
తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమగ్ర శిక్షా అభియాన్ నిధుల వివాదం రాజుకుంది. ఈ వివాద గాలి కాస్తా హిందీని రుద్దే విషయం మీదికి మళ్లి చర్చకు దారితీసింది. హిందీయేతర రాష్ట్రాలు ఎక్కువ బహుభాషాలుతో ఉన్నాయని డేటా చూపిస్తుంది. అదే హిందీభాషను మాట్లాడే రాష్ట్రాలలో ఈ ధోరణి బలహీనంగా ఉంది.
న్యూఢిల్లీ: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులకు సంబంధించి నడుస్తున్న వివాదం హిందీయేతర రాష్ట్రాల మీద హిందీ భాషను రుద్దుతున్నారనే చర్చకు మరోసారి దారితీసింది. హిందీని బలవంతంగా అమలు చేసే చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరద్ఘాటించారు. అంతేకాకుండా ద్విభాష సిద్ధాంతానికి(తమిళం, హిందీ)అనుకూలంగా తన నిబద్ధతను ప్రకటించారు.
అదే సమయంలో, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హిందీ భాష రుద్దుతున్నారనే ఆరోపణలను కొట్టిపారేస్తూ ‘బహుభాష విద్యతో ఎవరికి నష్టం జరగదు. తమిళనాడు విద్యార్థులు హిందీ నేర్చుకోవడం అనివార్యమేమి కాదు’ అన్నారు. కానీ అసలు విషయమేంటంటే మూడు భాషల ఫార్ములాతో హిందీని పరోక్షంగా రుద్దుతున్నారా?
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ద హిందూ పత్రిక లాంగ్వేజ్ సెన్సెస్, గ్లోబల్ డాటా విశ్లేషణలో చూపించిన దాని ప్రకారం హిందీ ప్రాంత ప్రజలు వేరే భాషలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. హిందీయేతర రాష్ట్రాలలో బహుభాషల స్థానం ఎక్కువగా ఉంది. ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య హిందీయేతర రాష్ట్రాలలో పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా హిందీభాష ప్రాంతాలలో ఈ సంఖ్య తగ్గుతుంది.
హిందీ రుద్దడం, ఇంగ్లీష్ ఔచిత్యంపై చర్చ..
మూడు భాషల ఫార్ములాతో పరోక్షంగా హిందీ భాషను రుద్దడం కారణమా కాదా? అనేది ఈ పూర్తి వివాదానికి ప్రాథమికమైన ప్రశ్నగా కనబడుతుంది. కానీ దీని కంటే పెద్ద ప్రశ్న ఏంటంటే, అభివృద్ధితో ముడిపడిన డేటా ప్రకారం ఆంగ్లం కలిపే భాష(లింక్ లాంగ్వేజ్)గా హిందీ కంటే ఎక్కువ ఉపయోగకరమైనదిగా నిరుపిస్తున్నదా?
సరళంగా చెప్పాలంటే, హిందీభాష మాట్లాడే వారికి మెరుగైన అవకాశాల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రోత్సాహించాలా, లేకుంటే హిందీయేతరులకు హిందీ నేర్చుకునేలా బలవంతపెట్టాలా? దీని మీద ద హిందూ విశ్లేషణాత్మక డేటా చాలా మంచి సమాచారాన్ని అందించింది.
వివిధ రాష్ట్రాలలో బహుభాషల నమూనా..
హిందీయేతర రాష్ట్రాల ప్రజలు సాధారణంగా కొత్త భాషలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని డేటా ప్రకారం తెలుస్తుంది. అదే హిందీభాష రాష్ట్రాలలో మాత్రం ఈ ధోరణి చూడడానికి చాలా తక్కువగా ఉంది.
ఉదాహరణకు, 1991లో తమిళనాడులో 84.5% తమిళులు కేవలం తమిళం మాట్లాడే వారు, కానీ 2011 వరకు అది క్షీణించి 78% అయ్యింది. ఇదే విధంగా ఒడిశాలో 86% ఒడియా ప్రజలు 1991లో కేవలం ఒడియా మాట్లాడేవారు, 2011లో అది తగ్గి 74.5% మారింది.
