ప్రధానంగా చంద్రబాబు సర్కారు మాత్రమేనన్నది బిజెపి వైఖరి.దానికితోడు ఎపి బిజెపి అద్యక్షుల ఎన్నిక కూడా జరిగితే గానీ ఒక కొలిక్కి రాదు, ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్న పార్టీలను నెమ్మదిగా చప్పరించడం బిజెపి వ్యూహమనేది తెలిసిన విషయమే.ఇక్కడ వారికి పవన్ కళ్యాణ్ అదనంగా తోడవుతున్నారు.(తెలంగాణలోనూ ఆయనను ఉపయోగించుకోవాలా వద్దా ఇంకా తేల్చుకోవలసి వుంటుంది) మావైపు నుంచి సమస్యలేమీ లేవని జనసేన అంటుంటే అదే అసలైనసమస్య అని టిడిపి వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల గడిచాక ఇవన్నీ వూహాగానాలేనని కొట్టి పారేయవచ్చు గానీ నిజమైన వైరుధ్యాలు నిజాలు కాకుండా పోవు. ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు గానీ విశాల ప్రజాకోణం నుంచి రాష్ట్రాల సమస్యలకోణం నుంచి చూస్తే ఆలోచించడం,కుల మత తత్వాలు ప్రకోపించకుండా చూడటం అంతకన్నా కీలకం.
తెలకపల్లి రవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.