తెలుగు ఫిలిం ఛాంబర్ ఈరోజున తెలుగు సినిమా పుట్టినరోజును జరుపుకుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు ను జరుపుకోవాలని కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వేడుకలకు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సీనియర్ నటులు మురళీమోహన్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆవార్డులే కాకుండా ఇకపై ప్రత్యేకంగా ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఆవార్డులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి నటుడి ఇంటిపైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ జెండా ఎలా ఉండాలి, ఏ రంగులో ఉండాలి రూపకల్పన బాధ్యత మొత్తం పర్చూరు గోపాలకృష్ణకు అప్పగించినట్లు తెలిసింది. సినిమా పుట్టినరోజును ఇన్నానాళ్లకు జరుపుకోవాలనే ఆలోచన రావటం సంతోషం దగ్గర విషయం. భక్తప్రహ్లాద తొలిటాకీ సినిమా విడుదలైంది 1932 ఫిబ్రవరి ఆరున , సరిగ్గా నేటికి 93 ఏండ్లు. తొలి టాకీ చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని హెచ్.ఎం.రెడ్డి నిర్వహించగా , ఎల్వీ ప్రసాద్ సహాయ దర్శకునిగా పనిచేశారు. ఇందులో పాటలు ,పద్యాలు నలభై వరకు ఉన్నాయి. అప్పటి వరకు మూకీ చిత్రాలను చూసిన ప్రేక్షకులు ఈ టాకీ చిత్రాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఈ 93 ఏండ్లలో తెలుగు సినిమా దేశం గర్వించదగ్గ స్థాయికీ ఎదిగి ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. సినిమా నిర్మాణం రోజు నుంచి విడుదలకు ముందు వరకు ఎంతగా ప్రచారం చేయాలో అంత చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ , ఆడియో ఫంక్షన్ లు అనేవి ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా నిర్వహిస్తున్నారు. అంతా బాగానే ఉంది. తొలిటాకీ సినిమాకు పాటలు రాసిన చందాల కేశవదాస్ ను మాత్రం తెలుగు సినిమా దాదాపుగా మరచిపోయిందనే చెప్పాలి. సంపూర్ణ మానవతావాది ,సమాజ హితం కోసం జీవితకాలం కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన పేరు కోసమో కీర్తి కోసమో కాకుండా తనకున్న జ్ఞానాన్ని నిస్వార్ధంగా సమాజ ఉన్నతికి వినియోగించిన సాహితీకరుడు ,నాటకర్త, సినీగే రచయిత చందాల కేశవదాసు. 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో ఆయన జన్మించారు, భక్త రామదాసు జన్మించిన గ్రామం కూడా ఇదే. ఒక కవిగా, నాటక కర్తగా ,అష్టావధానిగా ,హరిదాసుగా, సినీ రచయితగా ,వైద్యులుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చందాల కేశవదాస్ కృషిని ప్రభుత్వాలు,సాహిత్యం రంగం కానీ గుర్తించకపోవడం శోచనీయం.
సమకాలీన సమాజ పరిస్థితులకు స్పందించటం కవుల రచయితల బాధ్యత. ఈ విషయాన్ని విస్మరించని కేశవదాసు 1933 మధ్య మన దేశంలో ముమ్మరంగా కొనసాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమానికి తన వంతు సహకారాన్ని అందించాడు. “జయతుజై” అంటూ ఒక ప్రబోధ గీతాన్ని రాసి ఆకుల నరసింహారావు ,ఎస్. రాజేశ్వరరావుల చేత పాడించారు. దీనిని వ్యయ ప్రయాసలకోర్చి ఆ రోజుల్లోనే బెంగళూరులో రికార్డ్ చేయించారు. కేశవ దాసు ఏ సంస్థానాధీశులను ఆశ్రయించలేదు యాశించలేదు .
ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు వారి మధ్యనే తనుకున్న ప్రతిభా పాటవాలతో సాహిత్య ప్రక్రియలో సృజన చేసి ప్రజల రంజంపజేసి, ఆలోచింపజేసిన ధన్యజీవి ఆయన.
సంగీత ,సాహిత్యాలను ఏనాడు సంపాదన కోసం వినియోగించుకోవాలనుకోలేదని ఆయన సమకాలీకులు చెబుతుంటారు. సాహిత్య రంగంలోనూ, సినిమా రంగంలోనూ మిగిలిన రంగాల్లోనూ తన చేసిన కృషి పూర్తిగా కనుమరుగైపోయింది. 1948 జూలైలో రజాకార్లు కేశవదాసు గ్రామం జక్కేపల్లిలోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించారు. అదే సందర్భంలో ఆయన ఇంట్లోకి చొరబడి సొత్తును దొంగిలించుకపోవడమే కాక అమూల్యమైన ఆయన రచనలను కూడా రజాకార్లు నాశనం చేశారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని కనీసం సినీ పరిశ్రమ అయిన తగినంత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిల్మ్ ఛాంబర్ ఇకపై ప్రతి ఏటా సినిమా పుట్టిన రోజును జరుపుకోవాలని,నటీనటులకు ,సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నవేళ ఉత్తమ గీతరచయితకు చందాలకేశవదాసు పేరిట అవార్డును ఇచ్చే ఆలోచన చేస్తే బావుంటుంది.అంతేకాదు ఆయన విగ్రహాన్ని ఫిల్మ్ నగర్ లో ఏర్పాటుచేయడం సముచితంగా ఉంటుంది.
పి.వి.రావు
సీనియర్ జర్నలిస్ట్