మరోవైపు, హిందీభాష రాష్ట్రాలలో ఒక వేరు ధోరణి కనబడుతుంది. బీహార్లో 1991లో 90.2% హిందీప్రజలు కేవలం హిందీ మాట్లాడేవారు, అదే 2011లో అది పెరిగి 95.2% అయ్యింది. ఇదే విధంగా రాజస్థాన్లో 1991లో 93% హిందీ ప్రజలకు కేవలం హిందీ మాత్రమే తెలుసు, కానీ 2011 వరకు ఇది పెరిగి 94.3%గా మారింది.
హిందీయేతర రాష్ట్రాలలో బహుభాషావాదం ఎక్కువగా ఉన్నట్టుగా డేటా ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది. కానీ హిందీభాష రాష్ట్రాలలో ఈ ధోరణి దీనికి విరుద్ధంగా బలహీనంగా ఉంది.
ద్వితీయ భాషగా ఇంగ్లీషు లేదా హిందీ?
రెండో, మూడో భాష ఎంపికలో ఇంగ్లీష్ లేదా హిందీ ఏ భాషను ఎంచుకుంటున్నారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది.
తమిళనాడులో 1991లో 13.5% తమిళులులకు ఆంగ్లం తెలిసేది, అదే 2011 వరకు అది పెరిగి 18.5% అయ్యింది. మరోవైపు హర్యానాలో 1991లో 17.5% హిందీభాషవారికి ఆంగ్లం తెలిసేది, కానీ 2011 వరకు అది తగ్గిపోయి 14.6% అయ్యింది.
ఇదే విధంగా హిందీభాష రాష్ట్రాలలో ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య తగ్గింది లేదా స్థిరంగా ఉంది, అదే హిందీయేతర రాష్ట్రాలలో ఈ సంఖ్య పెరిగింది.
తమిళనాడు, ఒడియా, పంజాబ్లలో ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య వేగంగా పెరిగింది. అదే గుజరాత్, మహారాష్ట్రలో ఈ పెరుగుదల తులనాత్మకంగా తక్కువగా ఉంది.
1991లో తమిళనాడులో 0.5% తమిళులకు హిందీ తెలిసేది, అదే 2011లో పెరిగి కేవలం 1.3% అయ్యింది. కర్ణాటకలో ఈ సంఖ్య 8.5%తో స్థిరంగానే ఉన్నట్టుగా హిందీయేతర రాష్ట్రాలలో హిందీ నేర్చుకునే ధోరణి ఎంత పెరిగిందో డేటా చూపిస్తుంది.
కానీ గుజారత్, మహారాష్ట్రలో హిందీ నేర్చుకునే ధోరణి ఎక్కువగా ఉంది. గుజరాత్లో 1991లో 21.6% గుజరాతీలకు హిందీ తెలిసేది, అదే 2011 వరకు పెరిగి 39% అయ్యింది. మహారాష్ట్రలో ఈ సంఖ్య 35.7% నుంచి పెరిగి 43.5% అయ్యింది.
దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో హిందీ నేర్చుకునే ధోరణి చాలా తక్కువగా ఉంది. కానీ పశ్చిమ, తూర్పు భారతదేశంలో హిందీ నేర్చుకునే వారి సంఖ్య పెరిగినట్టుగా దీంతో స్పష్టం అవుతుంది.
హిందీ లేదా ఆంగ్లం- ఏ భాష ఎక్కువ ఉపయోగకరం?
ప్రస్తుతం ఏ భాష పౌరులకు మెరుగైన అవకాశాలను అందిస్తుందనే ప్రశ్నతలెత్తుతుంది. అయితే, ఏ రాష్ట్రాలలో ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉందో అక్కడ మానవ అభివృద్ధి సూచిక బాగున్నట్టుగా డేటా ద్వారా తెలుస్తోంది. దీనికి విరుద్ధంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలో మానవ అభివృద్ధి సూచిక మెరుగైన రీతిలో లేదు. అంతేకాకుండా, హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం హిందీ మాట్లాడని రాష్ట్రాలకు ఎక్కువ సంఖ్యలో వలస వెళ్తున్నట్టుగా ఆర్థిక సర్వేలు కూడా వెల్లడించాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.